ఇది కెవిఆర్ శతజయంతి సంవత్సరం. ఆయన మార్చి 23, 1927న జన్మించారు. 1948లో తన 21వ ఏట అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. 1998 జనవరి 15న తన 71వ ఏట విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా కన్నుమూశారు. సరిగ్గా యాభై ఏళ్లు సాహిత్య సాంస్కృతిక మేధో ఉద్యమాల్లో తలమునకలుగా ఉన్నారు. ఆ ఉద్యమాల ప్రధాన నాయకుడిగా, వ్యాఖ్యాతగా, పెద్ద దిక్కుగా కొనసాగారు. వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో యాభై ఏళ్లు పార్టీతో కలిసి నడిచారు. సిపిఐ దగ్గరి నుంచి సిపిఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ దాకా ఆయన ప్రయాణం సాగింది. కేవలం పార్టీ అభిమానిగా, శ్రేయోభిలాషిగా కాదు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య మొదలు కొండపల్లి సీతారామయ్య దాకా అగ్రనాయకులు నడిపిన ఉద్యమాల్లో, నిర్మాణాల్లో అంతర్భాగమయ్యారు. కమ్యూనిస్టుపార్టీలో చీలికలు వచ్చిన ప్రతిసారీ ఏది విప్లవకరమో, ఏది వర్గపోరాటానికి నాయకత్వం వహిస్తుందో గుర్తించి ఆ పక్షం తీసుకున్నారు.
27 అక్టోబర్ 1946 ప్రజాశక్తిలో ‘నిర్భాగ్యుల దీపావళి’ కవిత అనే కవిత రాశారు. దొరుకుతున్న ఆధారాలనుబట్టి ఇదే ఆయన తొలి రచన కావచ్చు. 1948లో ఆనందవాణి పత్రిక దీపావళి సంచికలో ‘రూపాయల రాజ్యం’ అనే వ్యాసం రాశారు. ఇవి ఆయన రచనా దృక్పథాన్ని తెలియజేస్తాయి. అందువల్ల ఆయన సహజంగానే అరసంలో చేరారు. అప్పటికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతూ ఉండింది. భారత కమ్యూనిస్టుపార్టీ తీవ్ర నిర్బంధ నిషేధాల్లో ఉన్నది. అయినా దానికి అనుబంధ సాహిత్య సంస్థ అరసాన్ని తన రచనా కృషికి మార్గదర్శిగా ఎంచుకొని అందులో చేరారు. 1951లో ఆ పోరాటాన్ని విరమించి కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల దారి పట్టాక అరసం జవసత్వాలు కోల్పోయింది. తాను సభ్యుడిగా చేసిన సంస్థను అట్లా వదిలేయదల్చుకోలేదు. ఒక నిర్మాణంగా దాన్ని పునరుద్ధరించడానికి, రాజకీయ శక్తిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. విజయవాడలో అరసం సభల నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషించారు.
తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శకుల్లో ఆయన రెందో తరాన్ని ప్రారంభించారు. మద్దుకూరి చంద్రం దగ్గరి నుంచి కొడవటిగంటి కుటుంబరావు దాకా సాహిత్య విమర్శల్లో గణనీయ కృషి చేసినప్పటికీ వాళ్లలో చాలా మంది రాజకీయ ఉద్యమ బాధ్యతలు, వేరే ప్రధాన సాహిత్య ప్రక్రియలు నిర్వహించారు. కెవిఆర్ అప్పటికే కవిత్వం రాస్తుండినప్పటికీ ఆ తర్వాత ఆయనకు సాహిత్య విమర్శే ప్రధాన కార్యరంగమైంది. ఆయన పేరు సాహిత్య విమర్శకు పర్యాయపదంగా మారింది. మార్క్సిస్టు సాహిత్య విమర్శకు చరిత్రను మౌలిక పునాదిగా మార్చిన ఘనత కెవిఆర్దే. ఏ రచననైనా, రచయితనైనా వర్గ చైతన్యం గీటురాయిగా పరిశీలించే పద్ధతిని ఆయన అనుసరించారు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలపు విమర్శ కెవిఆర్ ప్రవేశంతో ముఖ్యమైన దశలోకి మారింది. ఆ మార్పును పరిశీలించి అంచనా వేయవలసే ఉన్నది.
ఒక భాషా సమాజపు అనుభవాన్ని, దాని సజనాత్మక వ్యక్తీకరణను విశాలమైన చారిత్రక ఆవరణలో చూడాలి. మానవ జీవితపు విశేషాలనూ, విషాదాలనూ, ఉత్తేజాలనూ, ఆకాంక్షలనూ, ఆరాట పోరాటాలనూ సాహిత్యంలో చదివి అంచనా వేయడానికి ఆ సమాజపు చరిత్రలోకి వెళ్లాల్సిందే. మానవ అనుభవాలన్నీ స్థలకాలబద్ధమైన చరిత్రతో ముడిపడి ఉంటాయి. ఈ దృష్టితో సాహిత్యాన్ని పరిశీలించే పద్ధతిని కెవిఆర్ అనుసరించారు.
కెవిఆర్ సాహిత్య విమర్శలో చరిత్ర భారం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. నిజానికి అందులో చరిత్ర ఒక్కటే ఉండదు. చరిత్ర అంటే గతించిపోయిన కాలమూ, వర్తమానమూ మాత్రమే కాదు.. ఆ చలనానికీ, పురోగతికీ సంబంధించిన రాజకీయ, సాంస్కృతిక సంఘర్షణ కూడా చరిత్రలో భాగమే. ఆయన చరిత్ర గతిని రాజకీయ శక్తుల సంఘర్షణా క్రమంగా చూశారు. చరిత్రకూ, సంస్కృతికీ ఉండే సంబంధాన్ని కూడా చూశారు. అకడమిక్ రంగంలో చరిత్రను ఘటనల పరంపరగా, తేదీల క్రమంగా చూసే పద్ధతి ఉంటుంది. కానీ చరిత్ర పరిశోధకుడిగా కెవిఆర్ దాన్ని చారిత్రక భౌతికవాద పద్ధతిలో చూశారు. ఏ రచయితకైనా, రచనకైనా చరిత్రలో చోటు ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వల్లనే ఆ వ్యక్తికీ, వ్యక్తీకరణకూ, భావజాలానికీ గుర్తింపు వచ్చిందని మనకు స్పురించేలా ఆయన విశ్లేషణ ఉంటుంది.
ఆయన రచనలో అలవోకగా అనేక చారిత్రక వివరాలు కనిపిస్తాయి. వాస్తవానికి కెవిఆర్ చరిత్రను ఒక నిర్మాణ క్రమంగా భావించారు. అందువల్లనే అత్యంత నిశితమైన, పటిష్టమైన, విశాలమైన మార్క్సిస్టు చారిత్రక పద్ధతిని అనుసరించాడు. ఈ ఒక్క మాట అని సరిపెట్టుకుంటే మనకు కెవిఆర్ అర్థమైనట్టు కాదు. ఆయన చరిత్రను ఎట్లా అర్థం చేసుకున్నారు అనే దానికంటే సాహిత్య విమర్శలోకి చరిత్రను ఎట్లా తీసుకొచ్చారు? అనేది కీలకం. మార్క్సిస్టు సాహిత్య విమర్శలోకి కెవిఆర్ చరిత్రను తీసుకొచ్చారనీ, లేదా విమర్శారంగానికి చారిత్రక ధృక్పథాన్ని అందించారనీ దాదాపు అందరూ అంగీకరిస్తారు. కానీ ఆయన సామాజిక విశ్లేషణకు చరిత్రను సాధనం చేసుకున్న పద్ధతికీ, సాహిత్య విశ్లేషణలో చరిత్రను భాగం చేసుకున్న పద్ధతికీ తేడా ఉంది. ఆ తేడా ఏమిటో మనం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. దాన్ని అంచనా వేయగలిగితే మార్క్సిస్టు సాహిత్య విమర్శకు కెవిఆర్ చేసిన ఒక ముఖ్యమైన దోహదం గ్రహించినట్లవుతుంది.
దీన్ని ఇలా వివరించుకోవచ్చు. సాహిత్యాన్ని విశాలమైన చరిత్రలో భాగంగా చూసినప్పటికీ¡, కళా సాహిత్యాలు భావాల చరిత్రకు సంబంధించినవనే ఎరుక ఆయనకు పుష్కలంగా ఉంది. సమాజ చరిత్రలో భాగంగా భావాల చరిత్రకు ఉండే ప్రత్యేకతలను పట్టించుకోవడం వల్ల ఆయన చేతిలో మార్క్సిస్టు సాహిత్య విమర్శ చాలా అభివృద్ధి చెందింది. ఇది కెవిఆర్ విమర్శ వ్యక్తిత్వంలో ఒక ప్రధానమైన విషయం. ఈ వైపు నుంచి చూస్తే ఆయన రచనల్లోని లోతు, విస్తృతి అర్థమవుతుంది. సాహిత్య విమర్శలోకి చరిత్ర అనే సామాజిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారనే స్థూల అంచనాను దాటి ‘మౌలిక కెవిఆర్’ను చేరుకోగలుగుతాం.
‘ప్రాచీన భారతీయ సాహిత్యంలో సామాజిక ప్రతిబింబం’ దగ్గరి నుంచి ‘మధ్య యుగాల సాహిత్య నిశీధిని’లో కూడా వెలుగు నీడలను పసిగట్టగల ఆయన మార్క్సిస్టు పద్ధతిలో సామాజిక రాజకీయ సాంస్కృతిక సాహిత్య చరిత్ర అధ్యయనం కీలకం. ఇందులో ఆ కాలపు భావాల సంఘర్షణా చరిత్రనూ, భావ వ్యక్తీకరణలయిన సాహిత్య కళా రూపాల సంఘర్షణనూ మనం గమనించవచ్చు. వేమన, గురజాడ, కట్టమంచి రామలింగారెడ్డి, దువ్వూరి రామిరెడ్డి, శ్రీశ్రీ మొదలు తన తన కాలపు కవులు, రచయితలు; చెరబండరాజు, గద్దర్, వంగపండు వంటి వాగ్గేయకారులందరి మీద ఆయన పరిశీలనలో చరిత్రను ఇంత విశాలమైన అర్థంలో భాగం చేసుకున్నాడు. బహుశా కొన్ని డజన్ల మంది సాహిత్యకారుల రచనల మీద కచ్చితమైన మార్క్సిస్టు అంచనా ఇచ్చాడు. అంతమంది భిన్నమైన రాజకీయ, తాత్విక దృక్పథాలు ఉన్న రచయితల మీద, అనేక శిల్ప ప్రయోగాలు చేసిన సాహిత్యకారుల మీద కెవిఆర్ తరంలో సీరియస్‌గా రాసిన విమర్శకులు కనిపించరు.
ఒక సమాజానికి ఉండే చరిత్ర ఎంత లోతైనదో, విశాలమైనదో.. అందులో భాగమైన సాహిత్యం కూడా అంతే విస్తారమైనది. అదనంగా ఇక్కడ మానవ ఊహాశక్తి ఉంటుంది. వాస్తవికతను కాల్పనికంగా పునర్నిర్మించే రచయితల, కళాకారుల ప్రతిభ కూడా ఉంటుంది. ఇవేవీ గాలిలోంచి వచ్చేవి కావు. రచయితలు కూడా చరిత్రలో భాగం కాబట్టి పట్టుబడతాయి. కెవిఆర్‌కు ఈ దృష్టి ఉన్నందు వల్ల ఎలాంటి భావజాలాల రచయితలనైనా, ప్రయోగవాద సాహితాన్నయినా విస్మరించలేదు.
***
కెవిఆర్ సాహిత్య విమర్శలో ఇంకో ముఖ్యమైన అంశం నిర్దిష్ట స్థల కాలాల్లో, వాటి వెనుక ఉండే విశాలమైన చారిత్రక ఆవరణలో రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు రూపొందే క్రమాన్ని అధ్యయనం చేయడం. సాహిత్యవ్యక్తుల జీవిత చరిత్రలు రాయడానికి ఈ పద్ధతి ఆయనకు ఉపయోగపడింది. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి, గురజాడ మహోదయం, శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలు ఆయన రచనా జీవితంలో బృహత్తర పరిశోధనా రచనలు. గద్దర్ గురించి రాసిన వ్యాసాల్లో కూడా ఈ పద్ధతి కనిపిస్తుంది. వ్యక్తుల సృజనాత్మకతను, అందులోని ప్రత్యేకతలను, ప్రతిభా నైపుణ్యాలను గుర్తిస్తూనే వాటితో సహా ఆ వ్యక్తులు చారిత్రక శక్తుల సంఘర్షణలోంచి రూపుదాల్చారని ఆయన చెప్పే పద్ధతి అద్భుతంగా ఉంటుంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సంబంధాన్ని, అందులోని ఘర్షణను, ఐక్యతను, వాటి పర్యవసానంగా చారిత్రక, వైయుక్తిక శక్తుల కలబోతగా ఆ సృజనకారుల ఆవిర్భావం ఎట్లా జరిగిందీ చెబుతారు. అదే సమయంలో సమాజానికి వారసత్వంగా సంక్రమించే మేధా సంప్రదాయాల మీద, వాటి ప్రత్యేకతల మీద కూడా కెవిఆర్‌కు గురి ఉంది. దానితోపాటు తక్షణ స్థల కాల పరిస్థితుల్లోంచి ఒక వ్యక్తిలో అవెట్లా బైటపడేదీ పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ సమాజంలోని భిన్న భావజాలాల ప్రభావాన్ని సాహిత్య వ్యక్తుల్లో, వాళ్ల రచనల్లో చూస్తారు. అజంతా, నారాయణబాబు, బైరాగి, పఠాభి, తిలక్ వంటివాళ్లనూ, బండ యాదగిరి వంటి వాగ్గేయ, దృశ్య కళారూపాల కవులను, విప్లవ వచన కవులనూ వాళ్ల భావజాలాల వైపు నుంచి, ప్రయోగశీలత వైపు నుంచి కెవిఆర్ అంచనా వేశారు.
***
కెవిఆర్ విస్తారమైన అధ్యయనపరుడు కావడం వల్లనే ఇదంతా సాధ్యం కాలేదు. సమాజంలోలాగే సాహిత్యంలో, సాహిత్య ఉద్యమాల్లో భిన్న భావజాల, రాజకీయ, సైద్ధాంతిక సంఘర్షణ నిరంతరాయంగా సాగుతుందనే దృక్పథం వల్లనే ఆయన ఎలాంటి భావజాల ప్రేరిత సాహిత్యాన్నయినా శ్రద్ధగా చదివారు. వేల పుస్తకాలు ఎవరైనా చదవగలరు. వేల పేజీలు రాయగలరు. కానీ ఆ రెండు పనులనూ చారిత్రక పురోగామి క్రమాలుగా కెవిఆర్ భావించారు. సమాజం, కళా సాహిత్యాలు, సిద్ధాంత రాజకీయాలు, ప్రజా పోరాటాలు, వాటికి నాయతకత్వం వహించే నిర్మాణాలు..మొదలైన వాటి గుండా ఈ పురోగామి చలనాలు సాగుతూ ఉంటాయని తెలిసిన బుద్ధిజీవి, కార్యకర్త, నాయకుడు కావడం వల్ల విశాలమైన మానవ జీవితాన్నీ, సమాజాన్నీ, వాటిని వివరించే సిద్ధాంత, రాజకీయాలను, ప్రజా పోరాటాలను తన ఆలోచనల్లోకి, ఆచరణలోకి స్వీకరించారు. అందువల్లనే వ్యక్తిగత ప్రవర్తనలోనేగాక, మేధావిగా కూడా తన గంభీరమైన మూర్తిమత్వంతో తన కాలాన్ని ప్రభావితం చేశారు. దానికి ఆయన రచనలోని ప్రతి అక్షరం, అంతకంటే ఆయన జీవితం నిలువెత్తు ఉదాహరణ. ఆయన వందేళ్ల సందర్భంలో ఆయన నుంచి స్వీకరించాల్సింది ఈ గాంభీర్యతనే. ఇప్పుడు దాని అవసరం చాలా పెరిగింది.
కెవిఆర్ జీవితంలో 1951 నుంచి నక్సల్బరీ దాకా ఒక ముఖ్యమైన దశ. చరిత్ర పునరావృతం అవుతుందికానీ గతంలాగానే కాదు. సరిగ్గా మనం ఇప్పుడు అలాంటి దశలోకి చేరుకున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ విరమించాకనే కెవిఆర్ తన అసలైన పనిలోకి దిగారు. ఆ విద్రోహాన్ని ప్రశ్నిస్తూనే తిరిగి మళ్లీ వర్గపోరాటం ఆరంభమవుతుందనీ, దానికి మేధో రంగంలో సన్నాహం చేయవలసి ఉన్నదనే అకుంఠిత దీక్షతో రాశారు. అది ఎప్పటికి మొదలవుతుందో ఆయనకు తెలియకపోవచ్చు. కానీ సమాజ చలనాలను శ్రద్ధగా గమనిస్తూ రాసుకుంటూపోయారు. సమాజాన్ని వివరించడానికీ, మార్చడానికీ మార్క్సిజం, వర్గపోరాటం మార్గమనే విషయంలో ఇసుమంత కూడా సందేహం కలగలేదు. తనను మార్క్సిస్టుగా నిలబెట్టుకుంటూ, ప్రగతిశీల భావజాలానికీ, రాజకీయాలకూ అనువైన వాతావరణాన్ని సిద్ధం చేయడానికి కృషి చేశారు. అందువల్లనే నక్సల్బరీ పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన ఎట్లాంటి తడబాటుకూ, సందేహాలకూ గురికాలేదు. సాహసోపేతంగా అందులో భాగమయ్యారు. ఇక తిరిగి చూసుకోవలసిన పనే కలగలేదు.
ఆయన జీవితకాలంలో ఇరవై ఎనిమిదేళ్లపాటు అనేక కష్టాల మధ్య, సవాళ్ల మధ్య కొనసాగిన దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. సందర్భం, భాష వేరేగాని, తిరిగి వర్గపోరాటానికి లోపలి నుంచే విద్రోహం జరిగింది. ఆ తర్వాత ఇంకెన్ని పరిణామాలైనా జరగనీగాక. ఫలితంగా వర్గపోరాటం స్థానంలోకి రాజ్యాంగబద్ధత ప్రవేశించింది. హిందుత్వ కార్పొరేట్ ఫాసిస్టులు ఎంచుకున్న విప్లవోద్యమ నిర్మూలనా యుద్ధకాలంలో ఇదంతా జరిగింది. ఆనాటి సాయుధ పోరాట విద్రోహంతో ఏమాత్రం సరిరాని విఘాతం ఇది. బహుశా అప్పట్లో కెవిఆర్కంటే ఇప్పటి విప్లవాభిమానులకు ఇది మరింత లోతైన అనుభవం. కానీ వర్గపోరాటం చరిత్ర నియమం. సాయుధ పోరాటం ద్వారానే మౌలిక మార్పు సాధ్యం. ఇదీ కెవిఆర్ జీవన, రచనా సందేశం. దాన్ని అందుకొని దృఢంగా నిలబడతామా? లేదా అనేదే ఇవాళ మనందరి ముందున్న ప్రశ్న. వందేళ్ల కెవిఆర్ ఇప్పుడు మనకు వర్గపోరాట సందర్భం. ఇది గుర్తించడమే ఆయనకు ఇచ్చే నివాళి.




