నేటితరం కవులు అనివార్యంగా వర్తమాన సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, ఆక్రంధనలు, అత్యాచారాలులాంటి ఘటనలే కాక ప్రతీ సామాజిక దురాగతాలు, అసమానతలూ, దోపిడీ, ప్రపంచీకరణ, కార్పోరేటీకరణ లాంటి ప్రతి దుర్మార్గాన్ని ఎండగడుతూ కలమెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వపు కాన్వాసు మరింత విశాలంగా మారింది. ఎలా రాస్తున్నారనో ఏం రాస్తున్నారనో విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గూర్చైతే ఆలోచిస్తున్నారు. ఇటీవం కవిత్వంలోకి మహిళలు వరదలా వస్తున్నారు..ఇది గొప్ప పరిణామం..అలా అనుకుంటున్న క్రమంలో ‘‘ నాడైరీ కనిపించడం లేదు’’ అంటూ సిహెచ్ మంజుల అనే కవయిత్రి రాసిన కవితా సంపుటి నాకు అందింది.
మానవజీవితాన్ని అనేక పార్శ్వాలలో కథ పరిచయం చేస్తుందని చదివాం. కాని కవిత్వం కూడా చేయగలదని ఈ కవిత్వం చదివాక తెలుస్తుంది. తరగతిగదిలో ఉపాధ్యాయినిగా నవ సమాజాన్ని నిర్మించే ఈ కవయిత్రి ఈ సమాజంలో జరిగే అరాచక దృశ్యాల్ని కవిత్వంగా శిల్పించడం ఈ కవిత్వం చదివేలా చేసింది. సహజసిద్దంగా సరళమైన కవితావాక్యాలతో ఓణం పండుగనాడు వేసే ముగ్గుల్లా రాయగలిగింది. ఓణం అనే ఎందుకనాల్సి వచ్చిందంటే ఓణం పండుగ ప్రారంభమయిన రోజు నుండి ఆఖరిరోజు వరకు వివిధరకాల పువ్వులతో ముగ్గులతో ఇంటిముందు వేయడం కేరళ సంప్రదాయం. అందుకే తన కవిత గూర్చి చెబుతూ ‘‘నా కవిత ఏ వేకువ జామునో కురిసిన ఓ వెలుతురు చినుకు’’ అంటుంది. కవిత్వం నిండా భావుకత, అభివ్యక్తి ప్రధానంగా సాగినా ప్రతి అంశాన్ని పలకరించి కవిత్వమై పలవరించే ప్రయత్నం చేయగలిగింది.‘‘ఉలితాకిడికి భయపడి/బండరాయి మిగిలేకంటే/ వంటినిండా గాయాలైనా ఫర్లేదు/శిల్పంగా మారగలిగితే!’’ అంటుంది. చాలా సున్నితంగానే పదునైన వాక్యాలు రాయగలిగింది. ఈ కవయిత్రిని వర్తమాన ప్రపంచం సృష్టించింది. ఈ కవయిత్రి వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న వ్యవస్థాగతమైన లోపాలు కవయిత్రిని చేశాయి. ఆవేశం, అభినివేశం కలిగిన కవిత్వం రాయగలిగేలా ఈ సమాజమే తీర్చిదిద్దింది. ఆవేశమంటే ఇలా వుంటుంది ‘‘చంపాల్సింది ఉరితీయాల్సింది వ్యక్తుల్నికాదు/ వాళ్ళలో పెరుగుతున్న పైశాచికత్వాన్ని/స్త్రీలో ఆడతనాన్ని తప్ప/ ఆమ్మతనాన్ని చూడలేని/ మనోవైకల్యాన్ని చంపాలి!/ మృగవాంఛ వెనక ఉన్న/ కృారత్వాన్ని నరికేయాలి/అప్పటివరకు/ ‘‘యత్రనార్యస్తు పూజ్యంతే’’/ శ్లోకాన్ని మర్చిపోండిక/ఎందుకంటే/ఇక్కడ స్త్రీలు పూజింపబడరు’’. ఆధునికత సమాజం ఆవిర్భావమంటే నాగరికంగా వృద్ధి చెంది, శాస్త్రసాంకేతికరంగాల్లో ముందుకురికి విలువలతో, నైతికతతో మానవీయ సంస్కృతినిర్మిస్తూ మానవ జీవన ప్రయాణం సాగడం. అవేమి ఇక్కడ సాగడం లేదు. పురోగమించడం లేదు. ఆధునికత ఇవాళ విశృంఖలత్వానికి జన్మనిచ్చింది. సమాజ తిరోగమనం ఆరంభమైనట్టే అనిపిస్తుంది.. అందుకే ఈ కవయిత్రి ఆవేశం ఎల్లలు దాటుతుంది. ఈ కవయిత్రి కలలుగంటున్న సమాజం ఇదికాదని చెప్పకనే చెబుతుంది. శేషేంద్ర ఆశించినట్టు సమాజస్పృహ వొక్కటే కాదు..సాహిత్యస్పృహ కూడా ఉండాలంటాడు..ఈమెకు రెండూ ఉన్నాయని ఈ కవిత్వం చదివాక పాఠకులకు అర్థమౌతుంది.
దేశానికి అన్నంపెట్టే రైతు గూర్చి చెబుతూ ‘‘ ఎటువంటి భేషజమూ లేకుండా/ రైతును కౌగిలించుకున్న నాకు/ అన్నం ముద్దను/ ఆలింగనం చేసుకున్నట్టుంది/అన్నదాతా నీకు వందనం’’. ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. కవితావాక్యాలు చదివి ఆనందపడాలా? రైతు వ్యతిరేకచట్టాలను అమలు చేసి, రైతును చంపేసి కార్పోరేట్లకు దేశసంపదను దారాదత్తం చేయాలని చూసే పాలకులను చూసి బాధపడాలా? అర్థం కావడం లేదు. రైతు చట్టాలు అమలయి ఉంటే ఇప్పటికే దేశంలో రైతనే వాడు రిలయన్స్, స్పెన్సర్, వాల్‌మార్టు, అంబానీ, అదానీల మార్టుల ముందు బిచ్చమెత్తుకునేవాడు. పంజాబ్ రైతుల పోరాటం దేశానికి స్ఫూర్తి కాగలిగింది. కనీసం ఈ దేశంలో రైతును బతికించుకోగలిగాం. ఈ కవిత్వంలో అక్కడక్కడా సాంప్రదాయాల గుబాళింపులున్నా ప్రగతిశీల భావాలూ మరోప్రపంచంం కోసం పడే ఆరాటమూ ఉంది. కొన్ని చోట్ల సందేశమూ..మరికొన్ని చోట్ల సందేహమూ..ఇంకొన్ని చోట్ల ప్రశ్నార్ధకమూ కనబడతాయి. సందిగ్ధతలూ , సంఘర్షణలూ కనబడినా కానీ, ఇవన్నీ కవితాప్రయాణానికి కొత్తదనం కూడా ఇచ్చాయి.
కవి సమాజాన్ని చూసే కోణం వైవిధ్యంగా వుంటుంది. ఈ కవయిత్రి ఈ సంపుటినిలోని ఊరిచెరువు గూర్చి చెబుతూ తన జీవితాన్నంతా బాల్యం చుట్టూ తిప్పుతుంది. చెరువుతో తనకున్న జ్ఞాపకాలు చెబుతున్నట్టే ఉన్నా కవిత చివరికి వచ్చేసరికి గొప్పతాత్విక సత్యం చెబుతుంది. ‘‘జీవితంలో ఏదో కోల్పోయామని/ కృంగిపోయి/ ఆత్మహత్యకు పాల్పడేవాళ్ళకు/ నడివేసవి వడగాలికి/ఎండి బీటలు వారినా/ రాబోయే వర్షాకాలం కోసం/ ఆశగా ఎదురుచూస్తున్న/ తనని చూసి స్ఫూర్తిపొందమని/ బోధిస్తుంది/ మాఊరిచెరువు/ అందుకే మా ఊరి చెరువంటే నాకు అంత ఇష్టం’’..అంటుంది. కవితావాక్యాల నిర్మాణం అపసవ్యంగా నిర్మించినట్టున్నా లోతైన అర్థాన్నిచ్చినట్లుంది. ఎండిన చెరువు సర్వం కోల్పోయిన జీవితానికి చిహ్నంగా చెబుతుంది. చినుకు కోసం చెరువు ఎదురు చూడటమంటే జీవితంలో అన్నీ కోల్పోయినా తిరిగి జీవితాన్ని నిండుగా చెరువును నింపుకున్నట్టు నింపుకోవచ్చనే సందేశాన్నిస్తుంది. వానచినుకు కొత్త జీవితాన్ని ఆరంభించమనేలా చెబటం గొప్ప కవితాత్మక ప్రయోగంగా చెప్పవచ్చు.
ఈ కవిత్వ ప్రయాణం సగటు మహిళా జీవితంలోనూ ఉద్యోగిగా మారాక జరిగే జీవనప్రయాణంలోని అనేక మలుపులు కవితలుగా సాగాయి. అలాగని అవలీలగా అలవోకగా చెప్పేశాలా ఉన్నాయని అనను. ఎందుకంటే ఈ కవిత్వంలో ‘‘శరీరం సేదదీరుతున్నా / మనసు మాత్రం/ ఈ సమయంలో / చెప్పిన మాట వినక/ గతానికీ వర్తమానానికీ మధ్య శూన్యంలో విహరిస్తుంటుంది’’ తమ పిల్లల్ని తలచుకుంటూ వొంటరితనాన్ని ..జ్ఞాపకాలను నెమరేసుకునే గొప్ప కవితా వాక్యాలను రాస్తుంది.
ఈ తన కవిత్వసంపుటికి నా డైరీ కనిపించడం లేదు అని శీర్షిక పెట్టుకుంది. డైరీ ప్రతినిత్యం తన చేయిపట్టుకుని నడిపించే స్నేహితురాలుగా..ఆత్మీయురాలిగా ఆవిష్కరించింది. ‘‘నను జోకొట్టి నిద్రపుచ్చి / నాకు వెన్నెల కాంతులు,/ నక్షత్ర తోరణాల స్వప్న వీచికలు/ కానుకగా పంపి/ రాత్రంతా నా తలగడ ప్రక్కన/ మేలుకుంనుండే నా డైరీ!’’ అంటూ ప్రతి జ్ఞాపకాన్ని, ప్రతి అనుభూతిని గుండెలో పదిలం చేసుకున్న వైనాన్ని ఈ డైరీ కవితలో చెబుతుంది. కవిత్వం చదువుతున్నంత సేపూ ఒక భావచిత్రం, అనుభవదృశ్యం కళ్ళ ముందు కనబడుతుంది. గొప్ప కవిత్వమనో..మహ కవిత్వమనో అతిశయోక్తులు చెప్పను కాని, ఈ కవిత్వం వర్తమానసమాజ స్థితిని చూపెడుతుంది. కవిత్వం నిరంతర అన్వేషణ.. ఆ అన్వేషణ తనిప్పుడు కొనసాగిస్తుంది. ఈ అన్వేషణ ఎటువంటి అవరోధాలు లేకుండా నిరంతరం సాగాలి.
సామాజిక స్పృహ, సాహిత్య స్పృహ ఉన్న ఈ కవయిత్రి విస్తృత అధ్యయనం చేస్తే సాహిత్య సమాజంలో ప్రామిస్డ్ పోయట్‌గా నిలబడుతుంది.
I agree with u sir —she is a good writer
=====================buchireddy gangula’