షెడ్యూల్డ్ తెగలు (అనుసూచిత తెగలు- ఆదివాసులు) ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006, (దీనిని సాధారణంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తారు) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 2న కేసున విచారణ చేపట్టనుంది.
షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులను అటవీ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో తరలించడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్టపరమైన అడ్డంకులు, పర్యావరణ విధ్వంసం పెరుగుతున్న ముప్పులు, ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మరోవైపు, అటవీ హక్కుల చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పైన ప్రశ్నలు లేవనెత్తుతూ, అనేక ప్రభుత్వేతర సంస్థలు, అటవీ శాఖ కుమ్మక్కయి అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని, దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
దేశవ్యాప్తంగా ఆదివాసులు, ఇతర అటవీ ఆధారిత సముదాయాలు చేసిన దీర్ఘకాల పోరాటాల ఫలితంగా వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం2006లో పార్లమెంట్ ఆమోదించిన అటవీ హక్కుల చట్టం. ఈ చట్టం అటవీ ఆధారిత సముదాయాలకు, వ్యవస్థీకృతంగా దోపిడీకి గురవుతున్న, తమ స్వంత భూముల నుంచి బహిష్కృతులై, వలసరాజ్యాల కాలం నుండి స్వాతంత్ర్యం తర్వాత కూడా అటవీ హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుండి వెలివేతకు గురైన సముదాయాలకు ఒక న్యాయపరమైన రక్షణగా నిలుస్తుంది.
ఈ చట్టం దాని ప్రవేశికలోనే “అటవీ నివాసులైన షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకు జరిగిన చారిత్రాత్మక అన్యాయాన్ని” ప్రస్తావిస్తుంది. వారిని “అటవీ పర్యావరణ వ్యవస్థల మనుగడ, స్థిరత్వానికి సమగ్రమైనది”గా నిర్ధారిస్తుంది. తరతరాలుగా నివసిస్తూ, ఉపయోగిస్తూ, నిర్వహిస్తున్న అటవీ నివాసులకు ఉన్న అటవీ భూములు, వనరులపైన ముందస్తు హక్కులను ఈ చట్టం గుర్తిస్తుంది. అన్ని రకాల అటవీ భూములపై వ్యక్తిగత, సాముదాయక యాజమాన్యాన్ని సురక్షితంగా ఉంచుతూ, అటవీ హక్కుల చట్టం అటవీ పరిపాలన, నిర్వహణపై నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామసభలకు అధికారం ఇస్తుంది. అటవీ భూమి బదిలీపై తనిఖీలు, సుస్థిరతను నిర్ధారిస్తుంది.
భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆదివాసీ, అటవీ ఆధారిత జనాభా కలిగిన దేశాలలో ఒకటి; భారతదేశంలోని ఈ సముదాయాలు అడవులను నిర్వహించడంలో, సంరక్షించడంలో సుదీర్ఘమైన లిఖిత చరిత్రను కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ చట్టం లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చగల; అదే సమయంలో పర్యావరణ, జీవనోపాధి భద్రత – ఈ రెండింటినీ బలోపేతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇటీవల పర్యావరణ పరిరక్షణ చట్టాలలో సడలింపు దేశవ్యాప్తంగా అడవులలో వనరుల దోపిడీ, భారీ నిర్మాణ ప్రాజెక్టులు పెరగడానికి దారితీసింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటవీ హక్కుల చట్టాన్ని సవాలు చేసే పిటిషన్లు ఇప్పటికీ పాత వలసవాద కథనానికి కట్టుబడి ఉన్నాయి, ఇది సమాజాలను “ఆక్రమణదారులు”గా చిత్రీకరించడం ద్వారానూ ఆదివాసుల నిర్వాసిత్వాన్ని చట్టబద్ధం చేయడం ద్వారానూ పరిరక్షణకు వ్యతిరేకంగా వారిని నిలబెడుతుంది. వాస్తవానికి ఈ చట్టం సముదాయాలు, వనరులు, అడవుల ప్రయోజనాలను ఒకచోట చేర్చి రక్షిస్తుంది. అందువల్ల భారతదేశ పరిరక్షణ, వాతావరణ విధాన రూపకల్పనలో ఈ చట్టం కీలక పాత్రను పోషిస్తుంది.
భారతదేశం కూడా సంతకం చేసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి- పార్టీల సమావేశం), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్), సిబిడి, గ్లోబల్ బయోడైవర్సిటీ చట్రంలో ప్రపంచ విధాన చర్చలు; అడవులు, జీవవైవిధ్య నిర్వహణ, పాలన, రక్షణ కోసం ఆదివాసీ తదితర స్థానిక సముదాయాలకు ఉన్న సాంప్రదాయక హక్కులను, జ్ఞానాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి.
2007లో ఈ చట్టం అమలులోకి వచ్చినప్పుడు, చట్టానికి వ్యతిరేకంగా విశ్రాంత అటవీ అధికారులు, వన్యప్రాణి సంబంధిత స్వచ్ఛంద సంస్థలు, హైకోర్టులలో, సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేసారు. మార్చి 2008లో వైల్డ్ లైఫ్ ఫస్ట్, నేచర్ కన్జర్వేషన్ సొసైటీ, టైగర్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ట్రస్ట్, ఇతరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ వీటిలో ఒకటి. ఈ చట్టం పిటిషనర్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని, పరిరక్షణ లక్ష్యాలకు, పార్లమెంటు శాసన సామర్థ్యానికి విరుద్ధమని ఆ చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసారు.
2015 జనవరిలో, ఈ కేసులను వైల్డ్ లైఫ్ ఫస్ట్, ఇతరులు v యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరులు (WP(C) నం. 109/2008)గా కలిపి విచారణ కోసం సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. 2014లో, పిటిషనర్లు అటవీ హక్కుల చట్టం అమలు ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, “ఆక్రమణదారులకు” ప్రయోజనకరంగా ఉందని ప్రకటిస్తూ, ఈ చట్టం కింద అవసరమైన హక్కులను పరిష్కరించకుండా రక్షిత ప్రాంతాల నుండి అటవీ నివాస సముదాయాలకు “స్వచ్ఛంద పునరావాసం” కల్పించాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తును దాఖలు చేశారు.
2016లో, అటవీ హక్కుల చట్టం కింద ఇప్పటివరకు భూ హక్కు తిరస్కారానికి గురైన కుటుంబాలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించడానికి ఎందుకని చర్యలు చేపట్టలేదని అడుగుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ 13/02/2019న, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది; తిరస్కరణకు గురైన హక్కుదారులను తొలగించడానికి తీసుకున్న చర్యల గురించి కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది; ఈ చర్యవల్ల సుమారు 16 లక్షలకు పైగా కుటుంబాలు తమ భూముల నుండి బేదఖలు అవుతాయి. సముదాయం నుండి వచ్చిన నిరసనలు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తక్షణ జోక్యం తర్వాత, సుప్రీంకోర్టు 28/02/2019న తన తొలగింపు ఉత్తర్వుపైన స్టే విధించింది. అటవీ హక్కుల చట్టం కింద హక్కు దావాలను తిరస్కరించేటప్పుడు అనుసరించిన చట్టపరమైన విధానాలను బహిరంగపరచాలని; ఆరోపించిన ఆక్రమణలపై ఉపగ్రహ సర్వేను నిర్వహించాలని కూడా కోర్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులను కోరింది.
సెప్టెంబర్ 2019 నాటికి, ఇద్దరు ప్రధాన పిటిషనర్లు, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, ఈ కేసు నుండి తప్పుకున్నాయి; కోర్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను ఒక పార్టీగా చేర్చింది.
ఈ కేసు 2025న ఏప్రిల్ 2న మళ్ళీ విచారణకు రానుంది; కానీ బేదఖలుకు సంబంధించిన అభ్యర్థనలు, కారణాలు చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేయాలన్న ప్రాథమిక ప్రశ్న నుండి దృష్టిని మరల్చాయి. తిరస్కారానికి గురైన అటవీ హక్కు దావాల రాష్ట్ర స్థాయి ప్రక్రియ, సమీక్ష ఇప్పటికీ అసంపూర్ణంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో తగిన ప్రక్రియల ఉల్లంఘన జరిగింది.
ఆందోళన చెందాల్సిన కొన్ని ప్రధాన అంశాలు- తప్పుడు వివరణలు:
■ అటవీ హక్కుల చట్టం అమలులో ఎదురైన సవాళ్లకు అనేక తీవ్రమైన కారణాలు ఉన్నాయి. రాజకీయ సంకల్పం లేకపోవడం; అటవీ పరిపాలనాయంత్రాంగం ఆ చట్టాన్ని తన నియంత్రణకు ముప్పుగా భావించడం; అందులో సూచించిన పర్యావరణ రక్షణలను దాటవేయడానికి ప్రయత్నిస్తున్న కార్పొరేట్ ప్రయోజనాలు మొదలైనవి. అటవీ హక్కుల చట్టం కొత్తగా హక్కులను ఇవ్వదు; కేవలం ఉన్న హక్కులను గుర్తించి నమోదు చేస్తుంది. హక్కు దావా తిరస్కరణకు గురైతే ఒక వ్యక్తిని లేదా కుటుంబాన్ని వారు అనుభవిస్తున్న భూమి నుండి వెళ్ళగొట్టడానికి చట్టంలో ఎటువంటి నిబంధన లేదు.
సాక్ష్యాలు సూచిస్తున్న ప్రకారం, తరచుగా భూ హక్కు దావాలు తిరస్కారానికి గురైనప్పుడు, కుటుంబాలకు తెలియజేయరు లేదా కారణాలను చెప్పరు, లేదా వారి దావాలో ఉన్న విస్తీర్ణం కంటే చాలా తక్కువ భూమిని ఆమోదిస్తారు. దీనితో పాటు, అటవీ హక్కుల చట్టంలోని అనేక అంశాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా సూచిస్తున్నారు. ఉదాహరణకు, ఇటీవల క్లెయిమ్‌ల నిర్ణయాలను మూల్యాంకనం చేయడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించాలని పిలుపులు వచ్చాయి, కానీ ఉపగ్రహ చిత్రాలను వాదనలను నిరూపించడానికి సహాయక సాక్ష్యంగా మాత్రమే అనుమతిస్తారు, వాటిని తిరస్కరించడానికి కాదు.
■ అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్లు పార్లమెంటరీ అధికారాలతో పాటు గ్రామసభ అధికారాలను కూడా బలహీనపరుస్తాయి. గ్రామసభ అనేది 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినన ఒక చట్టబద్ధమైన వ్యవస్థ; ఇది భారత ప్రజాస్వామ్యానికి, పెసా (పంచాయతీ షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ చట్టం)-1996 వంటి చట్టపరమైన చట్రాలకు ప్రాథమిక పునాదిని ఏర్పరుస్తుంది. అటవీ హక్కుల చట్టంలో, గ్రామసభలు పాలనాపర నిర్ణయం తీసుకోవడంలో జెండర్, యువత చేరికను సమర్థిస్తాయి; సహభాగిత్వ, సమానత్వం ఆధారిత నిర్ణయం తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.
■ అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (ఒటిఎఫ్‌డి)ఒకరిపై ఒకరు పోటీ పడేలా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ, అటవీ హక్కుల చట్టం కోసం జరిగిన ఉద్యమం ప్రారంభం నుండే, అనేక మంది పశువుల కాపరులు, అర్ధ-సంచార జాతులు, ఆదిమ తెగలు, దళితులు డీనోటిఫైడ్ తెగలు వంటి విభిన్న సముదాయాలను చేర్చవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది, వీరు తరతరాలుగా అడవులపై ఆధారపడి ఉన్నప్పటికీ క్రమంగా భూమి, అటవీ ఉత్పత్తుల ప్రాప్యత హక్కులను కోల్పోతున్నారు. కొన్ని సముదాయాలను రాష్ట్ర సరిహద్దుల్లో వేర్వేరు స్థాయిలలో ఉంచారు, ఇది షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు – రెండు సముదాయాలనూ చేర్చడంలోని ప్రాముఖ్యతను మరింత నొక్కి చెబుతుంది.
■ దేశవ్యాప్తంగా ఉన్న సాక్ష్యాల ప్రకారం, “స్వచ్ఛందంగా” ముద్ర వేయబడిన రక్షిత ప్రాంతాల నుండి ఆదివాసులను తరలించే పునరావాస ప్రాజెక్టులు తరచుగా దౌర్జన్యంగా జరుగుతాయి; హింస, బెదిరింపులు, ఒత్తిడి లేదా ముందుగా ఉన్న హక్కులను తిరస్కరించడం, అణగదొక్కడం ద్వారా సాధిస్తారు. “స్వచ్ఛంద పునరావాసం” అనే ఆలోచన ద్వారా తొలగింపుల కోసం పిలుపులను సమర్థించినప్పుడు ఈ మానవ హక్కుల సంబంధిత ఆందోళన కలిగించే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
■ ఇటీవలి సంవత్సరాలలో, రక్షిత ప్రాంతాల నుండి అటవీ నివాసులను పునరావాసం కల్పించే ప్రాజెక్టులలో జరిగిన అటవీ హక్కుల చట్టంలోని నిబంధనలకు సంబంధించి జరిగిన ఉల్లంఘనలకు సంబంధించి ట్రైబల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓటిఎ)అనేక ప్రకటనలు జారీ చేసింది. 2024లో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘2024 ప్రధానమంత్రి జుగా యోజన’ను ప్రారంభించింది;ఇది అటవీ హక్కుల గుర్తింపును సంతృప్తిపరచడం; వేగవంతం చేయడం, ఆదివాసీ సముదాయాలకు సాధికారత కల్పించడం; వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాజ్యం చేస్తున్న ఈ వాదనలు చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను, శక్తిని మరింత బలోపేతం చేస్తాయి.
■ అటవీ హక్కుల చట్టం దిగువ స్థాయి పాలన, పారదర్శక మూడు-స్థాయి దావాల ప్రక్రియను; ఇది ఆదివాసీ, ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల అధికారాలను అలాగే ఉంచుతుంది. అటవీ నివాసుల హక్కులను పరిరక్షించే పెసా-1996, షెడ్యూల్డ్ కులాలు- షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం 1989 వంటి ఇతర చట్టపరమైన చట్రాలతో పాటుకలిపి ఈ చట్టాన్ని చదవాలి – ఇవి అక్రమ నిర్బంధాన్ని, అక్రమ బహిష్కరణను, అటవీ హక్కులను అనుభవించడంలో జోక్యం చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తాయి. ఈ సముదాయాలు, కులతత్వ పోలీసింగ్ వ్యూహాలు, తప్పుడు ఆరోపణలు, “ఆక్రమణదారులు” అనే అవమానకరమైన ముద్రలు, ప్రతీకార హింసకు లక్ష్యంగా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి , రాజ్యాంగ నైతికత దృష్టికోణంలో అటవీ హక్కుల చట్టానికి వస్తున్న వ్యతిరేకతను లేదా బలహీనపడటాన్ని పరిశీలించడం చాలా అవసరం.
జరగబోయే సుప్రీంకోర్టు విచారణలలో పెద్ద ఎత్తున తొలగింపుల ముప్పు, సరైన అమలుకు వ్యవస్థాగత అడ్డంకులు అవరోధంగా ఉండడంవల్ల , అటవీ హక్కుల చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించడంలో వైఫల్యం అటవీ హక్కుల చట్టం పరిష్కరించడానికి, సరిదిద్దడానికి రూపొందించినన చారిత్రక అన్యాయాలను పొడిగించే ప్రమాదం ఉంది.
విశద్ కుమార్ రిపోర్టు
మార్చి 25, 2025
తెలుగు: పద్మ కొండిపర్తి
https://janchowk.com/zaruri-khabar/the-supreme-court-will-hear-the-issue-of-the-threat-looming-over-the-forest-rights-act-and-the-question-of-its-constitutionality-on april2/?fbclid=IwY2xjawJRlbhleHRuA2FlbQIxMQABHZ6Y61XbTsp55rCbnof5PpcImySV58dxoQVrxMGR_hlcAcNDdRNkACmFBA_aem_C12kgfnxJBEbymaAV7P5Ig&sfnsn=wiwspmo