పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతులం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్లుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదాలు తీసుకురావచ్చు? ప్రభుత్వం, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. హార్మూజ్ జలసంధి వంటి మార్గాల ద్వారా ప్రతిరోజూ లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్‌కు సరఫరా అవుతుంది. ఇక్కడ యుద్ధం లేదా ఉద్రిక్తతలు పెరిగితే, ఈ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడటం సహజం. ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. భారతదేశం తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు తప్పకుండా పెరుగుతాయి.

గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా యుద్ధంలో పాలొన్న, పాల్గొనని దేశాలన్నీ వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేసింది ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. మౌలిక సదుపాయాలు ధ్వంసమై, పర్యావరణ దెబ్బతిని, దేశాల అభివృద్ధి దశాబ్దాల పాటు వెనకబడిపోయింది. ఆయా ప్రాంతాల్లో సైనికులతో పాటు పౌరులు ప్రాణనష్టానికి గురై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నేలకూలి విధ్వంసం సృష్టించిన ఈ యుద్ధం ఇంధన సంక్షోభానికి తెర తీసి దీర్ఘకాలిక ప్రభావంతో ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభానికి బీజం వేసింది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ, రోజుకు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోతోంది. మధ్యప్రాచ్యంలో ఇప్పటివరకు జరుగుతున్నది భూతల యుద్ధం కాదు. ఆకాశంలో జరిగే క్షిపణులు, ద్రోణ్‌ల యుద్ధం, ముందు ముందు ఇది ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అన్న కలవరం అందరిలోనూ మొదలైంది. అంతకంతకు పెరుగుతున్న ఈ యుద్ధం ప్రత్యక్షంగా 14 దేశాలపై, పరోక్షంగా యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమైనీని తన అనుచరులతో సహా మట్టుపెట్టిన తర్వాత మూడు రోజుల్లో యుద్ధ లక్ష్యాన్ని నెరవేరుస్తానని భావించిన ట్రంప్ అంచనాలు తారు మారాయినవి. అత్యున్నత స్థాయి సైనిక అధికారులను కోల్పోయి, కొన్ని ముఖ్యమై గ్యాస్ క్షేత్రాలు, రిఫైనరీలు, సైనిక స్థావరాలు, క్షిపణ వ్యవస్థలు, వైమానిక, నౌకాదళ సామర్థ్యాలకు భారీ నష్టం కలిగినా ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్‌పై తీవ్రంగా ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు  గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ మేఘాల కిందకు నెట్టడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గల్ఫ్ దేశాల (జిసిసి) ఆర్థిక సుస్థిరతను ప్రశ్నార్థకం చేస్తోన్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తోన్న యుద్ధం గల్ఫ్ దేశాలకు ఒక బాధకరమైన వాస్తవం. తమ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని అమెరికాను గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. కానీ, అమెరికా ఎప్పటిలాగే గల్ఫ్ దేశాల మాటను పెడచెవిన పెట్టి ఇజ్రాయెల్ అనుకూల ఎజెండాకే మొగ్గు చూపింది. మొదట్లో ఇరాన్ గల్ఫ్‌లోని అమెరికా పైనే దాడులు చేసింది. కానీ ఆ తర్వాత గల్ఫ్ దేశాల హోటల్స్, విమానాశ్రయాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఫలితంగా ఏర్పడిన ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం గల్ఫ్ దేశాల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. యుద్ధ నీడలో విలవిలలాడుతున్న పశ్చిమాసియా మరోసారి  అశాంతికి నిలయంగా మారింది. ఇరాన్ ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మరోవైపు సాగిస్తున్న ‘నీడ యుద్ధం’ ఇప్పుడు బహిరంగా పోరాటంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల వల్ల నేరుగా యుద్ధంలో లేని సౌదీ అరేబియా. యూఎఇ ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు భారీ ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. కేవలం బాంబుల మోత మాత్రమే కాదు, మార్కెట్ల పతనం, పెట్టుబడుల ఉపసంహరణ, సరఫరా గొలుసుల విచ్చిన్నం ఈ దేశాల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి.

తమ ప్రమేయం లేని యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల రక్షణ వ్యయం పెరిగి Ð బడ్ౙెట్ లోటు అనివార్యమవుతుంది. యుద్ధ భయాల వల్ల గల్ఫ్ దేశాలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని రక్షణ రంగానికి కేటాయించాల్సి వస్తోంది. ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సిన నిధులను క్షిపణి రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు మళ్లిస్తున్నారు. ఇది ఆయా దేశాల బడ్జెట్ లోటును పెంచుతోంది. షిప్పింగ్, లాజిస్టిక్స్ ఖర్చులు. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు, ఇటు పర్షియన్ గల్ప్ లో ఉద్రిక్తతల వల్ల బీమా ప్రీమియంలు భారీగా పెరిగాయి. సరుకు రవాణా నౌకలకు భద్రత కల్పించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి గల్ఫ్ దేశాల్లో ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. గల్ఫ్ దేశాల్లోనే అత్యంత సంపన్నమైన, పర్యాటక హబ్‌గా పేరున్న దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు ‘దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డిఎక్స్ బి) గుండెకాయ వంటి విమానాశ్రయం ధ్వంసమైంది.

ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి లాంటి హర్మూజ్ మూసివేత, గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడులతో అంతర్జాతీయంగా చమురు ధలు భగ్గుమన్నాయి. ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మైలురాయిని దాటింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మార్చి 27 నాటికి 109.14 డాలర్లకు చేరుకుంది. గతంలో సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న ధరలు, కొద్ది రోజుల వ్యవధిలోనే భారీగా ఎగబాకాయి. ఒక్కరోజులోనే ముడి చమురు ధర దాదాపు 16 శాతం పెరగడం మార్కెట్లను కుదిపేసింది. వారం రోజుల్లోనే మొత్తం 33 డాలర్లకు పైగా పెరుగుదల నమోదు కావడం విశేషం. 1973 యుద్ధ సమయంలో ప్రపంచ చమురు సరఫరాపై 7Ð9 శాతం మేర ప్రభావం  పడింది. రోజుకు సగటున 4 నుంచి 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా కొరత ఏర్పడింది. ప్రస్తుతం హర్మూజ్ మూసివేత వల్ల రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా అంటే, ప్రపంచ చమురు వినియోగంలో 20 శాతంపై ప్రభావం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హర్మూజ్ మూసివేత ఇలానే కొనసాగితే దీర్ఘకాలంలో చమురు ధరలు మరింత భగ్గుమనే పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. బ్యారెల్ ధర 145Ð150 డాలర్లకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం.. ఒక్క చమురు రవాణాను మాత్రమేగాక ఔషధాలు, సెమీకండక్టర్లు, ఎరువులు ఇలా అన్నింటి సరఫరాలను ప్రభావితం చేస్తుండటం గమనార్హం. భారత్ నుంచి ఔషధాలు, ఇతర ఆసియా దేశాల నుంచి సెమీకండక్టర్లు, కంప్యూటర్ చిప్‌లు, బ్యాటరీలతో పాటు పశ్చిమాసియా నుంచి ఎరువుల తయారీకి వినియోగించే చమురు ఆధారిత ఉత్పత్తుల రవాణాకు ఈ యుద్ధం ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చి పెడుతున్నది. తమ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండటంతో గల్ఫ్ తీరాల్లోనే భారీగా కార్గో షిప్‌లు ఇరుక్కుపోయాయి. దీంతో భారత్ సహా ఆసియా దేశాల నుంచి వెళ్లాల్సిన నౌకలు కూడా ముందుకు కదల్లేకపోతున్నాయి. షిప్పింగ్ డాటాను వెల్లడించే క్లార్క్‌సన్స్ రీసెర్చ్.. దాదాపు 500 అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు యూఎఇ, ఒమన్ తీరాల్లో రవాణా కోసం వేచిచూస్తున్నట్టు చెప్తున్నది. ప్లాస్టిక్, రబ్బర్, నైట్రోజన్ ఎరువుల తయారీకి వినియోగించే పెట్రో రసాయన పదార్థాలు పశ్చిమాసియా దేశాల నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడవన్నీ నిలిచిపోయాయి.

హార్మూజ్ జలసంధి మార్గం మూతబడిన నేపథ్యంలో సరుకు రవాణా కోసం భారత్ తదితర దేశాల నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే షిప్‌లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ మీదుగా వేల కిలోమీటర్లు 10-14 రోజులు అదనంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో ఇంధన వాడకం పెరిగి రవాణా వ్యయమేగాక, బీమా ఖర్చులు ఎగిసి ఆయా సరుకుల ధరలు ప్రభావితం కావాల్సి వస్తున్నది. ఒక్కో షిప్‌నకు ఇంధన ఖర్చు సుమారు 1 మిలియన్ డాలర్లు పెరుగుతున్నదని అంచనా. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణాను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నది. అలాగే ఈ యుద్ధం కొనసాగితే భారత్, చైనా సహా ఆయా దేశాల ఎగుమతులు దెబ్బతినడం ఖాయమన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సహా యూఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ మరికొన్ని దేశాలు తమ గగనతలాలను మూసేశాయి. దీంతో దూరపు మార్గాల్లో వెళ్లడంతో కార్గో రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నది.

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం భారతదేశ ఇంధనం భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. దీనివల్ల ఎల్పీజీ కొరత, గ్యాస్ ధరల పెరుగుదల, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న అవాంతరాల కారణంగా పారిశ్రామిక మందగమనం వంటి సమస్యలు తలెత్తాయి. భారతదేశ ఎల్పీజీ దిగుమతులలో 80Ð90 శాతం ఈ ప్రాంతం గుండానే జరుగుతాయి. వాణిజ్య ఎల్పీజీ డెలివరీలలో జాప్యం 2 నుండి 8 రోజులకు పెరగడంతో రెస్టారెంట్లు, పరిశ్రమలు ప్రభావితమవుతున్నాయి. గృహ వినియోగ ఎల్పీజీ ధరలు రూ.60 మేర, వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.114-రూ.115 మేర పెరిగాయి. అంతేకాకుండా, ఈ యుద్ధం ద్రవ్యోల్బణాన్ని పెంచే, కరెంట్ అకౌంట్ లోటును విస్తృతం చేసే, పెరిగిన సబ్సిడీల కారణంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం మోపే ప్రమాదం ఉంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ సంఘర్షణ భారతదేశపు ఇంధన భద్రత, ఎరువుల సరఫరా, వాణిజ్యానికి ముప్పుగా పరిణమించింది. ఎందుకంటే భారతదేశం గల్ఫ్ చమురు, ఎలఎన్‌జి, ఎరువుల ముడిసరుకులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. మనం గల్ఫ్ నుండి 88 శాతం చమురు, 91 శాతం ఎల్‌పిజిని దిగుమతి చేసుకుంటున్నందున, చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు మించి పెరిగాయి. ఇలాంటి తరుణంలో, ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం దేశ ఇంధన భద్రత, సరఫరా గొలుసులు, వాణిజ్య స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది.

ప‌శ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయనుందని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, యాక్సిస్ కాపిటల్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీలకంఠ మిశ్రా హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తోన్న ఉద్రిక్తతలు మరో నాలుగు వారాల పాటు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్త తీవ్రమైన మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు 7 శాతం మేర అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్, వాహన తయారీ రంగాలు కీలక ముడిసరుకుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక నష్టం విపరీతంగా పెరిగి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల నుండి ఒత్తిడి పెరిగినప్పుడే యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం వల్ల కలిగే ఆర్థిక భారంతో అన్ని దేశాలు నష్టపోతాయని హెచ్చరించారు.

ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, దేశాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. ఈ సంఘర్షణలు గ్లోబల్ ఎకానమీని, ఎనర్ౙీ మార్కెట్‌లను, ఫుడ్ సప్లై చైన్‌లను, షిప్పింగ్ రూట్‌లను దెబ్బతీస్తున్నాయి. ఈ యుద్ధాల వల్ల దేశాలు భారీ నష్టాలు చెందుతున్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, సూడాన్, మయన్మార్ వంటివి డైరెక్ట్ ధ్వంసంతో బాధపడుతున్నాయి. జిడిపి తగ్గుదల, ఇన్‌ప్లేషన్, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ప్రజలపై భారం: రుణాలు, గాయాలు, శరణార్థులు, ఆహార-ఔషధ లేమి, విద్య-ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయి. యూరప్ ఎనర్జీ క్రైసిస్‌తో బాధపడుతోంది. గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్ అయింది షిప్పింగ్ రేట్లు పెరిగాయి. ఫుడ్ ఎక్స్ పోర్ట్ స్టక్ అయ్యాయి. మొత్తంగా ఈ యుద్ధాలు ఎవరికీ నిజమైన లాభం చేకూర్చవు. భీకరంగా కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం యొక్క ముగింపు ఆనవాళ్లు కనుచూపుమేరలో కనబడడం లేదు. యుద్ధ పరిణామాలు, ఇరాన్ ప్రతిఘటన సామర్థ్యాలను ముందుగా అంచనా వేయలేక ట్రంప్ ప్రభుత్వం చేజేతులా గందరగోళాన్ని సృష్టించుకొని, తన దేశంతో సహా ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. దీర్ఘకాలిక నష్టాలు, ప్రాణనష్టం, ఆర్థిక పతనం, అస్థిరత, ఆస్తుల నష్టం, అధిక ద్రవ్యోల్బణం, ఈ యుద్ధాలు దేశాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కుంగదీస్తున్నాయి.

Leave a Reply