అనగనగా ఒక ఏనుగు ఉండేదట. అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేదట. ఒకరోజు అది నదీ తీరం వెంబడి ఆహారం వెదుక్కుంటూ ఒక గ్రామంలోకి ప్రవేశించిందట. గ్రామంలోకి వచ్చిందే గాని అది ఎవరి జోలికి రాలేదట. కానీ కొందరు మనుషులే ఏమనుకున్నారో ఏమో.. పేలుడు పదార్థాలు పెట్టిన పైనాపిల్ పండును దానికి పెట్టారట. ఆ ఏనుగు దాన్ని నోట్లో వేసుకోగానే అది పేలిపోయిందట. రక్తమోడుతున్న గాయంతో అది ఊరు విడిచి పారిపోయిందట. కొద్ది రోజులకు అది చచ్చిపోయిందట. అప్పుడు అది గర్భంతో ఉన్నదట. అందువల్ల కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయిందట. ఇంత ఘోరానికి పాల్పడిన ఆ గ్రామానికి భయంకరమైన శాపం తగిలిందట. ఫలితంగానే భీకరమైన వర్షం కురిసి, వరదొచ్చి, కొండ చరియాలు విరిగిపడి ఆ ఊరు నామరూపాల్లేకుండా నాశనమయ్యిందట.

కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలో జులై 29 అర్ధరాత్రి కొండచరియాలు విరిగిపడి ఆరు గ్రామాలలోని వందలాది మంది సజీవ సమాధి అయినప్పుడు వాట్సప్ యూనివర్సిటీ ప్రచారం చేసిన కథ ఇది. రాష్ట్రం నలుమూలల నుండి, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ప్రజలు స్పందించి మానవత్వాన్ని చాటుతున్న సమయంలో ‘వాళ్ళు పాపం చేశారు కాబట్టే అనుభవిస్తున్నారు’ అని వికృతానందనం పొందిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారంటే నిలువెల్లా జలదరిస్తుంది కదా. బీఫ్ తినేవాళ్ళని, అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేశారని, అందుకే దేవుని శాపం తగిలిందని.. క్రూరమైన పరిహాసంతో ఇంతటి విషాద సమయంలో కూడా విద్వేషాన్ని ప్రచారం చెయడం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందో లేదో. ఒక్క ఇజ్రాయెల్ తప్ప ఇంకేమీ గుర్తుకురాదు.

ఏనుగు చచ్చిపోయిన మాట నిజమే కానీ అది వయనాడ్ కాదు మల్లపురం జిల్లాలో అని, అది జరిగి నాలుగేళ్ళు అయిందని లక్షలాది మంది అబద్ధపు, విద్వేషపు విషంలో మునిగాక ఓ మూల నుండి వాస్తవం పీలగా పలికింది. అయితే ఈ పిట్ట కథల మాటున దాచేస్తే దాగని వాస్తవం ఒకటుంది. ఆ కథలో ఒక ఏనుగు చనిపోయింది. కానీ వాస్తవానికి ఏనుగులు వేలాదిగా చనిపోయాయి. మరెన్నో వన్య ప్రాణులు లక్షలాదిగా చనిపోయి ఉంటాయి. ఒక్క ఏనుగును చంపడానికి పేలుడు పదార్థం వాడారో లేదో గానీ కోట్లాది జీవులకు ఆవాసమైన ఆడవుల్ని, కొండల్ని బాంబులతో పేల్చివేశారు. పశ్చిమ కనుమల విధ్వంసంలో చనిపోయిన ఏనుగుల శాపమే తగిలితే ఈ రాజ్యాన్నేలేవాళ్ళు ఒక్కరూ మిగలరు. ఆరు రాష్టలలో (గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు) విస్తరించిన పశ్చిమ కనుమలు అచ్చంగా ఏనుగుల ఆవాసాలు. ఆసియా ఖండంలోని ఏనుగుల్లో 25 శాతం ఇక్కడే నివసిస్తాయి. ఒక్క ఏనుగులేమిటి, ఇండియాలో 30 శాతం చెట్టు చేమలు, వన్య ప్రాణులు ఇక్కడే ఉంటాయి. దక్షిణ భారతదేశ నదులన్నీ దాదాపు ఇక్కడే పుడతాయి. ప్రపంచంలోనే అరుదైన జీవవైవిధ్యమున్న ప్రాంతం ఇది. జీవవైవిధ్యంలో ప్రపంచం గురించిన అత్యంత అరుదైన ‘హాట్ స్పాట్’ ఇది. సుసంపన్నమైన ఈ పర్వత శ్రేణులు దేశానికే గర్వకారణం. ఇది పర్యావరణపరంగా అతి సున్నితమైన ప్రాంతం కూడా. ఈ పశ్చిమ కనుమల చెంత, మలబారు తీరం వెంబడి పరచుకున్న కేరళ అద్బుత సౌందర్యరాశి. ఈ ప్రకృతి అందాలను చూసి పరవసించే దీన్ని దేవ భూమి (god’s own country) అన్నారు. ఈ చిన్న రాష్ట్రంలో నలభై నదులున్నాయి. బంగారు పంటలు పండే భూములున్నాయి. ఇక్కడి భూముల్లో పండే సుగంధ ద్రవ్యాలు ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలనే శాసించాయి.

ఇటువంటి పశ్చిమ కనుమలు దారుణమైన విధ్వంసానికి గురయ్యాయి. వయనాడు విలాపం శాపమే. అది ప్రకృతి శాపం. కానీ నేరం చేసిన వాళ్ళు వేరు. దానిని అనుభవిస్తున్నవాళ్ళు వేరు. 

ప్రకృతి వైపరిత్యం వెనక ‘మానవ’ తప్పిదం గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. కానీ ఇది ‘మానవ’ తప్పిదం కాదు. ఎందుకంటే పశ్చిమ కనుమల్ని కాపాడండి అంటున్న మానవులు అక్కడున్నారు. వలస కాలంలో మొదలైన కాఫీ, టీ, రబ్బరు ప్లాంటేషన్లు, టూరిస్టు కేంద్రాలు నేడు మరింత విస్తరించి క్వారీలు, గనుల తవ్వకాల దాకా సమస్త విధ్వంసక చర్యలు చేస్తున్నది మానవుల రూపంలో ఉన్న పెట్టుబడిదారులు. కాబట్టి ప్రకృతి విలయం వెనక ఉన్నది మానవ తప్పిదం కాదు. కార్పొరేట్ పెట్టుబడి దురాశ.

కొన్ని దశాబ్దాల పాటు నడిచిన సేవ్ వెస్ట్రన్ ఘాట్స్ (పశ్చిమ కనుమల్ని కాపాడండి) ఉద్యమం ఫలితంగా 2010 లో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పర్యావరణ విధ్వంసాన్ని ఆపేందుకు చాలా సూచనలు చేసింది కానీ దానిని సిపియం నుండి కాంగ్రెస్, బిజెపి దాకా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. కారణం అది అడవులలో పెట్టుబడులను అడ్డుకుంటున్నదని, అందువల్ల అది అభవృద్ధికి వ్యతిరేకం అని. ఇంకేముంది! గ్రానైట్ మాఫియా చెలరేగిపోయింది. 2018 లో పది జిల్లాలను ముంచెత్తిన వరద వచ్చినప్పుడు కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పుడైనా గాడ్గిల్ కమిటీ సిఫారసులు అమలు చేయండని డిమాండ్ ముందుకొచ్చింది. అది జరగలేదు. కొండలని మరింతగా తొలిచేశారు. మునుపటికన్నా పెద్ద ఎత్తున ఇప్పుడు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ మృత్యు విలయం మీడియాలో అందరూ చూసే ఉంటారు.

మనకొక పర్యావరణ శాఖ ఉందని, దానికొక మంత్రి ఉన్నాడని చాలా మందికి తెలీదు. ఈ విలయం తర్వాత సదరు కేంద్ర మంత్రి ప్రత్యక్షమయ్యారు. కమ్యూనిస్టు ప్రభుత్వ పాలనలోని ఆ రాష్ట్రంలో అక్రమ గనుల తవ్వకాలు, భూకబ్జాలు మితిమీరి జరిగినందువల్లే పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం విధ్వంసం అయిందని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం హడావిడిగా పశ్చిమ కనుమల్లోని 56,800 కి.మీ.ల ప్రాంతాన్ని ‘పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం’గా (ఈఎస్ఏ)గా ప్రకటిస్తూ జూలై 31న ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మైనింగ్‌, క్వారీయింగ్‌ నిషేధిస్తూ, కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు కూడా చేపట్టవద్దని అందులో చెప్పింది.

ఇంత కనువిప్పు కలిగిన ప్రభుత్వాన్ని మధ్య భారతదేశంలోని అడవుల్లో కూడా మైనింగ్ ఆపేయమని అడగొచ్చు కదా. ‘పర్యావరణపరంగా సున్నితమైన’ అడవులను కాపాడమని ఆదివాసులు ఉద్యమిస్తున్నారు. వాళ్ళ మీద పోలీసు, మిలిటరీ బలగాల దాడులు నిలిపేసి చర్చలు జరపొచ్చు. ప్రకృతిని ఎలా కాపాడాలో, ఆదివాసుల అభివృద్ధి కోసం  ఏం చేయాలో స్థానికులను కూడా కలుపుకుని కమిటీ వేయొచ్చు కదా. అదేమీ చేయకుండా అక్కడ ప్రజలపై యుద్ధం చేస్తున్నారెందుకు? లక్షల కోట్లు ఖర్చుపెట్టి అధునాతన ఆయుధాలతో అంత మారణహోమం ఎందుకు?

One thought on “అనగనగా ఒక ఏనుగు

  1. MAA SATYAM
    అనగనగా ఒక ఏనుగు-
    పి వరలక్ష్మి గారు రాసిన సంపాదకీయం
    మానవ స్వభావాన్ని వాస్తవికతతో కళాత్మకతంగా మిళితం చేసి
    పర్యావరణ పరిరక్షణలో భాగంగా
    అడవులను కాపాడమని ఆదివాసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమిస్తున్న ఆదివాసులకు సంఘీభావంగా సంపాదకీయ రూపంలో తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని వ్యక్తీకరిస్తూ, వస్తు రూప సమన్వితంగా సాగుతు పాఠకులలో ప్రశ్నలు రేకెత్తిస్తుంది..అత్యంత సరళంగా సూటిగా ప్రశ్నిస్తూ సాంఘిక న్యాయాలను, మతాలను, పరిశీలించి తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రజలందరికీ, పసి పిల్లలకు సైతం అర్ధమయ్యే విధంగా సంపాదకీయం ఆలోచింపచేస్తోంది.
    మీ
    మా సత్యం

Leave a Reply