కా. బసవరాజు అమరుడయ్యాక, అర కన్నులతో ఆయన మృతదేహం ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అదిగాక, ఆయన నవ్వ యవ్వనంలో ఉన్నప్పటి మరో ఫొటోను డెవలప్ చేసి అభిమానులు ప్రచారంలోకి తెచ్చారు. దాన్ని ఒక మిత్రుడు చూసి ‘ఇది ఆయనకు సరిపోలినది కాద’ని అన్నారు. ఈ పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆయన నివాళి సందర్భాల్లో అదే కనిపిస్తున్నది. యాభై ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపిన నంబళ్ల కేశవరావుకు ఉద్యమంలో ఉండిన పేర్లు బైటికి వచ్చాయేగాని, ఇంకో ఫొటో ఏదీ ఎవ్వరి దగ్గరా ఉన్నట్లు లేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా పాతికేళ్ల వయసులోని ఆ ఫొటోకే పూల దండలు వేసి నివాళి ప్రకటించుకున్నట్లు సామాజిక మాధ్యమాలనుబట్టి తెలుస్తోంది.
బహుశా ఈ రెండూ తప్ప ఇన్నేళ్లలో వయసుతోపాటు మారుతూ వచ్చిన ఆయన రూపురేఖలను పట్టిచ్చే ఆనవాలేదీ ఈ సమాజానికి లేనట్లే. ఆయన ఎట్లా ఉండేవాడనే ఆసక్తికి నివృత్తి లేకపోవచ్చు. ఆయనతో పని చేసిన వాళ్ల హృదయాల్లో ఒక అద్భుతమైన చిత్తరువు పదిలంగా నిలిచి ఉండవచ్చు.
అంతగా కేశవరావు అనే ఉద్యమకారుడు వ్యక్తిగా తన గురించిన గుర్తులేవీ ఈ నేల మీద మిగిల్చుకోకుండా వెళ్లిపోయాడు. ఆయనలాంటి వాళ్లందరికీ విప్లవోద్యమమే వ్యక్తిత్వం. వందల, వేల అమర విప్లవకారులందరూ దీనికి ఉదాహరణే. గంగన్న అనీ, బసవరాజనీ కొన్ని పేర్లు తప్ప వ్యక్తిగా కేశవరావును పోల్చుకోడానికి ఇంకేమీ లేకపోవడం ఆయనలోని అదనపు విశేషం. అపురూపం. ఇది కేవలం సాంకేతికమైనదేనా? జీవిత పర్యంతం ఆయన తీసుకున్న జాగ్రత్తల్లో భాగమేనా? బహుశా అదీ కావచ్చు. కానీ అంతకంటే చాలా విశాలమైన అర్థం కూడా అందులో ఉన్నది.
ఇంకో పక్క నుంచి ఆయన మృతదేహాన్ని ఊళ్లోని కుటుంబసభ్యులు కూడా చూడ్డానికి రాజ్యం నిరాకరించింది. అభిమానులు నివాళి ప్రకటించడానికి లేకుండా కాల్చేసింది. ఆ బూడిదలోంచి ఒక చిత్తరువును ఊహిస్తారేమో అనే భయంతో దాన్నీ దక్కకుండా చేసింది. రక్తసంబంధీకులకు మిగిలించి ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలు మాత్రమే. ఈ దేశానికి, యావత్ ప్రజానీకానికి ఆయన చైతన్యం మాత్రమే. చివరికి ఆ పేరే ఒక చైతన్య ప్రతీకగా మారిపోయింది. అంతగా ఆయన తన మరణం తర్వాత కూడా విస్తృత ప్రజా చైతన్యానికి కారణమయ్యాడు. రాజ్యం ఎంత పాశవికమైనదో, వికృతమైనదో మామూలు మనుషులు కూడా తెలుసుకోగల సందర్భంగా మారిపోయాడు. విప్లవం ఎంత మానవీయమైనదో, అవసరమైనదో ఆయన మృతదేహాన్ని కూడా చూడలేకపోయిన ప్రజలకు మరోసారి అనుభవంలోకి వచ్చింది.
చరిత్రలోకి వెళ్లితే కేవలం తాము నిర్మించిన పోరాటాల వల్ల, అందులోని విలువల వల్ల, త్యాగమయ సంస్కృతి వల్ల నేటికీ మనల్ని ప్రేరేపిస్తున్న పోరాటకారులెందరో ఉన్నారు. వాళ్ల పేరే ఒకప్పటి ప్రజల సామూహిక అనుభవంగా గుర్తుకు వస్తుంది. సరిగ్గా అట్లాగే నంబళ్ల కేశవరావు కూడా ఒక వర్తమాన చారిత్రక మూర్తిమత్వంగా నిలిచిపోయాడు. ఆయన భౌతిక కాయాన్ని, అంత్యక్రియలను, సంస్మరణ విధులను కూడా పాలకులు క్రూరంగా అడ్డుకొనే కొద్దీ ఆ పేరు చైతన్య కెరటాల వెల్లువలా దేశాన్నంతా చుట్టి వస్తున్నది. ప్రపంచమంతా విస్తరిస్తున్నది. బస్సుల్లోనే, రైళ్లలోనే ఆయన పేరు ప్రస్తావించి మాట్లాడుకుంటోంటే చుట్టూ ఉన్న వాళ్లలో కొందరైనా తల తిప్పి మనవైపు చూసేంతగా బసవరాజు మామూలు జనాలకు కూడా చిరపరిచితుడయ్యాడు. మీలాగే మాకూ ఆయన పేరు తెలుసు, ఆయన హత్య గురించి తెలుసు, తద్వారా ఆయన తెలుసు.. అనే అర్థాలు వాళ్ల చూపుల్లో కనిపిస్తున్నాయి. అప్పుడు కూడా బహుశా వ్యక్తిగా ఆయన తెలుసని కాకపోవచ్చు. దేశంలో జరుగుతున్న ఒక భయానక అంతర్యుద్ధం గురించీ, మారణకాండ గురించీ కావచ్చు. దానికి ఎదురు నిలిచిన విప్లవోద్యమం గురించీ కావచ్చు. ఒక త్యాగమయ సంప్రదాయం గురించి కావచ్చు. చరిత్రను అత్యవసరంగా మార్చేసే ఆదర్శవంతమైన ఆచరణ గురించి కావచ్చు. అంతగా ఆ పేరు మారుమోగుతున్నది.
వ్యక్తిగత వివరాలేవీ తెలియని విప్లవకారుడిని ప్రజలు ఆయన నిర్మించిన విప్లవోద్యమ సంబంధంలో గ్రహించగల ఒక అమూర్త స్థాయికి నంబళ్ల కేశవరావు ఎదిగిపోయాడు. ఆయన నిర్మించి కాపుగాసిన విప్లవోద్యమం మీద యుద్ధం ఆపమని అనేక రకాల జన జమూహాలు మాట్లాడుతూ, ఆందోళనలు చేస్తూ దానికి ఒక రక్షణ వలయం కావడానికి చేస్తున్న ఈనాటి ప్రయత్నం కూడా చారిత్రాత్మకమే. అట్లా మరణానంతరం కూడా బసవరాజు విప్లవోద్యమానికి దన్నుగా నిలబడ్డాడు.
విప్లవోద్యమ నిర్మాణానికి, ఉద్యమ విస్తరణకు చేసిన దోహదంలో, అందించిన నాయకత్వంలో తప్ప ఇంకెక్కడా పోల్చుకోడానికి వీల్లేనంతగా ఆయన అందులో సంలీనమైపోయాడు. చరిత్రను నిర్మిస్తూ, చరిత్రలో భాగం కావడం అంటే ఇదే. మరణానంతరం కూడా చరిత్రను కొనసాగించడమంటే కూడా ఇదే. ఇక చరిత్ర నుంచి వ్యక్తిగా ఆయనను వేరు చేయడం ఎవరి వల్లా కాదు.
అత్యంత సహజమైన మానవ వ్యక్తీకరణలను ఈ లోకం అణచివేస్తుంది. విప్లవం వాటికి రెక్కలు తొడుగుతుంది. తీవ్రమైన దు:ఖంగా, ఆగ్రహంగా, ధిక్కారంగా, తిరుగుబాటుగా విప్లవమే తీర్చిదిద్దుతుంది. విప్లవ నాయకుడిగా బసవరాజు వాటిని రాజకీయం చేశాడు. సాయుధ చేశాడు. ప్రజా సైన్యం చేశాడు. ప్రజల భావోద్వేగాలను, సాహసాలను, తిరుగుబాటు తత్వాన్ని దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలోకి అనువదించగల పద్ధతిని ఆవిష్కరించాడు. తద్వారా ఆయన ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రజాయుద్ధ కథా నాయకుడయ్యాడు. ఇక ఎవరైనా ఆయనను ప్రజాయుద్ధ కళగా తెలుసుకోవాల్సిందే.