ఉజ్వల, విషాద అనంత గాథ
(ఇటీవల విడుదల అయిన రాయలసీమ విద్యావంతుల వేదిక బులిటెన్ -2 *మన రాయలసీమ* సంపాదకీయం) రాయలసీమ అనేక ఉప ప్రాంతాల ఉమ్మడి అస్తిత్వ సీమ. ఇవ్వాల్టి భౌగోళిక, పాలనా గుర్తింపులతో నిమిత్తం లేని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలు ప్రతి ఉప ప్రాంతానికీ ఉన్నాయి. మళ్లీ అన్నిటి మధ్య సాధారణ లక్షణాలు ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో, సాంస్కృతిక వికాసంలో ఇవి కనిపిస్తాయి. కనీసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి వీటిని చాలా స్పష్టంగా పరిశీలించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని ప్రతి ఉపప్రాంతం నిర్దిష్ట స్థానిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి.