ఊరుకి చెందిన వాడినా
తల్లివేర్లు తెంపుకు వచ్చిన వాడినా
ఊరు వదిలి వేరైపోయిన వాడినా
నిలువునా నీరైపోయిన వాడినా
అయినోళ్ళకి చెందిన వాడినా
పలునోళ్ళకు జంకిన వాడినా

ఎవరిని ?
నేను ఎవరికి చెందిన వాడిని ?

చేతులు రెండూ
చాచిన వాడిని కదా..
చూపంతా వచ్చిన దారిన
పరచిన వాడిని కదా..
నివశించే నేలకి
తలని తాటించేవాడిని కదా..
ఎక్కడైనా ఒక బొట్టు ప్రేమ కోసం
భిక్ష పట్టినవాడిని కదా..
భుజాన బరువుతో
బతుకు భ్రమణ గీతం పాడేవాడిని కదా..
మరి, నేను ఎవరిని ?

సూరీడికి చెందిన వాడినా
చుర్రుమనే ఎండకు చెందిన వాడినా
చంద్రునికి చెందిన వాడినా
చల్లని వెన్నెలకు చెందిన వాడినా
కడలికి చెందిన వాడినా
విరిగి లేచే కెరటానికి చెందిన వాడినా
అడివికి చెందిన వాడినా
గాయానికి పూసే ఆకు పసరుకి చెందిన వాడినా
నగరానికి చెందిన వాడినా
నగుబాటుకు కుంగిన వాడినా

ఎవరికి దేనికి చెందిన వాడిని ?

నేలకు రాలి చిట్లి
చిందిన చినుకులో
అలుముకుమన్న తేమని

కాలే కడుపులో దూకి
కనుమూసిన అన్నం మెతుకుని

మూలవాసీ గాయాన్ని
ఆదివాసీ గానాన్ని
నాగరికుల మౌనాన్ని
నలుగురు కూడి తలచే వేళలలో
ఒక క్షణకాలపు అమరుని తలపుని
.
ఎక్కడా ఇమడక ఎటూ పోలేక
నాలోనే అశాంతిగా
అటూ ఇటూ తిరుగుతున్న పులిని
సుడిగాలికి చెలరేగి
కలియతిరుగుతున్న మట్డిరేణువుని

ఎటు చెందిన వాడిని ?
నాకు నేనే అందని వాడిని
నాకు నేనే చెందని వాడిని.

One thought on “ఎటు చెందిన వాడిని

Leave a Reply