తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని
ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ హక్కు ఉంటుందని చెప్పారు.కానీ డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి పర్యటనలో విద్యార్థుల ముందస్తు అరెస్టులు, నిర్బంధం సర్వసాధారణంగా అమలైంది.అనేక ఆంక్షలనడుమ జరిగిన ఆ సభలో ఓయూ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడుదల చేసినట్లు ప్రకటించారు.ఆ నిధులతో అంతర్జాతీయ స్థాయిలో వసతిగృహాలు,తరగతి గదులు,ఆడిటోరియం,క్రీడాప్రాంగణం తదితర నిర్మాణాలు చేపడుతామని అన్నారు.ఓయూ అభివృద్ధిలో ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న చొరవను స్వాగతిస్తూనే ఓయూతో సమానంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు,చాకలి ఐలమ్మ తదితర 15 యూనివర్సిటీల అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేయాల్సింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉస్మానియా యూనివర్సిటీతో పాటు భుజం భుజం కలిపి పోరాడినటు వంటి చరిత్ర కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలకూ ఉంది. నేడు ఓయూతో పాటు తెలంగాణలోని మిగతా ప్రభుత్వ యూనివర్సిటీలు దాదాపు ఒకే రకమైన సమస్యలతో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో కూడా హాస్టల్ భవనాలు శిథిలావస్థలోనే ఉన్నాయి .ఈ రెండు యూనివర్సిటీలలో కూడా విద్యార్థులు రేకుల షెడ్డులలో ఉంటున్నారు. మరికొన్ని యూనివర్సిటీలలో విద్యార్థినులకు వసతి సరిపోవటం లేదు.అనగా అన్ని యూనివర్సిటీలలో కూడా నూతన వసతి గృహాల నిర్మాణంతో పాటు, తరగతి గదుల నిర్మాణం అదే విధంగా లైబ్రరీల నిర్మాణం,ప్రయోగ శాలలు,ఆడిటోరియంల నిర్మాణం అత్యవసరమై ఉన్నది. అలాగే ఓయూతో పాటు మిగతా యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల నియామకం, బోధనేతర సిబ్బంది నియామకం అత్యవసరంగా జరపాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వలేదు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఎలా అన్యాక్రాంత మవుతున్నాయో కాకతీయ యూనివర్సిటీలో శాతవాహన యూనివర్సిటీ లో కూడా భూములు కబ్జా అవుతుంటే విద్యార్థులు గత ఏడాది కాలంగా పోరాడుతున్నారు.భూముల కబ్జాలపై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పలేదు.ఇక విద్యార్థి సంఘ ఎన్నికలు అయితే తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలతో పాటు రాష్ట్ర మంతటా జరపాల్సిన అవసరం ఉంది.ముఖ్యమంత్రి ఆగస్టు సభలో ఈ విషయం ప్రస్తావిస్తారని భావించి నిరాశ పడిన విద్యార్థి లోకానికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఇక నిధుల కేటాయింపు విషయంలో గత బడ్జెట్లో యూనివర్సిటీల అభివృద్ధికి అతి తక్కువ నిధులు కేటాయించడంతో అన్ని యూనివర్సిటీలకు అన్యాయం జరిగింది.కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చి మిగతా యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. ఈ చర్య మిగతా యూనివర్సిటీల విద్యార్థులకు అన్యాయం చేయడమే కాకుండా, ఉన్నత విద్య అభివృద్ధిలో వివక్ష, ప్రాంతీయ అసమానతలు పాటించినట్లవుతుంది.
అందరూ తెలంగాణా బిడ్డలే కదా! అందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు అందాలి.అన్ని వర్శిటీల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలి. ఈనెల 10వ తేదీన జరిగిన ముఖ్యమంత్రి గారి ఓయూ సభలో కేయూ, శాతవాహన పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ,చాకలి ఐలమ్మ తదితర వర్సిటీల విద్యార్థుల సమస్యలపై చర్చ జరగలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే అన్ని యూనివర్సిటిలకు సంబంధించిన అధికారులను పిలిపించి,ఉన్నత విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఒక రివ్యూ జరిపి ఆయా విశ్వవిద్యాలయాలకు
ఏం కావాలో అడగాలి? ప్రత్యేక నిధులు విడుదల చేయాలి.రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న పి.జి విద్యార్థులకు 5 వేల రూపాయల ఫెలోషిప్, పిహెచ్డి విద్యార్థులకు పదిహేను వేల రూపాయల ఫెలోషిప్ పథకంను ప్రారంభించి అన్ని యూనివర్సిటీల లోని విద్యార్థులకు వర్తింప చేయాలి.ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ,మౌలిక సదుపాయాల కల్పన చేయాలి.లేనియెడల యూనివర్సిటీల సమిష్టి అభివృద్ధికై విద్యార్థులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలి.అందుకు విద్యార్థులకు ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది.
ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్
(PSU)
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి




