ఉన్నత విద్యాసంస్థలలో కులవివక్షతను రూపుమాపేందుకై  యుజిసి ఈ  జనవరి 14 న నియమ నిబంధనల విడుదల చేసింది. పై  వాటిపై ఉన్నత కులాలనే వారినుండి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. అవి కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందులలో పెడుతాయని మనలాంటి వారు భావించినా, వాస్తవంలో అవి మోడీ, షా రాజకీయ ఎత్తుగడలలో భాగమని చెప్పక తప్పదు. గతంలో, 1990 లో మండల్ నివేదికకు వ్య‌తిరేకంగా అగ్రవర్ణ విద్యార్థులురోడ్డు ఎక్కిన విషయం విదితమే.  నాడు వి. పి . సింగ్,  తన పదవిని కోల్పోయేoదుకు సిద్ధమై వాటిని అమలుచేయడం, ఆ తర్వాత కమండల్ ఉద్యమం మొదలు కావడమూ మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు మోదీ, షాలకు అటువంటి ఇబ్బందేమీ లేదు. వారికి రక్షణగా న్యాయ వ్యవస్థ వుండనే వుంది . ఒక వైపు తాము కుల, లింగ, జాతి వివక్షతలకు వ్యతిరేకమని ఫోజులిస్తూనే, ముఖ్యంగా ఓబీసీ వర్గాలను తమకనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తూనే, మరో వైపు తమ బలమైన అగ్రవర్ణ ఓటు బ్యాంక్ చెదరకుండా యుజిసి నిబంధ‌న‌లు  అమలుగాకుండా చేసిన కుటిల ప్రయత్నంలో భాగమే సుప్రీo కోర్ట్  స్టే గా బావించవచ్చు .

కులవ్యవస్థ ఉన్న స‌మాజంలో  విద్యారంగంలో కుల వివక్షతను రద్దు చేయడం అంత సులభమైనది కాదు. అందులోనూ పాలకులు కుల వ్యవస్థ సమర్థకులైనప్పుడు అది అసాధ్యం. బురద గుంటలో ఉంటూ బురద అంటగూడదనుకోవడం అమాయకత్వమే.  అందులోంచి తాత్కాలికంగా  బయటకు వచ్చే అవకాశం వ‌చ్చిన‌ప్ప‌డు  ఆ బురదను కడుక్కోవచ్చు. అయితే మరల నివసిoచాల్సింది ఆ బురద గుంటలోనని మరువరాదు.  అందువల్ల, ప్రక్షాళనం చేయాల్సింది బురద గుంటలాంటి ఈ వ్యవస్థను. అయితే, ఆ లక్ష్యం కోసం  కులవివక్షతకు గురయ్యేవారు పోరాడకుండా, కొంత వెసులుబాటు నిచ్చే సంస్కరణలు పాలకవర్గాలు చేపట్టుతాయి . అవి పీడితులకు కాదు, ఒక విధంగా పాలకులకు  రక్షణ కవచాలు అని చెప్పాలి. అయితే, ఇప్పుడున్న పాలకులు పీడిత   కులాలకు ఆ వెసులు బాటును కూడా సహించే పరిస్థితుల్లో లేరు. 

ప్రజలకు పాలకులు కల్పించే యే వెసులుబాటయినా ప్రజా ఉద్యమాల ఫలితమే. ఈ రాయితీలు, రిజర్వేషన్లు ప్రజల అసంతృప్తి తమ అధికారానికి, ఆధిపత్యానికి పూర్తిగా ఎసరు పెట్టకుండా పాలకులు  అమలు చేస్తున్నావే, కొన్ని(అటవీ చట్టాలు) అమలు జేస్తున్నట్టు నటిస్తున్నవే.

ఈ నిబంధ‌ల నేపథ్యం:

 ఉన్నత విద్యాసంస్థలలో, గత ఐదు సంవత్సరాలలో కుల వివక్షతకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఈ విషయమై కులవ్యవస్థకు బలయిన రోహిత్ వేముల, పాయల్ తాద్విల తల్లులు సుప్రీం కోర్టుకు చేసిన అప్పీల్ పై, కోర్టు యుజిసికి వివరాలు సమర్పించమని ఆదేశాలిచ్చింది. యుజిసి  పార్లమెంట్ కు, సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం అలాంటి ఫిర్యాదులు, గత ఐదు సంవత్సరాలలో, 118% పెరిగాయి. అవి 2019-20 లో  173 నమోదుకాగా , 2023-24 నాటికి  378 కి పెరిగాయి.  ఈ ఫిర్యాదులు మొత్తం 4,547 కాలేజీలకు గాను, 1,553 కాలేజీలలో, 1,168 విశ్వవిద్యాలయాలకు గాను 701 విశ్వవిద్యాలయాల్లో నమోదు చేయబడ్డవే. అంటే మిగతా ఉన్నత విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష లేదనుకోవాలా?  విద్యార్థుల నుంచి ఫిర్యాదులందలేదా? వాటిని ఆయా పాలకవర్గాలు పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు ఉదయించక తప్పదు.

 కొందరు మేధావులనబడే వారు రిజర్వేషన్లే కులవ్యవస్థను మరింత ఘనీభవిస్తాయని, కుల సంబంధ‌మైన  వివక్షత రూపుమాపే ప్రయత్నాలకు అడ్డంకి అని వాదిస్తున్నారంటే, అలాంటి వారి యాజమాన్యంలోని ఉన్నత విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఫిర్యాదులను ఆశించగలమా?

మరోవైపు, గత ఐదు సంవత్సరాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో, ఐఐటి, ఐఐఎమ్ లలో 13,500 ఎస్ సి, ఎస్ టి, ఓబిసి విద్యార్థులు  మధ్యలో చదువును మానుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దానికి వారి వైఫల్యమే కారణమని ఆ సంస్థల అధినేతలు చెబుతున్నారు. కొంచెం నిశితంగా ఆలోచిస్తే, దానికి కారణం వారి సామాజిక నేపథ్యం అని తెలియవస్తుంది. వారంతా, ఆయా కులాలలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న  మొదటి తరం వారై వుంటారు కూడా. అంతేగాక, వారు ప్రభుత్వ కళాశాలల్లో , కళాశాలలలో, ముఖ్యంగా మాతృభాషా మాధ్యమంలో  చడడం వల్ల , ఉన్నత విద్యలో ఆంగ్ల భాషాలా ప్రావీణ్యతలో చాలా వెనుకబడి వునబడడం సహజం. ఇది వారికి అన్నీ విధాలా అడ్డంకి. వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య-కుల వివక్షతను సహిoచి, అవమానాలు భరిస్తూ, చదువును కొనసాగించడం,లేదా ఆత్మాగౌరవం కోసం చదువును మానెయ్యడం. చాలామంది, జీవితావసరాలకోసం   మొదటి ప్రత్యామ్నాయాన్నే ఎంచుకుంటారు. కారణం వారి ఆర్ధిక పరిస్థితులే నని వేరే చెప్పాలా? అలాంటివారికి కులవివక్షత నుండి రక్షణకై యూజిసి నియమావళి . అలాంటి సంఘటనలుపై, ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తిని, నిరసనల చల్లార్చడానికై, 2012లో, ఉన్నత విద్యాసంస్థలలో సమానత్వాన్ని పెంపొందించేందుకై యుజిసి కొన్ని నియమ నిబంధ‌న‌లు  ప్రకటించింది. దాని ప్రాథమిక లక్ష్యాలుగా ,  వివక్షను, విశాలమైన సమానత్వ పరిధిలో, కుల వివక్షను నిర్మూలించడం. అయితే, 2012 నిబంధ‌న‌ల‌లో తప్పుడు, ద్వేషపూరిత ఫిర్యాదు అంటే స్పష్టమైన నిర్వచనం లేదు. తప్పుడు ఆరోపణలు చేసినవారికి విధించే శిక్షలేమిటో తెలుప లేదు. స్వతంత్ర, బయటివారి ధృవీకరణ కు అవకాశం లేదు. మొత్తం విచారణంతా అంతర్గత విచక్షణ పై ఆధారపడి వుంటుంది. అందువల్ల సంబంధిత సంస్థల యాజమాన్యాల , అధికారుల పక్షపాత వైఖరి పై తీర్పులు ఆధారపడివుంటాయనే విమర్శలున్నాయి.  సంస్థల యాజమాన్యాలు ఎక్కువుగా  ఉన్నత కులాల వారే వుండడం గమనార్హం . పై లోపాల సరిదిద్దే ప్రయత్నమే 2026 నిబంధ‌న‌ల‌ని యూజీసీ తెలిపింది.

 యు జిసి నూతనంగా 2026 జనవరి 14 న విడుదల జేసిన నియమ నిబంధ‌న‌లు ఇలా ఉన్నాయి.   కేవలం విద్యార్థులేగాక  వివక్ష కు గురయ్యేవారందరి గౌరవం కాపాడడం , రక్షణ కల్పించడం. కేవలం కాగితాలకే పరిమితం గాక, సంస్థలు భాధ్యతాయుతంగా అమలు చేసేలా చూడడం  లక్ష్యం. ఇందులోని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమేమంటే కుల   వివక్షత పరిధిలో ఒబిసిలను చేర్చడం. కుల. మత, భాషా, లింగ, జాతి, అంగవైకల్య  వివక్షతను రూపుమాపేందుకై, అన్ని ఉన్నత విద్యాసంస్థలలో ”సమానత్వ అవకాశాల సెల్(Equal opportunity cells)”లను ఏర్పాటు జేస్తుంది. వివక్షత ఫిర్యాదుల స్వీకరించి, వాటిపై తగిన చర్యలు తీసుకొనేందుకై, వివక్షతా వ్యతిరేక అధికారి పేరుతో ఒక ప్రొఫెసర్ ను నియమిస్తారు.

 పై నియమ నిబంధ‌నలను మరింత కఠినతరం చేసి, ఆ  డ్రాఫ్ట్ ను   విడుదల చేస్తూ గత సం. ఫిబ్రవరిలో  యూజిసి ,ప్రజాభిప్రాయం కోరింది.   వాటిపై, వివక్షతకు గురయ్యే కులాల జాబితాలో  ఓబీసీ లు లేరని ,అసలు వివక్షత అంటే  స్పష్టత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో మరిన్ని సవరణలతో తన డ్రాఫ్ట్ లో కుల వివక్షత  జాబితాలో ఓబీసీ లను చేర్చింది, అయితే, తప్పుడు, అబద్ధపు ఫిర్యాదులపై చర్యల అంశం ను వదిలేసింది.

 వివక్ష  అంటే “మతం, జాతి, జన్మస్థలం, అంగ వైకల్యం మొదలైన వాటి ఆధారంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  ఏ స్టేక్ హోల్డర్ (ఫ‌లితాల అనుభవించేవారు ) పైన అన్యాయమైన, భిన్నమైన, పక్షపాత పూరిత ప్రవర్తన ,లేక చర్య ”

పై నిర్వచనాన్ని మరింత స్పష్టత చేకూరుస్తూ , 2026 డ్రాఫ్ట్  వివక్ష  “ విద్యలో సమానత్వ వైఖరిని దెబ్బతీయడం, రద్దుచేసే ఉద్దేశ్యంతో గాని,అటువంటి ప్రభావాన్ని చూపేందుకు గానీ జరిపే ఏ విధమైన భేదం, బహిష్కరణ, పరిమితులను వివక్షత గా భావించాలి. ముఖ్యంగా, మానవ గౌరవాన్ని భంగపరిచే షరతులను ఏ వ్యక్తీ,లేదా ఏ గుంపు మీదైనా విధించడం కూడా వివక్షతనే ” అని పేర్కొనింది.

అయితే ,విద్యా సంస్థలలో ప్రవేశాల విషయంలో ఎస్ సి,ఎస్ టి పట్ల చూపే వివక్షత లో వుండే ఎనిమిది భిన్నమైన రూపాలను  2012 నిభంధనలు స్పష్టంగా పేర్కొనగా, 2026 నిభందనలు వాటిని పేర్కొనకపోవడం గమనార్హం. అందువల్ల వివక్షత గురించిన స్పష్టత కరువయ్యింది.

ప్రతి విద్యా సంస్థలో “సమాన అవకాశాల కమిటీ “ వుంటుంది.అది ప్రతి ఉన్నత విద్యా సంస్థలో సామాజిక సమ్మిళితం(social inclusion)పెంపొందించడానికి కృషి చేస్తుంది. ఈ కమిటీ ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణ, పరిశీలన  బాధ్య‌తలను నిర్వహిస్తుంది. ఈ “సమాన అవకాశాల కమిటీ “  కింద విద్యాసంస్థ ఉన్నతాధికారి అద్యక్షతన ఈక్విటీ కమిటీ ఏర్పాటు చేస్తారు. అందులో సభ్యులుగా ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, మహిళల , అంగవైకల్యం కలవారి నుండి ఒక్కొక్క సభ్యుడు తప్పక ఉంటారు. ఈ కమిటీ సభ్యులు సంవత్సరానికి రెండుమార్లు సమావేశమవుతారు. అంతేగాక, ప్రతి సంస్థ సంవత్సరానికి ఒక మారు “సమాన అవకాశాల కమిటీ “  పని తీరుపై యుజిసి కి నివేదిక సమర్పించాలి.  వీటి పర్యవేక్షణకై, జాతీయ స్థాయిలో ఒక  కమిటీ వుంటుంది. అందులో వివిధ వృత్తులకు సంబంధించిన  ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు వుంటారు. వారంతా  కనీసం   సంవత్సరానికి రెండు మార్లు సమావేశమై వివిధ విద్యాసంస్థల నివేదికల పరిశీలించి, నిబంధ‌నల ఉల్లంఘించిన వాటిపై -యుజిసి స్కీం ల నుండి వెలివేత, డిగ్రీ పోగ్రాంల, దూరవిద్య, ఆన్ లైన్ పోగ్రాంల  నిరాకరణ లాంటి చర్యలను తీసుకుంటుంది.

గతంలో,ఈ మొత్తం సమస్య కేవలం వివక్ష వ్యతిరేక అధికారి( anti –discrimination  officer ) అంటే  ఈక్వల్ ఆపర్చ్యూనిటీ సెంటర్  పరిధిలోనే వుండేది. కానీ అదిప్పుడు అనేక పర్యవేక్షక కమిటీల పరిశీలన కిందికి వస్తుంది.అందువల్ల ఫిర్యాదులను ఏ ఒక్కరూ నీరుగార్చే అవకాశం లేదు.

 నిరసనలు:

 1990 ల నాటి మండల్ వ్యతిరేక ఉద్యమ స్థాయి గాకపోయినా ఉన్నతకులాల వారినుండి యుజిసి నిబంధ‌నల పట్ల నిరసనలు, ముఖ్యంగా ఆధిపత్య కులాల ప్రాభల్యం ఎక్కువుగా వున్న ఉత్తరప్రదేశ్రా ష్ట్రంలోపెల్లుబికాయి. కొందరు ఛోటా బిజెపి నాయకు, కొంతమంది అధికారులూ రాజీనామా చేయడం గమనార్హం. పొతే, ఇప్పుడు , న్యాయవ్యవస్థ వారికనుకూలంగా నిబంధ‌నల అమలును తాత్కాలికంగా నిలిపివేయడంతో , నిరసనలు దేశవ్యాప్తం కాలేదు.

 నిరసనకారుల అభ్యంతరాలు:

‘రాగింగ్’ అనే తప్పుడు సమానత్వం సాధారణ వర్గానికి చెందిన విద్యార్థిని, షెడ్యూల్డ్ కులానికి చెందిన  చెందిన సీనియర్ రాగింగ్ చేస్తే ఎలా? అన్న పిటిషనర్ ఆందోళన—అధికారాన్ని (power) పక్షపాతంతో (prejudice) గల్లంతు చేస్తుంది.

రాగింగ్ భయంకరమైనదే. దానికి తగిన దండన వుండాల్సిందే.  కానీ ఇక్కడ ఒక మౌలిక తేడా ఉంది. ఒక వ్యక్తి చేసే అల్లరితన చర్య (అది ఎస్‌సీ వ్యక్తి చేసినా సరే) ఒకటి;

సంస్థలే అమలు చేసే వ్యవస్థాగత బహిష్కరణ మరోటి.

ఒక బ్రాహ్మణ విద్యార్థిని ఒక దళిత విద్యార్థి రాగింగ్ చేస్తే—అది నేరమే.

కానీ అది బ్రాహ్మణుడిని, సమాజంలో అట్టడుగున ఉంచే సామాజిక శ్రేణి స్థాయికి  చేర్చదు..

అదే ఒక బ్రాహ్మణ పరిపాలనా వ్యవస్థ, దళిత విద్యార్థిని అవమానిస్తే—అది శతాబ్దాల అణచివేత పునరావృతం కావడమే.  విద్యార్తుల ఆకతాయి చేష్టలను ,కులపరమైన అవమాన చర్యలుగా చూడడం హాస్యాస్పదం  .

యుజిసి విధించిన మార్గదర్శక సూత్రాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు వున్నాయని, అవి మోతాదుకు మించిన చర్యలకు దారి తీస్తాయని వారు వాదిస్తున్నారు. కొందరు అస్పష్టమైన నిర్వచనాలున్నాయంటున్నారు. అంతేగాకా, ఆ నిబంధనల న్యాయబద్ధంగా అమలుజేసే సామర్థ్యం విద్యాసంస్థలకు లేవంటున్నారు. ఈ నిబంధ‌నలు గతంలో లాగా కేవలం సలహా పూర్వకమైనవి కావని, 2026 నిబంధ‌నలు చట్టబద్ధ‌మైనవని, నిర్ణీత కాలంలో వాటిని అమలు చేయాలని లేకపోతే విశ్వవిద్యాలయాలు గుర్తింపు కోల్పోతాయని , అందువల్ల, ఈ నిబంధ‌న‌లు  అన్యాయమైనవని, సామాజిక విభజనకు దారితీస్తాయని మరికొందరి అభిప్రాయం. డిల్లీకి చెందిన పిహెచ్ డి విద్యార్తి  త్రిపాటి  ఈ నూతన నిబంధ‌నలలో –నేరంచేయలేదని నిరూపించుకునే  బాధ్య‌త  ఆరోపణలనెదుర్కుంటున్నవారిదే అవుతుంది తప్ప, ఆరోపణల ఋజువు చేయాల్సిన బాధ్యత ఆరోపణ చేసినవారిది కాదు అని అభిప్రాయపడుతారు. దీన్ని గురించి  కొంత ఆలోచించవలసినదే

అయితే, దుర్వినియోగం విషయానికొస్తే, దుర్వినియోగం కాని రక్షణ నిబ‌oధనలు అంటూ ఏవీ లేవు  – రాగింగ్ నియమాలనుండి  మహిళల వేధింపుల దాకా ప్రతి నియమం కొన్నిమార్లైన, దుర్వినియోగానికి గురవుతున్నవే. అంతమాత్రాన, వాటిని రద్దుచేయమనడం , జలుబుచేసిందని  ముక్కును కోసుకోవడం అవుతుంది.

మరో అభ్యంతరంరం- ఈక్విటీ కమిటీలలో జనరల్ కేటగిరీ కి చెందిన వారికి స్థానం లేదు.

అయితే ఆ నియమాలలో ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, మహిళల ప్రాతినిథ్యం   తప్పనిసరన్నారు గాని, జనరల్ కేటగిరీ కి చెందిన వారికి స్థానం లేదని కాదు.అంతేగాక, విశ్వవిద్యాలయ అధిపతులు మెజారిటి జనరల్ కేటగిరీకి చెందిన వారే. వారే పై కమిటీలకు అధ్యక్షత వహిస్తారు. అలాంటప్పుడు జనరల్ కేటగిరీ కి చెందిన వారికి స్థానం లేదనడం అవాస్తవం.

  మొత్తం విద్యార్థుల్లో ,2021-22 గణాంకాల ప్రకారం,ఎస్ సి, ఎస్ టి, ఓబిసివిద్యార్థులు అందరూ కలిసి 60.83% వున్నారు. అందువల్ల మైనారిటీ సంఖ్యలో వున్న ఉన్నత కులాలవాళ్ళు , మెజారిటీ సంఖ్యలో ఉన్నవారిని ఎలా వేధిస్తారని నిరసన కారుల ప్రశ్న. ఇది పైన చూడడానికి హేతుబద్ధంగా కనిపిస్తుంది. కానీ, మన నిచ్చెనమెట్ల వ్యవస్థలో దిగువ కులాలలో, నిమ్నకులాల మధ్య  ఐక్యత ఆశించడం ఎండమావుల్లో దాహం తీర్చుకోవడమే అవుతుంది.అలా మెజారిటీ,మైనారిటీ గణాంకాలు పరిగణలోనికి తీసుకుంటే నేడు ప్రభుత్వాధీకారం కిoదికులాల చేతుల్లో వుండాలి.   ఉదాహరణకు,న్యాయవ్యవస్థలోనే చూద్దాం.  పార్లమెంటుకు సమర్పించిన గణాంకాల ప్రకారం,2021 -26 హై కోర్ట్ న్యాయమూర్తులుగా నియమించబడ్డవారు- ఎస్ సి లనుండి 26, (4.38%) ,ఎస్ టిలు 14 ( 2.36% ), ఓబీసీలు 80 (13.49% ) వుండగా, జనరల్ కేటగిరీ(ఉన్నత కులాల ) కి చెందినవారు 473( 79.76%) వుండడం గమనార్హం. అంతకముందు  2018 -, 2024, మధ్యకాలంలో,3.07% (21) ఎస్ సి లు,  2.05% (14) ఎస్ టి , 11.99% (82) ఓబీసీ ,మిగతా  82.89% (567) జనరల్ కేటగిరీ(ఉన్నత కులాల ) కి చెందినవారు .

అన్ని సంస్థలపై అధికారం అగ్రవర్ణాల వారిదే.  అంతేగాక,ఇక్కడ మనం చూడాల్సింది,మెజారిటీ,మైనారిటీ గణాంకాలను  కాదు,సామాజిక ఆధిపత్యం ఎవరి చేతిలో ఉందనే వాస్తవాన్ని .

  వివిధ విశ్లేషకుల అభిప్రాయాలు:

ఉన్నతకులాలవారి అసలు సమస్య కొత్త నిభంధనలలో-ఫిర్యాదుల విచారణ,వాటిపై చర్యలకై కాలపరిమితి నిర్ణయించడం, తప్పనిసరిగా నివేదికల సమర్పణ,కఠినమైన జరిమాన, బహుళ పర్యవేక్షక బృందాలు,అని రోషణి చక్రవర్తి తన ఇండియా టు డే వ్యాసం( UGC’s new equity rules: What changed since 2012, what hasn’t, and why it matters) అంటారు.   అంతే కాదు, అగ్రవర్ణాల వారికి కలిగే ఇబ్బందికి కారణం  కొత్త నిభంధనలు కావు, వాటిని అమలుపరచబోయే స్థాయి,పరిధి అసలు కారణం అని రచయిత అభిప్రాయం. 

 డిల్లీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ లతిక గుప్త, కులం అనేది చాలా నిగూడంగా పనిచేస్తుందన్నారు. చాలామంది రిజర్వేషన్ పొందిన విద్యార్తులు ప్రభుత్వ పాఠ‌శాలల నుండి వచ్చిన వారై ఉంటారు. అందువల్ల  వారి ఆంగ్లభాష పరిజ్ఞానం , ప్రైవేట్ పాటశాలల్లో ఆంగ్లమాధ్యమంలో చదివిన ఉన్నత కులాల విద్యార్థులతో పోలిస్తే తక్కువుగా ఉంటుందని, ఇది  కూడా ఉన్నత కులాల విద్యార్థులు వారిని చిన్న చూపు చూసే అవకాశం కల్పిస్తుందని ఆమె భావన. ఈ ఆంగ్లభాష పరిజ్ఞానలేమిని అగ్రకులాల విద్యార్తులు  కులానికి అంటగడుతున్నారు. ఆమె అభిప్రాయంలో – విద్యార్తుల సఫలత (performance) కులం పై ఆధారపడి వుంటుంది. విశ్వవిద్యాలయాల్లో, అసమానత కొనసాగడానికి పైన చెప్పిన వ్యవస్తీకృత సమస్యలే కారణం. అంతేగాక, ఇంతవరకు అధికారులు, పీడితకులాల విద్యార్తుల సమస్యలు పట్టించుకోలేదని, వారిలో చాలామంది అత్యంత పేద కుటుంబాల నుండి వచ్చినవారని తెలిసినా, వారికి సకాలంలో ఉపకారవేతనాలు చెల్లించడం లేదన్నారు. వ్యవస్థ వారిపట్ల సానుభూతితో లేకపోతే, వ్యవస్థలో సమానత్వం ఎలా వుంటుందని ఆమె ప్రశ్నిస్తారు. ఆమె ఉద్దేశ్యంలో ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, ఇడబ్లూసి, వైకల్యం గలవారిని ఒకే గ్రూపుగా పరిగణించడం సరైంది కాదు. శారీరిక వైకల్యం గలవారిని, వివిధ కులాలవారితో, ఇడబ్లూసికి చెందిన వారిని, ఎస్ సి,ఎస్ టి, ఓబిసి వారితో సమానంగా చూడడం సామాజికంగా, రాజకీయంగా తప్పుడు బావన. కులాన్ని ఆర్థికపరమైన పేదరికంతో సమానంగా చూడడం తప్పుడు నిర్ణయమని చెప్పక తప్పదు. ఉన్నత కులాలలోని పేదలకు రిజర్వేషన్ కలిపించడం వేరు.కులపరమైన వివక్ష అనుభవిస్తున్న  వారితో జతపరచడం వేరు. కూటికి పేదనైనా, కులానికి పేదను కాననే బావన ఇప్పటికీ అగ్రకులాల్లోని మెజారిటీలో  నరనరాల్లో జీర్ణించుకొనే వుందనేది చేదు వాస్తవం ఎలా మరువగలం.

అదేవిధంగా మరికొందరు,ఈ నియమ నిభందనలు ప్రాథమికంగా వివక్షాపూరిత ప్రవర్తనను గుర్తించడం,అలా ప్రవర్తించిన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టడం పై కేంద్రీకరిస్తాయనీ, అలా కులాన్ని కేవలం ప్రవర్తనకు సంభందించిన సమస్యగా చూడడం సరిపోదంటారు. కారణం అది వ్యవస్థకు సంభందించినది.సమానత్వం అనేది మార్గదర్శకాలతో సాధించలేమని, అణచివేయబడిన కులాల నుండి వచ్చిన వారికి ఉన్నతకులాలపిల్లతో సమానంగా జ్ఞానాన్నిఅందించే స్థాయికి సమాజం చేరలేదంటారు ప్రో.గుప్త.

ఇక డిల్లీకే చెందిన మాజీ ప్రో.సతీష్ దేశ్ పాండే- వివక్షత అనేది కేవలం వ్యక్తులలోనే కాదు,సమాజం లో చాలా లోతుగా పాతుకపోయింది.ఆయన అభిప్రాయంలో, కుల పీడనకు గురయ్యే  వారు ,తాము పీడిత కులాలకు చెందిన వారమని చెప్పుకొనే అవకాశం లేకపోవడమే  అత్యంత  భయంకరమైన అణచివేత. సమాజం చాలాకాలం వివక్షత బయటపడకుండా చేసింది. ఈ నియమాలు నేడు వాటిని వెల్లడించే అవకాశాలు కల్పిస్తాయి. ఆయన అభిప్రాయంలో ఈ నిరసలన్నీ,అగ్రకులాలవారికి ఇంతవరకూ వారు అనుభవిస్తున్న హక్కులను రద్దుచేస్తున్నారనే భాధకు,ఆగ్రహానికి వ్యక్తీకరణలే అని ఆయన అభిప్రాయం.

  రాజస్థాన్ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్సెలర్, ఫర్ఖాన్ కమార్ ( Furqan qamar) అభిప్రాయంలో, ఈ సమస్య కేవలo నిర్మాణాత్మక (structural) మైనదే కాదు,సామాజికమైనది కూడా. వివిధ సామాజిక సమూహాల మధ్య,ఆ సమూహాలలో అంతర్గతంగానూ  లోతుగా పాతుకపొయిన  అపనమ్మకాన్ని, అభద్రతా బావాన్ని యుజిసి నిభందనలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు తెలియజేస్తున్నాయని, సామాజిక ఐక్యతను పెంపొందించడం అత్యవసరమని ఆయన అంటారు. నిభందనలు ప్రగతిశీలమైనవే అయినా, అవి కేవలం కాగితాలకే పరిమితమవుతాయేమోననే సందేహాన్ని ఆయన వెలిబుచ్చుతారు.

 సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్ అగ్రవర్ణాల నిరసనల తీవ్రంగా ఖండించారు.ఆమె దృష్టిలో ఈ నియమ, నిబంధ‌న‌లు చాలవు, అసమగ్రమైనవి. యూజిసి నిభందనల రద్దుచేయమని కొందరు సుప్రీం కోర్టుకు వెళ్ళారు.వాటిని సవాల్ జేస్తూ రెండు పిటీషన్ లు విడిగా  దాఖలు అయ్యాయి.

 ఆ ఫిర్యాదుదారుల ప్రధాన ఫిర్యాదు- ఆ నిబంధ‌నలలోని 3 సి నిబంధ‌న-ఆ నిబంధ‌న  ప్రకారం కుల ఆధారిత వివక్షత అంటే  కేవలం ఎస్ సి,ఎస్ టి, ఓబిసి ల పట్ల కుల వివక్షత. ఆ నిర్వచనం జనరల్ కేటగిరికి సంబంధించిన విద్యార్థుల వివ‌క్ష‌తను తన పరిధిలోకి తీసుకోలేదని, అదీ ఒకరకమైన వివక్షతే నని ఫిర్యాదుదారుల వాదన.

ఫిర్యాదుదారులలో ఒకరైన మృత్యంజయ తివారీ ప్రకారం, ఈ నియమాల్లో  కుల ఆధారిత వివక్షత అనేది ఒకే దిశలోనే ప్రవహిస్తుంది. అందువల్ల, ఈ నియమం కొన్ని వర్గాలను  మాత్రమే చట్టపరంగా బిధితులుగా గుర్తిస్తుంది. మిగిలిన వర్గాలు ఫిర్యాదు చేసేందుకు , న్యాయం కోరేందుకు అవకాశం లేదు.

పై వాదన నేటి సమాజంలో ఎంత అర్థరహితమో మనకంతా తెలుసు. శతాబ్దాలుగా కుల వివక్షతకు గురవుతున్న వారెవరో, కుల ఆధిపత్యాన్ని చెలాయించే వారెవరో  నాటి ఏకలవ్యుని  నుండి  నేటి రోహిత్ వేముల దాక  చరిత్ర కళ్ళముOదుంచుతూనే వుంది.

రెండవ పిటిషన్ వినీత్ జిందాల్ అనే వకీలు దాఖలు చేసారు. ఆయన ఫిర్యాదు-ఆ నిభందనలు ఏకపక్షమైనవి, రాజ్యాంగ విరుద్ధమే గాక, యూజిసి పరిధిలో లేవు.వివక్షత కేవలం ఎస్ సి,ఎస్ టి,ఓబిసి లకుకే పరిమితం చేయడం చట్టం ముందు అందరు సమానమే అనేరాజ్యాంగ హామీని ఉల్లంఘించడమే నని ఆయన అభిప్రాయం. అందువల్ల ఆ నియమాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టును అభ్యర్తించారు.

ఇక సుప్రీంకోర్టు ఏం చెబుతుOదో వేచి చూద్దాం:

కోర్టు,పై నిబంధ‌న‌లు అస్ఫష్టంగా వున్నాయని, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందంటూ వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వుల నిచ్చింది. గతంలో మండల వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వపరంగా, న్యాయపరంగా కమలనాథులకు చుక్కెదురయ్యింది. ఓబిసి రిజర్వేషన్లను ,  అగ్రవర్ణ విద్యార్థులు తమ ఆందోళనలతో ఆపలేకపోయారు. కాలం మారింది, అధికారం కోసం వాళ్ళూ ఓబిసి చాంపియన్ల  ముసుగు ధరించవలసి వచ్చింది. అదేసమయంలో, తన పునాదిబలం అగ్రవర్ణాల మద్దతును పోగొట్టుకోలేదు. ఈ క్లిష్ట సమస్యకు సుప్రీం కోర్టు తన స్టే ఉత్తర్వులతో పరిష్కారం చూపింది.

 న్యాయవ్యవస్థ , మొదటినుండి , కుల ఒక వ్యవస్థీకృత వాస్తవం అని అంగీకరించేందుకు ఇబ్బంది పడుతూనే వుంది. ఇప్పుడుకూడా అంతే.  యూజిసి నిబంధ‌న‌లు  2026 ను తాత్కాలికంగా నిలిపివేస్తూ, కోర్టు ధర్మాస‌నం వేసిన ప్రశ్న కోర్టు కుల దృక్కోణాన్ని వెల్లడిస్తుంది.

మనం కులరహిత సమాజాన్ని సాధించడంలో ఏమి సాధించామో దాని నుండి వెనక్కి వెళ్తున్నామా? అనే  ధర్మాసనం వేసిన ప్రశ్న, భారతీయ క్యాంపస్‌లలో జరుగుతున్న సంఘటనలకు పూర్తిగా విరుద్ధంగా వుంది. కోర్టు మనం ఒక “కులరహిత సమాజం”ను సాధించామని, లేదా సాధించే అంచున ఉన్నామని ఊహిస్తోంది, ఈ నిబంధనలు ఆ కులతత్వానికి   మళ్లీ ప్రాధాన్యత కలిగిస్తున్నాయని  భావిస్తోంది. కోర్టు బావనలు , అభిప్రాయాలు నేటి సామాజిక వాస్తవాలకు దూరంగా వున్నాయి. నిండు కోర్టులో, సనాతన ధర్మానికి అపకారం జరిగిందని,  ఒక దళిత జడ్జి పైన దాడి జరిగిన సంఘటన కళ్ళెదుట కనపడుతున్నా, ధర్మాసనం, పై వాఖ్యలు చేసుందంటే న్యాయస్థానాల్లో దళితులకు   న్యాయం జరుగుతుందని ఎవరైనా ఎలా అనుకోగలరు. ఇలాంటి దృష్టికోణం వున్న న్యాయమూర్తులనుండి ఎలాంటి తీర్పులు వస్తాయో ఊహించడం కష్టం కాదు.

మనం వివక్షతను ఎత్తి చూపుతున్నందుకు “వెనక్కు మరలడం లేదు”,ఆ వివక్షత వుందని అంగీకరించక పోవడమే  మనల్ని  వెనకకు వెళ్ళేలా చేస్తున్నది,అని పవన్ కోరాడ తన What Did the Supreme Court Say When Staying the New 2026 UGC Equity అనే  వ్యాసంలో   వాఖ్యానిస్తారుజ.

 కోర్టు మరో ప్రశ్న –“ వివక్షత” అనేదే  అన్నిరకాల వివక్షతలును పరిగణలోనికి తీసుకొస్తున్నది కదా, అలాంటప్పుడు,” కుల వివక్షత” కు ప్రత్యెక నిర్వచనం ఇవ్వడం ఎందుకు? పైకి ఇది సబబైన సందేహంలా కనిపిస్తుంది. కానీ, అంతర్గతంగా న్యాయమూర్తులు అన్ని రకాల వివక్షతలను ఒకే గాటికి కట్టే ప్రయత్నం అది.

పవన్ కోరాడఅభిప్రాయంలో,   దాన్ని న్యాయం ముసుగులో దాగివున్న అధికారిక సమానత్వం అనవచ్చు. అసమాన సమాజంలో అందరికీ ఒకే న్యాయం వర్తిoపజేయడమంటే, ఉన్న అసమానతల కొనసాగించడమే   అంతేగాక,మనకు దాడుల,హత్యల పై శిక్షవేసేందుకు భారతీయ న్యాయసంహిత వున్నప్పుడు,ఇక అత్యాచార నిరోధక చట్టం (Prevention of Atrocities ఆక్ట్)ఎందుకు? అనే ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. సాధారణ దాడులను శిక్షించే చట్టం ఇప్పటికే ఉన్నప్పటికీ,  మహిళలను గృహహింస నుండి కాపాడే చట్టం అవసరమేమిటంటారు  పవన్ కొరాడ .

ఆయన వివక్షత గురించి మరింత వివరిస్తూ,  కుల వివక్ష అనేది ఏదో సాధారణమైన “వివక్షత” కాదు; అది చరిత్రలో రూపుదిద్దుకున్న, మతపరంగా సమర్థించబడిన, సామాజికంగా అమలయ్యే అవమానాల వ్యవస్థ. ఇది “సాధారణ” చూపుకి కనిపించని సంకేతాల, కోడ్‌ల ద్వారా పనిచేస్తుంది, అని చెబుతూ నేడు జరుగుతున్న సంఘటనల వివరిస్తారు.

ఒక దళిత విద్యార్థి ప్రతిభ మౌఖిక పరీక్షలో (Viva Voce) ప్రశ్నించబడినప్పుడు, లేదా మెస్ హాల్‌లో సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు, అది “సాధారణ వివక్ష” కాదు. అది పుట్టుక ఆధారంగా జరిగే గౌరవంపై ప్రత్యేక దాడి. దీన్ని ఒక సాధారణ విభాగంలో కలిపివేయడం అంటే , దాని చరిత్రనూ, అది చిమ్ముతున్న  విషాన్ని కూడా చెరిపేస్తుంది.

“నిష్పాక్షికత” నిర్వచనంపై కోర్టు గట్టిగా నిలబడటం వల్ల దళితులు, ఆదివాసీలు అనుభవించే ప్రత్యేక బాధలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. వీటినన్నింటినీ కోర్టు పరిగణలోనికి తీసుకోకపోవడం విచారకరం.

కోర్టు “రాగింగ్‌ను ఎందుకు మినహాయించారు?” అని అడిగింది. కానీ ఇక్కడ ఒక స్పష్టమైన న్యాయపరమైన సందర్భం ఉంది.

UGCకి ఇప్పటికే Regulations on Curbing the Menace of Ragging in Higher Education Institutions, 2009 ఉన్నాయి.. .

ఇది కోర్టు దృష్టిలో కుల హింసను, వ్యవస్థాగత రోగంగా గాక. విద్యార్థుల క్రమశిక్షణ సమస్యగా మాత్రమే చూస్తున్నట్టుగా సూచిస్తుంది— సమానత్వానికి సంబంధించిన నియమావళిలో రాగింగ్‌ను కలపాలని అడగడం కుల వివక్ష నియమాలను నీరుకార్చడమే అవుతుంది.

‘దుర్వినియోగం’ అనే భూతం కోర్టు 2012 నియమావళికి  తిరిగి ప్రాణం పోసింది—అదే నియమాలు రోహిత్ వేముల, పాయల్ తడ్వీ వంటి వారు మరణానికి నెట్టబడ్డ కాలంలో అమలులో ఉన్నవే . అయితే,వారి ఆత్మహత్యలకు కారణభూతులైన వారిని శిక్షించలేదు,సరికదా కనీసం వారెవ్వరో తేల్చలేదు.  ఈ విషయం న్యాయమూర్తులు మరిచారేమో.

“తాత్కాలికంగా 2012 మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి” అని చెప్పడం అంటే—దండనలేని వ్యవస్థ తాత్కాలికంగా కొనసాగవచ్చని సూచించడమే. 2026 నియమావళి “అస్పష్టంగా ఉంది”, “దుర్వినియోగానికి అవకాశం ఉంది” అని కోర్టు అంటుంది. అయితే దళిత పరిశోధకుల ఆత్మహత్యల పరంపర దుర్వినియోగం కాదా?

రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులను వేధించే ప్రొఫెసర్లపై ఎలాంటి బాధ్యత లేకపోవడం అధికార దుర్వినియోగం కాదా?

ఈ సందర్భంలో న్యాయవ్యవస్థకు “దుర్వినియోగం” అన్న మాట—ప్రధానంగా ఆధిపత్య కులాల అభిప్రాయాలతో ఏకీభవిస్తునట్టుంది. దళితుల జీవితాల విధ్వంసం మాత్రం “పరిపాలనా లోపం”గా మాత్రమే చూపబడుతోంది—దాన్ని “ఎమినెంట్ జ్యూరిస్టులు” సరిచేస్తారట.

‘ఎమినెంట్’ పరిష్కారం చివరగా, “సామాజిక విలువలు” అర్థం చేసుకునే “ఎమినెంట్ జ్యూరిస్టుల” కమిటీని కోర్టు సూచిస్తోంది. భారతదేశంలో “సామాజిక విలువలు” అనేది చాలాసార్లు సామాజిక క్రమాన్ని కాపాడటం అనే దానికి  సంకేత పదం—ఆ క్రమం హైరార్కీతోనే నిర్వచించబడింది.

ఈ స్టే ఆర్డర్ ఒక విరామం కాదు; అది ఒక సంకేతం“జనరల్ కేటగిరీ” అనేది నియంత్రణ అవసరమైన ప్రత్యేకాధికార స్థలం అని అంగీకరించడానికి భారత రాజ్యం—న్యాయవ్యవస్థ ద్వారా—ఇంకా సిద్ధంగా లేదన్న సంకేతం ఇది.

ఎగువ కులాల ఊహాత్మక అసౌకర్యాలకు  ప్రాధాన్యతనిస్తూ , అంచుల్లో ఉన్న వర్గాల నిజమైన వివక్ష అనుభవాలను (చాలాసార్లు ప్రాణాంతకమైనవి) పక్కన పెట్టినప్పుడు, న్యాయం చేసే శబ్దం కన్నా, సమాధి స్థలంలోని నిశ్శబ్దమే మేలన్నట్టు కసనపడుతుంది.

సుప్రీంకోర్టు ఒక ప్రమాదకరమైన వాదన వైపు నడుస్తోందనిపిస్తుంది  పై వాదన, ప్రతివాదనల పరిశీలిస్తే ముందే చెప్పినట్టుగా ఈ కుల,వర్గ వ్యవస్థలో పీడితులకు పాలకులు కల్పించే వెసులుబాటు,రాయితీలు, పాలకవర్గ ప్రయోజనాలకు ఇబ్బందికరo కానంతవరకే అమలవుతాయని, ఎప్పుడైతే అవి వారి ప్రయోజనాలకు అడ్డంకిగా మారుతాయని వారు బావిస్తే,  పాలకులు, పీడితుల మధ్య ఐనక్యత సృష్టించి గానీ, న్యాయవ్యవస్థను ఉపయోగించుకొని గానీ, ఆ వెసులుబాటునూ  తొలగిస్తారనే విషయం స్పష్టమవుంది.ఈ వ్యవస్థను,తమ అధికారాన్ని కాపాడుకునేందుకు ఇచ్చే రాయిటీలతోనే సంతృప్తి చెందితే ఏర్పడే పరిణామాలివి. దీన్ని పీడిత వర్గాలు,కులాలు గ్రహించనంతకాలం ఆధిపత్య కులాల, వర్గాల ఆటలు సాగుతూనే వుంటాయి.

  ( వివిధ వెబ్ సైట్ ల లోని వ్యాసాల ఆధారంగా)

Leave a Reply