గూగీ వా థియాంగో తన 87 ఏళ్ల ధిక్కార జీవితాన్ని ప్రపంచ పీడిత ప్రజల బలమైన సాంస్కృతిక ప్రతిఘటనగా నిలిపి మే 28, 2025 న భౌతికంగా నిష్క్రమించాడు. తూర్పు ఆఫ్రికా కెన్యా దేశంలోని ఒక చిన్న తెగలో జన్మించిన గూగీ తన ప్రజల గురించి, వారి బాధల గురించి, అణచివేతల గురించి రాస్తే అది తమ గురించే రాసినట్లు తెలుగు పాఠకులు భావించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజల ‘మౌ మౌ’ గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ పోరాటాన్ని తలపింపజేస్తుంది. అందులో పాల్గొన్న విప్లవ వీరుడి కుటుంబం గూగీ ది. ఆ కారణంగా ఆయన చిన్నప్పుడే నిర్బంధాన్ని, రాజ్య హింసను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ జ్ఞాపకాలను ఆయన రాసినప్పుడు ఇక్కడి ప్రజలు ఆఫ్రికన్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రత్యక్ష వలస నుండి బైట పడిన కెన్యా పరోక్ష వలసలో మరింత దోపిడీకి గురైంది. అచ్చం అధికార మార్పిడి తర్వాత భారతదేశంలానే దగా పడింది. ‘పెటల్స్ ఆఫ్ ది బ్లడ్’ నవల వలసానంతర కెన్యా గురించి అనేక ప్రశ్నలు సంధిస్తుంది. పెట్టుబడిదారీ దోపిడీ స్వరూప స్వభావాలను ఆయన నవల ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ అద్భుతంగా కళ్ళకు కడుతుంది. ప్రజావీరులు మృత్యుంజయులు అనే సత్యాన్ని ‘మాటిగరి’ అనే కాల్పనిక పాత్ర ద్వారా రోమాంచితంగా ఆవిష్కరించాడు. ఈ పాత్ర ఎంత ప్రభావాన్ని వేసిందంటే ఈ కాల్పనిక కథా నాయకుని మీద ప్రభుత్వం కేసు నమోదు చేసేంతగా. నవల లోని పాత్రకు కెన్యా ప్రభుత్వం భయపడినట్లుగా ఇక్కడి ప్రభుత్వం విప్లవకారుల మృతదేహాలకు భయపడుతోంది.

అలా తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతుల పీడిత ప్రజలు గూగీని సొంతం చేసుకున్నారు. ప్రజల పక్షాన సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టి ఆయన జైలుకెళ్లాడు. జైల్లో రహస్యంగా టాయ్ లెట్ పేపర్ పై ఆయన రాసిన నవల ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ ను కామ్రేడ్  వరవరరావు ‘మట్టికాళ్ళ మహారాక్షసి’ పేరుతో ఇక్కడి జైల్లో అనువాదం చేశాడు. ‘యుద్ధ కాలంలో స్వప్నాలు’ అనే మరో నవలను కామ్రేడ్ సాయిబాబా తన కఠినమైన జైలు నిర్బంధంలో అనువాదం చేశాడు. పోరాడే ప్రజలకు బాసటగా రచనలు చేసిన గూగీ ఎదుర్కున్న నిర్బంధం, నిషేధాలు, దాడులు మన రచయితలు ఎదుర్కుంటున్నవే. గూగీ రెండు సార్లు స్వయంగా తెలంగాణ వచ్చి ఇక్కడి ప్రజా పోరాటాల గురించి తెలుసుకుని ఎక్కడైనా పీడిత ప్రజలందరూ ఒక్కటే అని చాటాడు. కామ్రేడ్ సాయిబాబా అనువాదం చేసిన తన నవలను హైదరాబాదులో ఆవిష్కరించి ఆయనకు సంఘీభావం తెలిపాడు.

సామ్రాజ్యవాద దోపిడిని, భాషా సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ఆయన స్థానిక ప్రజల భాషా సంస్కృతులను ఎత్తి పట్టాడు. ఇంగ్లీష్ లో రాయడం మానేసి తన ప్రజల కోసం తన మాతృభాష గికుయు లో రాయడం ప్రారంభించారు. ‘జేమ్స్ గూగీ’ అనే తన పేరును కూడా అచ్చమైన ఆఫికన్ పేరు ‘గూగీ వా థియాంగో’ గా మార్చుకున్నాడు. భాష ఎట్లా ఆధిపత్య సాధనవుతుందో అది మనుషుల్ని ఎట్లా తమ సమూహం నుండి దూరం చేసి వలసవాదానికి  బానిసలుగా చేస్తుందో సైద్ధాంతికంగా విశ్లేషించడమే కాదు, సుసంపన్నమైన ప్రజా సాహిత్యాన్ని, కళలను వెలికి తీసి ప్రాచీన జానపద శైలిని విప్లవీకరించి అద్భుతమైన కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించాడు. ఆ ప్రజా సాహిత్యాన్ని ప్రపంచమంతా చదివేలా చేశాడు. ఆఫ్రికన్ జానపద శైలిలో ఆయన రాసిన ‘వై హుమాన్స్ వాక్ అప్ రైట్’ అనే కథ వంద భాషలలోకి అనువాదమైంది. పిల్లల కథల దగ్గరి నుండి నాటకాలు, నవలలు, వ్యాసాలు, సాహిత్య విమర్శ వరకు అనేక ప్రక్రియల్లో ప్రజా సాంస్కృతిని సమున్నతంగా ఎత్తి పట్టిన గూగీ ప్రపంచ సాహిత్యంలో, పీడిత ప్రజల పోరాటాలలో, రేపటి మానవీయ సమాజ స్వప్నాలలో సజీవంగా ఉంటాడు. ఆయనకు వసంతమేఘం జోహార్లు అర్పిస్తున్నది.

Leave a Reply