ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని
వచ్చిన దారిలోని
కలుపు మొక్కలను ఏరుకుంటూ
భుజం భుజం కలుపుతూ
మునుముందుకు సాగుదాం
యుద్ధం మధ్యలో తుపాకీని
శత్రువు చేతిలో పెట్టిన
వాళ్ళ నవ్వులను తిప్పికొడుతూ
అమరుల రెప్పల మాటున దాగిన
కలల సాకారం కోసం సాయుధమవుదాం
వర్గ పోరాటం ఎప్పుడూ
ముగిసిపోదు కదా
ఒకరు ఆపేస్తే ఆగేది కాదిది
పిరికి గుండెలకు చోటు లేనిది
మెలకువను మింగే మాయ తెరలను
ఛేదిస్తూ ఉదయాస్తమయాల మధ్య
నిత్యమూ సాగె బడలిక ఎరుగని
సుదూర ప్రయాణం కదా
అణగారిన ప్రజల హృదయాలే
స్థావరాలుగా యుద్ధం చేసే వాళ్ళకి
చివరి మజిలీ ఎన్నడూ లేదు కదా
ఇది మరణాన్ని గెలిచే యుద్ధం!
మాతృత్వాన్ని ప్రేమించే యుద్ధం!
మనుషులను కలిపే యుద్ధం!!




