భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి?

2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు – జార్ఖండ్‌కు చెందిన రూపేష్ కుమార్ సింగ్, జమ్ము కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్‌ల కోసం ‘ఫ్రీ స్పీచ్ కలెక్టివ్’ ఈ ప్రశ్నను సంధిస్తోంది. ‘వాండే’ మ్యాగజైన్ ఎడిటర్ ఇర్ఫాన్ మెహరాజ్‌ను, 2023 మార్చి 20నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద నమోదు చేసిన ఆరోపణలపై అరెస్టు చేసారు. ఆయనపై విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

కాశ్మీర్‌లోని  సంక్లిష్ట రాజకీయాలు, దాని ఘనమైన చరిత్రను, సంస్కృతిని అన్వేషించడానికి ప్రయత్నించిన ‘వాండే’ మ్యాగజైన్ ఎడిటర్ ఇర్ఫాన్ మెహ్రాజ్ అరెస్టు తర్వాత ఆ మ్యాగజైన్ మూగబోయింది. హింసపైన మెహ్రాజ్ చేసిన వివరణాత్మక డాక్యుమెంటేషన్, ప్రభుత్వ హింసపైన ఆయన నిర్భయ వైఖరి ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆయన కృషి (రచనలు) మరుగున పడిపోయి, గుర్తింపు కోసం పోరాడుతోంది.

2023 మార్చి 20నాడు శ్రీనగర్‌కు చెందిన జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆఫీసు నుండి ఒకసారి ఆఫీసుకి రమ్మని ఒక ఫోన్ కాల్ వచ్చింది.

కేవలం ఐదు నిమిషాల విచారణ అని చెప్పి ఆయన్ను పిలిచారని, కానీ అది అరెస్టుగా మారిందని ఆయన తండ్రి మీడియాకు తెలిపారు. మరుసటి రోజే మెహరాజ్‌ను ఢిల్లీకి తీసుకెళ్ళి, మార్చి 22న ఎన్‌ఐఎ కస్టడీకి పంపారు. మరింత సమాచారం తెలుసుకోవడానికి, లాయర్‌నుఏర్పాటు చేయడానికి ఆయన సోదరుడు, మామ ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చింది. పెళ్ళై కేవలం ఆరు నెలలే అయిన ఆయన భార్యతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో ఆందోళనగా ఎదురుచూస్తూ ఉండిపోయారు.

అప్పటి నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద న్యూఢిల్లీలోని రోహిణి జైలు కాంప్లెక్స్‌ లో గత మూడు సంవత్సరాలకు పైగా విచారణా ఖైదీగా ఉన్నారు. ఆయన ఇంటికి, ఢిల్లీకి మధ్య ఉన్న దూరం వల్ల, అలాగే ఆయన తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల కుటుంబ సభ్యలు జైలు ‘ములాఖత్’ కోసం వెళ్లడం కష్టమైపోతోంది. ఈ కలవడం కూడా సాధారణంగా గాజు గోడ కటూ ఇటూ కూచుని ఫోన్ ద్వారా మాట్లాడుకోవాలి. ఇది ఎలాగూ ఎటువంటి శారీరక స్పర్శకు అవకాశం ఇవ్వదు.

మెహరాజ్‌ను ఎన్‌ఐఎ పిలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా శ్రీనగర్, న్యూఢిల్లీ ఆఫీసులకు పిలిపించి, 2020లో జమ్మూ అండ్ కాశ్మీర్ కోయలిషన్ ఆఫ్ సివిల్ సొసైటీ (జెకెసిసిఎస్)పైన నమోదైన ‘ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం’, ‘వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొనడం’అనే కేసులో ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఖుర్రం పర్వేజ్‌ను నవంబర్ 2021లో ఉపా కింద అరెస్టు చేశారు. మెహ్రాజ్‌కు ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తాము విచారణ చేస్తున్నామని ఎన్‌ఐఎ అంటోంది. 2024లో బెయిల్ విచారణ ప్రారంభమైనప్పటికీ, న్యాయమూర్తుల మార్పుల కారణంగా విచారణలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది.

మెహ్రాజ్ అరెస్టు అవడం గురించి స్థానిక కశ్మీరీ మీడియాలోని సహచరులు తీవ్రంగా కలత చెందారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఒక జర్నలిస్టును జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడమేనని; మానవ హక్కుల ఆందోళనలను నేరంగా పరిగణించడమేనని విమర్శించాయి. జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ కాశ్మీర్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, హ్యూమన్ రైట్స్ వాచ్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ తదితర సంస్థలు ఆయన విడుదలను కోరుతూ ప్రకటనలు విడుదల చేశాయి. మెహ్రాజ్ అరెస్టుపై తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని ట్వీట్ చేస్తూ, ఆయనను “వెంటనే విడుదల చేయాలని” మానవ హక్కుల కార్యకర్తల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మేరీ లాలర్ పిలుపునిచ్చారు.

ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద సమన్లు పంపడం లేదా అరెస్టులు చేయడం అనేది కశ్మీర్‌లో అసాధారణమైన విషయమేమీ కాదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపా చట్టం కింద జరుగుతున్న అరెస్టులలో జమ్ము కశ్మీర్ అగ్రస్థానంలో ఉంది. 2023లో అక్కడ మొత్తం 1206 అరెస్టులు జరిగాయి; ఇది దేశవ్యాప్త అరెస్టులలో 42 శాతానికి సమానం. ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగినప్పటికీ, ఆ కేంద్రపాలిత ప్రాంతంలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్ష పడింది. అంటే అక్కడ శిక్షా రేటు కేవలం 0.8 శాతం మాత్రమే. ఇది దేశంలోనే అత్యంత తక్కువ.

ఒక బిబిసి నివేదిక ప్రకారం, రాసిన వార్తల విషయంలో జర్నలిస్టులను పోలీసులు పిలిపించడం; వారిని అదుపులోకి తీసుకోవడం అనేది అక్కడ చాలా సర్వసాధారణమైన విషయం. మరికొందరిని ” నేపథ్య తనిఖీల” పేరుతో వాడుకగా పిలుస్తుంటారు. వారిపై ఉన్న నిఘా కేవలం జర్నలిస్టు కార్యకలాపాలకే పరిమితం కాదని, అది వారి కుటుంబ సభ్యులకు, తోబుట్టువులకు కూడా వర్తిస్తుందని ఈ తనిఖీల సమయంలో పోలీసులు జర్నలిస్టులను హెచ్చరిస్తుంటారు.

దశాబ్దాలుగా పని చేయడానికి, వార్తలు రిపోర్టు చేయడానికి అత్యంత సవాలుతో కూడిన, ప్రమాదకరమైన ప్రాంతాలలో ఒకటిగా కశ్మీర్  పేరుపొందడం కేవలం యాదృచ్చికం ఏమీ కాదు. తొంభైల కాలంలో ఈ ఘర్షణ ప్రాంతంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న భౌతిక దాడులతో పాటు, ముఖ్యంగా 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, 2020లో ఏదైనా ఒక వార్త “నకిలీ”, “అనైతిక” లేదా “దేశ వ్యతిరేకమైనది” అని నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చే కొత్త మీడియా విధానాన్ని అమలులోకి తెచ్చిన తర్వాత ప్రభుత్వం మరింత అణిచివేత వాతావరణాన్ని సృష్టించింది. దీనివల్ల నిఘా, వేధింపులు, బెదిరింపులు, అరెస్టులు గణనీయంగా పెరిగాయి.

కొన్ని మసీదుల వివరాలను  సేకరించడానికి కశ్మీర్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపైన వార్తలు రాసినందుకు గాను,  ప్రధాన జాతీయ దినపత్రికల ప్రతినిధులను పోలీసులు పిలిపించారని ఈ ఏడాది ప్రారంభంలో, ఇండియన్ ఎక్స్‌ ప్రెస్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ చేసిన ఒక ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. కశ్మీర్‌లోని ఈ అణిచివేతను ‘డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్’ తీవ్రంగా ఖండించింది. స్థానిక కశ్మీరీ జర్నలిస్టుల నుండి ఇప్పుడు ఈ వేధింపులు ప్రధాన జాతీయ మీడియా రిపోర్టర్లకు, ఫ్రీలాన్సర్‌లకు కూడా విస్తరించాయని పేర్కొంది. అదే సమయంలో, అనేక పెద్ద మీడియా సంస్థలు మౌనంగా ఉండటంతో, నిస్సహాయ స్థితిలో ఉన్న జర్నలిస్టులు ఈ వేధింపుల భారాన్ని అనుభవించాల్సి వస్తోంది.

మౌనం వహించడం అనేది అక్కడ కొత్త లక్షణమేమీ కాదు. కశ్మీర్‌లోని అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి ఏమిటంటే—సాధారణ పౌరుడు చూసే లేదా అనుభవించే హింస, జాతీయ మీడియాలో చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. కశ్మీరీల ప్రత్యక్ష అనుభవాలకు, వారి గురించి రాసే విషయాలకు (అవి ప్రభుత్వ కథనాలు కావచ్చు లేదా కార్పొరేట్ మీడియా సంస్థలు రూపొందించినవి కావచ్చు) మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది.

కశ్మీర్ విషయానికి వస్తే, జాతీయవాద ఆందోళనలు “ఉదారవాద” సమూహాలను కూడా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా వివాదాస్పద అంశాల విషయంలో—రాజకీయ ఆకాంక్షలు లేదా స్వయం నిర్ణయాధికారం వంటి ఆలోచనలను వ్యక్తం చేయడాన్ని “ఉగ్రవాదం” అనే పదంతో ముడిపెట్టడం జరుగుతోంది. అయితే, ఒక లీగల్  కార్యకర్త ఎత్తిచూపినట్లుగా, రాజ్యాంగం ప్రకారం ఇది చట్టవిరుద్ధం అని చెప్పడానికేమీ లేదు.

ఇంతటి బలహీనమైన మీడియా వ్యవస్థ, నిజాన్ని రిపోర్టు చేయడానికి సాహసించే కశ్మీరీ జర్నలిస్టులకు ఎటువంటి మద్దతు లేదా రక్షణ లేకపోవడం వారిని చాలా నిస్సహాయ స్థితిలో పడేస్తోంది. కేవలం అత్యంత ధైర్యవంతులు, వృత్తి పట్ల నిబద్ధత ఉన్నవారు మాత్రమే ఇటువంటి వృత్తిని ఎంచుకోగలరు. అలాంటి వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడే మెహ్రాజ్, కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్- జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చదువుని ఎన్నుకున్నాడు. బ్లాగులు రాయడంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు; ‘కశ్మీర్ లైఫ్‌’లో ఇంటర్న్‌ గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తూ, ది కారవాన్, హిమాల్, ఆర్టికల్ 14, అల్ జజీరా, డాయిచే వెల్లే, టీఎన్‌టీ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రచురణలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం రాసాడు.

కశ్మీర్‌లోని సంక్లిష్ట రాజకీయాలు, దాని ఘనమైన చరిత్రను, సంస్కృతిని అన్వేషించాలనే ఆసక్తితో, మెహ్రాజ్ ‘వాండే’ (శీతాకాలం) అనే సంస్థ సహ-స్థాపకులలో ఒకరు అయ్యారు. ఇది కశ్మీర్‌ను ఊహల్లో “ఘనీభవించడానికి” చేసిన ఒక ప్రయత్నం. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం రిపోర్టింగ్ పరిధిని దాటి, ఎన్నో లోతైన విశ్లేషణాత్మక కథనాలను అందించింది. మెహ్రాజ్ అరెస్టు తర్వాత ఇది ఆగిపోయింది. 

దీర్ఘ రచనలపైన ఉన్న ప్రగాఢమైన ఆసక్తే, నిశితమైన డాక్యుమెంటేషన్, పరిశోధనలకు పేరుగాంచిన మానవ హక్కుల సంస్థ అయిన జెకెసిసిఎస్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడటానికి దారితీసింది. జైలులో ఉన్న ప్రోగ్రామ్ డైరెక్టర్ ఖుర్రం పర్వేజ్, 2006 రీబాక్ మానవ హక్కుల పురస్కారాలను అందుకున్నారు; 2022లో టైమ్ మ్యాగజైన్ ఎన్నిక చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు.

రచనా నైపుణ్యాలు కలిగిన పాత్రికేయుడిగా మెహ్రాజ్, జెకెసిసిఎస్‌ ద్వారా హింసపై రూపొందించిన ప్రాథమిక, సమగ్ర నివేదికను తీర్చిదిద్దడంలో సహాయపడిన వారిలో ఒకరు. హింస, ఇతర క్రూరమైన, అమానవీయ లేదా అవమానకరమైన ప్రవర్తన లేదా శిక్షలపైన ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పూర్వ రిపోర్టర్ జువాన్ ఇ. మెండెజ్ దీనిని ఇలా గా ప్రశంసించారు: “అత్యంత విషాదకరమైన బాధ గురించి చర్చిస్తున్నప్పుడు కూడా నిష్పక్షపాతమైన, ఖచ్చితమైన భాషకు ఒక నమూనా.”

మెహ్రాజ్ కేవలం ఒక సాధారణ రిపోర్టర్ మాత్రమే కాదని, ప్రభుత్వ అధికారిక కథనాలపైన తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ, ఇబ్బంది పెట్టే ప్రశ్నలను అడిగే అత్యంత ధైర్యవంతుడనే విషయాన్ని బహుశా ఈ ప్రయత్నాలన్నీ కలిపి అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.

అతనిని సమాజం నుండి వేరుగా ఉంచడానికి ఉపా అనే చట్టాన్ని ఆయుధంగా ఉపయోగించారు. మెహ్రాజ్ కేసు ప్రాసిక్యూషన్ వాదనల్లోని లోపాలను బయటపెట్టడమే కాకుండా, ఈ చట్టం గురించి విస్తృతమైన ఆందోళనలను ఎలా నొక్కి చెబుతుందో ‘ది వైర్’ లోని ఒక వ్యాసం వివరిస్తుంది. ఉపా అనేది ప్రభుత్వ నియంత్రణకు ఒక సాధనంగా ఎలా పనిచేస్తుందో, అసమ్మతిపైన ఆంక్షలు విధించడానికి ఎలా వీలు కల్పిస్తుందో ఇది ప్రతిబింబిస్తుంది.

ఒక వ్యక్తిని ‘ఉగ్రవాది’గా చిత్రీకరించడానికి ఉపా ఒక రాజకీయ సాధనంగా ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని ఆ వ్యాసం విశ్లేషించింది. ప్రభుత్వ కథనాలను సవాలు చేసే జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలను కూడా ఇందులో చేర్చేలా ఈ చట్టం తన పరిధిని విస్తరించింది.

మోపిన ఆరోపణలు, బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా చేసే వాదనలు అత్యంత తీవ్రమైనవిగా ఉంటాయి. కానీ ఉగ్రవాదానికి సంబంధించి సాక్ష్యాధారాలను సమర్పించినప్పుడు మాత్రం చాలా బలహీనంగా ఉంటాయి; దీని ఫలితంగా చివరకు నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారు.

ఉపా చట్టం విషయంలో స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే—ఇక్కడ విచారణ ప్రక్రియనే ఒక శిక్షగా మారుతుంది. విచారణలు చాలా కాలం పాటు సాగుతాయి. జైలులో ఉన్న మెహ్రాజ్, సమాజానికి దూరమైపోయారు. తన కుటుంబమూ, ఆత్మీయులతో విడిపోయారు. ఆయన జీవితంలోని అత్యుత్తమ సంవత్సరాలు వృథా అవుతున్నాయి. ప్రజలను నియంత్రించడానికి, చరిత్రను చెరిపివేయడానికి, కలలను చిదిమేయడానికి అరెస్టులు, బెదిరింపులు ఒక మార్గంగా మారాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మెహ్రాజ్ సన్నిహిత మిత్రుని సమాధానం: “జ్ఞాపకం. ఆ రాజకీయ ఖైదీని మనం గుర్తుంచుకుంటాం. బందీలుగా ఉన్న వారిని మనం మరిచిపోం.”

(*ఇర్ఫాన్ మెహ్రాజ్ సహచరుడైన ఈ రచయిత, తన పేరు బైట పెట్టకూడదు అనుకున్నారు.)

– అనువాదం : కె. పద్మ

Leave a Reply