ఇంకో అయిదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బిజెపి ప్రభుత్వం భారతదేశ క్రిమినల్ చట్టాలను మారుస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ చేసుకుంది. అప్పుడు 143 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదు. ప్రజా జీవితాన్ని ఎంతగానో శాసించే ఈ చట్టాల కోసం ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోలేదు.
ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాత ప్రభుత్వానికి మూడొంతుల మెజారిటీ లేదు. కనుక ప్రతిపక్ష సభ్యుల మద్దతు లేకుండా చట్టాలు చేయలేదు. అయితే దానికి మెజారిటీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మూడు నేర చట్టాలు జులై 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ చట్టాలు చేసిన పాత ప్రభుత్వం ఇప్పుడు లేదు కానీ అది పోతూపోతూ ఉన్న కాసింత ప్రజాస్వామ్యం పీక నులిమేసింది. ప్రజల ప్రాథమిక హక్కులు పార్లమెంటులో నంబర్ గేమ్ అయిపోయాయి. అగ్రకుల సంపన్న వర్గ ముఠా ఒకటి దేశ పాలనా వ్యవహారాలను చూడడానికి అయిదేళ్లు అవకాశం చేజిక్కించుకుంటే వందల ఏళ్ల ప్రజా పోరాటాలు సాధించుకున్న హక్కులను చిటికెలో రద్దు చేయగలవు.
సంఘ పరివార్ మూడు లక్ష్యాలను ప్రకటించింది. కశ్మీర్‌కున్న ప్రత్యేక అధికారాలను రద్దు చేయడం, మసీదును కూలగొట్టి మందిరం నిర్మించడం, భిన్న సంస్కృతులు, మతాలకు అతీతంగా ఒకే పౌరస్మృతిని (మనుస్మృతిని) అందరికీ వర్తింపజేయడం (యూనిఫాం సివిల్ కోడ్). అది ముగ్గురు శత్రువులను పేర్కొన్నది (కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు). మూడు కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. తాజా మూడు నేర చట్టాలను తీసుకొచ్చింది. మూడు కలిసొచ్చిందేమో తెలీదు మరి. ముప్పేట దాడి ఇప్పుడు న్యాయవ్యవస్థ మీద ముమ్మరం కానుంది.
గత పదేళ్లుగా ప్రజల సామాజిక ఆర్థిక జీవితం మీద అది చేసిన దాడి వల్ల అనేక రూపాల్లో నిరసనను ఎదుర్కొన్నది. దళితులు, మైనార్టీలు, విద్యార్థులు, రైతులు, ఆదివాసులు వివిధ రూపాల్లో ఉద్యమించారు. రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు నియంతృత్వానికి వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపించారు. వీళ్లందరినీ అణిచివేయడానికి ప్రభుత్వం చేయవలసిందంతా చేసింది. అయినా నానాటికీ దుర్భరమవుతున్న జీవన పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు మరింత బలపడే అవకాశమే ఉంది. కాబట్టి పాత నిరంకుశ చట్టాలు, తమ గుప్పిట్లో ఉన్న కొంత మంది న్యాయమూర్తులు, విచారణ సంస్థలు వీటిని అణగదొక్కడానికి సరిపోవనుకున్నారు. నేర, న్యాయ చట్టాలను మొత్తంగా తిరగరాశారు.
మన దేశంలో డబ్బు పరపతి ఉన్నవాళ్లు ఏ నేరం చేసినా తప్పించుకునే అవకాశం ఉంటుంది. సమాజంలో అట్టడుగున ఉన్న సమూహాలు చట్టం చేతిలో అన్యాయంగా బలవుతుంటారు. కొత్త చట్టాలు ఈ పరిస్థితిని బాగుచేయకపోగా మరింత దిగజారుస్తున్నాయి. అవి పోలీసులకు అపరిమిత అధికారాలు ఇచ్చాయి. నేరం జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్ రాయాల్సిన పని లేదట. పోలీసులు ప్రాథమిక విచారణ చేసాక కేసు పెట్టొచ్చట. ఎఫ్‌ఐఆర్ ఆలస్యమయ్యే కొద్దీ చాలా మార్పులు జరుగుతాయి. డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు సులభంగా తప్పించుకోడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా పోలీసుల విచక్షణ మీద ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. అలాంటి స్థితిలో సాధారణంగా బలహీన వర్గాలవారే బలవుతారు.
విచారణ క్రమంలో ఎప్పుడైనా పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకోవచ్చు. పాత చట్టాల ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లో విచారణ పూర్తి కాకపోతే న్యాయమూర్తి ముందు నిందితులను ప్రవేశపెట్టి ఏడు రోజుల వరకు కస్టడీకి అడగొచ్చు. దానికి కూడా చాలా నిబంధనలున్నాయి. ఎందుకంటే పోలీసులు చిత్రహింసలు పెట్టి బలవంతంగా నేరం అంగీకరింపజేయొచ్చు. ఎన్నో నిబంధనలున్నా న్యాయం అపహాస్యమవుతోంది. ఇక పోలీసులకు 60 నుండి 90 రోజుల వరకు నేరస్తులను కస్టడీలో ఉంచుకునే అధికారం ఉంటే ఏం జరుగుతుందో ఊహించొచ్చు. సాధారణంగా పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్న నేరాన్ని కోర్టులు అంగీకరించవు. పోలీసులు బలవంతంగా ఒప్పించొచ్చు కదా, అందువల్ల. కానీ ఇక మీదట పోలీసు సాక్ష్యం కూడా చెల్లుతుంది.
పోలీసులకు పరిధులు కూడా ఉండవు. ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా ఏ స్థాయి పోలీసు అధికారి అయినా ఎవరినైనా విచారించొచ్చు. కోర్టు ఆర్డర్ లేకుండా సోదా చేయొచ్చు. ఎలెక్ట్రానిక్ పరికరాల మీద నిఘా పెట్టొచ్చు. కావాలంటే వాటిని ఎత్తుకుపోవచ్చు.
మరో ముఖ్యమైన విషయం విచారణ సా…గుతున్నంత కాలం బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. ఇప్పటిదాకా ఇది ‘అరుదైన కేసుల్లో’ ఉండేది. ఇక మీదట జైలు సాధారణం, బెయిలు అసాధారణం. ఇప్పటి దాకా మనం యుఎపిఎ (ఊపా) వంటి కొన్ని నిరంకుశ చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ కొత్త న్యాయ చట్టాలు నిందితులకు యుఎపిఎలో ఉన్న కనీస రక్షణను కూడా తీసేసాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఈ కొత్త చట్టాలకు నోరు తిరగని సంస్కృత పేర్లు పెట్టారు. ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023’, ‘భారతీయ న్యాయ సంహిత, 2023’, భారతీయ సాక్ష్యా అధినియం, 2023’. చచ్చిపోయిన సంస్కృత భాషలో కాలం తీరిన అనాగరిక రాచరిక చట్టాలు ప్రవేశపెట్టారు. కానీ పైకి మాత్రం వలసవాద చట్టాలను రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ‘రాజద్రోహ’ చట్టాన్ని సుప్రీం కోర్టు రద్దు చేస్తే ఇప్పుడు దాని స్థానంలో ‘దేశద్రోహ’ చట్టం వచ్చింది. ఇప్పుడు దేశమంటే మోడీ కదా. ఈ చట్టం దేనిని నేరమంటుందో ఊహించొచ్చు. శాంతి భద్రతలను, దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్చలు, మాటలు, సంజ్ఞలు, ఆలోచనలు ఏవైనా దేశద్రోహం కిందికి వస్తాయి. ఎలాంటి మాటలు, ఆలోచనలు శాంతి భద్రతలను, దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటే అది పోలీసుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ముస్లింలు శత్రువులు అని హిందూ సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడితే అది నేరం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడేవాళ్లే అధికారంలో ఉన్నారు. ఇప్పటిదాకా అమలులో ఉన్న న్యాయసూత్రం అదే కదా.
అయితే దేశద్రోహ చర్యల జాబితాలో ఇప్పుడొక విచిత్రమైన విషయం ఉంది. అది ‘దేశ ఆర్థిక భద్రతకు’ ముప్పు వాటిల్లేలా చేయడం. నిజానికి ఇందులో లోతైన అర్థం ఉంది. కార్మికులు సమ్మె చేస్తే ఉత్పత్తి ఆగిపోతుంది. అది ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అదానీ అవినీతి గురించి మాట్లాడితే షేర్ మార్కెట్ పడిపోతుంది. అది కూడా ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే విషయం కావచ్చు. కొత్త చట్టాలలో చాలా విషయాలు అస్పష్టంగా ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ అస్పష్టత న్యాయ వ్యవహారాలను ప్రజలకు దూరం చేయడం కోసం. కానీ ఈ చట్టాలు చేసినవాళ్లకు స్పష్టత ఉంది. ఇవి ప్రజల నిరసనలు, పోరాటాల నుండి తమను తాము రక్షించుకోడానికి, కార్పొరేట్ వర్గాల దోపిడికి అడ్డు లేకుండా చేయడానికి.
ఈ చట్టాలతో ఏదో అద్భుతం జరగబోతున్నదని మీడియా ప్రచారం చేస్తోంది. బహుషా ఇన్నేళ్ల నాగరికతను, ప్రజాస్వామ్య విలువలను ఇంత సులువుగా ధ్వంసం చేయడమనే అద్భుతం కావొచ్చు.