భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి?
ఈ ఏడాది మే 3, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు – జార్ఖండ్‌కు చెందిన రూపేష్ కుమార్ సింగ్, జమ్ము- కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్ కోసం ‘ఫ్రీ స్పీచ్ కలెక్టివ్’ ఈ ప్రశ్నను సంధిస్తోంది. రూపేష్ కుమార్ సింగ్ 2022 జూలై 17 నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా), 1967 కింద నమోదైన ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయనపై విచారణ కొనసాగుతోంది.
తన కుటుంబానికి దూరంగా ఉన్న జైలుకు మార్చిన రూపేష్ కుమార్ సింగ్‌ను కలవడానికి పడుతున్న రోజువారీ కష్టాల గురించి ఇప్సా శతాక్షి రాసిన ఈ కథనాన్ని చదవండి. ఈ దూరం కేవలం అధికారాన్ని ప్రశ్నించి నిజాలను రిపోర్టు చేస్తున్నందుకు విధిస్తున్న శిక్ష మాత్రమే కాదు, ఇది ఆ జర్నలిస్ట్, అతని కుటుంబ పోరాట పటిమను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నం.
మే 3, అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఒక దేశానికి లేదా ఒక సమాజానికి మీడియా స్వేచ్ఛ ఎంత ప్రాముఖ్యత కలిగినదో మనకు గుర్తుచేయడానికి ఈ రోజును జరుపుకుంటారు. మీడియాను సెన్సార్ చేయనప్పుడు, సత్యం వైపు నిలబడినందుకు వారిని లక్ష్యంగా చేసుకోనప్పుడు మాత్రమే మీడియా నిజమైన, సరైన వార్తలను, సమస్యలను ప్రపంచం ముందుకు తీసుకురాగలదు.
తమ వృత్తికి న్యాయం చేసినందుకు మన దేశంలో ఎంతో మంది జర్నలిస్ట్ మిత్రులు అమరులయ్యారు. ఈ క్రమంలో, మితవాద భావజాలాన్ని విమర్శించిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ త్యాగాన్ని ఎన్నటికీ మరువలేము.
జర్నలిస్టులపైన దాడులను ప్రపంచ స్థాయిలో పరిశీలిస్తే, ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ (సిపిజె) ప్రకారం, గత ఏడాది అంటే 2025లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 129 మంది మీడియా ప్రతినిధుల మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలలో మూడింట రెండు వంతుల మరణాలకు ఇజ్రాయెల్ దేశానిది బాధ్యత.
గత ఏడాది జరిగిన ఒక విచారకరమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలు మన కళ్లముందు కదలాడుతుంటాయి—గాజాలోని ఒక ఆసుపత్రి వెలుపల ఉన్న మీడియా టెంట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినప్పుడు, అందులో జర్నలిస్ట్ హిల్మీ అల్ ఫకావీ సజీవ దహనమయ్యారు; పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇక మన దేశం విషయానికి వస్తే, ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ ప్రకారం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ 2026లో మొత్తం 180 దేశాలలో భారతదేశం 157వ స్థానంలో ఉంది. ఇది 2025లో 151వ స్థానంలో ఉండేది. దీనిని బట్టి భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మరింత సవాలుగా మారుతోందని స్పష్టమవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడే భారతదేశం, భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడంలో అగ్రగామిగా మారుతోంది. జర్నలిస్టులను చంపడం, కల్పిత ఆరోపణలతో జైలుకు పంపడం, ఉద్యోగాల నుండి తొలగించడం వంటి ఆయుధాలతో వారిని నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నది.
స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థలు లేదా యూట్యూబర్లు ఎవరైనా సరే.. నిజం వైపు నిలబడే వారు లక్ష్యమవుతారు. ప్రస్తుతం జార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ అయినా లేదా కాశ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ మెహ్రాజ్ అయినా.. వీరిద్దరినీ క్రూర చట్టం ఉపా కింద జైలులో బంధించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని పిలవబడే దేశం ముందు ఒక పెద్ద ప్రశ్న గుర్తును నిలబెడుతోంది. ఇర్ఫాన్ మెహ్రాజ్ 2023 మార్చి 20 నుండి జైలులో ఉంటే, రూపేష్ కుమార్ సింగ్‌ను 2022 జూలై 17 న అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనపై ఒకదాని తర్వాత ఒకటిగా మరో మూడు కేసులు మోపారు.
రూపేష్ కుమార్ సింగ్ తన క్షేత్రస్థాయి, సాహసోపేతమైన జర్నలిజానికి పేరుగాంచారు. నక్సల్స్ నిర్మూలన పేరుతో ఆదివాసీలపైన జరుగుతున్న అన్యాయాలను ఎటువంటి మొహమాటం లేకుండా బయటపెట్టేవారు. రాజ్య యంత్రాంగాన్ని దోషిగా నిలబెట్టే అమానవీయ ప్రవర్తనలన్నింటినీ తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చేవారు. అందుకే ఆయనపై ఒకటి కాదు, అనేక కేసులు నమోదు చేసి, ఆయనను, ఆయన స్వరాన్ని సుదీర్ఘకాలం పాటు బంధించే పని జరుగుతోంది.
రూపేష్ రెండవసారి జైలు జీవితం గడపడం ప్రారంభించి (జులై 17, 2022 నుండి) నేటికి 3 ఏళ్ల 9 నెలల 17 రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో ఆయనను జార్ఖండ్, బీహార్లలోని మొత్తం 4 జైళ్లకు 5 సార్లు బదిలీ చేశారు. ఇందులో జార్ఖండ్‌లోని రెండు జైళ్లు, బీహార్‌లోని రెండు జైళ్లు ఉన్నాయి.
జైలులో ఉన్న జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ జీవిత సహచరిగా నా అనుభవం:
కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు నన్ను ఒక ప్రశ్న అడిగారు—”ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా రూపేశ్ కూడా ఏమైనా రాస్తారా?” అని. కానీ, దానికి సమాధానం నాకే తెలియదు. ఎందుకంటే గత 7 రోజులుగా రూపేశ్‌తో మాట్లాడటం సాధ్యపడలేదు. మా జైళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ అధికారులతో ఈ విషయం గురించి మాట్లాడే వీలు కూడా ఉండదు. వారి దృష్టిలో నేరమే వృత్తిగా ఉన్నవారికీ, రాజకీయ ఖైదీకి మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. పైగా, ఒక హత్యారోపణ ఉన్న వ్యక్తికి సాధారణ వార్డులో చోటు దక్కుతుందేమో కానీ, రూపేశ్ వంటి మేధావులను వారు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా పరిగణిస్తారు; వారిని ‘హై సెక్యూరిటీ సెల్’లో ఉంచడమే అవసరమని భావిస్తారు. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి పొరపాటున ఒకసారి ఫోన్లో మాట్లాడినా, మరుసటి క్షణమే ఆ అధికారులు మా నంబర్‌ను బ్లాక్ చేస్తారు.
రూపేశ్‌ను ప్రస్తుతం భాగల్పూర్లోని ‘షహీద్ జుబ్బా సహనీ సెంట్రల్ జైలు’లో ఉంచారు. 2026 ఏప్రిల్ 9నాడు పాట్నాలోని ‘ఆదర్శ్ సెంట్రల్ జైలు, బేవుర్’ నుండి పాలనాపరమైన బదిలీ పేరుతో ఇక్కడికి పంపారు. పాట్నా జైలులో లాగే ఇక్కడ కూడా ఆయనను ‘సెల్’ (ఏకాంత గది)లోనే బంధించారు. అక్కడ ఆయనకు జైలు మాన్యువల్ ప్రకారం ఆహారం గానీ, ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలు, చికిత్స గానీ అందడం లేదు.
జైలులోని దుస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ: ఇప్పుడు ఎండలు మొదలయ్యాయి. ఇక్కడ వారంలో వరుసగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు కేవలం పనసకాయ కూరనే పెడుతున్నారు. పనసకాయ వంటి కూరను వరుసగా ఐదు రోజులు పెట్టడం అంటే అది ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. జైలు ఆవరణలోని పనస చెట్ల పండ్లు అయిపోయే వరకు ఈ తంతు ఇలాగే సాగుతుంది. ఆ తర్వాత పగలు, రాత్రి కూరల్లో ముల్లంగి వంతు వస్తుంది, ఎందుకంటే అప్పటికి ముల్లంగి సీజన్ వస్తుంది కాబట్టి.. ఆ జైలు పొలాల్లో ముల్లంగి విపరీతంగా పండుతుంది.
అంటే, జైలు లోపల కూడా రకరకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. 2024లో రూపేశ్‌ను మొదటిసారి ఈ జైలుకే బదిలీ చేసినప్పుడు ఇక్కడి పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉండేవి. అప్పుడు రూపేశ్, ఇతర ఖైదీల పోరాటం వల్ల పరిస్థితుల్లో కొంచెం మార్పు వచ్చింది. కానీ, ఈసారి మళ్లీ పాత పరిస్థితులనే పునరావృతం చేస్తున్నారని రూపేశ్ తెలిపారు.
పోరాటం కొనసాగుతూనే ఉంది…
(*ఇప్సా శతాక్షి ఒక కవయిత్రి, కార్యకర్త. ఈమె జార్ఖండ్‌లోని ఆదివాసీ సముదాయాల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈమె జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ జీవన సహచరి; ఆయన విడుదల క్యాంపెయిన్ నడుపుతున్నారు.)
- అనువాదం : కె. పద్మ




