“గాయాలు ఈనాటివి కావు…”
జీవితాన్ని విశ్లేషించడం ఒక్క సాహిత్యానికి మాత్రమే సాధ్యమౌతుంది. మనిషిలోని మనిషితనం, మనసుతనం చెప్పడమే కాదు, ఈ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టి నడిపించేది కూడా కవిత్వమే. కవికి కవిత్వ వస్తువుల్ని వర్తమాన ప్రపంచమే అందిస్తుంది. ఈ ప్రపంచం అందించే వస్తువును గూర్చి డా.కిన్నెర శ్రీదేవి ‘‘కవిత్వం వాస్తవ ప్రపంచంలోని నిర్ధిష్ట విషయాన్ని రచయిత సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించి మదింపు చేయడం వలన అది సాహిత్య వస్తువౌతుంది’’ అంటారు. అటువంటి నిర్ధిష్టమైన విషయంతో, వస్తువును సౌందర్యాత్మకంగా.. మనసును లయాత్మకంగా విన్యాసం చేయించే కవిత్వం ఇటీవల వచ్చిన "వెన్నెల కురవని రాత్రి". ఈ కవిత్వాన్ని అందించిన కవి కర్నూలు జిల్లాకు చెందిన స్వయంప్రభ.










