(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము – ఎడిటర్)
మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం) పూర్వ అధ్యక్షుడు రఘు మిమీడియామిని అరెస్టు చేశారు. నాయకురాలు, కార్యకర్త సునీతా పోట్టంను గత సంవత్సరం అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నవంబర్ 2024 లో ఎంబిఎం ని నిషేధించింది. ఈ అణచివేతను మీరు ఎలా చూస్తారు?
సోనీ సోరి: ప్రతిరోజూ ఐదు నుంచి పది మంది ఆదివాసులను అరెస్టు చేస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దీని ప్రధాన లక్ష్యం ఆదివాసీల ఉనికిని అంతం చేయడమే. బస్తర్‌లో పోరాటాలు చేసే వారెవరినైనా – ఎంబీఎం కావచ్చు, సోనీ సోరి కావచ్చు, హిడ్మే మర్కామ్ కావచ్చు అందరినీ నక్సలైట్లు అని పిలుస్తారు. అదే సునీత విషయంలో కూడా జరిగింది.
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు (ఆమె పోసనార్‌కు చెందినది) సునీతా మాతృభూమి. ఆ ప్రాంతం గనుల కొండలతో నిండి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో గనుల తవ్వకం చేయాలి అనుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనులను తవ్వాలనుకుంటే, తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు? అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను. భూమిని ఖాళీ చేయాలంటే ఆదివాసులను నిర్మూలించాలి. ఆదివాసీలను నిర్మూలించాలంటే వారి నాయకులను నిషేధాలు, అరెస్టుల ద్వారా లక్ష్యంగా చేసుకోవాలి.
ఇదంతా పెద్ద పెట్టుబడిదారుల చేతుల్లోకి ఖనిజ సంపదతో నిండిన కొండలను అప్పగించి ఆదివాసులను అడవుల నుండి తొలగించే ప్రభుత్వ వ్యూహంలో భాగం. నక్సలైట్లను అడ్డుకోవడమనేది కేవలం ఒక సాకు మాత్రమే. నిజమైన పోరాటం అడవిలో నివసించే మాకు వ్యతిరేకంగా జరుగుతోంది.
మీనా కందసామి: ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ కింద మావోయిజం/ నక్సలిజం ను 2026 మార్చి 31 నాటికి నిర్మూలించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటించాడు. దీనికి ముందు, సమాధాన్ ప్రహార్ పేరుతో ఒక కేంపెయిన్ జరిగింది; దీనికి ముందు కూడా వివిధ పేర్లతో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ విధమైన గడువును నిర్ణయించి, బహిరంగ ప్రకటన చేయటానికి వెనుక గల కారణం ఏమిటి?
సోనీ సోరి: హోంమంత్రి చెబుతున్నది కొత్తది కాదు. ఇలాగే ఇంతకు ముందు కూడా చెప్పారు. కానీ ఈసారి మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. అన్నీ రాష్ట్రాలలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా, ప్రతిచోటా చెబుతున్నాడు.
ఇంతకు ముందు సల్వాజుడుం నడిచింది. ఈ ప్రచారం దుష్ప్రభావం ఎవరిపైన ఎక్కువగా చూపింది? ఆదివాసుల మీద. తరువాత బస్తర్ బటాలియన్ ఏర్పడింది, దంతేశ్వరి ఫైటర్స్ వచ్చారు, కమాండో బటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) బటాలియన్లను మోహరించారు. అనేక ఇతర బలగాలను తీసుకువచ్చారు. పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఆదివాసులను అంతం చేయడానికి అన్ని రకాల సైనిక బలగాలను మోహరించారు.
బూటకపు ఎన్కౌంటర్లు జరిగే చోటకు మమ్మల్ని వెళ్లనివ్వరు. ప్రశ్నలు అడగడానికి అనుమతి లేదు. మీడియాతో మాట్లాడనివ్వరు. మా స్వరాన్ని వినిపించనివ్వరు. రాజ్యం పూర్తి ప్రపంచంతో మాట్లాడుతుంది. కానీ బస్తర్ ప్రజలను, సామాజిక కార్యకర్తలను మాట్లాడనివ్వరు.
ఇప్పుడు అమిత్ షా 2026 నాటికి మావోయిస్టులు అంతం అవుతారని అంటున్నారు. అసలు వ్యూహం ఏమిటి? మావోయిస్టుల పేరుతో ఎవరైనా హత్యకు గురైనప్పుడు అతని తలపై 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయల బహుమతి ఉందని చెబుతారు. నిజానికి వారు ఆదివాసీ రైతులను చంపేస్తున్నారు కానీ వారిని మావోయిస్టులు అని నిర్ధారిస్తారు.
60 లక్షలు – 1.5 కోట్ల వరకూ బహుమతులు ఉన్న “మావోయిస్టుల” కథలు మేం విన్నాం. మీరు ఒక మనిషిని చంపుతారు. బహుమతి మొత్తాన్ని పంచుకుంటారు. ఇదే నిజమైన వ్యూహం. ఇది ఆదివాసులకు వ్యతిరేకంగా ఒక వ్యవస్థీకృత కేంపెయిన్.
కానీ చట్టపరంగా ఏమి చేయాలి? మొదట శవపరీక్ష జరగాలి. మావోయిస్టును చంపిన గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వాలి. కుటుంబానికి సమాచారం ఇవ్వాలి. గ్రామ ప్రజలకు, ముఖ్యంగా విద్యావంతులకు సమాచారం ఇవ్వాలి.
కానీ వారు అలాంటిదేమీ చేయరు. శవపరీక్ష చేయరు. వార్తాపత్రికలు ఏ సమాచారాన్ని ప్రచురించవు. మరణానంతరం బహుమతిని ప్రకటిస్తారు. అందుకనే ఇక్కడ రోజూ రక్తం ప్రవహిస్తుంది. ఎవరినైనా చంపు- డబ్బు తీసుకో. లొంగిపో – డబ్బు తీసుకో. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా ప్రశ్న. ఈ డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? మీ వద్ద దీని గురించి ఏదైనా లెక్క ఉన్నదా? ఇంతటి సైనికీకరణ చేసినప్పటికీ కాల్పులు ఆగలేదు. అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం నిజంగా మావోయిస్టులతో పోరాడాలనుకుంటే, నిర్దోషులైన ఆదివాసులను చంపకుండా పోరాడండి. అడవులను, కొండలను నష్టపరచకుండా చేయండి. పర్యావరణానికి హాని కలిగించకుండా చేయండి.
నేడు కొండలు కాలిపోతున్నాయి, నదులు నాశనమవుతున్నాయి, ఆదివాసీ పిల్లలను చంపుతున్నారు.
మావోయిస్టులను అంతం చేస్తున్నామని వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది మావోయిస్టులను కాదు, ఆదివాసీలను అంతం చేయడం. బహుమతి డబ్బు ప్రజల డబ్బు కాదా? ఆ లెక్క ఎక్కడ ఉంది? ఎవరు కేటాయిస్తారు? ఎవరు ఆడిట్ చేస్తారు? ఇవన్నీ ఎక్కడ నమోదు అవుతాయి? నేను ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఈ విషయాన్ని ప్రశ్నిస్తే నన్ను నక్సలైట్ అని చంపేస్తారు లేదా జైలుకు పంపుతారు.
కానీ మేం చనిపోతామనో లేదా జైలుకు వెళ్తామనో భయపడం; ఎందుకంటే మన పోరాటం మనఅడవుల కోసం. మానవత్వం కోసం.
మీనా కందసామి: బస్తర్‌లో ఓపెన్ క్యాంపుల కోసం 2500 మంది సైనికులతో కూడిన కొత్త బెటాలియన్ ను తీసుకువస్తున్నట్లు నేను చదివాను. గగనతల నిఘా కోసం అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, మానవరహిత వైమానిక వాహనాలు, డ్రోన్లు తెస్తున్నారు. ఈ కార్యకలాపాలన్నీ సామాన్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి?
సోనీ సోరి: గ్రామస్తుల జీవితాలపై ఏం ప్రభావంపడుతుందా? గ్రామస్తులకు నిద్రపట్టడం లేదు. ఈ క్యాంపులను ఏర్పాటు చేసిన తరువాత, సైనికులు గ్రామాలపై బాంబు దాడులు చేస్తారు. ఆదివాసీ రైతులు తమ పొలాలకు వెళ్లలేరు, నీరు పట్టలేరు, కట్టెలు కొట్టలేరు, బీడీ ఆకులను సేకరించలేరు. బీజాపూర్‌లో కూడా నేడు ఇదే పరిస్థితి నెలకొంది.
ఒక రాత్రి నేను సిలంగేర్ పక్కన ఉన్న ఒక గ్రామంలో బస చేశాను. రాత్రి 1 గంటలకు బాంబు పేలుడు శబ్దం విని నిద్ర లేచాను. నాతో పాటు ఒక గర్భవతి మహిళా ఉండింది. ఇలా ప్రతిరోజూ జరుగుతుందని, తన గర్భంలో ఉన్న బిడ్డకు కూడా ఈ శబ్దం ఇబ్బంది కలిగిస్తుందని ఆమె చెప్పింది. “నా కడుపు మీద చేతులు ఉంచి చూడండి, నా బిడ్డ చాలా ఆందోళనగా ఉంది” అని ఆమె అన్నది.
బాంబు దాడులు పర్యావరణం మీద, భూమి మీద ఎలా ప్రభావం చూపుతాయో చూపించే ఫొటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మీరు మనుషులను చంపడం మాత్రమే కాదు, మొత్తం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇది కేవలం మా సమస్య మాత్రమే కాదు, మొత్తం దేశానికి సంబంధించినది.
ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదు? పారామిలిటరీ దళాలు ప్రతిచోటా ఎందుకు ఉన్నాయి? ఇంత పెద్ద సంఖ్యలో వారిని మోహరించాల్సిన అవసరం ఏముంది? మావోయిస్టులతో మాట్లాడే ముందు బస్తర్ ప్రజలతో ఎందుకు మాట్లాడటం లేదు? కానీ ప్రభుత్వం బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడదు. డబ్బు రాజకీయాలు, ఉత్సవాల క్రూరత్వం; రాజ్యం డబ్బును పంపిణీ చేయడాన్ని ఆపిన రోజున, ఆదివాసులపై దౌర్జన్యాలు కూడా ఆగిపోతాయి.
మీరు నమ్మరు – మృతదేహాలు పడి ఉంటాయి, ఐతు 4 లక్షల బహుమతి, హిడ్మా 3 లక్షల బహుమతి, జోగా 2 లక్షల బహుమతి అని ప్రకటిస్తారు.
మీనా కందసామి: ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. భారతదేశంలో సాధారణంగా సైన్యం భూమిని కాపాడుతుంది అనే భావన ఉంది. ఈ సైన్యం మన దేశవాసులను చంపి పండుగ చేసుకుంటోంది. కానీ ఈ వార్త బస్తర్ వెలుపల ఉన్నవారికి చేరడం లేదు. మహిళలు, పిల్లల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా?
సోనీ సోరీ: పిల్లలు తుపాకీ తూటాలను ఎదుర్కొంటున్నారు. ఇంద్రావతి నది ప్రాంతంలో నలుగురు పిల్లలను కాల్చి చంపారు. వారి రికార్డులు మా దగ్గర ఉన్నాయి. కేవలం ఒక సంవత్సరం వయస్సు ఉన్న శిశువు తన తల్లి పాలు తాగుతోంది. పారామిలిటరీ దళాలు గ్రామానికి రావడంతో తండ్రి ఆ బిడ్డను తీసుకొని అడవిలోకి పారిపోయాడు. ఆ పిల్లవాడు ఏడుస్తే పట్టుకుంటారని అనుకున్నాడు. అతను అడవిలో దాక్కున్నాడు, కానీ వాళ్ళు అతన్ని పట్టుకుని చంపేసారు.
ఆ తరువాత, వారు ఆ బిడ్డను మరొక గ్రామానికి తీసుకెళ్ళి, అక్కడి ప్రజలకు అప్పగించారు. “బిడ్డ తల్లి కోసం వెతుక్కుంటున్నాడు. వాడికి పాలు కావాలి” అని మాకు ఫోన్ వచ్చింది. గాయపడిన పిల్లలు బాధాకరమైన స్థితిలో ఉన్నారు. ఈ అర్ధ సైనిక బలగాల చేతిలో గాయపడిన పిల్లలను మేము కలిసేటప్పటికే పురుగులు పట్టి ఉండేవి. బూటకపు ఎన్కౌంటర్ తరువాత, పారామిలిటరీ దళాలు మృతదేహాలను తమ క్యాంపుకు తీసుకువెళతాయి, ఎందుకంటే వారికి బహుమతి డబ్బు లభిస్తుంది. కానీ ఒకవేళ ఒక పిల్లవాడిని కాల్చి చంపితే, వారు క్యాంపుకు తీసుకెళ్లరు, ఎందుకంటే పిల్లల మృతదేహం మీద వారికి ఎటువంటి బహుమతి లభించదు. ఒక పిల్లవాడు, స్త్రీ లేదా వృద్ధుడి పైన పొరపాటున కాల్పులు జరిపితే ఎందుకని ఎటువంటి విచారణ జరగదు? పిల్లలను చనిపోవడానికి వదిలేస్తారు. మొత్తం విషయాన్ని అణచివేస్తారు.
ఒకవేళ ఎవరైనా వారిని ప్రశ్నిస్తే, వారు పిల్లలు “క్రాస్ ఫైర్”లో చనిపోయారని చెబుతారు. కానీ వారు మీ స్వంత పిల్లలు అయితే, వారి జీవితాలకు విలువ నివ్వరా? తేడా ఏమిటంటే, వీరు ఆదివాసీ పిల్లలు – వారి మరణానికి విలువ ఉండదు.
మహిళలపై దాడులు, అత్యాచారాలుజరుగుతున్నాయి. అత్యాచారాల వ్యతిరేక చట్టం ప్రకారం పోలీసులు ఒక ఇంటిలోకి ప్రవేశిస్తేవెళ్లినప్పుడు మహిళను తాకడానికి ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించాలి. కానీ ఇక్కడ దేన్నీ లెక్క చేయరు.. పారామిలిటరీ దళాలు ఉదయాన్నే ఇళ్లలోకి వచ్చేస్తాయి. మహిళలు ధాన్యం దంచుతున్నప్పుడో, బట్టలు ఉతికేటప్పుడో, పొయ్యిని వెలిగించేటప్పుడో లోపలికి వస్తారు. మహిళల దుస్తులను చింపివేస్తారు, చీరలను ఇప్పేస్తారు, కొడతారు, అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు.
ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కానీ విచారణ జరగడం లేదు. ఇది కేవలం బస్తర్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మొత్తం దేశానికి సంబంధించినది. సుధ విషయమే చూడండి. ఆమెను పారా మిలిటరీ బలగాలు బలవంతంగా ఇంటి నుండి తీసుకెళ్లాయి. “మీరు కేసు పెట్టాలనుకుంటే, పెట్టుకోండి, కానీ ఆమెను తీసుకెళ్లకండి!” అని గ్రామంలోని ఇతర స్త్రీలు బతిమిలాడారు.
కానీ వారు ఆమెను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్ళారు. ఇంటికి దగ్గరలోనే. ఆమె చనిపోయే వరకు అత్యాచారం చేశారు. ఒక్క తూటా కూడా పేల్చలేదు. ఆమె తన చివరి శ్వాసను తీసుకున్నప్పుడు, “ఒక నక్సలైట్ ఎన్కౌంటర్ జరిగింది” అని ప్రకటించారు. ఆమె మృతదేహాన్ని దంతేవాడ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె కాల్పుల్లో చనిపోయిందని నాకు చెప్పారు. నేను డ్యూటీలో ఉన్న వైద్యుడిని అడిగాను, “నన్ను మృతదేహాన్ని చూపించు” అని. ఒక్క తూటా తాకిన గుర్తు కూడా లేదు. “ఇది ఎన్కౌంటర్ అయితే, శరీరంపై తూటా తగిలిన గుర్తులు ఎందుకు లేవు?” అని నేను అడిగాను. ఏ సమాధానమూ లేదు.
బస్తర్ మహిళలు నాతో అంటారు – “సోనీ దీదీ, మేము మరణానికి భయపడము. మాపై కాల్పులు జరపండి, కానీ మాపై అత్యాచారం చేయకండి! మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఈ హింసను భరించలేము”ఇక్కడ అత్యాచారం అతిపెద్ద భయానకంగా మారింది.
అత్యాచారం, హత్యలు, క్రూరమైన హింసలు. మహిళలను సజీవయాతనలకు గురిచేస్తాయి. వారిని గోళ్ళతో రక్కుతారు, కొడతారు, అత్యాచారం చేస్తారు – ఆ తరువాత తూటాలతో కాల్చి చంపుతారు. నేను గాయపడిన, ఉబ్బిపోయిన మహిళల మర్మాంగాలను చూసాను! ఎన్ని ఛిద్రమైన తొడలు, ఎన్ని గాయాలను చూశాను!
ఇలాంటి ఘటనలు బస్తర్‌లో ప్రతిరోజూ జరుగుతాయి. మీరు వీటి గురించి మాట్లాడితే, మిమ్మల్ని మావోయిస్టులుగా నిర్ధారిస్తారు. మనుషుల్ని చాలా క్రూరంగా చంపుతారు. తన కొడుకు, సోదరుడు, తండ్రిల మర్మాంగాలను సజీవంగా ఉన్నప్పుడే కోసినట్లు నాకు ఒక మహిళ చెప్పింది. ఇక్కడ మహిళలు, పిల్లలు, అన్నదమ్ములు, తండ్రులు, అడవి, జంతువులు, పక్షులు – ఎవరూ సురక్షితంగా లేరు.
ప్రజలను పారిపోయేట్లు చేయడానికి ఇక్కడ కాల్పులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సల్వాజుడుం సమయంలో లక్షలాది మంది ప్రజలు వరంగల్‌కు పారిపోయారు. ప్రజలు నుండి భూమిని ఖాళీ చేసి వెళ్లిపోతే తమ ప్రియమైన పెద్ద పెట్టుబడిదారులకు ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నారు.
మీనా కందసామి: రెండేళ్ల క్రితం నేను బస్తర్ కు వచ్చినప్పుడు, ప్రజలకు తాగునీటి సౌకర్యం లేదని గమనించాను. విద్యుత్తు లేదు. స్కూలు, హాస్పిటల్ చాలా దూరంలో ఉన్నాయి. కానీ ఎనిమిది దారుల రహదారుల వంటి విస్తృత రహదారులు ఉన్నాయి! పారామిలిటరీ బలగాలు “సమీకృత అభివృద్ధి కేంద్రాల” (‘ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సెంటర్స్’)ను ఏర్పాటు చేస్తున్నాయని అంతర్జాలంలో ప్రచారం చేస్తున్నాయి. వీటిలో బ్యాంకులు, రేషన్ షాపులు, అంగన్ వాడీ పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. కానీ ఈ సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత కదా? పారామిలిటరీ దళాలు ఈ పని ఎందుకు చేస్తున్నాయి? ఈ క్యాంపుల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?
సోనీ సోరి: గ్రామసభలో ఒక సర్పంచ్, కార్యదర్శి ఉంటారు. చట్టం ప్రకారం వారు అత్యున్నత అధికారాన్ని కలిగి ఉంటారు. మరి పారా మిలిటరీ బలగాలు రోడ్లు ఎందుకు నిర్మిస్తున్నాయి? ప్రభుత్వం రోడ్లు నిర్మించాలనుకుంటే, పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్ళే రోడ్లను నిర్మించాలి. ప్రజలను మార్కెట్‌కు తీసుకెళ్ళి, తిరిగి తీసుకురావాలి.
కానీ ఈ పెద్ద రహదారులను అడవిలో నివసించే ఆదివాసుల కోసం నిర్మించడంలేదు. ఖనిజ సంపన్నమైన కొండలకు చేరుకోవడానికి వేస్తున్నారు. ఖనిజాలను వెలికితీసిన తరువాత, వాటిని ఈ వెడల్పైన రహదారుల మీద బయటకు తీసుకువెళతారు.
ఆదివాసుల భూమిలో ఒక్క అంగుళం కూడా దోచుకోవడం జరగదని, గనుల తవ్వకం జరగదని, భూమి దోపిడీ జరగదని, పర్యావరణానికి హాని జరగదని కేంద్ర ప్రభుత్వం లేదా అమిత్ షా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వగలరా?
బస్తర్ లోని ఆదివాసులందరినీ సమీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మావోయిస్టులతో కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ముందుగా ప్రభుత్వం మాతో మాట్లాడాలి. ఆదివాసుల భూమిలో ఒక చిన్న ముక్కను కూడా వారి నుండి తీసుకోము అని నాకు భరోసా కల్పించాలి.
మీనా కందసామి: అన్ని రకాల అణచివేతలు అభివృద్ధి పేరుతో జరుగుతున్నాయి. ఈ మొత్తం అభివృద్ధి చర్చను మీరు ఎలా చూస్తారు?
సోనీ సోరీ: మేము కంపెనీలను వ్యతిరేకిస్తున్నాం. ఉదాహరణకు, ఎన్‌ఎండిసి (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) గత 75 సంవత్సరాలుగా ఇక్కడ గనులను తవ్వుతోంది. ఇది రాబోయే తరాలకు ఉపాధి కల్పిస్తుందని మేము భావించాము. ఆసుపత్రులు, పాఠశాలలు వస్తాయి. మా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అనుకున్నాం.
కానీ ఈ రోజు నిజం ఇది. కొండలు ఖాళీఅయిపోయాయి. ప్రజలు విషపూరిత ఎర్రటి నీరు త్రాగడం తప్పడం లేదు. పిల్లలు బతకడంలేదు. వ్యవసాయ భూమి నాశనమైంది. ప్రజలు చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను అమ్ముకొని బతుకీడుస్తున్నారు.
గనుల త్రవ్వకాల ఫలితం ఇలా ఉన్నప్పుడు, ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేయరు? మావోయిస్టులపైన అబద్ధపు ఆరోపణలు ఎందుకు? పిడియా గ్రామంలో పాఠశాల లేదు. ఆసుపత్రి లేదు. ప్రజల దగ్గర తమ భూమికి సంబంధించిన పత్రాలు లేవు. అంగన్‌వాడీలు లేవు. విద్యుత్ లేదు. మావోయిస్టులు వీటిని ఏర్పాటుచెయ్యనివ్వడం లేదని ప్రభుత్వం చెబుతోంది!
నిజమైన అభివృద్ధి ఎక్కడనుంచి ప్రారంభం కావాలి? ముందుగా గ్రామాల్లో రోడ్లు నిర్మించాలి. విద్యుత్తు రావాలి. ఆసుపత్రులు, నీరు, పిల్లల కోసం సౌకర్యాలు ఉండాలి. ఆ తర్వాత పెద్ద రోడ్ల గురించి మాట్లాడాలి.
కానీ వీరు కేవలం పెద్ద రోడ్ల గురించి మాత్రమే మాట్లాడతారు. నిజం చెప్పేవారిని చంపేస్తారు. జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ గ్రామ రహదారుల సమస్యను లేవనెత్తాడు. అతన్ని చంపేశారు. అతను “అభివృద్ధికి వ్యతిరేకుడా”? సత్యం చెప్పేవాళ్లను అణచివేస్తారు .
మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ వారు చెప్పే అభివృద్ధి విధానాన్ని అంగీకరించం. మొదట మా ప్రాథమిక హక్కులను మాకు ఇవ్వండి! తరువాత అభివృద్ధి! కానీ వీటన్నిటి బదులు వారు కంపెనీలకు సేవ చేయాలనుకుంటారు.
———————————————————————————————————
సోని సోరి భారతదేశం అంతర్గత వలసక్రమంలో రక్తసిక్త అంచుల వద్ద నిలుచుంది. ఆమె జీవితకథ ఛత్తీస్‌గఢ్‌లోని ఖనిజ సంపదగల అటవీ భూముల యాజమాన్యంపై ఆదివాసులు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య నడుస్తున్న దీర్ఘకాలిక సంఘర్షణను ప్రతిబింబిస్తుంది.
2011లో ఆమెను మావోయిస్టుగా ప్రకటించినప్పుడు, అది కేవలం ఒక భావజాలం మాత్రమే కాదు, ప్రతి రూపంలో ప్రతిఘటనను కూడా నేరపూరితం చేసే పాత పాఠ్యపుస్తకాన్ని అనుసరించింది. ఆమె రెండు సంవత్సరాల జైలు జీవితం, భారతదేశం తన అతి అంచుకు చేరిన సముదాయాలను ఎలా నియంత్రిస్తుందో చూపించే ఉదాహరణగా మారింది.
జైలు గోడల మధ్య, అప్పటి జిల్లా పోలీసు అధికారి అంకిత్ గార్గ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి—తరువాత ఆయన శౌర్యానికి రాష్ట్రపతి పోలీసు మెడల్ లభించింది.
కానీ సోరి తాను బాధితురాలు అనే కథనాన్ని తీవ్రంగా తిరస్కరించింది. 2013 నుండి, ఆమె ప్రభుత్వాన్ని భయపెట్టే అతిపెద్ద శక్తిగా రూపాంతరం చెందింది—ఒక చరిత్రకారురాలిగా, ఒక వాస్తవ సాక్షిగా. 2016లో ఆమెపై జరిగిన యాసిడ్ దాడి కూడా ఆమెను తన పోరాటాన్ని కొనసాగించకుండా ఆపలేకపోయింది. ఇటీవల ఇచ్చిన తన సాక్ష్యంలో, “ఆపరేషన్ కగార్” అనే 2026 మార్చిలోగా మావోయిస్టులను “తొలగించే” సైనిక గడువు నిజానికి ఆదివాసీల భూమిని, గౌరవాన్ని నాశనం చేసే కుట్ర అని ఆమె ఆరోపించింది.
అభివృద్ధి ప్రచారానికి, విధ్వంసానికి మధ్య ఉన్న అసహ్యమైన కూటమిని ఎత్తి చూపిస్తూ సోనీ ఆతురతతో , ఆవేదనతో మాట్లాడుతుంది. రాజ్యం రోడ్లను చూస్తున్నప్పుడు, ఆమె జీవనోపాధి, ఖనిజాలు, వనరులు, ఆదివాసీల జీవనాధారాలను హరించే ఆక్రమణ సిరలను చూస్తుంది. అధికారులు సెక్యూరిటీ క్యాంపులను, పెరుగుతున్న బెటాలియన్లను చూసి విజయోత్సవాలను జరుపుకుంటున్నప్పుడు, ఆమె హింస, నిర్వాసిత్వం, అత్యాచారాల భయానకాల చిత్రాన్ని చూస్తుంది. కార్పొరేట్ మీడియా పురోగతిని నివేదించి, తన విశ్వసనీయ పాత్రికేయులను అసంఖ్యాక ఆదివాసుల ప్రాణాల్ని జీవితాన్ని పణంగా పెట్టి సాధించిన విజయాన్ని ప్రదర్శించడానికి పంపినప్పుడు, ఆమె భారతదేశంలోని స్థానిక ప్రజలకు చేసిన రాజ్యాంగ వాగ్దానాలను క్రమపద్ధతిలో జరుగుతున్న కూల్చివేతను చూస్తుంది. ఈ ఇంటర్వ్యూలో, సోనీ సోరి మాట్లాడుతూ, భూమి సంపదను కలిగి ఉన్నప్పుడు, ప్రజలు అదృశ్యం కావడానికి నిరాకరించినప్పుడు ప్రజాస్వామ్యం సైనిక ఆక్రమణగా మారుతుంది అని అంటుంది.
తెలుగు: పద్మ కొండిపర్తి