కార్పొరేట్‌ హిందుత్వ కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం

భారత విప్లవోద్యమానికి అండగా నిలబడదాం

సంస్మరణ సభ

జూలై 6 శనివారం ఉదయం 11 గంటల నుంచి, బొబ్బిలి

కా. గంటి ప్రసాదంగారు అమరుడై పదకొండేళ్లు. ఆయన నక్సల్బరీ చైతన్యంతో ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం వివిధ రంగాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించారు. విప్లవ పార్టీల ఐక్యతా క్రమంలో   అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు. 2015లో అరెస్టయ్యాక జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అప్పటి నుంచి తిరిగి బహిరంగ ప్రజాపోరాటాల్లో భాగమయ్యారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడిగా విప్లవ భావజాల ప్రచారానికి కృషి చేశారు. వివిధ రంగాల్లో ప్రజాస్వామిక పోరాటాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. విప్లవోద్యమానికి బాసటగా చట్టబద్ధ, ప్రజాస్వామిక పోరాటాలకు   అవసరమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించడానికి తదుపరి జీవితాన్నంతా అర్పించారు.  ప్రజా ఉద్యమాలకు వీలు లేని చీకటి రాజ్యాన్ని   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పుతున్న తరుణంలో ప్రసాదంగారు కొత్త పోరాట అవకాశాల కోసం ప్రయత్నించారు. నిర్బంధం వల్ల ప్రజా ఆకాంక్షలు చల్లారి పోవడానికి వీల్లేదని, రాజ్యహింసను ధిక్కరిస్తూనే ప్రజలు తమ జీవిత అవసరాలను ప్రకటించవలసి ఉన్నదని గట్టిగా విశ్వసించారు. ప్రజలు నిరంతరం కొత్త పోరాట ప్రపంచాన్ని నిర్మిస్తుంటారనే వాస్తవాన్ని ఎలుగెత్తి చాటారు.

ఆయన వ్యక్తిగత జీవితం బహిరంగ ప్రజాపోరాటాలు, అజ్ఞాత విప్లవోద్యమం,  జైలు జీవితం, తిరిగి చట్టబద్ధ ప్రజా జీవితం వంటి  ఎన్నో మలుపులు తిరిగింది. అన్ని సందర్భాల్లో కూడా విప్లవ రాజకీయ కృషి మీద ఆయన చివరి దాకా కేంద్రీకరించారు. విప్లవాచరణ ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ ప్రజలను  రాజకీయ సమస్యల మీద కదిలించడం,  సంఘటితపరచడం అతి ముఖ్యమైన కర్తవ్యం అని ప్రసాదంగారు భావించారు. విప్లవ భావజాలంతో ఈ రకమైన పని చేస్తూ బహిరంగ జీవితం గడపడం ప్రమాదకరం అని కూడా ఆయనకు తెలుసు. అయినా సిద్ధపడ్డారు. అజ్ఞాతంలో ఉంటూ  అరెస్టయినప్పుడే తన జీవితం ముగిసిపోవలసిందని, ఇది బోనస్‌ లైఫ్‌ అని, దీన్నంతా విప్లవ రాజకీయ కృషికి వెచ్చించాలనే దృఢమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు.  దానికి తగినట్లే పని చేశారు. ఆయన చేపట్టిన ప్రజాస్వామిక పోరాటాలు ప్రభుత్వానికి కంటగింపుగా తయారై హత్య చేసింది.

ప్రసాదంగారు జైలు నుంచి విడుదలయ్యాక సుమారు ఏడేళ్లపాటు చేసిన కృషి చాలా అరుదైనది.  వయసు పైబడ్డప్పటికీ, తన జీవితంతోనే  ఒక సృజనాత్మక ప్రయోగం చేసిన  సాహసిగా ఆయన విప్లవోద్యమ చరిత్రలో నిలిచిపోయారు. ప్రసాదంగారు ఎన్నో సంఘాలకు అండగా నిలబడినప్పటికీ, మరెన్నో రంగాల్లో కొత్త పోరాటాలకు ప్రయత్నించినప్పటికీ ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన కృషిని ఈరోజు తప్పక గుర్తు చేసుకోవలసి ఉన్నది. కేంద్రంలో ఆనాడు ఉన్న  కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్‌హంట్‌ అనే సైనిక దాడితో విప్లవోద్యమాన్ని నిర్మూలించాలని చూసింది. దానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలలో పౌర ప్రజాస్వామిక సంస్థలు, వ్యక్తులు విశాల ప్రాతిపదిక మీద గ్రీన్‌హంట్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడిరది. చాలా ప్రభావశీలంగా ఈ కమిటీ పని చేసింది.

భారత పాలకవర్గాలు గ్రీన్‌హంట్‌తో విప్లవోద్యమానికి కొంత నష్టం చేసి ఉండవచ్చు. కానీ వాళ్ల ‘ఆశయం’ నెరవేరలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్‌ సమాధాన్‌ను చేపట్టింది. 2022 నాటికి విప్లవోద్యమాన్ని తుదముట్టిస్తానని ప్రగల్బాలు పలికింది. ఎంత నిర్బంధం ప్రయోగించినా అది సాధ్యం కాలేదు. ఏకంగా వైమానిక దాడులు కూడా జరిగాయి. విప్లవోద్యమం ఎదురుదెబ్బ తిని ఉండవచ్చుగాని తన బలమైన రాజకీయ, సిద్ధాంత వ్యూహం వల్ల తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నది. ఇక లాభం లేదని చత్తీస్‌ఘడ్‌లో, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఆపరేషన్‌ కగార్‌ అనే అంతిమ యుద్ధాన్ని మొదలు పెట్టాయి. గతం కంటే మరింత పెద్ద ఎత్తున దేశ సరిహద్దుల్లోని సైన్యాన్ని మధ్య భారత దేశంలోకి తరలించాయి. ఈ కార్పొరేట్‌ హిందుత్వ యుద్ధంలో గత ఐదు నెలలో ఇప్పటికి 130 మంది ఆదివాసులు, విప్లవకారులు చనిపోయారు.

దేశాన్ని ఆదివాసీ రహిత భారత్‌గా మార్చేసి అక్కడ ఉన్న సహజ వనరులన్నిటినీ అదానికి, అంబానికి కట్టబెట్టాలనే రాజకీయార్థిక సాంస్కృతిక సైనిక వ్యూహంతో కగార్‌ను నడిపిస్తున్నారు. విప్లవోద్యమ నిర్మూలన అనే ఈ లక్ష్యాన్ని కేంద్రంలో కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం మరింత ముందుకు తీసికెళ్లడానికి ప్రయత్నిస్తుంది. పాలక పార్టీల మధ్య, కూటముల మధ్య ఎన్నికల్లో ఎంత తీవ్రమైన సంఘర్షణ జరిగినప్పటికీ విప్లవోద్యమం విషయంలో వాటన్నిటి వైఖరి ఒకటే. బీజేపీ హిందుత్వ రాజకీయాలను కాంగ్రెస్‌ కూటమి ప్రశ్నిస్తున్నప్పటికీ ఈ దేశంలో మతతత్వం ఫాసిజంగా   పెచ్చరిల్లడానికి ఆ పార్టీ కూడా కారణం. దీన్ని  ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. అట్లాగే కార్పొరేట్‌ రాజకీయార్థిక విధానం పట్ల కాంగ్రెస్‌ కూటమిలోని ఏ ఒక్క పార్టీకి అభ్యంతరం లేదు. ప్రత్యామ్నాయ విధానం లేదు. కాబట్టి కార్పొరేట్‌ హిందుత్వకు, ఆపరేషన్‌ కగార్‌కు వ్యతరేకంగా ప్రజా క్షేత్రం నుంచి పోరాటాలు ముందుకు రావాల్సిందే. హిందుత్వ, దళారీ రాజకీయాలకు ప్రత్యామ్నాయం విప్లవోద్యమం మాత్రమే. దాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులందరూ నిరసించాలి. విప్లవోద్యమానికి, ఆదివాసులకు అండగా నిలబడాలి. కా. గంటి ప్రసాదంగారి సంస్మరణ అప్పుడే అర్థవంతమవుతుంది. ఈ సభకు వచ్చి ఆయన ఆశయాలను ఎత్తిపట్టాలని కోరుతున్నాం. 

జూలై 6 శనివారం ఉదయం 10 గంటల నుంచి

స్థలం: గంటి ప్రసాదం స్మారక భవనం, అయ్యన్న పేట రోడ్డు, బొబ్బిలి

అధ్యక్షత: తమటాల అప్పలనాయుడు

వక్తలు: పాణి(విరసం)

కొండారెడ్డి(ప్రగతిశీల కార్మిక సమాఖ్య)

పద్మకుమారి(ఏబిఎంఎస్‌)

గంటి వెంకటరమణ

పిల్లా లక్ష్మణరావు(ఐఎఫ్‌టియు), ఇంకా స్థానిక కార్మిక నాయకులు

-గంటి ప్రసాదం స్మారక కమిటీ

-ప్రగతిశీల కార్మిక సమాఖ్య ‘బొబ్బిలి’

Leave a Reply