ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సుంకోజి దేవేంద్రాచారి వృత్తి రీత్యా పాత్రికేయులు. వందకు పైగా కథలు, ఏడు నవలలు రాశారు. ‘అన్నంగుడ్డ, ఒకమేఘం కథ, దృశ్యాలు మూడు ఒక ఆవిష్కరణ’ కథల సంపుటాలు, ‘నీరు నేల మనిషి, రెక్కాడినంత కాలం’ నవలలు పుస్తకాలుగా తెచ్చారు. వీరు గ్రామీణ క్రీడలపై రాసిన కథనాలు ‘మనమంచి ఆటలు’ పుస్తకంగా వచ్చింది.
“ఇప్పుడున్న నేను పుస్తకం చెక్కిన మనిషిని” అంటూ మాట్లాడే పుస్తకాల గురించి సుంకోజి దేవేంద్రాచారి ఇలా అంటున్నారు…
1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయమయ్యాయి?
ఈ ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. పుస్తకాలు అంటే.. ఏరకమైన పుస్తకాలు? అన్ని పుస్తకాలు ఒకటి కాదు. మూఢనమ్మకాలను అనుసరించే పుస్తకాలు, మూఢనమ్మకాలను ప్రశ్నించే పుస్తకాలు ఉన్నాయి. మనిషి పుట్టుక నుంచి భౌతికంగా ఎదిగినట్టే.. ఆలోచనల పరంగాను ఎదుగుతాడు. ఎదగాలి. ఈ ఎదిగే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయమవుతారు. రకరకాల పుస్తకాలు పరిచయం అవుతాయి. చదువుతాం.
మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. మా నాయన సుంకోజి రెడ్డెప్పాచారి రాగయుక్తంగా పద్యాలు చదివేవారు. పాటలు బాగా పాడేవారు. మంచి మాటకారి. గజేంద్రమోక్షం, నరసింహశతకం, నారాయణశతకం, నలచరిత్ర, రామాయణం పుస్తకాలు ఉండేవి. నేను నాయన ఒడిలో కూర్చుని.. మా నాయన వాటిని రాగయుక్తంగా చదువుతుంటే వినేవాడిని. ఆ పుస్తకాలను చదివే ప్రయత్నం చేసేవాడిని. అవి పద్యాలు కావడంతో చదవలేక పోయేవాడిని. ఇవి కాకుండా ఇంట్లో ‘మళయాళ మంత్రతంత్ర రహస్యములు’ పుస్తకం కూడా ఉండేది.
రెండోతరగతి వేసవి సెలవుల్లో మా చిన్నాయన పెళ్లి జరిగింది. ఆయన వెంట దిన్నెమిందపల్లెకు వెళ్లాము. అక్కడ మా చిన్నమ్మోళ్ల ఇంట్లో ‘బాటసారి’ అనే పుస్తకం ఉన్నింది. నేను దానిని ఇంటికి తెచ్చుకున్నా. మొదట చదివిన పుస్తకం అదే. ఆ పుస్తకంలో ఏముందో ఇప్పుడు గుర్తు లేదు. ఆ పుస్తకం చదివిన తర్వాతే.. నేనూ చదవగలననే నమ్మకం ఏర్పడింది. పుస్తకాలు చదవాలనే కోరికా కలిగింది. తర్వాత్తర్వాత మా నాయన ఒడిలో కూర్చుని నేనూ పద్యాలు చదివేవాడిని. మా నాయన సంప్రదాయవాది. బడిపుస్తకాలు, భక్తి పుస్తకాలు తప్ప వేరేవి చదివితే ఒప్పుకోరు. నేను ఐదో తరగతిలో ఉండగా.. మా ఎదురింటికి కొత్తల్లుడు వచ్చాడు. ఆయన ద్వారా మధుబాబు షాడో నవలలు పరిచయం అయ్యాయి. మా పక్కింటిలో ఉండే సురేంద్రరెడ్డి నాకంటే ఆరేడేళ్లు పెద్దవాడు. వాయల్పాడులో ఉండి చదువుకునేవాడు. కాలేజీ చదువు ఆపేసి ఇంటికి వచ్చేశాడు. తన వద్ద ట్రంకు పెట్టె నిండా పుస్తకాలు ఉండేవి. అప్పటి మాసపత్రికలు, వాటి అనుబంధ నవలలు, అపరాధ పరిశోధన పుస్తకాలు చదివాను. ఈ పుస్తకం చదువు అంటూ ‘అసమర్థుని జీవయాత్ర’ ఇచ్చాడు. నేను ఆరోతరగతిలో ఉండగా ఆ పుస్తకం చదివాను. దానిని చదువుతున్నప్పుడు చూసి.. నేను బడి పుస్తకాలు చదవకుండా పాడైపోతున్నానని మా నాయన నన్ను కొట్టాడు. అయినా పుస్తకాలు చదవడం ఆపలేదు. మా నాయనకు తెలీకుండా పుస్తకాలు చదివేవాడిని. (నేను ఏడో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాక మా నాయన నేను చదివే పుస్తకాలపైన ఆంక్షలు పెట్టలేదు). తర్వాత నేను చదువుకుంటున్న కంభంవారిపల్లెలో పాఠశాలకు దగ్గరలో శాఖాగ్రంథాలయం ఏర్పాటైంది. అక్కడ పిచ్చిగా పుస్తకాలు చదివాను.
తర్వాత చదువులో భాగంగా మారుమూలపల్లి నుంచి తిరుపతి నగరానికి నా మకాం మారింది. రెండేళ్ల చదువు తర్వాత.. కార్పెంటర్ గా జీవనం.. దేవితో పెళ్లి అన్నీ తిరుపతిలోనే. అవి ఆబగా పుస్తకాలు చదువుతున్న కాలం. ఏవి పడితే అవి చదివే రోజులు. అప్పట్లో తిరుపతిలో మధురాంతకం నరేంద్ర గారి ఇంటికి రెండుమూడు రోజులకు ఒకసారి అయినా వెళ్లేవాడిని. ప్రతిసారి తను నాకు ఒక పుస్తకం ఇచ్చి చదవమనేవారు. నేను చదివి తిరిగి తీసుకెళ్లి ఇచ్చి ఆ పుస్తకం గురించి మాట్లాడాక.. మరో పుస్తకం ఇచ్చేవారు. అలా నాకు తెలీకుండానే క్లాసిక్స్ అనదగ్గ పుస్తకాలు చదవడం మొదలైంది. వులికంటి కృష్ణారెడ్డి గారు పరిచయం అయ్యాక ఒకరోజు వారి ఇంట్లో మేడమీద గదిలోని తన పుస్తకాలను చూస్తుంటే.. నీకు ఏ పుస్తకం కావాలో తీసుకో అన్నారు. ‘సీమ కథ’ పుస్తకం తెచ్చుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర ఆ పుస్తకం ఉంది. ఆ తర్వాత ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారు ‘కథ’ సిరీస్ పుస్తకాలను పరిచయం చేశారు. తిరుపతి విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ గా పనిచేసే టీఎంఆర్ రమణారెడ్డి తరచూ నాతో సాహిత్యం గురించి మాట్లాడేవారు. నాకు పుస్తకాలపైన ఉండే ఆసక్తి గమనించి, నా దగ్గర డబ్బు లేదని తెలిసి ‘రాదుగ’ ప్రచురణాలయం పుస్తకాలను తక్కువ ధరకు ఇచ్చేవారు. ఎస్వీయూ లైబ్రరీలో షణ్ముగం గారు పనిచేసేవారు. ఆయనే ఓ లైబ్రరీ. కథ కవిత్వం నవల విమర్శ అనువాదం చరిత్ర.. ఇలా ఏదైనా సరే తనతో మాట్లాడామంటే.. వెంటనే దానికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాల గురించి చెప్పి వాటిని చదవమనేవారు. అప్పటికి నేను చదవాల్సిన పుస్తకాలు ఏవో కాస్త స్పష్టత వచ్చింది. ఇలా నా జీవితంలో ఒక్కో దశలో ఒక్కొక్కరు పుస్తకాలను పరిచయం చేస్తూ వచ్చారు.
2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి
ఉద్యోగరీత్యా ఉన్న పనిఒత్తిడి వలన పుస్తకాలను చదివే టైము చాలా తక్కువ ఉంటుంది. సరాసరిన వారానికి ఒక పుస్తకం (300 పేజీలు) చదవగలను. అందుకని పుస్తకాలను సెలెక్టివ్ గా తీసుకుంటాను. దగ్గరి మిత్రులనో, తెలిసిన వారనో.. వారి పుస్తకం రాగానే కొనుక్కోను. గతంలో ఒక మంచి పుస్తకం వెలువరించిన రచయితది రెండో పుస్తకం వచ్చినా సరే.. వెంటనే తీసుకోను. మేమున్న చోట (ప్రస్తుతం కడపలో) షాపులో అందుబాటులో ఉంటే.. అక్కడికి వెళ్లి పుస్తకాన్ని తీసుకుని పరిశీలిస్తాను. ఏ పుస్తకం అయినా నేను మొదట చూసేది రచయిత మాటలు. తర్వాత అచ్చు తప్పులు. అచ్చు తప్పులు ఎక్కువగా ఉండే పుస్తకాలను తీసుకోను. నేను రెండు దశాబ్దాలకు పైగా డెస్క్ జర్నలిస్టుగా పనిచేస్తున్నందుకేమో.. అచ్చు తప్పులు ఉండే పుస్తకం చదివానంటే నాకు అందులోని కంటెంట్ కంటే తప్పులపైనే ధ్యాసంతా ఉంటుంది. ఇక పుస్తకాన్ని అక్కడక్కడా చదువుతాను. వాక్య నిర్మాణం సరిగా లేకపోయినా తీసుకోను. షాపులో అందుబాటులో లేని పుస్తకాలైతే.. పత్రికల్లో, ఫేస్బుక్లో వాటిపై వచ్చే రివ్యూలు చదువుతాను. ఐదారు రివ్యూలు చదివాక నాకూ ఆ పుస్తకంపైన ఒక అవగాహన వస్తుంది. అప్పుడు కావాలంటే ఆ పుస్తకం ఆర్డర్ పెడతాను.
మార్కెట్లో ఉండే పుస్తకాలైతే పరిశీలించి కొనుక్కుంటాను. మార్కెట్లో అందుబాటులో లేని పుస్తకం.. నాకేదైనా కావాలి అనుకుంటే.. నేను ఏ ఊరు వెళ్లినా మొదట పుస్తకాల షాపులు చూస్తాను. లేదంటే బుక్ ఫెయిర్‌లో పాత పుస్తకాల షాపుల్లో వెతుకుతాను. ఒకసారి సింగమనేని నారాయణగారు తిరుపతికి వచ్చిన సమయంలో “సుంకోజీ.. ‘మిత్రుని హృదయం’ పుస్తకం చదివావా” అన్నారు. లేదన్నాను. తప్పకుండా చదువు. చాలా గొప్ప పుస్తకం అన్నారు. తన దగ్గర ఉండేదని, దానిని ఎవరో తీసుకుని తిరిగివ్వలేదని చెప్పారు. వారు చెప్పిన కొద్దిరోజులకే తిరుపతిలో జరిగిన బుక్ ఫెయిర్‌లో పాతపుస్తకాల దుకాణంలో ఆ పుస్తకం కొన్నాను. వెంటనే సింగమనేని గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను. వారూ సంతోషించారు.
పుస్తకాలను భద్రపరచడం పెద్ద టాస్క్. ఉద్యోగరీత్యా ఊర్లు మారాము. ఊర్లు, ఇల్లు మారిన ప్రతిసారీ పుస్తకాలను జాగ్రత్తగా తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద పని. మా ఇంటి లగేజీ మొత్తం బరువులో సగం కంటే ఎక్కువ పుస్తకాలే ఉంటాయి. మూవర్స్ అండ్ ప్యాకర్స్ కి అప్పగిస్తే వాళ్లు పుస్తకాలను సరిగా ప్యాక్ చేయరని.. మేమే ప్యాక్ చేసుకుంటాము. షెల్ఫుల్లో నుంచి పుస్తకాలను దించి కింద పెట్టామంటే మా దేవి వాటిని శుభ్రం చేస్తుంటుంది. నేను మా అమ్మాయి యుక్త అట్టపెట్టెలో పెట్టి టేప్ తో ప్యాక్ చేస్తాం. మోయడానికి ఈజీగా ఉండడం కోసమని మళ్లీ ఆ అట్టపెట్టెని తాడుతో కడతాం. బాడుగ మాట్లాడే దానికి మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకు ముందుగానే చెప్తాను.. ఆ అట్టపెట్టెల్లో ఉన్నవన్నీ పుస్తకాలని. మొదట వాళ్లు నేను చెప్పిన విషయాన్ని తేలికగా తీసుకుంటారు. వాటిని మోయడం మొదలుపెట్టాక అర్థమవుతుంది పుస్తకాలు ఎంత బరువైనవో.
మేము19 అద్దె ఇళ్లల్లో ఉన్నాము. ఏ ఊరికి పోయినా నేను మొదట విచారించేది ఆ ఊర్లో చెదలు ఏవైపు ఎక్కువగా ఉంటుంది అని.. చెదలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మేము బాడుగకు ఇల్లు తీసుకునే వాళ్లం కాదు. అయినా సరే.. రెండు సార్లు మా ఇంట్లో పుస్తకాలకు చెదలు పెట్టింది. కొన్ని విలువైన పుస్తకాలను నమిలి మింగేశాయి. అప్పటి నుంచి పుస్తకాలు ఉండే షెల్ఫ్ అడుగున న్యూస్ పేపర్ కాకుండా ప్లాస్టిక్ కవర్ వేస్తున్నాం. కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారైనా పుస్తకాలను తీసి పెడుతుంటా. షెల్ఫ్ లో పుస్తకాలు ఉంటే చూడ్డానికి బాగుంటుందే కానీ.. దుమ్ము ఎక్కువగా చేరుతుంది. షెల్ఫ్ క్లోజ్‌లో ఉంటే పుస్తకాలు దుమ్ము పట్టకుండా ఉంటాయి.
పుస్తకాలను జాగ్రత్తగా చూసుకోవడంలో నాకంటే మా దేవికి శ్రద్ధ ఎక్కువ. వాటిపైన దుమ్మును ఎప్పటికప్పుడు దులుపుతుంటుంది. నేను లేనప్పుడు మా ఇంటికి అతిథులు వచ్చి, సెల్ఫ్ లో పుస్తకాలని అడ్డదిడ్డంగా తీస్తుంటే తను ఒప్పుకోదు. మీకు ఏ పుస్తకం కావాలో చెప్పండి నేను తీసిస్తాను అంటుంది. లేదూ.. తీసిన పుస్తకాన్ని మళ్లీ తీసినచోటే పెట్టమంటుంది. తను పసిపిల్లలను చూసుకున్నంత జాగ్రత్తగా పుస్తకాలను చూసుకుంటుంది. అందుకే మేము ఇన్ని ఊర్లు ఇన్ని ఇండ్లు మారినా పుస్తకాలు అట్టలు ఊడిపోకుండా, కాగితాలు చిరిగిపోకుండా ఉన్నాయి.
ఇంకో విషయం చెప్పాలి.. మా అమ్మాయి యుక్త కూడా పుస్తకాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మేము తిరుపతిలో కాటన్ మిల్లు వద్ద అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ పద్మావతి కాలేజీలో చేరింది. కాలేజీకి దగ్గరగా ఉన్న ఇంట్లోకి మారాం. ఆ సమయంలో తన ఇంటర్మీడియట్ పుస్తకాలు, వార మాస పత్రికలు, న్యూస్ పేపర్లు ఇళ్ల వద్దకు వచ్చి కొనుక్కునే వ్యక్తికి అమ్మేశాం. ఆ వ్యక్తి పుస్తకాలను మెట్ల దారిలో తీసుకెళ్లకుండా మిద్దె పైనుంచి కిందకు విసిరేశాడు. దాన్ని చూసి మా అమ్మాయి కళ్లనీళ్లు పెట్టుకుంది. అప్పటినుంచి న్యూస్ పేపర్లు కూడా మేము ఇంటికి వచ్చే వాళ్లకు అమ్మటం మానేసాము. మేమే నీటుగా ప్యాక్ చేసి ఆటోలో తీసుకెళ్లి షాపులో తూకానికి అమ్మేస్తాము.
3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి
అలెగ్జాండర్ డ్యూమా నవల తెలుగులో ‘అజేయుడు’ పేరుతో ఉంది. అందులో కథానాయకుడిని చీకటి గుహలాంటి జైలులో వేస్తారు. అక్కడ అప్పటికే చాలా కాలంగా ఒకతను ఖైదులో ఉంటాడు. చీకటిలో ఉండి అతనికి చూపు కూడా పోయుంటాది. అతను కథానాయకుడితో.. మనం చదవాల్సిన పుస్తకాలు ‘150కి మించి ఉండవు. వాటినే మళ్లీ మళ్లీ చదివినా చాలు’ అంటాడు. అతనన్నది నిజమే. ఒక వ్యక్తి జీవిత కాలంలో వేయికి మించి పుస్తకాలను చదవాల్సిన అవసరం ఉండదు. అయితే.. ఏ పుస్తకాలు చదువుతున్నాం అనేది చాలా ముఖ్యం. నేను చదవాలనుకుని చదవలేక పోయిన పుస్తకాలు చాలా ఉన్నాయి. విక్టర్ హ్యూగో ‘బీదలపాట్లు’, టాల్ స్టాయ్ ‘యుద్ధము శాంతి’, డాస్టోవిస్కీ ‘కరమ్ జోవ్ సోదరులు’, అయిన్ రాండ్ ‘ఫౌంటెన్ హెడ్’, గోర్కీ ‘భయస్థుడు’, అమిష్ ‘శివ ట్రయాలజీ’, రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు.. లిస్టు పెద్దదే ఉంది. ఈ పుస్తకాలన్నీ నాదగ్గర ఉన్నాయి. తప్పకుండా వీటిని చదువుతాను.
నేను సేకరించాలనుకుని సేకరించలేక పోయిన పుస్తకాలు దాదాపు లేవు. శూద్రవర్ణం ఎలా పుట్టిందనే దానిపై ఆర్.ఎస్.శర్మ రాసిన పుస్తకం కావాలనుకున్నాను. దానిని మాత్రం సేకరించలేక పోయాను.
4. ఎంతో ఇష్టమైన మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి
చాలా పేదరికంలో పెరిగాను. అయినా.. ఎదుటి వ్యక్తి చేతిలో డబ్బు ఉంటే అది నాకు కావాలని అనిపించదు. అదే పుస్తకం ఉంటే మాత్రం నాకు కావాలనిపిస్తాది. నేను చదువుకున్న బడికి దగ్గరలో ఏర్పాటైన శాఖాగ్రంథాలయం సభ్యత్వం అప్పట్లో 15 రూపాయలు. సభ్యత్వం ఉంటే ఇంటికి చదువుకునేదానికి పుస్తకాలు ఇస్తారు. పదోతరగతి పరీక్షల ఫీజు 20 రూపాయలు కట్టలేదని మా హెడ్మాస్టర్ నన్ను క్లాస్ నుంచి ఇంటికి పంపించేశాడు (1989లో కంభంవారిపల్లె జడ్పీ హైస్కూల్ పదోతరగతి టాపర్ నేనే). అంతటి పేదరికంలో ఉండే మేము.. లైబ్రరీ సభ్యత్వానికి 15 రూపాయలు కట్టడం ఊహకు కూడా అందని విషయం. అయితే నాకుండే లీజర్ టైమంతా లైబ్రరీలోనే గడిపేవాడిని. లైబ్రరీలో పనిచేసే ఉద్యోగులు ఇద్దరూ 20 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నుంచి రోజూ వచ్చి పోయేవాళ్లు. నేను రోజూ వాళ్లకంటే ముందే లైబ్రరీ దగ్గర కాచుకుని ఉండేవాడిని.
నేను తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో నా రూమ్మేట్, ఇప్పటికీ నాకు ఆప్తమిత్రుడు బి. యాదగిరి… కేశవరెడ్డి నవల ‘ఇన్ క్రెడిబుల్ గాడెస్’ పుస్తకం ఇచ్చాడు. దాని తర్వాత నేను ‘రాముడుండాడు రాజ్జెముండాది’ కొన్నాను. అవి నేను కార్పెంటర్ గా జీవనం సాగించే రోజులు. తిరుపతిలో నేను, దేవి ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండేవాళ్లం. మా పాప యుక్తకు అప్పుడు ఏడాది వయసు. సాహిత్యం ద్వారా పరిచయం అయిన ఒక ప్రముఖ కవి మా ఇంటికి వచ్చాడు. అప్పటికి నా దగ్గర 50కి మించి పుస్తకాలు లేవు. వాటిలోంచి కేశవరెడ్డి నవలలు తీసుకున్నాడు. చదివి ఇస్తానని తీసుకెళ్లాడు. ఆర్నెళ్లయింది. సంవత్సరం అయింది. అతను పుస్తకాలు ఇవ్వలేదు. కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడికి చుక్కనీటి బొట్టుకూడా విలువైందే. పుస్తకాలకు కరువున ఉండే నాకు ఆ రెండు పుస్తకాలు చాలా విలువైనవి. అతడి అడ్రస్ సంపాదించి ఒక రోజు కవి ఇంటికి వెళ్లాను. అతడి ఇంట్లో షెల్ఫ్ లల్లో వందల పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర నుంచి తీసుకెళ్లిన పుస్తకాల గురించి అడిగాను. తాను నా దగ్గర పుస్తకాలే తెచ్చుకోలేదని చెప్పాడు. నేను గట్టిగా ప్రశ్నించాక.. అవును ఒక్క పుస్తకం తెచ్చుకున్నట్టు గుర్తు అన్నాడు. ‘రాముడుండాడు రాజ్జెముండాది’ పుస్తకం నా చేతికి ఇచ్చాడు. అప్పటికే ఆ పుస్తకం పేజీలన్నీ ఊడొచ్చేశాయి. అంత ఘోరంగా పుస్తకాన్ని చదివాడు. అప్పటి నుంచి పెద్దవాళ్లకు పుస్తకాలు ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను.
ఎస్.ఎల్.భైరప్ప నవల ‘గృహభంగం’ నా దగ్గర ఉండేది. దానిని ఎవరికి ఇచ్చానో గుర్తు లేదు. ఆ పుస్తకం తిరిగి రాలేదు. కొందామంటే అందుబాటులో లేదు. నేను పుస్తకాలను నాకు బాగా దగ్గరి వాళ్లు, ఆత్మీయులు, చదువుతారు అనేవాళ్లకు మాత్రమే ఇస్తాను. అలాంటి వాళ్లు కూడా పుస్తకాలు తీసుకున్నాక కొందరు తిరిగి ఇవ్వలేదు. ఆ పుస్తకాలను మళ్లీ కొనుక్కున్నా.
పాతికేళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒకరు కువైట్‌లో ఉండేవారు. నీలిమేఘాలు, లజ్జ, రాజకీయకథలు, తమస్.. ఇలా దాదాపు 30 పుస్తకాలు ప్యాక్ చేసి మా పల్లెనుంచి ఒకరు కువైట్ వెళుతుంటే తనకు ఇవ్వమని చెప్పి పంపించాను. ఆ పుస్తకాలు తనకు చేరలేదు. అవి వెనక్కు రానూ లేదు. నీలిమేఘాలు, లజ్జ, రాజకీయ కథలు పుస్తకాలు తిరిగి కొనుక్కోవడానికి నాకు చాలా టైము పట్టింది.
5. మీకు ప్రాణసమానమైన పుస్తకాల గురించి
వయసు 50 ఏళ్లు దాటాక.. బరువు ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాం. అది శరీరమైనా పుస్తకాలైనా బాంధవ్యాలైనా. కానీ అది సాధ్యం కాదు. కొంతమంది ప్రముఖ రచయితలు వారి రచనలను కాల్చేసిన సందర్భాలున్నాయని చదివాను. అక్కడక్కడా వరదలు వచ్చి ఇంట్లో ఉన్నవన్నీ తుడిచి పెట్టుకుపోవడం చూస్తుంటాం. నాకూ ఒక్కోసారి పిచ్చి ఊహ వస్తుంటుంది “మా ఇంట్లో ఉండే పుస్తకాలన్నీ ఒక్కసారిగా పోతే” అని! విజయవాడలో పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి ఇంటికి చాలాసార్లు వెళ్లాను. వారింట్లో తన పుస్తకాలు కూడా ఉండేవి కావు. అన్నీ లైబ్రరీలకు ఇచ్చేశారు. అలా చేయాలంటే చాలా మనోధైర్యం కావాలి.
ఎవరికీ ప్రాణసమానమైన పుస్తకాలనేవి ఉండవు. పదేపదే చదువుకునే పుస్తకాలుంటాయి. పదేళ్ల వయసులో ఇష్టంగా చదివిన పుస్తకం ఇప్పుడు అంతే ఇష్టంగా చదవలేం. దేవుడున్నాడు అని నమ్మే వయసులో మెచ్చుకున్న పుస్తకాలను.. దేవుడు లేడనే స్థితిలో ఉన్నప్పుడు అస్సలు చదవలేం. వయసు, మనసు, ఆలోచనల పరిణితితో పాటు.. ఇష్టపడే పుస్తకాలు మారుతుంటాయి. ఈ పుస్తకం నాకు ప్రాణప్రదమైంది అని గిరిగీసుక్కూర్చున్నామంటే.. ఆ దశలోనే ఆగిపోయినట్టు. చలనం లేనట్టు. అయితే దాదాపు పదేళ్లుగా నేను ఇష్టంగా చదువుకునే పుస్తకాలున్నాయి. కేశవరెడ్డి, చింగిజ్ ఐత్మాతోవ్, బి. వసిల్యేవ్ నవలలు.. గోర్కీ నా బాల్యం, నా బాల్యసేవ, నా విశ్వవిద్యాలయాలు, జాక్ లండన్ రచనలు, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే రచనలు, బ్రజ్ రంజన్ మణి ‘మడివిప్పిన చరిత్ర’, శ్రీశ్రీ, శివారెడ్డి, కలేకూరి ప్రసాద్, త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వం.. ఇలా ఈ లిస్టు కూడా సుమారుగా ఉంది.
6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి
మంచిపని చేయడానికి ముహూర్తం అవసరం లేనట్టే.. పుస్తకం చదవడానికి కూడా ఫలానా సమయం అంటూ ఏమీ ఉండదు. నేను పల్లెలో ఉన్నప్పుడు.. పుస్తకం తీసుకుని పొలం దగ్గరకు పోయి చెట్టుకిందో, గుంటికిందో కూర్చుని చదువుకునే వాడిని. చిన్నప్పుడు పుస్తకం చదవడం అనే పిచ్చి చాలా ఎక్కువగా ఉండేది. ఎంతలా అంటే.. మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి భోజనానికి రావడానికి పదినిమిషాల నడక. బడి నుంచి ఇంటికి వచ్చి పోయేప్పుడు, ఇంటి నుంచి పొలానికి పోయి వచ్చేప్పుడు కూడా దారిలో నడుస్తూనే పుస్తకం చదివేవాడిని. ఒకప్పుడు అవపరాల కోసం నడిచేవాళ్లం. ఇప్పుడు ఆరోగ్యం కోసరం మాత్రమే నడుస్తున్నాం. నడవడం అనేదే తగ్గిపోయాక.. నడుస్తూ పుస్తకం చదవడం అనేది భ్రమయుగం లాంటిది. గతంలో అన్నం తినేప్పుడు కూడా పుస్తకం చదివేవాడిని.
పేజీల సంఖ్య, బరువు ఎక్కువ ఉండే పుస్తకం అయితే.. రీడింగ్ చైర్లో కూర్చుని, ప్యాడ్ పైన పుస్తకం పెట్టుకుని చదువుతాను. చిన్న పుస్తకాలయితే.. బెడ్ రూములో పడుకుని చదువుతాను. నాకు రోజూ నైట్ డ్యూటీ. పొద్దున్నే 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చదువుతాను. ఒక్కోసారి మధ్యాహ్నం రెండుగంటల నుంచి మూడు గంటల వరకు చదువుతాను. ముఖ్యమైన పుస్తకం అయితే.. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక తెల్లవారుజామున మూడు నాలుగు గంటల వరకు చదివిన సందర్భాలున్నాయి. ఇప్పుడైతే అలా చదవడం లేదు. వయసు శరీరాన్ని హెచ్చరిస్తా ఉంది. నా వయసును గౌరవించడం అలవాటు చేసుకుంటున్నా. ఆఫీసు నుంచి అర్ధరాత్రి ఇంటికి వచ్చాక గమ్మున పడుకుంటున్నా. ఇప్పుడు ఏ పుస్తకం చదివినా పగటిపూటే.
7. మీలో మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి
పుస్తకాలను చదివే వ్యక్తుల జీవితంలో, ఆచరణలో తప్పకుండా మార్పు వస్తుంది. లేదంటే వారు పుస్తకాలను చదివినట్టు కాదు. భౌతికంగా నాకు జన్మ ఇచ్చింది సుంకోజి రెడ్డెప్పాచారి, సుంకోజి ఈశ్వరమ్మ అయితే.. నన్ను మనిషిగా నిలబెట్టింది, నాకంటూ ఉనికిని కల్పించింది మాత్రం పుస్తకాలే. సర్టిఫికెట్ల చదువు నాకు తక్కువ. అయితే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అనే పిచ్చి.. దానికి జత అయిన రాయడం అనే మరో పిచ్చి ప్రస్తుతం నా ఉద్యోగ జీవితానికి ఆలంబనగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే చదవడం రాయడం అనేదే జీవితంగా మారింది. నాకున్న వ్యాపకాలు కూడా ఇవే.
ఎక్కడో మారుమూల పల్లెలో.. దేవుడే సర్వస్వం అని నమ్మే సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నేను.. ఇప్పుడు వీటికి భిన్నంగా జీవిస్తున్నానంటే పుస్తకాలే కారణం. మగవాడి నుంచి నేను మనిషిగా మారుతున్న పరిణామం వెనుక పుస్తకాలున్నాయి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది పుస్తకాలే. ఇప్పుడున్న నేను పుస్తకం చెక్కిన మనిషిని. ఇప్పుడున్న నా జీవితం పుస్తకం ఇచ్చిన కానుక.





Buchireddy gangula
———————————-
Nice interview —
Sir u r books list -where to get