మోదీ ప్రభుత్వం నవంబర్ 21,2025 నుండి అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల పై  నిబంధనలను మే 8,9 తేదీలలో గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లు భారత కార్మికవర్గాన్ని దళారీ బడా పెట్టుబడిదార్లకు, బహుళజాతి సంస్థలకు అత్యంత మోసపూరితంగా అమ్మివేశాయి. ఆ విధంగా భారత కార్మికవర్గం వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టబద్ధ కార్మిక హక్కులను రద్దు చేసింది.2019 నుండి కార్మిక చట్టాల ఎత్తివేతకు జరుగుతున్న ప్రయత్నాలను కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నా,నవంబర్ 26,2026 న (బిజెపి అనుబంధం కార్మిక యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ తప్ప) పది కేంద్ర కార్మిక యూనియన్ లు దేశ వ్యాప్తంగా బ్లాక్ డే పాటించినా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ లను అమలు చేస్తూ తన కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రకటించుకుంది. వేతనాలు,పని పరిస్థితులు,సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలలో సంస్కరణల పేరుతో రూపొందించిన ఈ కోడ్ లు ఇప్పటి వరకున్న కార్మిక చట్టాలను,హక్కులను రద్దు చేసింది. కార్మికుడు,వేతనం,పరిశ్రమ,సమ్మె, భధ్రత, యూనియన్,హక్కులు మొదలగు పదాల నిర్వచనాలనే పూర్తిగా మార్చి వేసింది. సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి అమలు పధకమైన ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ సృష్టిస్తున్న విధ్వంసానికి,దోపిడీకి వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న కార్మికవర్గ పోరాటాలను కట్టడి చేయడానికి,పాత చట్టాల సంస్కరణల ముసుగులో కార్మికుల హక్కుల న్నీ రద్దు చేశారు. “నూతన శ్రామిక నియమావళి – 2019 ” పేరుతో వచ్చిన, మనుస్మృతులను పోలిన ఈ లేబర్ కోడ్/స్మృతులు పార్లమెంటరీ పార్టీల, ట్రేడ్ యూనియన్ల, ప్రజాస్వామికవాదుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ఏలాంటి చర్చలు జరుపకుండానే తీసుకొచ్చారు. ఒక్క మాటలో ఈ నిబంధనలు కార్మికులు,ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించి, వారి పరిస్థితిని కట్టు బానిసలుగా దిగజార్చడానికి ఉద్దేశించినవేనని అర్ధం చేసుకోవచ్చు.

ఆర్ఎస్ఎస్-బిజెపి కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు గల చట్టాలలోని 44 కార్మిక చట్టాల సంస్కరణ/సవరణ/క్రోడీకరణ గురించి మాట్లాడి,చివరికి 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. నాలుగు లేబర్ కోడ్ రూపొందించి అమలు చేయబోతున్నవి వరుసగా 1.నూతన వేతన నియమావళి-2019,2.నూతన సామాజిక భద్రత నియమావళి -2020,3.నూతన పారిశ్రామిక సంబంధాల నియమావళి -2020

4.పని ప్రదేశాల్లో సురక్ష, ఆరోగ్య, స్థితిగతుల నియమావళి -2020.

నూతన లేబర్ కోడ్ లలో మొదటిదైన నూతన వేతన నియమావళి, 2019 ప్రకారం నాలుగు పాత చట్టాలు రద్దు అయ్యాయి. వీటిలో అతి కీలకమైన వేతన చట్టం -1936, కనీస వేతనాల చట్టం -1948, బోనస్ చెల్లింపు చట్టం -1965,సమాన వేతన చెల్లింపుల చట్టం -1976 లు ఉన్నాయి.

రెండవది. నూతన సామాజిక భద్రత నియమావళి, 2020 ప్రకారం 8 చట్టాలు రద్ద య్యాయి. ఉద్యోగాలు రాష్ట్ర భీమా చట్టం, 1948, ఉద్యోగుల భవిష్య నిధి చట్టం, ఉద్యోగ నమోదు కార్యాలయాల చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం -1961, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం -1972,సినీ కార్మికుల సంక్షేమ చట్టం, భవన ఇతర నిర్మాణ రంగాల్లోని పనివారి యోగ క్షేమాల ఆశించే చట్టం -1966, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టాలు ఉన్నాయి.

నూతన పారిశ్రామిక సంబంధాల నియమావళి -2020 ప్రకారం, ఉద్యోగ కార్మిక సంఘాల చట్టం -1945, పారిశ్రామిక వివాదాల చట్టం-1947 లు ఉన్నాయి.

నాలుగవది, పని ప్రదేశాల్లో సురక్ష, ఆరోగ్య, స్థితిగతుల నియమావళి -2020 ప్రకారం, 13 పాత చట్టాలు రద్దు అయ్యాయి. అవి గనుల చట్టం -1952, పాత్రికేయ, వృత్తి విలేఖరి, ఇతర వార్తా పత్రిక ఉద్యోగుల పని స్థితి గతుల చట్టం -1955,పత్రికా వృౠ, విలేఖరి జీత భత్యాల నిర్ణయ చట్టం -1958, మోటారు వాహనాల చట్టం -1961, బీడీ, పొగ చుట్టల కార్మికుల స్థితి గతుల చట్టం -1966, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ చట్టం -1970, వస్తువు అమ్మకం ఉద్యోగుల చట్టం -1976, అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979,సినీ కార్మికుల, సినిమా థియేటర్ కార్మికుల చట్టం -1981, రేవు పని వారి సురక్ష ఆరోగ్య చట్టం -1986,భవన, ఇతర నిర్మాణ రంగ పని వారి పరిస్థితుల పర్యవేక్షణ చట్టం -1996 లు ఉన్నాయి.

ఈ రకంగా రద్దు చేసిన చట్టాలన్నింటి స్థానంలో రూపొందించిన నాలుగు కోడ్ ల ద్వారా యాజమాన్యాలు,ప్రభుత్వాలు కార్మికులను మరింత శ్రమ దోపిడికి గురి చేసి బానిసలుగా మార్చనున్నారు.ఇక నుండి ప్రభుత్వం కనీస వేతనాల నిర్ణయం చేయదు.ప్రతి నెల సకాలంలో వేతనాల చెల్లింపు,బోనస్ చెల్లింపు ఉండదు.కాంట్రాక్టు కార్మిక విధాన నిర్మూలన చట్టాన్ని రద్దు చేసి నిర్ధిష్ట కాలం కాంట్రాక్టు అను విధానాన్ని తీసుకొచ్చారు.ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు ప్రాధమిక హక్కు కాగా కార్మికులు యూనియన్ స్థాపించడం,అందులో చేరి,సమ్మె చేయడం,శాశ్వత కార్మికులుగా నియామకం ఇక నుండి వీలుకాదు.ఇప్పటి వరకు ఏడుగురు కార్మికులు కలసి యూనియన్ స్థాపించేందుకునే వారు.నేడు 10 శాతం కార్మికుల మద్దతు కావాలి.కొత్త కోడ్ ల ప్రకారం 60 రోజుల ముందుగానే సమ్మె నోటీసు లేకుండా సమ్మె చేయడం వీలు కాదు.ఇంతకు ముందు ఈ గడువు 15 రోజులు ఉండేది. ఆకస్మిక సమ్మెలను పూర్తిగా నిషేధించారు.సమ్మె చేస్తే వేతనాల్లో కోతపెట్టె హక్కు యాజమాన్యాలకు కల్పించారు.ఈ కోడ్ ల ప్రకారం పరిశ్రమల కార్మికవర్గం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేసే ట్రేడ్ యూనియన్ కార్య కలాపాలను నిషేదించారు.ట్రేడ్ యూనియన్లు వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన ఏర్పాటు.ప్రపంచీకరణ విధానాల వల్ల వీటిని కట్టడి చేయడం లేదా అసలే లేకుండా చేయడమో జరుగుతుంది.కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. శాశ్వత కార్మికులుగా నియామకం ఇక నుండి వీలుకాదు.ఇక నుండి కార్మికులకు వారానికి నాలుగు రోజులే పని దొరుకుతుంది.ఎనిమిది గంటల పని దినం ఇకనుండి 12 గంటలుగా మారుతుంది.మహిళలు రాత్రివేళల్లో పని చేయాల్సి వస్తుంది.ఎన్ని గంటలైనా కార్మికులతో పని చేయించుకునే అధికారాన్ని ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు వదిలేశారు.300 లోపు కార్మికులుండే కంపెనీలు తమ కార్మికులను ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించవచ్చు, కంపెనీలను నష్టాల సాకుతో మూసివేయవచ్చు.ఇంత చేసినా రాజ్యం మరియు దళారీ పెట్టుబడిదార్లు నూతన కోడ్ల వల్ల సంతోషంగా లేరు.వారు మరింతగా దోపిడీకి వీలయ్యే ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్ ను ప్రతిపాదిస్తున్నారు.స్త్రీ,పురుషులకు సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేసే హక్కును యాజమాన్యాలకు వదిలేశారు.

వృత్తి పరమైన రక్షణ, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు కోడ్,2020 ప్రకారం,పరిశ్రమ నిర్వచనాన్ని మార్చివేసింది. దీని ప్రకారం పది మంది కార్మికులు పనిచేస్తూ కరెంట్ తో నడిచే ఫ్యాక్టరీని ఇరవైకి పెంచింది. కరెంట్ తో సంబంధం లేనివైతే 40 మంది కార్మికులకు పెంచింది.దేశంలోని చిన్న తరహా తయారీ రంగ పరిశ్రమలన్నీ 20 మంది కార్మికుల లోపే పని చేస్తున్నాయి. ఈ నిబంధన వల్ల చిన్న కంపెనీల కార్మికులు ఆరోగ్యం మరియు రక్షణ చర్యల నుండి మినహాయించబడ్డరు. ఇదే కోడ్ ప్రకారం చిన్న కంపెనీల కార్మికుల రక్షణ ఆరోగ్య విషయాల అమలు పర్యవేక్షించే బాధ్యత నుండి రేబర్ ఆఫీసర్ లను తొలగించింది. ఇక నుండి ఈ పనులన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించనుంది అంటే ఈ బాధ్యతనుండి తప్పుకుంది. ఈ కోడ్ ద్వారా దేశంలోని అత్యధిక రంగాలైన టెక్స్ టైల్, గార్మెంట్, మెటల్, హౌసెరీ, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పని చేసే కార్మికులు ఆరోగ్యం మరియు రక్షణ చర్యల నుండి మినహాయించబడ్డారు.

కార్మికవర్గ దుస్థితి.
ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ పధకాల అమలులో భాగంగా కోసం తీసుకొచ్చిన డీ-ఇండస్ట్రీయలైజేషన్, డీరెగ్యులేషన్ విధానాల ఫలితంగా పారిశ్రామిక రంగం క్షీణించింది. పబ్లిక్ రంగం దెబ్బతిని ప్రైవేటు రంగం పెరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయి. సంఘటిత రంగం తగ్గిపోయి అసంఘటిత రంగ పెరిగింది. దేశం మొత్తంలో కార్మికులు 44 కోట్లు ఉండగా అసంఘటిత రంగ కార్మికులు 39 కోట్లు కాగా సంఘటిత రంగం కేవలం 5 కోట్లు మాత్రమే. అసంఘటిత రంగంలో వ్యవసాయ కూలీలే అత్యధికంగా 52 శాతం ఉన్నారు.52 రకాల పనులు చేసే భవన నిర్మాణ రంగంలో 16 కోట్ల కార్మికులు ఉన్నారు. కోట్లాది మంది వలస కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారు. స్వయం ఉపాధి,చేనేత రంగంతో పాటు అనేక రకాల చేతి వృత్తుల వారు అసంఘటిత రంగంలోకే వస్తారు. వీరిలో యూనియన్ కింద సంఘటితమైన వారు తక్కువ. వీరికి గిట్టుబాటు అవుతున్న వేతనాలు లేదా కూలీలు బతకడానికి కూడా సరిపోవు.ఈ అసంఘటిత రంగ కార్మికులకు కార్మిక చట్టాలు వర్తించడం లేదు. ఇక నుండి వర్తించడానికి ప్రయత్నమే జరుగదు. ఇప్పుడు నూతన లేబర్ కోడ్ ల చర్చంతా సంఘటిత రంగ కార్మికులకు సంబంధించినదే. వీరిలో సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికులను లేబర్ కోడ్ లు టార్గెట్ చేశాయి. తయారీ రంగ ఉత్పత్తిలో 40 శాతం, ఎగుమతులలో 34 శాతం వీరి శ్రమ ఫలితమే.

దేశ వ్యాప్తంగా రోజుకు కనీసం ముగ్గురు కార్మికులు ప్యాక్టరీలలో జరుగుతున్న ‘ప్రమాదాలలో’ మరణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పని ప్రదేశాల్లో జరుగుతున్న ప్రమాదాలు అత్యధికంగా కెమికల్ సెక్టార్ లోనివే. భరించనలవికాని సమస్యల నేపధ్యంలో గత సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా కార్మికుల పోరాటాలు పెరిగాయి. వీరందరి సాధారణ డిమాండ్లు కనీస వేతనాలు,పని గంటల తగ్గింపు,సామాజిక భద్రత, ఉద్యోగాల కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా మొదలగు సాధారణ డిమాండ్లు. కార్మికులు అనుభవిస్తున్న ధుర్భర జీవితాలను మెరుగుపరుచుకోవడానికి జీవన్మరణ పోరాటం చేస్తుంటే ప్రస్తుతం ఉన్న నామ మాత్రపు కార్మిక చట్టాలను లేబర్ కోడ్ ల పేరుతో రద్దు చేస్తున్నారు.

కార్మిక వర్గ దుస్థితి కి కారణాలు ఏమిటి.

పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం అనేక దశాబ్దాలుగా సాధారణ సార్వత్రిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ లక్షణాలుగా సరుకులు అమ్ముడుపోకపోవడం, పరిశ్రమలు మూతపడడం,నిరుద్యోగం పెరగడం,ధరల పెరుగుదల,బ్యాంకుల మూసిలేత, షేర్ల విలువ పడిపోవడం,ఉత్పత్తి శక్తుల విధ్వంసం, పర్యావరణ సంక్షోభం మొదలగునవి తీవ్రమయ్యాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి దాని ఆర్థిక భారాన్ని ద్రవ్య పెట్టుబడి రూపంలో ప్రపంచ దేశాల పై రుద్దారు. దీన్నే ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ-సరళీకరణ అన్నారు. సామ్రాజ్యవాదుల ఈ ప్రపంచీకరణ విధానాలు విఫలమౌతున్న స్థితిలో వారు అనేక దేశాలలో జాత్యహంకారాన్ని,ఫాసిజాన్ని, ప్రాంతీయ యుద్ధాలను రెచ్చగొడుతున్నారు. మన దేశంలో నెలకొన్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని ఈ నేపధ్యంలోనే చూడాలి. ఆ విధంగా ఫాసిజం ద్రవ్య పెట్టుబడి ఫలితమని కూడా అర్ధం చేసుకోవచ్చు.

ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ తీసుకొచ్చిన మార్పుల వల్ల శ్రమ విభజన, ఉత్పత్తి, సరుకుల సరఫరా కోసం సామ్రాజ్యవాదులు వెనుకబడిన దేశాలలోని దళారీ కంపెనీలలో జాయింట్ వెంచర్ లు ఏర్పరుచుకున్నాయి. ఈ దళారీ కంపెనీలు ఎగుమతి చేయడానికే సరుకులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ విధానం కార్మికుల సంఘటిత శక్తిని దెబ్బ తీస్తుంది. అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవడానికి నూతనంగా ముందుకు తేబడిన అంతర్జాతీయ శ్రమ విభజన,కృత్రిమ మేధ,సైబర్ టెక్నాలజీ, ఆటోమేషన్ ల ఫలితంగా యాంత్రీకరణ ప్రమాదం పెరగడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కాంట్రాక్టు,క్యాజువల్, ఔట్ సోర్సింగ్, గిగ్ ప్లాట్ ఫారం వంటి శ్రమ రూపాలు,అతి తక్కువ వేతనాలు ప్రధాన ధోరణిగా మారాయి. నిరుద్యోగ కార్మిక రిజర్వు సైన్యం పెరిగింది. ఫలితంగా ట్రేడ్ యూనియన్ల,కార్మికుల సంఘటిత శక్తి దెబ్బ తిన్నది. కార్మికుల పై కార్పొరేట్, బహుళజాతి సంస్థల దోపిడీ, దాడులు, పనుల నుండి తొలగించడం పెరిగింది. ద్రవ్య పెట్టుబడి ఫలితంగా కార్మిక, ఉద్యోగ భద్రతకు, ప్రమాణాలకు ఎటువంటి గ్యారంటీ లేకుండా పోయింది. కొద్ది మంది ద్రవ్య పెట్టుబడిదారుల, వారికి దళారీలైన పెట్టుబడిదార్ల ఫాసిజం పెరిగింది. దేశంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తీవ్రంగా పెరిగాయి. పెరిగిన దారిద్ర్యం వల్ల మనుగడే కష్టమైన కార్మికులు ఎక్కడికక్కడ విడివిడిగా ఆందోళనలకు,సమ్మెలకు, మిలిటెంట్ పోరాటాలకు దిగుతుండడం ఇటీవల పరిణామాలు.

భారత దేశంలోని హిందూత్వ కార్పోరేట్ శక్తులు అధిక లాభాల కోసం ఏఐ, ఆటోమేషన్ లు పెంచుతున్నరు. యాంత్రీకరణ ఎంత పెరిగినా లాభాన్ని ఉత్పత్తి చేసే సాధనం కార్మికుల శ్రమే కాబట్టి లాభాల రేటు తగ్గకుండా,ఇబ్బడి ముబ్బడిగా కార్మికులను దోచుకోవాలంటే పెట్టుబడిదారులు వేతనాలను తగ్గించడం,పని గంటలు పెంచడం,కార్మిక భద్రతను తగ్గించడం,సంక్షేమ ఖర్చుల కోత, చర్చలు,రాజీలు,ఒప్పందాలు వంటి ప్రజాస్వామిక పరిష్కారాలు లేకుండా చేయడం,కార్మికులకు ఏలాంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో పాటు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫాసిస్టు కార్పోరేట్ శక్తులు మూకుమ్మడిగా కార్మికవర్గం పై తలపెట్టిన దాడి ఫలితమే లేబర్ కోడ్ ల పేరుతో కార్మికుల చట్టబద్ధ హక్కులను పూర్తిగా ఎత్తి వేశారు.

కార్మికవర్గం ఏం చేయాలి.

వీరోచిత పోరాట చరిత్ర,త్యాగాల సాంప్రదాయం గల కార్మికవర్గం పై ఫాసిస్టు పాలకులు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ప్రస్తుత కార్మికవర్గ పోరాటం చాలా బలహీనంగా ఉంది. కార్మికవర్గం పై పాలక పార్టీల,రివిజనిస్టుల ప్రభావం బలంగా ఉన్నది. అత్యధిక సంఖ్యలోని కార్మికవర్గం యూనియన్లకు వెలుపలే ఉంది. భావజాల పరమైన బలహీనత వల్ల మన దేశ అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సామాజిక స్వభావాన్ని అర్థం చేసుకుని,అంతర్జాతీయ,దేశీయ పరిణామాలకు అనుగుణంగా స్పందించే శక్తుల ఆధ్వర్యంలోని కార్మికవర్గం అతి స్వల్పంగా ఉంది. సుధీర్ఘ కాలంగా కార్మికోద్యమం పై ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులు కార్మికోద్యమ లక్ష్యం,దిశను పార్లమెంటరీ ప్రయోజనాల పరిధికే కుదించివేశారు. యాజమాన్యాలకు అమ్ముడుపోయే స్వభావం, మోసకారితనం వల్ల నేటి ట్రేడ్ యూనియన్ల పట్ల యువతలో అనాసక్తత నెలకొన్నది. వీటికి తోడు కార్మికోద్యమంలో ఆర్ధిక వాదం,ట్రేడ్ యూనియనిజం, చట్టబద్ధవాదం, కులతత్వం, సంస్కరణవాదం, చీలికవాదం మొదలగు కార్మికవర్గేతర పెడధోరణులు ఆధిపత్యం వహిస్తున్నాయి. కార్మికవర్గంలోకి హిందూత్వ శక్తులు చొరబడి సనాతన భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ,పోరాడే చేవను నీరుగారుస్తూ కార్మికోద్యమాన్ని బలహీనం చేస్తున్నాయి.

ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, బలహీనతలున్నప్పటికీ ఇప్పటికీ దేశంలో బలమైన సంఘటిత శక్తి అయిన కార్మికవర్గం ప్రభుత్వాలు, యాజమాన్యాలకు వ్యతిరేకంగా తన నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఎన్నో సమస్యలను సాధించుకుంటున్నది. దేశ వ్యాపితంగా జరుగుతున్న పీరియాడికల్ సమ్మెలతో పాటు యాదృచ్ఛిక పోరాటాల్లో  మిలిటెంటుగానూ పాల్గోంటుంది. ఈ సందర్భంగా కార్మికులు తమ కార్మికవర్గోద్యమ లక్ష్యాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. కార్మికవర్గ మహోపాద్యాయులు భోదించినట్లుగా వారి ఉద్యమాన్ని ఉత్పత్తి సాధనాల యాజమాన్యాన్ని రద్దు చేయడం, విప్లవ పద్ధతుల ద్వారా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునేదిగా మల్చుకోవాలి. కార్మికులు కోరుకొనేది తమకు ప్రత్యేక హక్కులు కాదని,సమస్త వర్గ పీడన రద్దు కావాలనీ,రాజకీయ పోరాటం లేకుండా కార్మికులు విముక్తి చెందలేరని గ్రహించి పోరాడాలి. ఈ అవగాహనతో ఫాసిస్టు పాలకులు తీసుకొచ్చిన లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకూ పోరాడుతూనే మన దేశ సామాజిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చగల నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సమీకృతం కావాలి.

తేదీ.13-5-2026.

Leave a Reply