ఊరు మొత్తం  ఒక్కసారిగా  ఉలిక్కిపడింది.

ఏనుగులు అడవి దాటి సరాసరి కోటూరు వద్ద పొలాల్లోకి వచ్చేసాయి.ఎన్ని వచ్చాయో ఎవరికీ తెలీదుఎవరూ సరిగ్గా చూడలేదు. అంత సమయం లేదు. పొలాల్లో అక్కడక్కడా  పనులు చేసుకుంటున్న రైతులు అందరూ  పలుగూ పారా కత్తీ, కొడవలితట్టాబుట్టా ఎక్కడవి అక్కడే పడేసి కేకలు పెట్టుకుంటూ ఒకర్ని ఒకరు హెచ్చరించుకుంటూ పరుగుపరుగున ఊర్లోకి వచ్చేశారు.

ఏనుగులు వచ్చేసాయి, ఏనుగులంట.. గుంపులు గుంపులుగా వచ్చేసాయంట ..”

రోజు ఎవురికి మూడిందో ఏమో .. ఎవరి  పంటలు తినేసి, తొక్కేసి పోతాయో  ఏమో ? “

 “ముండా ఏనుగులు, మిడిమాలం ఏనుగులు ..తినేది కాల్ బాగం, తొక్కేసి నాశనం చేసేసి పోయేది ముక్కాల్ బాగం’’

మనుషుల  ప్రాణాలకే దిక్కులేకుండా పొతా వుంటే  ఇంక పంటల గురించి ఎందుకులేన్నా  మాట్లాడేది. ముందంతా వానల్లేకుండా కరువుతో  నిండా మునిగిపోతిమి. ఇప్పుడేమో పంట చేతికి వస్తా వుండాదనుకునే లోపలే ఏనుగులొచ్చి పొలాలఫైనా, తోటలఫైనా  పడిపోతా వుoడాయి. ఇంకెప్పుడు మన కష్టాలు తీరతాయో.. ఏమోన్నా”  రైతుల మాటల మధ్యనే ఊరు మొత్తం ఒక్క చోట చేరిపోయింది.

“  ఏటిగడ్డకు  పక్క మామిడి తోపులోకి వచ్చేసినాయంటనే . అయ్యో పాపం మొగుడు కూడా లేదు ఒంటరి ఎరుకలామెఅయినా మొగరాయుడి మాదిరితో  సేద్యం చేస్తా వుంది.ఇద్దరూ ఆడబిడ్డలే.. ఎరుకలమ్మకే రావల్లనా ఇంత కష్టం. పాపం కట్టెలామె ఎట్లా తట్టుకుంటుందో కష్టాన్ని .”

 “ ఆహాహా..ఏం ఎరుకలామేకేనా  వుండేది బాధలు. ఈడ బాధలల్లేంది ఎవురికో చెప్పు  .. ఇంటింటికో బాధ ఉండనే  వుంటాదిఅందరూ అందర్తో  చెప్పుకోరంతే.”

అప్పటికే కొందరు మిద్దెలు ఎక్కేసారు. కొందరు చెట్లపైకి  ఎక్కి చూస్తున్నారు. కొందరిలో కుతూహలం, కొందరిలో అలజడి.. మొత్తంమీద అందరికీ భయం భయంగానే ఉంది.

ఏమీ అర్థంకాని  చిన్న పిల్లలు అయోమయంగా చూస్తూ తల్లులని అంటుకుపోతున్నారు. ముసలివాళ్ళు వక్కాకు నములుతూ , బీడీలు కాలుస్తూ తలలు తిప్పుతూ   పొలాల వైపు, మనుషుల మొహాల వైపు మార్చి మార్చి చూస్తూ వున్నారు.

 చేస్తున్న వంటపనులు ఆపేసి,ఇంటి తలుపైనా వెయ్యకుండా  ఒక్క పరుగులో  అక్కడకి వచ్చి గభాలున మిద్దె ఎక్కి కళ్ళు పెద్దవి చేసుకుని అవునా, కాదా అన్నట్లు పరీక్షగా చూసి , ఏనుగులు వచ్చిండేది, ఇప్పుడు వుండేది తమ పొలాలంలోనే అని   కట్టెలామెకి  నిర్ధారణ అయిపోయింది.

  విషయం అర్థం అయ్యాక అక్కడ ఆమె   ఒక్క క్షణం కూడా ఉండలేక పోయింది. జరుగుతున్న ఘోరాన్ని చూసే శక్తి తనకు లేదన్నట్టు  అంతే వేగంగా మిద్దె దిగేసి , మట్టి రోడ్డు పైకి వచ్చి అక్కడే  కూర్చునేసింది ఆదెమ్మ. ఆమెతోబాటే వచ్చిన ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు మాత్రం  మిద్దెపైనే నిలబడిపోయి మామిడితోపు వైపే కళ్ళప్పగించి చూస్తూ ఏడుస్తూ ఉండిపోతే ఇంకో అమ్మాయి వాళ్ళమ్మతో బాటే  తోడుగా వచ్చి ఏడుస్తూ రోడ్డు పైనే  కూర్చునేసింది.

  “ వాడు చూస్తే కరెంటోల్ల కాడ   కాంట్రాక్ట్ పనికి పోయికరెంట్ మానెక్కి షాక్ కొట్టి  సచ్చిపోయా. ఇద్దరాడ పిల్లల్ని నా  మొఖాన ఏసేసి  వాని దావా వాడు చూసుకుండె, రాత్రీ పగలూ బిడ్డల్ని సాకినట్లు సాకినా మామిడిచెట్టుల్ని  , తినేది ఏందో కడుపునిండా తినేసి పోకుండా ఆటలాటకు తోపు మొత్తం   నాశనం చేస్తా వుండాయి  ముండా ఏనుగులు .  ”

అక్కడ గుంపు చేరిన వాళ్ళు  ఒక వైపు ఆమె ఏడుపు వింటూనే మరో వైపు ఏనుగుల కదలికలు చూస్తూనే మాట్లాడుకుంటూ ఉన్నారు.

  “ ఆయమ్మ ఒంటరి ఆడదని, మొగుడు కరెంటు మానెక్కి సచ్చిపోయినాడని, ఇద్దరు అడబిడ్డలకి ఇంకా పెండ్లీ దేవరా చెయ్యాల్సి వుందని  ఏనుగులకు ఏమైనా తెలస్తాదా. నీలాంటోడు ఎవుడన్నా ఏనుగుల ముందుకు పొయ్యి చెప్తేనే  కదా తెలిసేది .”

ఊర్లో పందులు మేపేది వద్దని ఊరంతా తీర్మానించినాకే కదా అబ్బోడు ఎరికిలోళ్ళ కులాచారాన్ని పక్కనపెట్టి, మిగిలిండే పందుల్ని పందిపిల్లల్ని అయిన కాడికి అరవదేశమోల్లకి అమ్మేసినాడు. “

 “ అందుకే కదా కరెంటు పనికి పోతా వున్యాడు.మనం ఎరికిలోల్లని పొలం పనులకి రానివ్వం కదా వూరి కట్టుబాటు, తరతరాల ఆచారం కదా. అయినా నాకు తెలవక అడగతా ఆయబ్బోడు పందుల్ని అమ్మేసింది వూరోల్ల మాటలు విని కాదు కదా. పంచాయతీ ఆఫీసోళ్ళు దండోరా కొట్టి, రెండుమూడుతూర్లు నోటీసులు ఇచ్చినాకే  కదా మనిషి కదిలినాడు. ఊర్లోనే గానా ఉంటే పందుల్ని కాల్చేస్తామని చెప్పినాకే కదా కదిలినాడు   ”

 యాభై అయిదు పైనే వయస్సు, బక్కపలుచటి పొట్టిమనిషి. ఆమె చేతులు పుల్లల్లాగా వుంటాయి. అడవికిపోయి కట్టెలు కొట్టిటౌన్ లోకి వెళ్లి అమ్మే పనులు చేసే కాలంలో ఆమె మోసే కట్టెల మోపు పెద్దదిగా వుండేది. ఇంత చిన్న మనిషి ఇన్ని కట్టెలు కొట్టిందా అని అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు.

 పెద్దమోపులు  కాబట్టి ఆమె తెచ్చే కట్టెల మోపులకు బాగా డిమాండు వుండేది. కట్టెలకు డిమాండు వుండేటప్పుడు రాత్రీ  పగలు ఆమె మగవాళ్ళతో సమానంగా కష్టపడేది. చీర పైన మొగుడి చొక్కా తొడుక్కుని,ఆమె అంత వేగంగా కట్టెల మోపులు ఫారెస్ట్ ఉద్యోగుల కళ్ళ బడకుండా అడవి దాటించేది చూసి ఎలక పిల్ల మాదిరి  వుంది ఎరుకల పిల్ల చూసేదానికి.అయినా ఎంత గట్టిది అనే వాళ్ళు వూర్లో జనం. ఆంక్షలు ఎక్కువై ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెట్టడం , కొంత మంది కేసుల్లో ఇరుక్కుని ఫారెస్టు ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి సంపాదించింది అంతా వడ్డీతో సహా ఖర్చు పెట్టుకుంది చూసిన తర్వాత , గ్యాసు సిలిండర్లు  వచ్చేసాకఫారెస్ట్ వాళ్ళ హెచ్చరికలు కేసుల భయంతో  అడవిలోకి పోవడం తగ్గిపోయిందిచూడడానికి ఎండుకట్టెలా వున్నా కాలంలో  కట్టెల మోపులు మోసి  బ్రతికింది కాబట్టి  ఆమెకు కట్టెలామె అనే పేరు వచ్చేసింది. చాలా ధైర్యం గల మనిషిగా ఆమె అందరికీ తెలుసు. ఆమెకి అడవి అన్నా, అడవి జంతువులన్నాచీకటి అన్నా , ఫారెస్ట్ అధికారులన్నా భయమే లేదు.

ఇప్పుడు కట్టెలామే అట్లా నడిరోడ్డులో కుర్చుని కళ్ళనిండా నీళ్ళతో , బిగ్గరగా ఏడుస్తోంది. భయం లేని మనిషని ఊరంతా ఒప్పుకున్న జనం ఆమె వైపు జాలిగా చూస్తున్నారు. ఆమె రెక్కల కష్టం అది. రెండెకరాల మామిడితోపు అమ్మకానికి వచ్చినప్పుడు  మొగుడితో గొడవలు పడి, తెగాయించి మరీ పందుల్ని అమ్మించేసింది. తనవద్ద వుండే  రవ్వంత బంగారం అమ్మేసింది. ఇంట్లో వుండే స్టీల్ సామాన్లు, వెదురు తట్టలు బుట్టలు  సహా అమ్మేసి మొత్తం ఆశలన్నీ మామిడి తోపు పైనే పెట్టుకుంది. అదే ఇప్పడు ఆమె ఏడుపుకు కారణం .

 “ పెడ్లి అయినాక పదేండ్లకు కానీ నాకు బిడ్డలు పుట్టలే.అయినా వాళ్ళకంటే మురిపంగానే మామిడి మొక్కల్నే బిడ్డల మాదిరి  సాకినా .రాత్రి పగలూ పిల్లాజల్లా చూడకుండా , గొడ్డూగోదా పోకుండా కంటికి రెప్పమాదిరి సాకితినే, ఎవురు అడిగినా  నాలుగు మామిడి కాయలు తెంపి ఇచ్చేదానికి నాకు చేతులు రాకుండా పోయిందే, ఇప్పుడుతోట మొత్తం ఖాళీ అయిపోతావుంది. నేనేం పాపం చేసినానురా తండ్రీ ?ఎందుకింత  కడుపు కోత  పెడతాండావు. ఇద్దరు ఆడ పిలకాయలతో నేనెట్లా బ్రతకాలిరా తండ్రో, నాకు ఇంకా దిక్కు ఎవర్రా దేవుడో  “రాగాలు తీస్తా శోకాలు పెడతా  వుంది కట్టెలామె.

మిద్దె పైన గుంపు పెద్దదయింది. కొందరు సెల్ ఫోనుల్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారుఅప్పటిదాకా మిద్దెపైన నిలబడి మామిడితోపులో జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తూ వుండిపోయిన పన్నెండేళ్ళ నీలిమ మిద్దె దిగి ఒక్క ఉదుటున వాళ్ళ అమ్మ పక్కనే నిలబడిమొత్తం కాయలన్నీ తినేసి కొమ్మలు విరిసి తోక్కతా వుండాయిమా.. మోటారు స్టార్టర్ కూడా మిగల్లేదు ..“ అంది ఏడుస్తూ చేతులు ఊపుతూ . మాట వినగానే కట్టెలామెకు ఒళ్ళు జలదరించింది.దిగ్గున లేచి నుంచుంది.జుట్టు ముడేసుకుంది. నెటికలు విరుస్తూ కిందకు వంగి రెండు చేతులతో మట్టి తీసుకుని తన తోట ఉన్న దిశగా గాల్లోకి  దుమ్మెత్తిపోస్తూ శాపనార్థాలు పెడుతోంది.

 “..నా ఉసురు పోసుకునే దానికి యాడినుంచి యాడిదాకా వచ్చినాయమ్మా రాకాసి ఏనుగులు.. రోజుతో మొత్తం పోయా..మామిడి కాయలు పోయా, మామిడి చెట్లూ  పోయా అనుకుంటేనా  బతుక్కి జీవనాధారం లేకుండా వాటి పొట్టన పెట్టుకుంటే నేనేం చెయ్యాలిరా బగవంతుడా ? మోటార్ కూడా కాలికింద ఏసి తోక్కేస్తా వుంటే, ఇంకా నేను యెట్లా బ్రతకాలిరా తండ్రీ  ? ”

 కొందరు ఆడవాళ్ళకు బాధగానే వుంది.ఓదార్పు మాటలు చెప్పాలని, ఆమెకు ధైర్యం చెప్పాలని ఉంది కానీ ఎవరూ నోరు విప్పే సాహసం చేయడం లేదు.

సర్పంచ్ చిన్నస్వామికి అలాగే అనిపించి రెండు అడుగులు ముందుకు వేసాడు. అడుగులైతే ముందుకు పడ్డాయి కానీ మాటలే రాలేదు గొంతులోంచి. ఆమె శోకాలు అందరినీ కదిలిస్తున్నాయి.అందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఆమె రెక్కల కష్టం ఏమిటో ఎలాంటిదో అందరికీ తెలుసు.

 ఆమె మామిడి తోపుకు పక్కనే పొలాలు, తోపులు వున్న రైతులు మిద్దె ఎక్కి కంగారుగా అక్కడినుండి ఏనుగుల కదలికలనే కళ్ళార్పకుండా  చూస్తూ  వున్నారు.ఎక్కడ తమ పొలాల్లోకి, తోటల్లోకి క్షణం ఏనుగులు వచ్చి విధ్వంశం సృష్టిస్తాయేమో   అనే  భయంతో వాళ్ళు

 నిముషాలు, గంటలూ  గడుస్తూ వున్నాయిదుఖం, బాధ, ఆవేశం పెనవేసుకుపోయిన గొంతుతో ఆమె ఏనుగుల్ని కాస్సేపు, దేవుడిని కాస్సేపు విడివిడిగానూ కాస్సేపు కలిపి  తిడుతూ వుంది.

సెల్ ఫోన్స్ సమాచారాన్ని అందించాయి.పోలీసులు రాలేదు, ఫారెస్ట్ వాళ్ళూ రాలేదుకానీ తక్షణమే వచ్చిన వాళ్ళు ఏనుగుల జాడలు అన్వేషించే ట్రాకర్స్ మాత్రమే.

వాళ్ళు నెల కూలికి  అటవీశాఖ అధికారుల కింద  పనిచేసేవాళ్ళు మాత్రమే. అయినా వాళ్ళు చేసే పనులు, వాళ్ళు పడే కష్టాలు లెక్కలేనివి. ప్రభుత్వ లెక్కల్లో లేనివి. ప్రభుత్వ ఉద్యోగస్తులెవరు  పని చేసినా చెయ్యకపోయినా  రాత్రనక పగలనక ఎండల్లో వానల్లో చలిలో నిరంతరం అడవుల్లో ఏనుగుల జాడల్ని వెతకడమే వాళ్ళ పని. ఊర్లోకి రానివ్వకుండా పోలాలపైకి రాకుండా ఏనుగుల్ని అడవిలోపలికి నిరంతరం తోలడమే వాళ్ళ పని.  

ఏలుమలై అన్నా.. అదో ఆడ సూడు గుండుకు ఎడంపక్క కనిపిస్తా వుండాది చూడు గాటి ఏనుగు వచ్చేసిండాది. జనాల్ని చూస్తేచాలు దానికి తిక్కరేగుతుంది. దాన్ని ఇంకా అపేదానికి ఎవరివల్లా కాదు నోవ్. జనాలకి ముందుగానే చెప్పేయల్ల, ఎవురైనా మొండిగా ముందుకో ఎనక్కో పోయినారంటే మాత్రం వాళ్ళ ప్రాణాలకు మనం గ్యారెంటీ కాదు. ” బైనాకులర్స్ తో పరీక్షగా చూస్తూ ఎడమ  చేతి చూపుడు వేలుతో అటు వైపు చూపిస్తూ మాట్లాడుతున్నాడు మొగిలప్పఅతడి చూపుడు వేలునే చూస్తూ అతడు చూపించిన వైపే తలలు తిప్పి చూసారు అందరూ.

మొగిలప్ప వద్దనుండి బైనాకులర్స్ తెసుకుని తాను కూడా దృష్టి సారించాడు. మామిడితోపులో పెద్ద బండరాయి కింద  ఉన్న పాముపుట్ట పక్కనే తొండం పైకెత్తి గాల్లో ఆడిస్తూ వుంది ఒక పెద్ద ఏనుగు.దూకుడుగా వుంది. దాని వాలకం భయపెడుతోందిముందుకూ వెనక్కూ ఊగుతూ వుంది. దానికి దూరంగా  ఏనుగులు  ఉండుండి శబ్దాలు చేస్తూ, మామిడి తోటలో ఆడుకుంటున్నాయి.

 కాస్సేపటి తర్వాత  జీపు శబ్దం వినపడగానే  గభాలున వంగి ఆత్రంగా కిందకు చూసారు అందరూహారన్ శబ్ధం వింటూనే అది ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళ జీపే అని  కనిపెట్టేసి క్షణం ఆలస్యం కాకుండా కిందకు దిగేశారు ట్రాకర్స్ మొగిలప్ప ఏలుమలై ఇద్దరూ.. మొదట రోడ్డు పైన దుమ్ము కనిపించింది  ,  దుమ్ములో వచ్చిన వాళ్ళు  ఎవరో  మిద్దె పైనుండి కనిపించలేదు కానీ, అక్కడినుండే  సెల్యూట్  కొడుతూ వేగంగా  కిందకు దిగేశారు ఇద్దరూ.

జీపును చూడగానే గ్రామస్తులు అందరూ అప్రమత్తమైపోయారు. జనంలో కదలిక వచ్చేసింది.పోలీసు జీప్ వచ్చినా, ఫారెస్ట్ డిపార్టుమెంటు వాళ్ళ జీప్ వచ్చినా , కరెంట్ డిపార్టుమెంటు జీప్ వచ్చినా కొందరు మగవాళ్ళు ఎక్కడివాళ్లక్కడ క్షణాల్లో మాయమైపోతారు. ఆడవాళ్ళు మాత్రం ఇండ్ల వద్ద వుండి ఎప్పుడూ   ఒకే రకం సమాధానమే చెపుతారు.

 “ ఏమో సార్ మాకు తెలియదు. యాడికో  అర్జెంటుగా ఎలబారిపోయినాడు.ఎప్పుడొస్తాడో తెలీదు సార్. వచ్చినంక  నువ్వు వచ్చిపోయినావని చెపుతాలే సా..ర్  ” వక్కాకు నములుతూ వాళ్ళు అంతే మాట్లాడతారు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ దగ్గరనుండి అంతకు మించి మరెలాంటి సమాచారం అంతకు మించి అందదని అందరు అధికారులకు బాగా తెలుసు.      

 అందుకే ఫారెస్ట్ జీప్ రాగానే గుంపులో ఉన్నట్లుండి కదలిక వచ్చేసింది. కొందరు మెరుపు వేగంతో కదిలారు. కొందరు  మగవాళ్ళు నిముషాల్లో ఊరు దాటేసారు. వేటకు ఉపయోగించే నాటు తుపాకులు ఇండ్లు దాటి రహస్య స్థలాల్లోకి చేరిపోయాయి.కృష్ణుడు, రాజయ్య ఇద్దరూ అక్కడినుంచి  మాయమయ్యారు. అడవిపందుల్ని వేటాడి , చంపి  మాంసం భాగాలు చేసి అమ్ముకునే నారాయణప్ప , కృష్ణప్ప  కత్తులు, చాకులు సిమెంట్ సంచిలో చుట్టి , అలవాటుగా  భూమిలోపల గుంత తవ్వి దాచిపెట్టేసారు. నిముషాల్లో వాళ్ళ వాళ్ళ ఇండ్ల లోంచి బయటకు వచ్చి  సావాసగాళ్ళ ఇండ్లు చేరిపోయారు. అడవిలోపల నుండి  తేనె తెచ్చి టౌన్ లో అమ్ముకునే వినాయకం , ఫారెస్ట్ వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అడవిలోపలికి వెళ్లి రకరకాల  మూలికలు వెతికి తవ్వి వేర్లు సేకరించుకుని వాటిని అమ్ముకునే సహదేవప్ప , గుర్రప్ప వాళ్ళ వాళ్ళ ఇండ్లలో లేకుండా అలవాటుగా  ఎటో వెళ్ళిపోయారు.

 మొగిలప్ప, ఏలుమలై ఇద్దరూ జీపు ముందుకు వచ్చి నిలబడి రెండు,మూడుసార్లు  గట్టిగా  సెల్యుట్ కొట్టేసారుగుంపులో మిగిలిన వాళ్ళు జీప్ చుట్టూ చేరిపోయారు. జీప్ లోంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హనుమంతు , సెక్షన్ ఆఫీసర్ హేమంత్ రెడ్డి , బీట్ ఆఫీసర్ జోసెఫ్ ,అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు దిగారు. వాళ్ళు ఒక వైపు జనాలతో మాట్లాడుతూనేవాళ్ళు చెప్పేది వింటూనే వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని సేకరించే పనిలోకి నేరుగా దిగేసారు. ఒకసారి మిద్దె పైకి ఎక్కి చూసి వచ్చారు.

 వాళ్ళిద్దరిని చూడగానే హనుమంతు మొహంలో నిశ్చింత కనిపించింది. హేమంత్ రెడ్డి మొహం చిట్లించుచుకున్నాడు. జోసెఫ్ పలకరింపుగా నవ్వాడు.ఇంక ఎంత మాత్రం ఆలస్యాన్ని భరించలేనట్లు హనుమంతు వెంటనే అడిగేసాడుఎన్ని వున్నాయి మొత్తం ?  ”

 “ సార్ నమస్కారం సార్  మొత్తం ఏడు వుండాయి సార్ మొండి గాటి ఏనుగు కూడా వుండాది సార్అని ఏలుమలై, “దాన్ని చూస్తా వుంటే పొద్దు కూడా  తిక్క తిక్కగానే వున్నట్లు వుండాది సార. మదమెక్కినట్లు ఊగిపోతా వుండాది, వెనక్కి ముందుకీ వూగాతా చెవులు అడిస్తా వుండాది సార్  ” అని మొగిలప్ప ఒకేసారి అన్నారు. మాట వినగానే ఫారెస్ట్ సిబ్బంది మొహాలు మాడిపోయాయి.

  “ ఏమైనా మదమెక్కిందా దానికి , కొంచం జాగ్రత్తగా చూడల్లా. లేదంటే అందరికీ  కష్టమే.. ” జోసెఫ్ హెచ్చరికగా అన్నాడు.

 “ అయ్యో మదమెక్కిన ఏనుగుని నూరుమంది మొగోళ్ళు కూడా పట్టలేరంటారు . ఇప్పుడెట్లా సార్ ఏం చేసైనా మమ్మల్ని మీరే కాపాడల్లా. ” గుంపులో చలనం మొదలయ్యింది.

 “ ముందు మనం చూద్దాం పద పద.. ” మాట అంటూనే ముందుకు కదిలాడు హనుమంతు. మిగతా ఫారెస్ట్ సిబ్బంది అతడిని అనుసరించారు. ట్రాకర్ల వెంట మళ్ళీ మిద్దె పైకి చేరారు వచ్చిన వాళ్ళు  .వెంట తెచ్చిన బైనాకులర్స్ తో పరీక్షగా చూస్తున్నాడు హనుమంతు. అతడి పక్కనే మిగతా ఇద్దరూ నిలబద్దారు.అక్కడే నిలబడి యధాలాపంగా మామిడి తోపు వైపు చూస్తూనే , మరో వైపు మిద్దె పైన వున్న వాళ్ళనే గమనిస్తున్నాడు హేమంత్ రెడ్డి. అతడి పక్కనే  నిలబడి , మెడను ముందుకు సాచి కళ్ళు పెద్దవి చేసుకుని మామిడి తోపు వైపే దృష్టి సారించాడు జోసెఫ్.ఉన్నట్లుండి బైనాకులర్స్ కిందకు దించి తలతిప్పి చుట్టూ ఉన్న వాళ్ళను ఒకసారి చూసి మళ్ళీ బైనాకులర్స్ ను కళ్ళ ముందు పెట్టుకునేసాడు  హనుమంతు. అతడి దవడ కండరాలు గట్టిగా  బిగుసుకున్నాయి.      

ఒకవైపు ఏనుగులు, ఇంకో వైపు రైతుల ఏడుపులు, అరుపులు, బాధలు, అందునా మదమెక్కినట్లు మొండిగా తిరుగుతున్న ఏనుగు. అయినా…. ఇలాంటి పరిస్థితిలో కూడా హేమంత్ రెడ్డి అక్కడున్న ఆడవాళ్ళ వైపే చొంగ కార్చుకుంటూ

చూస్తూ ఉన్నాడు.

మొన్న కరెంటు తగిలి ఏనుగు ఒకటి సచ్చినాక ఫుల్లు  కసిగా వుండాయి    ఏనుగులు .. జనం రెచ్చగొట్టకుండా  ఉండల్ల. మనం గానా దినం ఏమారినామంటే  ఎవరికో ఒకరికి పిండం పెట్టాల్సిందే. ముందుగానే అందరికీ చెప్పేయండి….. ఎవురూ ఇక్కడినుంచి ఇంచీ కూడా  కదలకూడదు . కాదూ కూడదని ఎవడైనా  కదిలినారంటే మీ ప్రాణాలకు గ్యారంటీ వుండదు, ముందుగానే చెప్తావుండాఒకేసారి సిబ్బందిని, గ్రామస్తులను హెచ్చరించాడు రేంజి ఆఫీసర్ హనుమంతు

 గ్రామస్తులు మాటతో కొoదరు వెనక్కి తగ్గారు. కొందరు అక్కడే అట్లాగే నిలుచుoడిపోయారు. కొందరు అసహనంగా అటూ ఇటూ కదులుతూ ఎవరి అభిప్రాయాలను వాళ్ళు ఎదుటివాళ్ళతో పంచుకునే ప్రయత్నంలో  అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దాంతో హనుమంతుకు కోపం ముంచుకొచ్చేసింది.ఒక్కసారిగా గట్టిగా అరిచేశాడు.

 “ ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు  రానేరాదు కదా. రాన్రానూ డిపార్ట్మెంటోళ్లు అంటేనే లెక్క లేకుండా పోతావుండాది మీకు. ముందంతా మీరు లోపలి పోయి అడవుల్ని మొత్తం తినేసినారు, అందుకే ఏనుగులు ఇప్పుడు ఊర్లపైన పడతా వుండాయి . ఎవరిది ఇంతకీ   మామిడి తోపు నిండా  మునిగిపోతావుండాడు ఎవడో  ” 

వూర్లో వాళ్ళు, ట్రాకర్లు ఒకేసారి ఆమె పేరు చెప్పారు. ఎప్పుడు వచ్చిందో కానీ దుమ్ముకొట్టుకుపోయిన మొహంతో తలనిండా దుమ్ముతో మట్టి మనిషిలా అచేతనంగా అయన వైపే ఎండిపోయిన కళ్ళతో  చూస్తోంది ఆమె.

 సిబ్బందిని మెల్లగా చెవిలో ఏదో అడిగాడు. ఆయన ట్రాకర్ని అడిగాడు.ట్రాకర్ ఏలుమలై మెల్లగానే చెప్పాడు కానీ అందరికీ వినిపించింది మాట. మాట  చెవిన బడగానే  “ .. ఏందేంది? ఎరికిలోల్లు కూడా సేద్యం చేస్తారా?అయినా  వాళ్ళెప్పుడు రైతులయ్యారు? దాంట్లో ఒక ఆడ ఎరికిలామె?…” నోరు తెరిచేసాడు.

 అప్పుడు వచ్చింది ఆమెకు తెగింపు.

అప్పటిదాకా ఆమె ఏడుపును మాత్రమే చూసిన వాళ్ళు ఆమె ఆవేశాన్ని చూసి కొంచెం జంకారు.ఉండుండి అరుస్తోంది ఆమె.

గుంపులోంచి కొంచెం ఇవతలికి వచ్చి గట్టిగా రెండు చేతులూ తిప్పుతూ అరుస్తోంది.   “ మేం కూడా  మీలాగే తొమ్మిదినెల్లు అమ్మ కడుపులో వుండే   భూమ్మిదకు వచ్చినాం సారూ. మమ్మల్ని మీరేమీ తక్కువ చూసే పని లే.. అడివి అయినా మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడతా ఉన్నింది.కానీ ఊరే మా బతుకేదో  మమ్మల్ని బతకనివ్వకుండా సంపకతింటా వుంది. ఊరు కంటే అడివే మేలని అందుకే  కదా అంటారు  సారూ ..కూలి పనులకి పిలస్తారు కానీ ఎరికిలోల్లు  పొలంలోకి దిగకూడదంటారు. అందుకే సారూ ఇల్లు అమ్ముకుని ఇంట్లో సామాన్లు అమ్ముకునినేనూ నా మొగుడూ అన్నాలు తినేది కూడా వదిలేసి  తోపు కొనింది. చస్తే మా పెద్దోల్లని పూడ్చేదానికి కూడా పెద్దకులమోళ్ళు   అడ్డం పడతా వుంటే మేం  ఇంకేట్లా సస్తాంమా సావేదో మేం సస్తే మా జాగాలోనే పూడ్చేదానికే అప్పులు చేసి అయిన కాడికి వడ్డీలకు అప్పు తెచ్చయినా  ఇంత నేల మాదనిపించుకున్నేం. మగ బిడ్డలు లేరు సారూఇంత ఆదరువు అయినా లేకపోతే రేపు మా ఆయన లాగా నేనుకూడా అర్దాంతరం గా సస్తే నా బిడ్డలు ఎట్లా బ్రతకాలంటారు సారూ? అయినా   మీ కాడ   మా కులం పేరు చెప్పి  మాట పడేదానికో, నా సొత్తు ఏనుగులకి ఇచ్చేసేదానికో  కాదు తోపు కొనిండేది . నా బిడ్డలకి కష్టం రా కూడదని. అయినా ఏనుగుల్ని తరిమేదానికి కూడా మీకు మా కులం అడ్డం  వస్తావుండాదంటే చెప్పండి సారూ మిమ్మల్ని అడుక్కునే బదులు అదేందో నేను నా బిడ్డలు పొయ్యి ఏనుగుల్నే అడుక్కుంటాం..  సారూ..     ”

ఆమె కదులుతూ చేతులు తిప్పుతూ పెద్ద గొంతుతో కడుపు కొట్టుకుంటూ, దుమ్ము ఎత్తిపోస్తూ  ….కోపంతో  ఏడుస్తూ అక్కడున్న గుంపు వైపు  చూసి  అడుగుతోంది . “  భూమ్మీద బతికేదానికీ మా  కులం అడ్డమే. సస్తే భూమిలోపల మన్నులో మన్నుగా కలిపే దానికీ మా కులo అడ్డమేనా? ఇట్లా అయితే అలా బతక్కుండా ఇలా సావకుండా ఎరికిలోల్లం ఇంక ఏం కావల్లంటారు సామీ , ఏం చేయమంటారు దొరా ..  ?”

ఆమె చుట్టూ దుమ్ము లేస్తూ వుంది. అక్కడ అంతటా దుమ్ముదుమ్ముగా వుంది.ఎందుకో అధికారికి తల, కళ్ళు తిరిగినట్లు అనిపించింది

అతడి కాళ్ళ దగ్గర నుండి లేచి కళ్ళముందు  నిలబడిన మనిషి, ఆడమనిషి, ఎరులామె, కట్టెలామె అతడ్ని భయపెట్టిందనే అనుకున్నారు అందరూ.   మట్టి మొత్తం మనిషిగా మారినట్లు, మట్టిమొత్తం  తుఫానుగా మారినట్లు, తాము మట్టిలో ఎటో కొట్టుకు పోతున్నట్లు….

ఏనుగుల ఘీంకారాలు..దూరమవుతూ

2 thoughts on “ఏనుగుల రాజ్యంలో

  1. చాలా మంచి కథ ఇతరులని వాళ్ళ కులం వలనో,ఆడ మగ అనే తేడా వలనో తక్కువగా చూసే ప్రతి ఒక్కరూ మదించిన ఏనుగే.అటువంటి ఏనుగుల రాజ్యంలో మనం ఉన్నాము
    మంచి కథను అందించిన పలమనేరు బాలాజీ గారికి అభినందనలు

  2. ఎరికలోళ్ళు సేద్యం చెయ్యకూడదా? రైతులు కాకూడదా? కూలీలుగా కూడా పనికిరారా? ఏమిటీ దాష్ణీకం? ఎలకలాంటి కట్టెలాయమ్మ. కట్టెలాంటి కట్టెలాయమ్మ. ఆ కట్టెలాయమ్మే కట్టెగామారి ఏనుగులాంటి ప్రభుత్వాన్నీ అధికారాన్నీ అరాచకాన్నీ దుమ్ము దులిపేసింది. ఏనుగుల్దేముంది. ఎప్పుడోగానీ ఊళ్ళోకి రావు. మరి ఊళ్ళో ఉండే ఏనుగుల్ని తరిమేదెవరు? ఇంకెవరు ఉందిగా కట్టెలాయమ్మ? ఊరికో కట్టెలాయమ్మ ఉంటే…???
    ఎరుకల కథలు ఈరోజు కూడా ఇలాగే ఉండేవి కావు. మారాల్సిందేమిటి? మారుతున్నదేమిటి? మార్చాల్సినవాళ్ళే ఏమార్చేవాళ్ళైతే ఈ కథలు ఎనిమిది దశాబ్దాల క్రితం ఎలా ఉన్నాయో విజన్ ట్వంటీ ట్వంటీ దాటాకా అలాగే ఉన్నాయి.

Leave a Reply