తల్లులు బిడ్డలు రచించినది హుస్సేన్. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. తల్లులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కన్నా, తల్లులకై బిడ్డలు చేసిన పోరాటాలు త్యాగాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. తల్లుల కొరకై బిడ్డలు,బిడ్డల కొరకై తల్లులు,తల్లడిల్లిన క్రమం, బిడ్డలు విప్లవంలో ఎదుగుతున్న తీరు చూసి సంతోషించిన తల్లులు, దూరమవుతున్న పిల్లలను చూస్తూ బాధపడతారు.బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు.

ఈ పుస్తకం కేవలం తల్లులు బిడ్డల మధ్య జరిగినది కాదు. ఇది ఒక తరం ధైర్యానికి సాహసానికి, త్యాగనిరతికి, ప్రతీక ఈ పుస్తకం. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల,మంచిర్యాల, ప్రాంతంలో చెలరేగిన ఉద్యమాల ఊట చెలిమ. సింగరేణి కార్మికులు చేపట్టిన ఉద్యమాల చరిత్ర క్రమం ఇది. వారి జీవిత కథలు,వారి త్యాగాలు, ఇందులో విస్తారంగా చర్చించబడ్డాయి. సాధారణ కార్మికుల నుండి క్రమంగా రాజకీయాలను అర్థం చేసుకుంటూ, సైద్ధాంతిక దృక్పథాన్ని పెంపొందించుకుంటూ, దోపిడీ పీడనలను ఎదిరించడానికి వర్గ పోరాటం మొదలుపెట్టి, పూర్తి కాలం కార్యకర్తలుగా రహస్య జీవితంలోకి వెళ్లిన వారి జీవితాల పరిణామ క్రమం ఇందులో ఉంటుంది. ఇందులో ఉన్న ఏ ఒక్క పాత్ర కల్పితం కాదు. ప్రతిదీ రక్త మాంసాలు ఉన్న మనిషి.అనే గ్రహింపు క్రమంగా మనకు కలిగి,మనల్ని చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది.

బెల్లంపల్లి-కన్నాల బస్తీ:

అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణం, కన్నాల బస్తీలో గజ్జల లక్ష్మమ్మ ఇంటి నుండి ఇది మొదలవుతుంది. వీరులకు జన్మనిచ్చి విప్లవమాతగా విప్లవాచరణలో జీవిస్తూ, తన చివరి శ్వాస వరకు తన బిడ్డల కోసం, తన బిడ్డలు అంటే వర్గ పోరాటం చేసే ప్రతి బిడ్డ తన బిడ్డనే అనుకునే తల్లి కనుక, ఆ బిడ్డల కోసం ఎదురుచూస్తూ విప్లవం వర్ధిల్లాలి అని పిడికిలెత్తి ముందుకు సాగిన విప్లవమాత గజ్జల లక్ష్మమ్మ. గజ్జల గంగారం గజ్జల సరోజ ఆమె సంతానం. సరోజ సహరుడు నల్ల ఆదిరెడ్డి ఆ ఇంటికి అల్లుడు.లక్ష్మవ్వకు లక్ష్మణ్, నారాయణ, రామచంద్ర, కమలాకర్, పద్మ అనే పిల్లలు కూడా ఉన్నారు. కానీ విప్లవాన్నే తమ వృత్తిగా భావించి, పూర్తికాలం కార్యకర్తలుగా మారింది మాత్రం గజ్జల గంగారం, గజ్జల సరోజ.

లచ్చవ్వ కూడా అందరిలాగే తన పిల్లలను కూడా పై చదువులు చదివించింది. ఉద్యోగాలు చేస్తారనుకున్నది. కానీ వారు విప్లవోద్యమంలోకి పూర్తి కాలం వెళ్లారు. అలా వెళ్తారు అనుకోలేదు తల్లి. బిడ్డ గంగారం ఉన్నత చదువుల్లో భాగంగా కాలేజీలో చదువుతున్నప్పుడు విప్లవ రాజకీయాలకు ఆకర్షితులవుతాడు. రాడికల్ విద్యార్థి సంఘంలో,(RSU) చేరుతాడు.కాలేజీలో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఉద్యమం మొదలుపెట్టి, తన చుట్టూ ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఆచరణలోకి వెళ్తాడు. కార్మికులకు కనీస అవసరాలు అయిన ఇల్లు, కరెంటు, నీరు, గాలి, గనిలోకి వెలుతురు. విద్య, ఆసుపత్రులు, ఇలాంటి వాటికోసం పోరాటం అవసరమైంది.మరో వైపు,వాళ్ళు చేసిన పనులకు జీతాలు ఇవ్వకుండా, కడుపు కొట్టి వేలకు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న యాజమాన్యులకు వ్యతిరేకంగా, గుండాలకు వ్యతిరేకంగా, ప్రజలను సంఘటితం చేస్తూ పోరాటాలు జరిపిస్తూ, చైతన్య పరుస్తూ, సభలు సమావేశాలు చర్చలు జరుపుతూ, అతడే నాయకుడై ప్రజల మధ్య ఉంటూ, సైద్ధాంతిక అవగాహన పెంపొందిస్తూ, కార్మికుల గుండెల్లో నిలిచిన అమరుడు గజ్జల గంగారం.

రాడికల్ గా జనజీవన స్రవంతి లోనే ఉంటూ, మిలిటెన్సీని పెంచుతూ, వర్గ పోరాటాలే సంఘటిత సమస్యలను పరిష్కరిస్తాయని ప్రజలను ఐక్యం చేస్తూ, వారు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నాయకత్వం వహించాడు గంగారం.

ఆయనకు రఘు(అదిరెడ్డి)తో పరిచయం ఏర్పడింది. తర్వాత క్రమంలో గంగారం ఇంటికి చాలామంది వస్తు పోతూ,రాజకీయ చర్చలు చేస్తూ ఉన్నారు. వాటికి కేంద్రం ఆయన ఇల్లు.ఇలాంటి రాజకీయ చర్చలతో లక్ష్మమ్మ, సరోజ, పద్మ, కమలాకర్ కూడా ప్రభావితమయ్యారు.

మరోవైపు పోలీసుల అండతో, యాజమాన్యపు అండ చూసుకొని సింగరేణి క్యాలరీస్ ప్రాంతంలో గుండాలు సాగిస్తున్న హత్యలు, రేపులు, దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్న క్రమంలో గంగారం, రఘు నాయకత్వన రాడికల్స్ ఆ గుండాలను నరికి చంపి, ఆడపిల్లలకు రక్షణ కల్పించడం అనే చర్య వలన ప్రజలకు రాడికల్స్ పై నమ్మకం పెరిగింది . అయితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ప్రజలను సంఘటన చేస్తూ రాజకీయాలను బోధిస్తూ, విప్లవ సాహిత్య అందిస్తూ, సభలు సమ్మెలూ నిర్వహిస్తూ,మిలిటెన్సీ  పెంచుతూ, రిక్రూట్మెంట్స్ జరుపుకున్నారు

ఉద్యమానికి జవసత్వాలను కల్పించారు.

పార్టీ లోకి పూర్తి కాలం కార్యకర్తలుగా మారిన వారికి ప్రజలు ప్రేమతో ఆశ్రయం కల్పించారు. పార్టీ కార్యకర్తలు ఏదైనా చర్చిస్తున్న సమయంలో ప్రజలే వాళ్ళింట్లో ఆశ్రయమిచ్చి, వారికి రక్షణను,ఆహారాన్ని సమకూర్చారు. ఇలా కార్మిక కుటుంబాలతో, దళాలకు, సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకరకంగా కుటుంబాలు మొత్తంగా కూడా పార్టీ మనుషులు అయిపోయారు. వాస్తవానికి లక్ష్మమ్మ ఇల్లు బహిరంగ కార్యాలయం లాంటిది పార్టీకి. ఎప్పుడు వచ్చినా సరే రక్షణ,ప్రేమ ఆప్యాయత దొరికేది అక్కడ విప్లవకారులకు.ఇటు అన్న గంగారం ప్రభావంతో పూర్తి కాలం కార్యకర్తగా సరోజ కూడా ఉద్యమంలోకి ప్రవేశించింది. అయినా సరే ఆ తల్లి బిడ్డను అడ్డుకోలేదు పైగా ప్రోత్సహించింది.

అంతేకాకుండా “నాలాంటి తల్లులు ఎందరో ఉంటారు కానీ వారందరి గురించి ఆలోచిస్తున్న మీరు ఇలా పని చేయడం నాకు సంతోషమని” చెప్పిందా తల్లి.మనల్ని కదిలించే ముఖ్యమైన సంఘటన లేదంటే అడవిలో మిలిటరీ ట్రెయినింగ్ క్యాంపు జరుగుతున్నప్పుడు గంగారాం చేతిలో గ్రెనేడ్ పేలి, ఆయన చనిపోవడం,నివాళి అర్పిస్తున్న సమయంలో బుల్లెట్ సాహును తాకడం, విడిపోతున్నప్పుడు దళ సభ్యులను పాము కాటేయడం, ఈ సంఘటనలు జరిగినా సరే, ఏమాత్రం అడుగు వెనక వేయకుండా తప్పులను సమీక్షిస్తూ ముందుకు సాగిన వారి ధైర్యం, విప్లవోద్యమం వాళ్ళకి ఇచ్చిన బలమే.

విప్లమంటే విందు భోజనం కాదు అది కష్టాలు నష్టాలతో కూడుకున్న దారి.అని మావో అన్నది అందుకే.

గంగారం మరణ వార్త విన్న కన్నాల బస్తి కన్నీరు మున్నీరయింది. ఇక గజ్జల సరోజ ఆదిరెడ్డి, పార్టీ సమ్మతంతో వివాహం చేసుకుంటారు.

సాధారణ విద్యార్థి, నుంచి మొదలై జిల్లా, రాష్ట్ర,కేంద్ర కమిటీ పార్టీ నాయకుడిగా ఆయన ఎదిగిన క్రమం ఒక స్ఫూర్తినిస్తుంది.నిజంగా శ్యామ్ జీవితం ఆయన జైలు నుండి బయటపడటం అనే క్రమాన్ని చదివితే మనసు బరువెక్కుతుంది.

పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే పార్టీ జాడ చెప్పనివారే కదా.అసలైన విప్లవకారులు. ఆ నిజాయితే కదా ఉద్యమాన్ని నిలబెట్టేది.

అనుకోకుండా శ్యామ్ మహేష్ మురళీలు కొయ్యూరులో పూటకు ఎన్కౌంటర్కు గురి కావడం వారు ముగ్గురు కేంద్ర కమిటీ నాయకులై ఉండటం వీరి మరణం అందరికీ తట్టుకోలేని బాధను మిగిల్చింది.ఈ వార్త విన్న సరోజ ఎంత బాధ పడ్డదో గాని రఘు చెప్పిన మాటలు ఆమె గుర్తుకొస్తాయి “విప్లవమంటే విజయాలు, పోటములు, మరణాలు, త్యాగాలు అన్నీ ఉంటాయి. మనం నమ్మిన సిద్ధాంతానికై చివరి శ్వాస వరకు పోరాడాలి”అని ఆయన చెప్పిన మాటలు ఆమెకు గుర్తొస్తాయి.

ఓ వైపు అన్న మరణం, మరొకవైపు సహచరుడి మరణం, సరోజను నిరాశపరచలేదు. ఆమె చివరిదాకా పార్టీలోనే కొనసాగి క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది.

ఇలా ఎన్ని త్యాగాలు! ఎంతమంది యోదుల మరణాలు, పెద్ధి శంకర్,పులి మధురయ్య, పులి అంజయ్య, విజయ్, గంగారాం, సరోజ, జిలాని బేగం,నల్ల ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, మురళి,కటకం సుదర్శన్,రాజలింగు, భాగ్య, ఇలా ఎందరో తమ తల్లులను వదిలి, తమ కుటుంబాన్ని వదిలి, ప్రజల కోసం పోరాటాలు చేసి,ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా త్యాగాలు చేసి, వారి చావుకు సార్థకతను మిగులుచుకొని ప్రజల గుండెల్లో విప్లవాగ్నిని పండించిన అరుణారుణ తారలు. అమరవీరులు. ఇది త్యాగాల జీవిత చరిత్ర,  ఈ “తల్లులు బిడ్డలు” ధైర్యానికి త్యాగానికి ప్రతీక, గుండెను పిండే అమరుల త్యాగాల చరిత్ర, మనిషిని మనసుని ఒక్కసారిగా కుదిపేసే చరిత్ర

ముఖ్యంగా మరొక పాత్ర. కేవలం పాత్ర కాక మరో మనిషి, జిలాని బేగం గురించి చెప్పుకోవాలి. అమే హుస్సేన్ భార్య. అనే ముస్లిం సంప్రదాయాలు పుట్టి పెరిగిన భర్త ఇంటికి వచ్చే విప్లవకారుల చేత ప్రభావితమై, నమ్ముకున్న సంప్రదాయాలకు స్వస్తి పలికి, విప్లవోద్యమంలోకి అడుగు పెట్టింది. ఎన్నో కష్టాలను అనుభవించింది. ఆ క్రమమంతా కూడా మనల్ని దుఃఖానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆమె అమరత్వం.

ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే హక్కులను ప్రజలు కోల్పోతారో, ఎక్కడైతే దోపిడీ పీడనలకు గురవుతారో, అక్కడే ఉద్యమం పుడుతుంది. అక్కడే చైతన్యం మొదలవుతుంది. నష్టాలను అధిగమించి ప్రజలు పోరాడుతారు. చరిత్రను సృష్టిస్తారు.

 ఆ క్రమంలో బిడ్డలకై తల్లులు పడే సంఘర్షణ ఈ పుస్తకంలో మనం చూస్తాం. ఉదాహరణగా గజ్జల లక్ష్మమ్మ కుటుంబాన్ని చెప్పొచ్చు. గంగారం సరోజ ఏ రోజు కైనా అమరులు అవుతారని తెలిసిన తన బిడ్డలను అడ్డుకోలేదు ఆ తల్లి.అంటే ఆ తల్లి హృదయం ఎంత గొప్పదై ఉంటుంది.

తన ఇంట్లోకే కార్యకర్తలు వచ్చి, చర్చలు జరుపుతూ, కరపత్రాలు రాస్తూ, వ్యాసాలు రాస్తూ వాల్ పోస్టర్లు సిద్ధం చేస్తూ,తన చేతి అన్నం తింటూ,పోరు బాటలో నడుస్తున్న క్రమంలోనే తన కళ్ళముందే పార్టీలో చేరిన ఎందరో పిల్లలు ,అసువులు బాస్తారు వారిని ఇంకెప్పుడూ చూడలేను. మాట్లాడలేను. అనే ఆ తల్లి ఆవేదన మాటల్లో చెప్పలేనిది. చదివిన మన గుండె కూడా ఆర్ద్రమవుతుంది.

తన సొంత కొడుకు బిడ్డ విప్లవం లోనే అమరులైనా సరే తన చివరి శ్వాస వరకు సైతం ఆమె విప్లవంతోనే నడిచింది

మరొక ముఖ్యమైన ఘటన కూడా పుస్తకంలో చదవాలి. పని మీద బయటకు వచ్చిన మాదిరెడ్డి సమ్మె రెడ్డిని ఇంట్లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో, పోలీసులు చుట్టుముట్టి డ్రమ్ములతో పెట్రోలు పోసి, సజీవ దహనం చేసిన ఆచర్య ప్రజలను కోపోద్రిక్తులను చేసి ఉద్యమం ముందుకు సాగడానికే ఊతం ఇచ్చింది. ఒకే ఒక నాయకుడు ఇద్దరు పోలీసులను, చంపి 500 మంది పోలీసులు ఎదురుగా ఇది చూస్తున్న 30 వేల మంది ప్రజలు,ఎదురుగా అమరుడయ్యాడు.ప్రజలు ఆ నాయకుడి ధైర్యం తెగువకు సంతోషపడ్డారు. బాధపడ్డారు. కానీ ఆ నాయకున్ని కోల్పోయారు. అదొక గుండెను మెలి పెట్టే సన్నివేశం

విప్లవకారుల విజయాలను చూసి ఏ విధంగా ప్రజలు స్ఫూర్తి పొందుతారో వారు ఎదురు దెబ్బలు తిన్నప్పుడు కూడా ఆ పరిస్థితిని ప్రతిఘటిస్తూ, విప్లవం కోసం పాటుపడే విధంగా మనమే ప్రజలకు అవగాహన కల్పించాలి. కగార్ పేరిట ప్రస్తుతం విప్లవకారుల ఏరివేత క్రమం జరుగుతున్నది. అయినా సరే విప్లవాన్ని కొనసాగించాలి.

ఈ దేశ పీడితులకు, దళితులకు, మహిళలకు, ఆదివాసులకు అది తప్ప మరో దారి లేదు.

ఈ పుస్తకంలో మనుషుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాల కన్నా, వారు చేసే పనుల్లో కనిపించే ఉద్వేగం,వారి కల్లోలం, దుఃఖం,వారి గుండెలోని విప్లవం, మనల్ని ఈ పుస్తకం చివరిదాకా చదివిస్తుంది. ఇది కేవలం ఇద్దరూ ముగ్గురు వారి కుటుంబాల చరిత్ర కాదు. వందల వేల మంది మధ్య సాగిన విప్లవ సంబంధాల చరిత్ర. తప్పకుండా చదవండి.

Leave a Reply