ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఖనిజ సంపన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త రఘు మిడియామిని ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను ఉపయోగించి అరెస్టు చేసింది.

గోండ్ ఆదివాసీ సమాజానికి చెందిన 23 ఏళ్ల రఘుని నిన్న (ఫిబ్రవరి 27) సాయంత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జగదల్‌పూర్ జైలుకు పంపారు.

రఘు నిషేధిత ఫ్రంట్ సంస్థకు అగ్ర నాయకుడు అని, ఈ సంస్థకు నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఎన్‌ఐఎ ఆరోపిస్తోంది.

తమ మాతృభూమిని భారత రాజ్యం కార్పొరేటీకరణ, సైనికీకరణ చేయడాన్ని వ్యతిరేకించిన, ఇటీవల నిషేధానికి గురైన బస్తర్‌లో ఉన్న ఒక స్థానిక సంస్థ మూల్‌వాసీ బచావో మంచ్ (ఎంబిఎం) అధ్యక్షుడు రఘు.

ఎన్‌ఐఎ ఈరోజు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి రఘును అరెస్టు చేశారు; కేసు నంబరు RC-02/2023/NIA/RPR.

2023లో నమోదైన ఈ ఎఫ్‌ఐ‌ఆర్‌లో ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం-2005లోని సెక్షన్లు 8(1), 8(3),  8(5),  చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం-1967లోని సెక్షన్లు 10, 13(1) & (2) కింద అభియోగాలు ఉన్నాయి.

2023 నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎంబిఎంకు  ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (బహిరంగంగా పనిచేసే కార్యకర్తలు)గా పనిచేస్తున్నారని గుర్తించినన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఛార్జిషీట్ చేసినప్పుడు ఈ కేసు మొదట వెలుగులోకి వచ్చిందని ఆ ప్రకటనలో పేర్కొంది.

2024 ఫిబ్రవరిలో, ఉగ్రవాద నిధుల నెట్‌వర్క్ గురించి మరిన్ని వివరాలు తమకు తెలిసాయని  ఎన్‌ఐఎ పేర్కొంది.

మావోయిస్టు పార్టీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణ, నిల్వ, పంపిణీల బాధ్యత రఘుదేనని ఎన్‌ఐఎ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి, బస్తర్‌లో రతన్ టాటా నిధులు సమకూర్చిన జాతి విధ్వంసక సల్వా జుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్ సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆదివాసీ యువత మూలవాసీ బచావో మంచ్‌కు నాయకత్వం వహించారు.

1996 పెసా చట్టం ఉల్లంఘనలను, గ్రామసభ సమ్మతి లేకపోవడాన్ని పేర్కొంటూ సిలంగేర్‌లో పోలీసు క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సామూహిక నిరసనలకు నాయకత్వం వహించినందుకు 2021లో ఎంబిఎం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. 2021 మే 17న జరిగిన కాల్పుల్లో గర్భిణీ స్త్రీతో సహా నలుగురు ఆదివాసీ గ్రామస్తులను సి‌ఆర్‌పి‌ఎఫ్ బలగాలు చంపిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2024 అక్టోబర్ 30న ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్- 2005 లోని సెక్షన్ 3 కింద ఎంబిఎంను ఒక సంవత్సరం పాటు నిషేధించింది. నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం యిచ్చిన ఉత్తర్వులో మావోయిస్టు పార్టీ గురించి ఏమీ ప్రస్తావించలేదు, కానీ ఎన్‌ఐఎ తన ప్రకటనలో ఆ సంస్థను మావోయిస్టు పార్టీతో అనుసంధానించింది.

సంస్థపై నిషేధాన్ని ఖండిస్తూ రాష్ట్రీయ జనతాదళ్ పార్లమెంటు సభ్యుడు మనోజ్ ఝా పార్లమెంటులో ప్రస్తావించాడు.

నిషేధానికి చాలా కాలం ముందు, ఎంబిఎం ఉపాధ్యక్షురాలు, 25 ఏళ్ల సునీతా పోట్టంను 2024 జూన్ 3 న ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్-2005 (సి‌ఎస్‌పి‌ఎస్‌ఎ)కింద రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు; ఆమె ప్రస్తుతం జైలులో ఉంది.

మానవ హక్కుల స్థితిపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ మేరీ లాలర్ ఆమె అరెస్టును ఖండించింది. సంస్థకు చెందిన మరో సభ్యుడు సర్జు టేకం, 2024 ఏప్రిల్ 2న  ఉపా, సి‌ఎస్‌పి‌ఎస్‌ఎ చట్టాల కింద అరెస్టు అయి జైలులోనే ఉన్నాడు. 2024 నవంబర్ 8 న ఆరుగురు ఎంబిఎం సభ్యులు – అర్జున్ సోని, ముయా హేమ్లా, నగేష్ బన్సే, జోగా మిదియం, గిల్లు కటం, భీమా కుంజం – లను కూడా అరెస్టు చేసి జైలులో పెట్టారు.

2021లో సంస్థలో చేరిన రఘు ఎంబిఎం నిషేధం, తోటి కార్యకర్తల అరెస్టు తర్వాత ఉపా చట్టం కింద తనను కూడా అరెస్టు చేయవచ్చని సూచనప్రాయంగా చెప్పాడు. బస్తర్ భూమిని మరియు వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్న కార్పొరేట్ సంస్థలకు  కభారత ప్రభుత్వం ఇచ్చిన “బహుమతి”గా ఈ నిషేధాన్ని విమర్శించాడు.

మూలవాసీ బచావో మంచ్ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అడవులు, నీరు, భూమి, వనరులను కార్పొరేట్‌లకు అమ్మకుండా కాపాడటమే తమ పోరాటం అని రఘు నొక్కిచెప్పాడు. అందువల్లనే ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులని ముద్ర వేసిందని అన్నాడు.

ఆ సమయంలో, తనను  హత్య చేయవచ్చనే భయాన్ని కూడా వ్యక్తం చేశాడు. రాజ్యం చేస్తున్న కుట్రలో భాగంగా బూటకపు ఎన్‌కౌంటర్‌లో తనను చంపేస్తారని అతనికి అనిపించింది “నేను ఒంటరిగా ఉంటే, వారు నన్ను చంపుతారు. నేను నిరసనకు హాజరైతే, నన్ను నిర్బంధించి చంపుతారు. నేను నగరంలో ఉన్నా చంపుతారు” అని అతను హెచ్చరించాడు.

బస్తర్‌లో రాజ్యాంగానికి ఎటువంటి విలువ లేదని, చట్టవ్యతిరేకత ప్రబలిపోయిందని రఘు అన్నాడు. ప్రభుత్వం మరింత దూకుడుగా మారుతోందని, పోలీసు క్యాంపుల సంఖ్య పెరుగుతోందని, భద్రతా దళాలు ఆదివాసీలను నిరంతరం హత్య చేయడం, వైమానిక బాంబు దాడులు, తప్పుడు ఆరోపణలపై అమాయక గ్రామస్తులను అరెస్టు చేయడం వల్ల గ్రామస్తులు భయంతో జీవిస్తున్నారని ఆయన ఆరోపించాడు.

2024 మే నెలలో భద్రతా దళాలు పేల్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేలని మందుగుండు సామగ్రి కారణంగా ఇద్దరు ఆదివాసీ మైనర్లు మరణించిన తర్వాత మక్తూబ్ విలేకరితో రఘు మాట్లాడుతూ, బస్తర్ పరిస్థితిని పాలస్తీనా వంటి యుద్ధ ప్రాంతాలతో పోల్చాడు.

2024 మే నెలలో భద్రతా దళాలు పేల్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేలని మందుగుండు సామగ్రి కారణంగా ఇద్దరు ఆదివాసీ మైనర్లు మరణించిన తర్వాత మక్తూబ్ విలేకరితో రఘు మాట్లాడుతూ, బస్తర్ పరిస్థితిని పాలస్తీనా వంటి యుద్ధ ప్రాంతాలతో పోల్చాడు.

ఎంబిఎం ప్రకారం, ఇజ్రాయెల్ తయారు చేసిన డ్రోన్‌లను ఉపయోగించి బస్తర్‌లో ఐదుసార్లు వైమానిక దాడి జరిగింది. మొదటిది 2021 ఏప్రిల్ 19న బొతలంక, పాలగూడెంలలో జరిగింది. రెండవది 2022 ఏప్రిల్ 14-15, రాత్రి బొట్టేథాంగ్, మెట్టగూడెం, డ్యూలెడ్, సక్లర్, పొట్టేమంగిలపై డ్రోన్లు బాంబు దాడి చేశాయి. మూడవ బాంబు దాడి 2023 జనవరి 11 న జరిగింది. మెట్టగూడ, బొట్టేథాంగ్, ఎరాపల్లిలనులక్ష్యంగా చేసుకుని తొమ్మిది బాంబులు వేసి రెండు హెలికాప్టర్ల నుండి కాల్పులు జరిపారు.

అధికారులు రాజ్యాంగంలో పేర్కొన్న విధానాలను పాటించాలని డిమాండ్ చేసినందుకు వారిని ప్రభుత్వ వ్యతిరేకులు లేదా అభివృద్ధి వ్యతిరేకులుగా చెప్పలేమని, ఈ అరెస్టును ఖండిస్తూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఛత్తీస్‌గఢ్ శాఖ తన ప్రకటనలో,పేర్కొంది.

ప్రజాస్వామికంగా, శాంతియుతంగా తమ రాజ్యాంగ డిమాండ్లను లేవనెత్తుతున్న ఆదివాసీలపై ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టాన్ని,  ఉపా చట్టాన్ని ఉపయోగించడాన్ని కూడా ఈ సంస్థ విమర్శించింది.

రఘు మిడియామిపై ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని, ఎంబిఎం పై నిషేధాన్ని ఎత్తివేయాలని, ఎంబిఎం యువ కార్యకర్తలైన సునీతా పోట్టం, గజేంద్ర మాదవి, శంకర్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

ఈ అరెస్టును ఖండిస్తూ, ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్న గాంధేయవాది కార్యకర్త హిమాంశు కుమార్ మాట్లాడుతూ, “రఘు ఒక యువ సామాజిక కార్యకర్త, ఆదివాసి హక్కుల పోరాట యోధుడు. అతన్ని అరెస్టు చేయడం ప్రజాస్వామిక అసమ్మతిప్రకటనపై దాడి” అని అన్నారు.

మూల్వాసి బచావో మంచ్ మావోయిస్టు పార్టీ ప్రధాన సంస్థగా చేస్తున్నదనే ఆరోపణలను హిమాంశు తోసిపుచ్చారు.

“ఒకవేళ వారు (ఎంబిఎం) మావోయిస్టులు అయినప్పటికీ, వారు ఆయుధాలు లేని మావోయిస్టులు. ప్రభుత్వం నిరంతరం మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉందని చెబుతూనే ఉంది, కానీ నిరాయుధ సమూహాలను కూడా ఎలా అణచివేస్తున్నారో చూడండి” అని అన్నారు.

ఈ అరెస్టు ఆపరేషన్ కగార్ కింద ప్రజలపైన కార్పొరేట్ మద్దతుతో జరుగుతున్న యుద్ధంలో భాగమని రఘు అరెస్టుతో ఆశ్చర్యపోని కార్పొరేటీకరణ,  సైనికీకరణ వ్యతిరేక వేదిక సభ్యుడు అడ్వకేట్ ఎహ్తామామ్-ఉల్-హక్ వ్యాఖ్యానించారు.

సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న బస్తర్, ఆపరేషన్ కగార్ కారణంగా యుద్ధభూమిగా మారింది, ఇక్కడ స్థానిక ఆదివాసీలు తమ మనుగడ కోసం భారత రాజ్యాన్ని ప్రతిఘటిస్తున్నారు.

భారత ప్రభుత్వం సులభతరం చేసిన కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా బస్తర్‌లో జల్, జంగల్, జమీన్ దోపిడీకి వ్యతిరేకంగా అన్ని రకాల ప్రతిఘటనలు కొనసాగుతున్నాయి.

 “రఘు ఇంకా అనేక మంది మూల్‌వాసీ బచావో మంచ్‌కు నాయకత్వం వహించారు; జల్, జంగల్, జమీన్‌పై తమ హక్కుల కోసం ఆదివాసీ రైతుల అతిపెద్ద నిరంతర ప్రజా ఉద్యమాలలో ఒకటిగా దీనిని నడిపించారు” అని అడ్వకేట్ ఎహ్తామామ్ విలేకరితో అన్నారు.

 “ముఖ్యంగా సైనికీకరణ, ఆదివాసీల ఊచకోతలు తీవ్రతరం కావడంతో, రఘు చాలా కాలంగా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా ఉన్నవారిలో ఒకడు;”

“రఘుకు తాను చెల్లించాల్సిన మూల్యం తెలుసు; వారందరికీ తెలుసు. తమ ప్రతిఘటనకు చెల్లించాల్సిన మూల్యం తెలిసినప్పటికీ పోరాడుతూనే ఉన్నారు కాబట్టి, తమ గౌరవం కోసం, జల్, జంగల్, జమీన్‌పై హక్కుల కోసం ఆదివాసీ రైతాంగం చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.”

రాజ్యం చేస్తున్న అడ్డూ అదుపూ లేని యుద్ధానికి ముప్పుగా మారిన దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ ఉద్యమాలను అణచివేయడమే మూల్‌వాసీ బచావో మంచ్‌పై నిషేధమూ రఘు, సునీతా పోట్టం, మరో ఆదివాసీ నాయకుడు సర్జు టేకం అరెస్టుల ఉద్దేశ్యం అని ఎహ్తామామ్ అన్నారు.

స్వచ్ఛందంగా ఎహ్తామామ్ ఇలా కొనసాగించాడు, “వారు రఘు, సునీతా పోట్టం వంటి కొంతమందిని అరెస్టు చేశారు, కానీ ఇంకా చాలా మంది సునీతలు, రఘులు ఉద్భవిస్తారు – ఉనికి కోసం జరిగే పోరాటానికి ఉండే స్వభావం అలాంటిది. సల్వా జుడుం క్రూరత్వం నుండే రఘులు, సునీతలు జన్మించారు”.

రాజ్య హింసకు సంబంధించిన వార్తలు బయటి ప్రపంచానికి చేరకుండా నిరోధించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యనే ఈ అరెస్టు అని ఎహ్తామామ్ కూడా భావిస్తున్నాడు.

“ఈ యుద్ధాన్ని రాజ్యం దాచి ఉంచాలని కోరుకుంటోంది. హత్యా క్షేత్రాలలో ప్రజల రక్తం స్థిరంగా, అడ్డంకులు లేకుండా ప్రవహించాలని, దక్షిణ బస్తర్ మీదుగా ఉన్న తమ పైపులైన్ల ద్వారా ఖనిజ రజను సజావుగా ప్రవహించాలని కోరుకుంటోంది.”

“అందుకే వారు తుపాకీ నక్సలిజంపైన మాత్రమే కాకుండా, పట్టణ నక్సలిజంకి అనేక మారుపేర్లలో ఒకటైన ‘కలం నక్సలిజం’ అని పిలిచే దానిపై కూడా యుద్ధం ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు” అని ఆయన అన్నారు.

ఆపరేషన్ కగార్ ప్రారంభించినప్పటి నుండి, రఘు చెప్పినట్లుగా హింస తీవ్రత పెరిగింది; వందలాది మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న 31 మంది అనుమానిత మావోయిస్టులను చంపిన తర్వాత, అమిత్ షా, “2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను నిర్మూలిస్తాం” అని ప్రకటించాడు.

ఈ సంవత్సరం ఇప్పటివరకు, మావోయిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 81 మంది పైగా భద్రతా బలగాల చేతిలో హత్యకు గురయ్యారు.

ఫిబ్రవరి 1న బీజాపూర్ జిల్లాలోని కోర్చోలి, తోడ్కా గ్రామాల మధ్య ఉన్న టోలిమెటా ప్రాంతంలో మావోయిస్టులు అని చంపినన ఎనిమిది మంది మావోయిస్టులు కాదు, ఆదివాసీ గ్రామస్తులు అని కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక తెలిపింది.

మానవ హక్కుల కార్యకర్తలు ఈ ఎన్‌కౌంటర్‌ల ప్రామాణికతను సవాలు చేశారు; చంపబడిన వారిలో ఎక్కువ మంది మావోయిస్టులు కాదు, నిరాయుధ గ్రామస్తులే అని నొక్కి చెప్పారు.

ప్రభుత్వ నివేదికల ప్రకారం, 2024లో 219 మంది మావోయిస్టులు మరణించారు. అయితే, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ దళాలు చేసిన ఎన్‌కౌంటర్లలో నిరాయుధులైన ఆదివాసీ గ్రామస్తులను చంపి, మావోయిస్టులుగా తప్పుడు ముద్ర వేసిన అనేక కేసులను పి‌యు‌సి‌ఎల్ నమోదు చేసింది.

జనవరి 19న, ఇద్దరు టీనేజ్ బాలికలు, నాగి పునెం, సోని మడకమ్, ఒక వయోజనుడు, కోసా కరం మరణించారని పి‌యు‌సి‌ఎల్ రిపోర్టు చేసింది. జనవరి 27న, పోడియా మాండవి అనే రైతు పోలీసు కస్టడీలో మరణించాడు. ఫిబ్రవరి 25న, అనిల్ హిడ్కో, రామేశ్వర్ నేగి, సురేష్ టెటా అనే ముగ్గురు గ్రామస్తులు మరణించారు. మార్చి 27న, నలుగురు గ్రామస్తులు మరణించారు. ఏప్రిల్ 2న, కమ్లి కుంజమ్ అనే చెవిటి, మూగ బాలికతో సహా ఇద్దరు గ్రామస్తులు మరణించారు. మే 11న, పన్నెండు మంది గ్రామస్తులు మరణించారు. నవంబర్ 8న, హిడ్మా పోడియం, జోగా కుంజమ్ అనే ఇద్దరు గ్రామస్తులు మరణించారు. డిసెంబర్ 11న రెండు వేర్వేరు సంఘటనల్లో ఆరుగురు గ్రామస్తులు మరణించగా, డిసెంబర్ 12న మరో ఇద్దరు గ్రామస్తులు మరణించారు.

కొన్ని హత్యలను ప్రభుత్వం లెక్క నుండి మినహాయించినందున, వాస్తవ మరణాల సంఖ్య 219 కంటే ఎక్కువగా ఉందని కార్యకర్తలు వాదిస్తున్నారు. వీటిలో జనవరి 1న ఆరు నెలల పసిబిడ్డ మంగ్లీ సోడి హత్య, మేలో మోర్టార్ షెల్స్‌తో పిల్లలు మరణించడం ఉన్నాయి. ఈ హత్యలు తమ సొంత బలగాలే చేశాయని ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఈ హత్యలకు మావోయిస్టులను నిందించింది.

అదనంగా, హత్యలకు గురైన వారి గుర్తింపులను నమోదు చేయడంలో మానవ హక్కుల కార్యకర్తలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు; దీని వలన వారు నిరాయుధులైన గ్రామస్తులా లేదా సాయుధ మావోయిస్టులా అని ధృవీకరించడం కష్టమవుతుంది.

రెజాజ్ ఎం. షీబా సిద్దీఖ్ కేరళకు చెందిన ఒక స్వతంత్ర జర్నలిస్టు. ఆయన అణచివేతకు గురైన ప్రజల గాథలు, రాజ్య హింస గురించి రాస్తున్నారు.

Leave a Reply