2025 మే 14నసిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ డీజీపి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఏప్రిల్ 21 నుండి 21 రోజుల పాటు జరిపిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రధానంగా నెరవేర్చామనీ, అమిత్ షా ప్రకటించినట్లు 2026 మార్చ్ 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టించి తీరుతామని ప్రకటించారు. ఈ పత్రికా సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాను ఆహ్వానించారు.
ఆ ప్రెస్ మీట్ లో పేర్కొన్న ముఖ్య అంశాలు: 1. ఆపరేషన్ కర్రెగుట్టలు విజయవంతమైంది. మొత్తంగా 31 మంది మావోయిస్టులను తుదముట్టించాము. 2. 450 ఐఈడి లను నిర్వీర్యం చేశాము. 3. టెక్నికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన నాలుగు శిబిరాలను కనుక్కొని ఆ పరికరాలనన్నింటినీ ధ్వంసం చేశాము 4. మావోయిస్టు నాయకత్వం చెదిరిపోయేట్టు చేశాము. 5. కర్రెగుట్టల మీద ఉన్న గుహలను గుర్తించాము. 6. 12 టన్నుల ధాన్యపు నిలువలను గుర్తించి వాటిని ధ్వంసం చేశాము. 7. భద్రతా బలగాలకు సంబంధించి 18 మంది గాయపడ్డారు, వారికి జగదల్పూర్ లో చికిత్స అందిస్తున్నాము. 8. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ ఆంబులెన్స్ లో డిల్లీకి తరలించి చికిత్స చేస్తున్నాము.
వీటిని, ఈ మొత్తం ఆపరేషన్ ను సమీక్షిద్దాము.
ఈ ఆపరేషన్ లో ఎంత మంది బలగాలను మోహరించారనే విషయాన్ని పై ప్రెస్ మీట్ లో చెప్పలేదు. కానీ 20,000 నుండి 28,000 వరకు 21 రోజుల పాటు వినియోగించారని అనేక పత్రికా కథనాల్లో వచ్చింది. ఇంతమంది బలగాలను 60X20 కి.మీ. విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో మోహరించారు. ఈ బలగాలకు తోడు ఆధునిక టెక్నాలజీని, ఆయుధాలను విస్తృతంగా వినియోగించారు. భారత వాయుసేనకు సంబంధించిన 3 యుద్ధ హెలికాప్టర్లను ఈ మొత్తం కాలమంతా వినియోగించారు. సప్లైల కోసమే కాకుండా బాంబులను వేయడానికి, వేలాది తూటాలను కాల్చడానికి కూడా వాటిని వాడారు. ఎన్నో డ్రోన్ లను ఉపయోగించారు. నావిక్ (Navic -నేవిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెల్లెషన్) (భారతీయ జిపిఎస్) ఎప్పటికప్పుడు అందించే ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకున్నారు.
ఆపరేషన్ కర్రెగుట్టలు (ఆపరేషన్ సంకల్ప్/ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్) ప్రారంభించే ముందు ఈ బలగాలు పెట్టుకున్న లక్ష్యం ఏమిటి?
కర్రెగుట్టలలో హిడ్మా, దేవాల్ లతో పాటు బెటాలియన్ నంబర్ 1, తెలంగాణ రాష్ట్ర కమిటీ, దానితో పాటు చంద్రన్న వంటి కేంద్రకమిటీ నాయకులు ఉన్నారనీ వారిని తుదముట్టించాలనేది ఈ ఆపరేషన్ లక్ష్యం. దాని కొరకు కొన్ని గోదీ మీడియా పత్రికలలో వెయ్యి మంది – మూడు వేల మంది మావోయిస్టులను తుదముట్టించే లక్ష్యంతో ఈ ఆపరేషన్ జరుగుతోందనీ, ఇక మావోయిస్టుల ఖేల్ ఖతం అని రాతలు రాశాయి.
ఆ లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఆపరేషన్ సాఫల్య, వైఫల్యాలను సమీక్షిస్తే ప్రధానంగా ఈ ఆపరేషన్ పరిమితంగా మాత్రమే విజయం సాధించిందని నిర్ధారణకు రాక తప్పదు. 20000 నుండి 28000 బలగాలను మోహరించి,వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి,ఆధునిక టెక్నాలజీని, వైమానిక దళాన్నీ, డ్రోన్ లను పెద్ద ఎత్తున వినియోగించి ఖాళీ గుట్టల మీద ఝండా ఎగరేసి దాన్నే ఘన విజయంగా చాటుకోవడం తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికే. మావోయిస్టు నాయకత్వాన్ని చెదిరిపోయెట్టు చేశాము అనేది అర్ధ సత్యమే. అర్ధ సత్యాలు అసత్యాలతో సమానమే. మావోయిస్టు గెరిల్లా యుద్ధ తంత్రం, సున్-జూ యుద్ధ తంత్రం గురించి తెలిసిన వారికెవ్వరికైనా అర్థమయ్యే విషయం ఏమిటంటే దీర్ఘ కాలిక ప్రజా యుద్ధంలో ప్రతిపక్షం పై చివరి దశలో తప్ప అమీ – తుమీ లడాయిలోకి గెరిల్లా బలగాలు ఎప్పుడూ దిగవు. బలగాలను పరిరక్షించికునే ఎత్తుగడలనే అవలంబిస్తాయి. కాబట్టి ఇంతటి కేంద్రీకరణ మధ్య కూడా మావోయిస్టు ప్రధాన నాయకత్వం సురక్షితంగా తప్పుకోగలిగిందంటే ఈ ఆపరేషన్ విజయవంతమైందని చెప్పటం సరి కాదు. ఒకవేళ మొదట ప్రకటించిన విధంగా మావోయిస్టు బలగాలు అక్కడ లేవు అంటే అది వారి నిఘా వర్గపు ఘోరాతి ఘోర వైఫల్యం. ఐఈడి లను డిఫ్యూజ్ చేయడం 4 టెక్నికల్ టీం పరికరాలను పట్టుకోవడం, కొంత మంది మావోయిస్టు బలగాలను మట్టుబెట్టడం మాత్రం మావోయిస్టులకు పెద్ద నష్టమే. (ప్రకటించిన 22 మందిలో అందరి పేర్లను ప్రకటించలేదు. అందరూ ప్రజా సైన్యానికి చెందిన వారేనా స్పష్టత లేదు. అందులో ఎందరు గ్రామీణులు ఉన్నారనేది తేలలేదు.) కానీ ఆపరేషన్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మావోయిష్టులు కనీస నష్టంతో బయటపడ్డట్టే.
ఒక విలేఖరి ఇదే ప్రశ్నను అడగగా సిఆర్‌పిఎఫ్ డిజి ప్రత్యక్షంగా జవాబు చెప్పకుండా దాటవేశాడు. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా అని అడిగితే అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించాము అని చెప్పాడు కానీ మొదట పెట్టుకున్న లక్ష్యం ఏమిటనేదానికి సూటిగా సమాధానం చెప్పలేదు.
ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు ఎట్లా చనిపోయారనేదానికి ఇప్పటికీ సమాధానం లేదు. పీస్ డైలాగ్ కమిటీతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ తరువాత ఐజి మాకు ఇందులో ప్రమేయం లేదు అని చెప్పారు. కానీ మరి గ్రేహౌండ్స్ ఎట్లా పాల్గొన్నారు? చాలా మీడియాలో సిఆర్‌పిఎఫ్, గ్రేహౌండ్స్ పొరపాటున ఒకరిమీద ఒకరు కాల్పులు జరుపుకోవడం వల్ల గ్రేహౌండ్స్ జవాన్లు చనిపోయారని చెప్పాయి. దేనిలోని నిజానిజాలను తేల్చేదేవరు? వారి చావుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక కొంత మంది విలేఖరులు కొందరి కాళ్ళు కొట్టేయ్యాల్సి వచ్చిందని తెలిసింది నిజమేనా అని వేసిన ప్రశ్నకు సమాధానం డిజి చెప్పలేదు. కానీ ప్రజలకు నిజానిజాలు తెలుసుకునే హక్కు ఉంది.
ఇక ఈ ఆపరేషన్ సందర్భంగా ఈ భద్రతా బలగాలు, రాజ్యం ఆదివాసీల పట్ల ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయో మరోసారి బయటపడింది. ఈ ఆపరేషన్ చివరి దశలో మే 9వ తేదీ నాడు 22 మందిని మావోయిస్టులు చనిపోయారని ఒక వార్త వచ్చింది. కానీ ఇది నిజమా కాదా అనే సంశయం అందరిలో నెలకొని ఉండింది. ఎందుకంటే ఆ మూడు వారాల్లో గోదీ మీడియా ఒక సారి 20 మందిని, మరోసారి 30 మందిని, ఇంకోసారి చంద్రన్నను, బండి ప్రకాశ్ ను కూడా చంపేసింది. కానీ అవన్నీ అబద్ధపు వార్తలని తరువాత తేలిపోయింది. అయితే మే 10 ఉదయం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు సింగ్ దేవ్ 22 మంది మావోయిస్టులు హతమయ్యారని చెప్పారు. అదే సాయంత్రం, డిప్యూటీ సీఎం కూడా అయిన హోం మంత్రి విజయ్ శర్మ ఆపరేషన్ సంకల్ప్ అనేదే లేదని, 22 మంది చనిపోయారనేది కూడా అవాస్తవమని ప్రకటించాడు. ఇద్దరు ప్రధాన ప్రభుత్వాధినేతలు చేసిన ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు అత్యంత బాధ్యతా రహితమైనవనే విషయం పక్కన పెడితే ఛత్తీస్ గఢ్ హోం మంత్రి ఎందుకు అబద్ధం చెప్పాడనేది ఇప్పటికీ అంతుబట్టని విషయం. 22 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాక కూడా పోలీసులు 11 మృత దేహాలను మాత్రమే భద్రపరచగల బీజాపూర్ మార్చురీలో 22 మృతదేహాలను ఉంచారు. మృతుల కుటుంబాలకు, బంధువులకు తెలియజేయలేదు. ఐదారు రోజుల తరువాత కానీ మృతుల గురించిన విషయం బయటకు అధికారికంగా ప్రకటించలేదు. అప్పటి వరకు మృత దేహాలకు దారుణంగా పురుగులు పట్టి, కుళ్లి పోయి ఘోరంగా తయారయ్యాయి. మృత దేహాల పట్ల కూడా ఇంత అమానవీయంగా ప్రవర్తించే ఈ క్రూర సంస్కృతిని ఎక్కడ నేర్చుకున్నారు? ఆదివాసీల పట్ల, వారి మృతదేహాల పట్ల కూడా ఈ క్రూరత్వం ఎందుకు? ఛత్తీస్ గఢ్ హోం మంత్రి ఎందుకు అబద్ధం చెప్పినట్టు?బుద్ధుడు నడయాడిన నేల ఇది, శాంతికి నిలయమైన దేశమిది అని చెప్పే ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా తమ బలగాలలో ఈ క్రూరత్వాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? వీటికి కూడా జవాబు చెప్పవలసే ఉంది.
మావోయిస్టుల తలలకు వెల కట్టి వారిని చంపిన బలగాలకే ఆ డబ్బును ప్రోత్సాహకంగా ఇవ్వడం అనే అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక, అమానవీయ పద్ధతి వల్లనే భద్రతా బలగాలు గాయపడి పట్టుబడిన వాళ్ళను, గ్రామీణులను కూడా చంపేసి వారిని చంపేసిన తరువాత ఇనామీ నక్సలైట్లు అని ప్రకటించి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు. అయినా ‘నక్సలైట్లతో/ఆయుధాలు ఉన్న వారితో పోరాటం చేయడం వారి విధి నిర్వహణలో భాగమైనప్పుడు’ వారికి నగదు పురస్కారాలు ఎందుకు? పాకిస్తాన్ లో మొన్న వంద మంది దాకా ‘ఉగ్రవాదులను’ మట్టుబెట్టాము అన్నారు. వారి మీద భారత ప్రభుత్వామో/అమెరికా ప్రభుత్వామో ప్రకటించిన రివార్డును ఆ ‘చర్యలలో’ పాల్గొన్న వైమానిక దళ సిబ్బందికి, ఇతర సిబ్బందికి ఏమీ ఇవ్వలేదు కదా. మరి భారతదేశపు పౌరులైన ఆదివాసీలను చంపడానికి ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడమేమిటి?2024 నుండి ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలను ప్రోత్సాహకాలుగా ఇచ్చి ప్రభుత్వ బలగాలలో మానవత్వాన్ని చంపేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇటువంటి తప్పుడు పద్ధతుల వల్లనే ఇంత పెద్ద ఎత్తున నిరాయుధులైన, గాయపడి పట్టుబడిన మావోయిస్టుల, ఆదివాసీల హత్యలు జరుగుతున్నాయి.
ఈ చావులు మాత్రమే కాకుండా, లక్షలాది బలగాలను మోహరించడం వల్ల ఆదివాసీల దైనందిన జనజీవనం అంతా అస్తవ్యస్తమవుతున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టులు ఆదివాసీల మధ్య ఉన్నా సాధారణ ఆదివాసీల దైనందిన జీవితానికి ఎన్నడూ ఇసుమంతైనా అడ్డంకి ఏర్పడలేదు. మరి భద్రతా బలగాల మోహరింపుతో ఈ సమస్య ఎందుకు వస్తున్నట్టు? ఆదివాసీల అభివృద్ధి కోసం అంటే అది ఎంత వైరుధ్యభరితమైనదో, హాస్యాస్పదమైనదో అర్థం చేసుకోవచ్చు.
మావోయిస్టు పార్టీ ఏక పక్షంగా కాల్పుల విరమణను ప్రకటించిన తరువాత ఇంత పెద్ద ఆపరేషన్ ను చేపట్టి ఇంత ప్రాణహానికి పాల్పడటం ఎందుకు? దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ప్రజలు, మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణను ప్రకటించి చర్చలకు అనువైన వాతావరణాన్ని ఏర్పరచవలసిన అవసరం ఉంది. ఆదివాసీల హననాన్ని ఆపవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్ తో కాల్పుల విరమణను ప్రకటించి చర్చలు జరుపగలిగినప్పుడు ఈ దేశపు మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపకూడదు?‘వాళ్ళు కాల్పులు ఆపితే మేము ఆపుతాం; వాళ్ళు మొదలు పెడితే మేమూ మొదలు పెడతాం’ అని పాకిస్తాన్ తో అన్నప్పుడు మావోయిస్టులు ‘మేము కాల్పులు ఆపుతున్నాం’ అని ఏకపక్షంగా ప్రకటించినా ఎందుకు ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించడం లేదు?ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం కేంద్ర ప్రభుత్వాన్ని, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్నినిలదీయాలి, అందుకు డిమాండ్ చేయాలి.