ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా భారత ప్రభుత్వం ఆదివాసీ రైతులపై అమలు జరుపుతున్న రాజ్య భీభత్సం గురించి జార్ఖండ్ నుండి వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా భారత రాజ్యం జార్ఖండ్‌లోని కోల్హాన్ డివిజన్‌లో కొత్త ముందస్తు కార్యాచరణ క్యాంపులను (ఫార్వర్డ్ ఆపరేషనల్ క్యాంపు) ఏర్పాటు చేస్తోంది.
ఆపరేషన్ అనకొండ కంటే ముందు ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా కొల్హాన్ సమీపంలోని సరండ అడవులలో ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో హింసకాండను అనుభవించిన ఆదివాసీలు, ముఖ్యంగా పశ్చిమ సింగ్‌భూం జిల్లాలోని కొల్హాన్ డివిజన్‌లోని వాడ్, లిపుంగా ప్రాంతాలలో ప్రజలు, ఈ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న ఆదివాసీలపై కాల్పులు జరపాలని పారామిలటరీ బలగాలకు అందిన ఆదేశాలతో 15 రోజులుగా అడపాదడపా గ్రామస్తులపై కాల్పులు జరిపారు. గ్రామాల వెలుపల కూడా రాకెట్ లాంచర్లను పేల్చిన సందర్భాలు ఉన్నాయి. గత నెలల్లో కోల్హాన్ ప్రాంతంలో రెండు బూటకపు ఎన్‌కౌంటర్‌లు కూడా జరిగాయి.
జార్ఖండ్‌లో జరిగిన మొదటి ఘటనలో, సిపిఐ(మావోయిస్ట్) పార్టీకి చెందిన పిఎల్‌జిఎ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ), పారామిలటరీ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో, పిఎల్‌జిఎ స్క్వాడ్‌కు నాయకత్వం వహిస్తున్న బుధ్వీర్ కాలికి గాయమైంది. తాను కదలలేని స్థితిలో వుండడంతో, తన ఆయుధాన్ని తన తోటి సహచరులకు అప్పగించి వారిని అక్కడనుంచిద్ వెళ్ళిపొమ్మన్నాడు.
కదలలేని, నిరాయుధుడైన వ్యక్తిని రాజ్యం బంధించి, హింసించి, చంపింది. మావోయిస్టులను పట్టుకునేటప్పుడు అనుసరించాల్సిన విధి విధానాలను రాజ్యం పాటించలేదు. మావోయిస్టులు దేశ పౌరులు. అందువల్ల, దేశంలో ఏ పౌరుడికైనా అవే హక్కులు ఉంటాయి, శిక్షించడానికి ముందు తగిన న్యాయ ప్రక్రియను జరిపించాల్సిన హక్కు ఉంటుంది.
రాజ్య కార్యనిర్వాహక అధికారికి ఒక వ్యక్తిని నిస్సంకోచంగా హత్య చేసే హక్కు లేదు. అంతేకాకుండా, ఇది జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 13కి విరుద్ధం; ఇది యుద్ధ ఖైదీలపై ఎలాంటి అంగవైకల్యం, హింస లేదా శారీరక హాని చేయరాదని స్పష్టంగా ప్రకటించింది. ఈ ఘటన తర్వాత, పిఎల్‌జిఎకి చెందిన ఇద్దరు మహిళలు కూడా పట్టుబడినప్పుడు బలగాలు వారిపై అత్యాచారం చేసి చంపేసాయి. ఈ ఘటనలో కూడా రాజ్యం తన స్వంత పౌరులపైన లైంగిక హింసను ప్రయోగించింది. ఈ హింస ఆదివాసీల భూమిని లాక్కోవడానికి, కొల్హాన్ నేల కింద ఉన్న వనరులను దోచుకోవడానికి సాగుతోంది.
కోల్హాన్ డివిజన్ పరిధిలోకి వచ్చే సింగ్‌భూమ్ ప్రాంతంలో అతిపెద్ద ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. భారతదేశంలోని నిల్వలలో 28% ఇక్కడ ఉన్నాయి. సింగ్‌భూమ్ ప్రాంతంలో నాణ్యమైన ఇనుము ఉంది, కనీసం వంద సంవత్సరాల మన్నిక ఉంటుంది. ఈ ప్రాంతంలో బంగారం, మాంగనీస్, నికెల్, క్రోమియంతో సహా 13 ఇతర ఖనిజాలు ఉన్నాయి.
వీటిలో చాలా ఖనిజాలను ఉక్కు ఉత్పత్తికి కూడా ఉపయోగించవచ్చు. జార్ఖండ్‌లో 32 విభిన్న తెగలు ఉన్నాయి, వాటిలో అత్యంత ప్రముఖమైనవి హో, సంతాల్, ఓరాన్, ముండా. అసుర్, బిర్హుర్, కోర్వా, పహారియా లాంటి యితర తెగలు ఉన్నాయి. ఈ తెగలలో ఎక్కువ మంది కోల్హాన్ డివిజన్‌లోని సింగ్‌భూమ్ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీ రైతాంగం విదేశీ దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇది ఎన్నడూ మొఘలులు, మరాఠాల ఆధీనంలోకి రాని ప్రాంతం. బ్రిటిష్ వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆదివాసీలు ప్రతిఘటించారు.
‘హో’లు 1827-36 వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బిర్సా ముండా జార్ఖండ్‌లోని బ్రిటీషర్లకు వ్యతిరేకంగా తన ఉల్గులాన్‌కు నాయకత్వం వహించాడు. సింగ్‌భూమ్ ప్రాంత ఆదివాసీ రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ తిరుగుబాటు ఫలితంగా బ్రిటిష్ వారికి కొంత స్థాయి స్వయంప్రతిపత్తి కల్పించవలసి వచ్చింది. అధికార మార్పిడి తర్వాత, బ్రిటీషర్లు ఆదివాసీలకు అందించిన స్వయంప్రతిపత్తిని భారత రాజ్యం తొలగించింది. ఆదివాసీ రైతాంగ భూములను లాక్కొని సామ్రాజ్యవాద శక్తులకు అప్పగించే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ క్లీన్ వంటి సైనిక కార్యకలాపాల ద్వారా ఇది జరుగుతోంది.
ఆపరేషన్ గ్రీన్ హంట్ ఓటమి తర్వాత 2017లో ప్రారంభించిన ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌లో భాగంగా ఆపరేషన్ క్లీన్‌ను అభివృద్ధి చేసారు. ఆదివాసీ రైతాంగ ఉద్యమాల కారణంగా రాజ్యానికి పరిమిత ప్రవేశం ఉన్న ప్రాంతాలలో ఆదివాసీ రైతుల ప్రతిఘటనను తుడిచిపెట్టడానికి ఆపరేషన్ సమధాన్ ప్రహార్‌లో భాగంగా ప్రారంభించిన ఆపరేషన్ కగార్‌ను పోలి ఉంటుంది.
మైనింగ్ కార్యకలాపాల వ్యతిరేక ప్రతిఘటనలను, ఆదివాసీ సముదాయ ప్రజాస్వామిక హక్కులను అన్నింటిని అంతం చేయాలని ఆపరేషన్ సమాధాన్ ప్రయత్నిస్తుంది. ఆదివాసీ రైతుల కార్పొరేట్ దోపిడీని నిర్ధారించడానికి జార్ఖండ్‌లోని సరండా ప్రాంతంలోని ఆదివాసీ రైతులను నిర్వాసితులను చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ అనకొండకు కొనసాగింపే ఆపరేషన్ క్లీన్. ఆదివాసీ రైతులపై మారణహోమానికి తెరలేపేందుకు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో భాగమే ఆపరేషన్ అనకొండ.
ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో భాగంగా బస్తర్‌లో రాజ్యం ఉపయోగించిన వ్యూహాలనే జార్ఖండ్‌లో కూడా ఉపయోగించారు. రాజ్యం సల్వాజుడుం అనే ఫాసిస్ట్ మిలీషియాను ఎలా నిర్వహించిందో, ఆపరేషన్ అనకొండలో భాగంగా కూడా అనేక సాయుధ మిలీషియాలను ఏర్పాటు చేసింది.
తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ (టిఎస్‌పిసి), పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ), పహాడీ చిరుత, శాంతి సేన వంటిముఠాలు భూమిని కలిగిన ఆదివాసీలను నిరంతరం బెదిరించే, వేధించే సాయుధ ముఠాలు. ఈ ముఠాలను రాజ్య భద్రతా సంస్థలు తయారుచేశాయి. అయితే రాజ్యం ఈ వాదనలను తిరస్కరించింది.
టిఎస్‌పిసి, ఇలాంటి యితర గ్రూపులకు కార్పొరేట్ల నుండి నిధులు వస్తాయి. వసూళ్ళు లేదా లంచాలు డిమాండ్ చేయడానికి యివి హింసను ఉపయోగిస్తాయని కార్పొరేట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా, ఈ సాయుధ గ్రూపులు కార్పొరేషన్ల ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. మైనింగ్ కోసం తమ భూమిని ఇవ్వమని ఆదివాసీలను బెదిరిస్తాయి; మైనింగ్ కంపెనీలు, కాంట్రాక్టర్లక రక్షణ కల్పిస్తారు.
మైనింగ్‌కు స్థానిక ప్రతిఘటనను తగ్గించడానికి అమలుచేస్తున్న అనకొండ ఒక జాతి నిర్మూలన చర్య. బూటకపు ఎన్‌కౌంటర్లు, ఆదివాసీ రైతులపై అత్యాచారాలు ఈ ప్రాంతంలో సర్వసాధారణం. సరండ అడవుల నుండి మావోయిస్టులను పూర్తిగా తొలగించిన తర్వాత, ఆదివాసీ రైతాంగంపై మారణహోమ హింసను రాజ్యం తీవ్రతరం చేసింది. పారామిలటరీ గ్రామాల్లోకి వచ్చి గ్రామస్తులపై దాడి చేసి, ఆ భూమి ఆదివాసీకి చెందినదని రుజువు చేసే పత్రాల్ని తీసుకెళ్లి తగులబెట్టింది.
తమ స్వంత భూమిని విడిచిపెట్టమని బెదిరించడానికి ఆదివాసీ రైతులపై అత్యాచారాలు, ఎన్‌కౌంటర్ హత్యలు పెరిగాయి. ఆదివాసీ రైతాంగం సరండ అడవులలోని వివిధ ప్రాంతాల నుండి నిర్వాసితులను చేసి, ఆపై భూములను మైనింగ్ కంపెనీలకు ఇచ్చారు. మైనింగ్ కంపెనీల ట్రక్కుల కోసం భూముల్లో పెద్ద రోడ్లు నిర్మించారు.
దీంతో అడవుల పర్యావరణంపైనా ప్రభావం పడింది. జార్ఖండ్ రాష్ట్రము, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు సరండ అడవులు అమెజాన్ అడవులకు సమానం. ఈ ప్రాంతానికి నీరు అందించే అనేక శాశ్వత ప్రవాహాలు ఉన్నాయి. ఈ శాశ్వత ప్రవాహాలను గనులు తుడిచిపెట్టేసాయి. నేల కింద ఉన్న నీటిని కూడా పూర్తిగా కలుషితం చేసాయి.
మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు ఈ ప్రాంతంలో స్థానిక విలక్షణమయిన వ్యాధులుగా మారాయి. దీని గురించి మైనింగ్ కంపెనీలను అడిగితే, మద్యం వినియోగం పెరగడం వల్ల ఇలా జరిగిందని వారు సమాధానం ఇచ్చారు. కానీ మహిళలు, పురుషులు, వృద్ధులు, యువకులు, ఇలా మొత్తం జనాభాకు మద్యపాన సమస్య ఉండటం నిజంగా అసంభవం. అంతేకాకుండా, ఇవి మైనింగ్ ఫలితంగా ఉద్భవించిన వ్యాధులు అని నిరూపితమైంది. సరండ అడవిలో ఆదివాసీ సగటు జీవితకాలం 45 సంవత్సరాలుగా మాత్రమే వుంది.
భూమి సారవంతం గణనీయంగా తగ్గింది. ఈ ప్రాంతంలో కరువు వ్యాపించింది. పౌర హక్కుల ఉద్యమాన్ని కూడా భయపెట్టడానికి రాజ్యం ఎన్‌ఐఎ తదితర రాజ్య ఏజెన్సీలను ఉపయోగించుకుంది. స్టాన్‌స్వామి వంటి ఉద్యమకారులను అరెస్టు చేసి జైలులో హత్య చేశారు. రూపేష్ కుమార్ సింగ్ వంటి జర్నలిస్టులు కూడా యుఎపిఎ కింద అరెస్టయ్యారు, విస్థాపన్ విరోధి జన్ ఆందోళన్‌కు చెందిన దామోదర్ తురిని రాజ్యం నిరంతరం వేధించింది. నిరంతర అరెస్టులు, ఇతర రకాల రాజ్య అణచివేత కారణంగా అతను తన పనిని కొనసాగించలేకపోయాడు. వీరందరూ ఆదివాసీ రైతుల హక్కుల కోసం పనిచేస్తున్న పౌర హక్కుల కార్యకర్తలు. అదేవిధంగా, ఎంఎస్‌ఎస్, ఎబిఎంఎస్ వంటి కార్మిక వర్గ సంస్థలను కూడా నిషేధించారు. కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజలు సంఘటితం కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని ప్రభుత్వం సరండ నమూనా అభివృద్దిగా పేర్కొంది.
వారు ఈ నమూనా ద్వారా సంక్షేమ పథకాలను కూడా తీసుకువచ్చారు, కానీ ఈ పథకాలు పెద్దగా విజయవంతం కాలేదు. ఈ ప్రాంతంలో మన్‌రేగా పథకాన్ని అమలు చేసారు, కానీ ఈ పథకం కింద ఆదివాసీ రైతాంగానికి సరైన పరిహారం కూడా ఇవ్వలేదు. ఆ విధంగా, సరండా అభివృద్ధి నమూనా అంటే జాతి నిర్మూలన హింస ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి ఏదైనా స్థానిక ప్రతిఘటనను తొలగించడం, ఆపై భూమిని కార్పొరేట్ దోపిడి కోసం గనులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం.
బడా కార్పొరేట్లు, మైనింగ్ కంపెనీల కోసం ఆదివాసీ రైతాంగాన్ని మారణహోమానికి గురిచేసే, వారి భూమిని లాక్కొనే, అడవులను నిర్మూలించే, జలాలను కలుషితం చేసే ఈ సరండా అభివృద్ధి నమూనాని దేశవ్యాప్తంగానూ జార్ఖండ్, ఆదివాసీ ప్రాంతాలలోనూ అమలుచేస్తామని రాజ్యం ప్రకటించింది.
సూరజ్‌కుండ్ పథకంలో భాగంగా ఈ కార్పొరేట్ దోపిడీ నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించడానికి రాజ్యం ప్రయత్నిస్తోంది. ప్రజల భూములను, ఇతర వనరులను ప్రభుత్వం వారి నుంచి లాక్కొని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది.
ఆ భూమిని ప్రభుత్వం మూటగట్టి కార్పొరేట్లకు అప్పగిస్తోంది. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు, ఈ చట్టాల అమలు, న్యాయ వ్యవస్థ, విధాన రూపకల్పనలో మార్పులు చేస్తోంది. ఈ ప్రయోజనం కోసం దేశంలో ఫాసిజాన్ని పెంచే విధానం వైపు రాజ్యం కదులుతోంది.
మహారాష్ట్ర పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ వంటి కొత్త ప్రజా భద్రతా చట్టాలను ఉపయోగించి అసమ్మతి స్వరాలు నిశ్శబ్దం చేస్తున్నారు, ఇందులో భిన్నాభిప్రాయాలు కలిగిన వారిని కమ్యూనిస్టులుగా ముద్ర వేయడం అధికారికంగా రాజ్యం ఆమోదించింది. కమ్యూనిస్టులుగా ముద్ర వేయబడిన వ్యక్తులు ఈ చట్టం క్రింద మరింత సులభంగా నేరస్థులుగా పరిగణించబడతారు. ఆపరేషన్ క్లీన్ కూడా ఈ సూరజ్‌కుండ్ పథకంలో భాగం.
రాష్ట్రం కొల్హాన్ ప్రాంతంలో కూడా ఈ సరందా మోడల్ అభివృద్ధిని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అందువల్ల, కొల్హాన్ డివిజన్‌లో కూడా మరిన్ని పారామిలిటరీ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ఈ అడవుల నుంచి ఆదివాసీలను ‘క్లీన్’ చేసేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా వారు ఆదివాసీ రైతులపై హింసకు పాల్పడ్డారు.
బ్రాహ్మణీయ రాజ్యం ఆదివాసీ రైతాంగాన్ని తక్కువ స్థాయి మనుషులుగా చూస్తోంది, వారు పెట్టుబడిదారుల కోసం వారిని అడవుల నుండి తరిమివేయాలి; వారి దోపిడీ లాభాలలో వాటా పొందాలి, ఎందుకంటే రాజ్యం పట్టించుకునేది ఇది ఒకటే. పారామిలిటరీ తన ప్రయత్నాలలో విజయం సాధిస్తే, కొల్హాన్ స్థితి విధి సరండ లాగా అవుతుంది.
ఆదివాసీ రైతాంగంపై జాతి విధ్వంసక హింసకు, రైతుల నిర్వాసిత్వం, వారి వనరుల కార్పొరేట్ దోపిడి దారితీసే ఆపరేషన్ క్లీన్, కగార్ వంటి అన్ని రకాల సైనికీకరణలను అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జార్ఖండ్‌లోని ఆదివాసీ రైతాంగంపై బెదిరింపులను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. రాజ్య హింసకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును వినియోగించుకోకుండా రైతాంగానికి అడ్డుపడకూడదు. ఆపరేషన్ క్లీన్ కింద జార్ఖండ్‌లోని కోల్హాన్ ప్రాంతంలో రాజ్యం చేసిన అక్రమాలపై స్వతంత్ర న్యాయ విచారణను జరిపించాలి. కోల్హాన్‌లో జరిగిన హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలి.
25-07-2024