నాగులకుంటలో తెల్లవారింది.

మేనపాటి నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఉదయం  ఆరు కూడా కాలేదు సమయం.ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి  బొటనవేలు నొప్పి పెడుతోంది, కానీ బెల్లు అంతగా మోగడం లేదు. అప్పటికే లేచి తయారైన పిల్లలు అక్కడక్కడా బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. దినపత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హుషారుగా నవ్వుకుంటూ  రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళపైన.

తనూ కదులుతూనే వాళ్ళ సైకిళ్ళని తదేకంగా చూస్తూ , తన  సైకిల్ వైపు తలవంచి  పరీక్షగా చూసుకున్నాడు. సైకిల్ మరీ పాతబడిపోయింది. ముందులాగా వేగంగా, చురుగ్గా తను కదల్లేకపోతున్నాడు. తన సైకిల్ కూడా కదల్లేకపోతోంది. మొన్ననే యాభై రూపాయలు పెట్టి మస్తాన్ సైకిల్ షాప్ లో ఓవర్ ఆయిలింగ్ చేయించాడు. అయినా సైకిల్ మిట్టల్లో యింకా మూలుగుతూనే వుంది. ఎప్పటికప్పుడు కొత్త సైకిల్ కాకపోయినా, ఐదారు వందలు జమ చేసుకుని అయినా , ఈ పాత సైకిల్ అమ్మేసి మరో మంచి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనాలని అనుకుంటున్నాడు, కానీ కనీసం అది కూడా  కుదరటం  లేదు.

ఇంట్లో అవసరాలు గుర్తొచ్చాయి. పెండ్లి చెయ్యాల్సిన చిన్న కూతురు గుర్తొచ్చింది.ఏవేవో పనులు, ఖర్చులు, లెక్కలు గుర్తుకు వచ్చాయి.  సంవత్సరంగా అనుకుంటున్నాడు పెద్ద కూతురింటికి ఓసారి వెళ్ళి ఒక చీర, జాకెట్టు పెట్టి రావాలని. పలమనేరు నుండి ఆంబూరుకు వెళ్ళిరావల్లంటే రెండు బస్సులు మారాలి అంతే. రెండుమూడు గంటల ప్రయాణమే. అయినా ఉత్తచేతుల్తో పోకూడదని ప్రయాణాన్ని వేసుకుంటూనే ఉన్నాడు. బిడ్డను చూసి రావల్లని ఒకటే పోరు పెడతా వుంటే భార్య రాధమ్మకేదో సర్ది చెప్పుకుని నెట్టుకొస్తున్నాడు.

రెండు మూడు వీధులు దాటాడు. మసీదు దగ్గర సైకిల్ ఆపి బన్ను తిని టీ తాగి, అక్కడినుండి కదిలాడు. పాతపేట దాటి బెంగుళూరు- తిరుపతి  రోడ్డు దాటి కొత్తపేటలోకి ప్రవేశించాడు.

‘ఎర్రమన్ను అమ్ముతాం, ముగ్గుపిండి అమ్ముతాం. ఎర్రమన్ను ఎర్రమన్ను.. ముగ్గుపిండమ్మా…. ముగ్గుపిండి ఎర్రమన్ను…. ఎర్రర్రెన్ని ఎర్రమన్ను ముగ్గుపిండి, తెల్లతెల్లని ముగ్గుపిండి…’ రాగయుక్తంగా అరచుకుంటూ వీధుల వెంట తిరుగుతూ వున్నాడు, సైకిల్ని తోసుకుంటూ, తొక్కుకుంటూ, నెట్టుకుంటూ.

ముత్తాచారిపాళెం వీధిలో ఒకామె ముగ్గులేయటం ఆపి ఎర్రమన్ను, ముగ్గుపిండి బేరం చేస్తుంటే మా లక్ష్మి… ఈ రోజు మంచి బోణీ, యాపారం చల్లగా జరిగిపోతుంది అనుకుంటూ మనసులోనే అనుకుంటూ  గట్టిగానే పైకే అనేసాడు.

ఆయమ్మ నవ్వుకుంటూ వెళ్ళి డబ్బు తీసుకొచ్చింది. తన సైకిల్ వెనుక క్యారియర్ పై  ఒడుపుగా కట్టిన రెండు ప్లాస్టిక్ సంచుల్ని విప్పి ఇనుప డబ్బాతో కొలిచి ఎర్రమన్ను, ముగ్గుపిండిని ఆమె తెచ్చిన చాటలోకి వంచాడు.ఆమె అడక్కుండానే కొసరుగా ఇంకొంచెం వేసాడు. ఆమె ఇచ్చిన ఇరవై రూపాయల్ని కళ్ళకద్దుకుని మళ్ళీ పాడిన పాటే పాడుకుంటూ ముందుకు కదిలాడు.

రాధమ్మది రాయచోటి దగ్గర టి.సుండుపల్లి, నరసింహులుది పలమనేరు దగ్గర నూనెవారిపల్లి. పెండ్లయిన ఐదారేళ్ళు పల్లెలోనే వుండిపోయారు. కానీ రాధమ్మ బిడ్డల్ని బాగా చదివించాలని, పల్లెలో వుంటే ఏండ్లు గడిచినా ఎదుగూబొదుగూ లేకుండా ఎక్కడుండే వాళ్ళు అట్లే వుండిపోతామని పోరితే,   పల్లె విడిచి టౌన్ కు వచ్చి పదిహేడు సంవత్సరాలవుతోంది.

మొదట్లో  నరసింహులు పందుల వ్యాపారమే చేసేవాడు. పందుల్ని కొనటంలో అమ్మటంలో మంచి నేర్పరి. టౌన్ కు  వచ్చిన తర్వాత కూడా ఈపక్క కదిరి నుండి ఆపక్క శ్రీకాళహస్తి దాకా , ఇంకోపక్క తమిళనాడు లోని వాణియంబాడి నుండి కర్ణాటకలో కోలార్ వరకూ  పందుల వ్యాపారం కోసం అన్ని ఊర్లు  తిరిగాడు.ఎక్కడ ఏది లాభసాటి వ్యాపారమో, ద మెళకువలన్నీ   ఊర్లన్నీతిరిగి తిరిగి నేర్చుకున్నాడు.  దళారుల మోసాలకు గురికాకుండా తమిళం,కన్నడం  నేర్చుకున్నాడు. పై ఆఫీసర్లు , ఊర్లో మతింపు వుండే వాళ్ళు పోరు పెడితే నెలకు నాలుగైదుసార్లు, అడపాదడపా పండగలు దేవర్లప్పుడు  సీమపందుల్ని తెచ్చి కోసి ఇంటి వద్దే  అమ్మేవాడు. కొంతమంది పైల్స్ సమస్య తగ్గిపోవడానికని , ఇంకొంత మంది పెద్దోళ్ళు ఇష్టంగా తినటానికని  కావాలంటారు  కానీ, యస్టీ కాలనిలోకి రావడానికి మాత్రం ఇష్టపడరు. వాళ్ళు తినేది బయట ఎవరికీ తెలియకూడదు అనుకుంటారు.అలాంటి వాళ్ళకు వాళ్ళ  ఇండ్లవద్దకే సీమపంది మాంసం తీసుకు వెళ్లి ఇచ్చేవాడు.  సీమపందులలో ఏది మంచిదో, ఏది జబ్బుతో వుందో , దేని మాంసం గట్టిగా వుంటుందో, దేని మాంసం మృధువుగా వుంటుందో చూసీ చూడగానే ఇట్టే చెప్పేసే వాడు.

అదంతా ఒకప్పటి కథ. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ, ఊరు పెద్దదయ్యే కొద్దీ పందుల పెంపకంపైన ఆంక్షలు ఎక్కువయ్యే కొద్దీ రాధమ్మ శతవిధాలా నచ్చచెప్పి అతడిచేత బలవంతంగా ఆ వ్యాపారం మాన్పించింది.

నాగలకుంటలో ఎరుకల కాలనీ ఏర్పడ్డాక నరసింహులు ఎట్లాగో కాలనీ ఇల్లు కట్టుకోగలిగాడంటే అతడు చేసిన పందుల వ్యాపారం వల్లనే అని  ఇప్పటికీ రాధమ్మతో అంటుంటాడు.

“ఎవడి బతుకు తెరువు వాడిది లేమ్మే. ఎవడి మానం మర్యాద వాడిదే. నా మాటినుమ్మే. ఇన్నేండ్లూ మనం బతకుతా ఉండేది ఈ యాపారంలోనే. మనకు కూడు గూడు ఇచ్చిండేదాన్ని కాలదన్నుకున్నామంటే మళ్లింకా  లేని బాధలు పడాల్సి వస్తుంది” అని అప్పటికీ ఎంతెంతో చెప్పి చూసాడు.

“మనం గానా ఇంకా పందుల్ని మేపతా ఊరికి దూరంగా వుండిపోయామంటే మన పిలకాయలకు విలువేముంటుందబ్బా. మీ నాయినేం చేస్తాడని పిలకాయల్ని ఎవరైనా అడిగితే వాళ్లేం చెప్పుకోవాల్నో  చెప్పు. నువ్వీ పని చేస్తావుంటే మన పిలకాయల్ని ఎవరైనా దగ్గరకు చేరస్తారా.నలుగుర్లో మనకైనా వాళ్ళకైనా ఏం మర్యాదుంటుంది. చెప్పు. గుడిసెలో వుండేటప్పుడు పందులు పెంచినా, గాడిదలు పెంచినా సరిపోతుందబ్బా. గుడిసె వదిలి కాలనీ ఇంట్లోకి చేరినంక కూడా ఇంకా పందులు గిందులు అన్నావంటే నేను పిలకాయల్ని తీసుకుని మా పెద్దయ్య కాడికి బెంగులూరికి ఎల్లిపోతా. కూలోనాలో చేసుకుని అయినా నా బిడ్డల్ని నేనే సదివించుకుంటా.ఊరూ పేరూ , ముక్కూ మొగం తెలియని చోట జనాలు ఎవుర్ని ఎవురూ పట్టించుకోని చోట అయితే మన కులం ఏంది అని అడిగే నాబట్ట వుండడు.  ” అని రాధమ్మ గట్టిగా బెదిరించేసరికి నరసింహులు దిగిరాక తప్పలేదు.

దాంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్న జీవాల్ని నరసింహులు అమ్మేయక తప్పలేదు.వందలూ వేలు లెక్కేసిన చేతులతో ఇప్పుడు పది, ఇరవై లేక్కేస్తుంటే అతడికి గుండెల్లో మంటగా వుంటుంది. రాన్రానూ అసలు పంది మాంసం ఇంట్లోకే రాకూడదని ఆమె తెగేసి చెప్పినప్పుడు మాత్రం  పెద్ద గొడవలే అయ్యాయి.

“ మనిషి తినేదాన్ని బట్టి మనిషికి విలువ తగ్గేది పెరిగేది అని యాడున్దిమే. పెద్ద పెద్దోళ్ళు పండగలకి ఊర్లల్లో  చాటుగా అయినా తరతరాలుగా తింటానే వుండారు.కాదని ఎవరంటారో చెప్పు”

ఎంతగా వాదించినా  చివరికి  ఆమె మాటలకి తల వంచక తప్పలేదు. ఎప్పుడైనా భ్రమ పుట్టినప్పుడు అతడు బంధువుల ఇండ్లల్లో నో,  హోటల్లోనో  తినటం అలవాటు చేసుకున్నాడు.

ఎవరో ఒకామె దారికి అడ్డం రావడంతో సైకిల్ బ్రేకు  బెల్లు ఒకేసారి వేసాడు. బెల్ మూగబోవడంతో దాని నెత్తిన అరచేత్తో కోపంగా గట్టిగా  చరిచాడు నరసింహులు. పైన బెల్ చుట్టూ అరచేత్తో తట్టి చూసాడు. కానీ బెల్లు పనిచేయనేలేదు. అరచెయ్యి మాత్రం మంట పుట్టింది.

దీనెమ్మ… ఎంత నూనె పోసినా…ఈ  బెల్లు పనికిరాకుండా పోతాండాది. ఈ సైకిలు మారిస్తే తప్ప ఈ దరిద్రం వదిలేటట్లు లేదు. దీన్ని ఒదలాలన్యా మనసురాదు. పెట్టుకోవాలనుకున్నా పనికి కుదరదు. మోకాళ్ళు నొప్పులు కూడా వస్తాన్డాయి బలంగా సైకిలు తొక్కి తొక్కి  అనుకుంటూ తన పాటను రాగయుక్తంగా ఆలపిస్తూ, సైకిల్ను తోసుకుంటూ రంగాపురంలోకి వచ్చాడు.

అప్పటికే తయారైన  పిల్లల్ని సైకిళ్ళపైనా, స్కూటర్లపైనా కూర్చోబెట్టుకుని కొందరు తండ్రులు స్కూళ్ళకు వెడుతున్నారు. ఆటోల నిండా ఇరుక్కుని కూర్చుని, నిలుచొని  నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హుషారుగా పోతున్నారు కాన్వెంటు పిల్లలు . ఆ పిల్లల్ని చూడగానే తమ పిల్లల్ని పట్టుబట్టి ఇంగ్లీష్ మీడియం కాన్వెంటులోనే చదివించిన రాధమ్మ పట్టుదల మొండితనం గుర్తు వచ్చేసరికి అతడి పెదాల పైకి మెల్లగా నవ్వు వచ్చింది.

ఉన్నట్లుండి ఎడమ మోకాలు కలుక్కుమనటంతో షాక్ కొట్టినట్లై అక్కడే ఆగిపోయాడు నరసింహులు. ఆ నొప్పికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.ఏ మాత్రం తమని పట్టించుకోని  కొడుకులు గుర్తొచ్చారు.

సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ళు అరిగిపోయాయి. ఒంట్లో పటుత్వం తగ్గి నీరసం పెరిగిపోయింది. మోకాళ్ళు కళుక్కుమన్నప్పుడల్లా అతనికి తన ఇద్దరు కొడుకులు గుర్తొస్తారు. ఒకరైనా తనకు మంచి డాక్టర్ వద్ద వైద్యం చేయించకూడదా అనిపిస్తుంది.  సైకిల్ స్టాండు వేసి సిమెంటు చప్టాపై అచేతనంగా కూలబడిపోయాడు.రాధమ్మ ఈ మధ్యే బేలుపల్లి నుండి తెప్పించిన నూనె రాసుకుంటున్నాడు కాబట్టి ఈ మాత్రం అయినా కదులుతున్నాడు.

నరసింహులుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. తొలిబిడ్డ, చివరి బిడ్డ ఆడపిల్లలు, మిగిలిన ఇద్దరూ మగపిల్లలు, రాధమ్మ ఆడపిల్లల్ని ఏనాడూ గారాబంగా పెంచకపోయిన మగపిల్లల్ని బాగానే ముద్దు చేసింది. ఆమె ముద్దూ, మురిపాలు, ముచ్చట్లూ, కబుర్లూ ఆశలు అన్నీ మగపిల్లలతోటే. దబ్బలు అల్లి, వెదురు బుట్టలు, చాటలు చెయ్యటంలో ఎరుకల ఇండ్లల్లో రాధమ్మవి గొప్ప చేతులు. కొంగు బిగించి, చీర మడిచికట్టి జుట్టు ముడివేసుకుని, వక్కాకు నములుతూ వెదురుబొంగుల్ని చీల్చి, వెదురుదబ్బల్ని మచ్చుకత్తితో ఒడుపుగా తనకు కావలసిన విధంగా పొట్టు తీస్తావుంటే వీధిలో జనం విచిత్రపోయి చూస్తా నిలబడేవాళ్ళు.

వారమంతా  గంపలు, చాపలు, బుట్టలు తయారుచేసేది. పక్కనే జగమర్ల అడవికి  వెళ్ళి యందు కట్టెలు, పొరకలు ఏరుకొచ్చేది.శుక్రవారం పలమనేరులో, శనివారం బైరెడ్డిపల్లిలో , పుంగనూరు, బంగారుపాళ్యం ,  చౌడేపల్లి సంతల్లో వాటిని ఆమె అమ్ముకొచ్చేది.ఆమెకి చెట్టు ఎక్కడం తెలుసు, ఒడుపుగా తేనే తీయడం తెలుసు.చింతకాయలు రాల్చడం తెలుసు. అడవిలో నేరేడుపళ్ళు, శీతాఫలాలు తెచ్చుకోవడమూ తెలుసు.

పిల్లల కోసం ఆమె ముందు నుండీ  రకరకాలుగా కష్టపడేది. రూపాయి, రూపాయి దాచిపెట్టేది. ఆమె ధ్యాసంతా కొడుకులపైనే. ఎప్పుడూ ఒక కొత్తచీర అయినా కొనుక్కునేది కాదు. పాత చీరల్ని ఊర్లో అడిగి తెచ్చుకునేది. దగ్గరిలోని అడవికి వెళ్ళి ఎలక్కాయలు, చింతపండు, నేరేడు పండ్లు, సీతాఫలాలు తెచ్చి బజార్లు తిరిగి,తిరిగి అమ్ముకొచ్చేది. పిల్లల్ని మురిపెంగా సాకేది. పదవతరగతి దాటి, ఇంటర్మీడియేట్లో చేరిన తర్వాత వాళ్ళు అడిగిందంతా కొనిచ్చింది. డిగ్రీ చదువులు అయిపోయేసరికి ఆమె ఒంట్లోని శక్తంతా ఆవిరైపోయింది. విపరీతమైన దగ్గు, ఆయాసం, నరాల బలహీనత ఆమెకు తోడయ్యాయి.రక్తం తగ్గి పోయింది, కొన్నాళ్ళకి రక్తపోటు వచ్చింది. 

అంత పరిస్థితుల్లోనూ ఒకరోజయినా ఆయమ్మ ఇంట్లో  విశ్రాంతిగా పడుకుంది లేదు.

“పడుకుంటే పొద్దు  గడిసిపోతుంది కానీ బ్రతుకు గడిసేది ఎట్లబ్బా. కొడుకుల చదువులు అయిపోయేంత వరకే మనకీ గాచ్చారం. వాళ్ళ సదువులు అయిపోనీ, ఉద్యోగాలు రానీ, మనకీ మంచి రోజులు వస్తాయి. మళ్ళింక వాళ్ళే మనల్ని చూసుకుంటార్లే. మన పిలకాయల కోసం  మనం ఇంకా ఇంకా కష్టపడల్లబ్బా.ఒళ్ళు దాసుకో కూడదు  ” అనేది రాధమ్మ వెలిగే కళ్ళతో.

ఆమె అన్నట్లే రోజులు గడిచాయి.కొడుకులిద్దరికీ యస్టి కోటాలో గవర్నమెంటు ఉద్యోగాలు వచ్చాయి. మదనపల్లి ఇరిగేషన్ ఆఫీసులో ఒకడు, తిరుపతి రైల్వేలో ఇంకొకడు గుమాస్తాలుగా చేరి నాలుగేళ్ళు అవుతోంది.

వస్తున్న దగ్గుతెరని ఆపుకుంటూ లేచి సైకిల్ ని  తోసుకుంటూ రెండో సందు కూడా  తిరిగాడు. ఇద్దరు ఆడవాళ్ళు బేరమాడి, బేరమాడి ఎర్రమన్ను ముగ్గుపిండి  కొనుకున్నారు.

వాళ్ళ బేరసారాల్ని చూస్తుంటే రాధమ్మ గుర్తొచ్చింది.సంతలో కూరగాయలు బేరమాడి, బేరమాడి కొనేది. బజార్లో బట్టలు కొన్నా, సరుకులు కొన్నా బాగా బేరమాడేది. లోక్యంగా నేర్పుగా మాట్లాడేది. వాళ్ళు ఒకవేళ  తగ్గించకపోతే గొడవ పెట్టుకునేది.ఎందుకే అంతగా బేరమాడతావు అని అడిగితే… “ఎట్లానో నాలుగు రూపాయలు మిగిలిస్తేనే కదబ్బా మన పిలకాయలకి ఏదో అవసరానికి పనికొస్తుంది ” అనేది నవ్వుతూ.చీటీలు కట్టేది, పోస్ట్ ఆఫీస్ లో డబ్బు దాచేది . డ్వాక్రా గ్రూప్ లో చేరి  బాగా లెక్కలు, మాటలు  నేర్చుకున్నావు మే అంటాడు నరసింహులు. నేను కష్టపడినా, నేను మాటలు లెక్కలు నేర్చినా అదంతా  మన పిల్లోల్ల కోసమే కదా అంటుంది ఆమె తేలిగ్గా నవ్వేస్తూ. 

కొడుకులు ఇద్దరికీ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళే దొరికారు. ఎవరూ సాటి కులమోళ్ళు కాదు. కొడుకులిద్దరూ ఇంటికొచ్చి రెండేండ్లు దాటుతోంది. రాధమ్మకు బిడ్డల్ని చూడాలనిపించి చిన్న కూతుర్ని వెంటబెట్టుకొని కొడుకుల ఇండ్లకు వెళ్ళొచ్చింది. కానీ అట్లా ఊర్లు తిరిగొచ్చినాక ఆమె అనారోగ్యం ఇంకా ముదిరిపోయింది.మనసూ చెదిరి పోయింది.

“ఎప్పుడూ ఈ పక్క రాబోకమ్మా… మనం ఎరుకలోళ్లం అని ఈ పక్క ఎవరికీ తెలీదు. నువ్వొచ్చి మమ్మల్ని అగుడు చెయ్యొద్దు. మాకుండే మానం మర్యాద అట్లనే ఉండాలంటే  ఇంకెప్పుడూ మా ఇండ్లకు రాబోకమ్మా తల్లీ నీకు పుణ్యం ఉంటుంది ” అనేసిన కొడుకుల్ని ఆమె అసహ్యించుకోలేదు.కోపం తెచ్చుకోలేదు.

పెద్దకూతురి పెండ్లికి, కాన్పుకి చేసిన  అప్పులింకా అట్లే ఉన్నాయి.వడ్డీలు వున్నాయి.చిన్నకూతురు పెళ్ళికి ఇంకా ఏదీ సమకూర్చుకోనేలేదు.ఇద్దరు కొడుకులకి, వాళ్ళ భార్యపిల్లలకి ఇక్కడినుండి తీసుకుపోయిన కొత్తబట్టల తాలూకు అప్పు కూడా దానికి తోడయ్యింది. చిన్న కూతురికి పెండ్లి చెయ్యడం కోసం అనారోగ్యం పట్టించుకోకుండా  ఆమె ఇంకా  వెదుర్లు చీలుస్తూనే వుంది. దబ్బలు, బుట్టలు, చాటలు  అల్లుతూనే ఉంది. తోడుగా మనుషులు కుదిరినప్పుడల్లా ఇప్పుడు కూడా అడవికి పోతానే వుంది.సంతలకి తిరగాతనే వుంది. కాలంతో బాటూ  ఇంకొన్ని రకరకాల కొత్త పనులు కూడా నేర్చుకుంది. డ్వాక్రా గ్రూపు ఆడోళ్ళతో కలసి పెండ్లి పనులప్పుడు వంట పనులకు పోతావుంటుంది. పెద్దింటి ఆడోల్లకు తలకు కాళ్ళు, చేతులకు  గోరింటాకు పెట్టేది, ఆడపిల్లలకి పూలజడ కుట్టేది, ఇండ్లల్లో  ఫంక్షన్స్ అప్పుడు  ఆ ఇంట్లో ఆడవాళ్లకి అన్ని రకాల పనుల్లో సహాయం చెయ్యటంలాంటి ఎన్నో  పనులను ఒక విద్య మాదిరి  నేర్చుకుంది. అట్లా పెద్దోల్ల ఇండ్లకు  పనుల కోసం  వెళ్లేందుకు బట్టలు కూడా వేరుగా కొనుక్కుంది.అప్పుడు ఆమె కొత్తగా ఉంటుంది. రాధమ్మలా కనిపించదు. వేరే ఎవరో అనిపిస్తుంది.

“ ఇప్పుడుగానా ఆ నా కొడుకులు చూస్తే ఈమే వాళ్ళ అమ్మ అని ఇప్పుడైనా అనుకుంటారేమో  ” అంటాడు నరసింహులు చిన్న కూతురితో మురిపంగా ఆమెనే చూస్తా.             

ఆమె పడే కష్టాన్ని చూసి మనసు ఉండబట్టలేక..  “ ఆ ఇద్దరు మొగపిల్లల్ని సాకే బదులు గమ్మునా నాలుగు పందుల్ని పెంచింటే బావుండేది. రాధమ్మ… అవన్నా మనల్ని సాకింటాయి మే ” అంటాడు నరసింహులు.

“ అయ్యో ..  అట్లా  అనొద్దబ్బా . కొడుకులకి తెలిస్తే బాధపడతారు ” అంటుంది రాధమ్మ నొచ్చుకొంటూ.

3 thoughts on “ఎర్రమన్ను, ముగ్గుపిండి

Leave a Reply