అది నాగాజాతి రాజధాని కాదు
నాకపురం దేవేంద్రుని స్వర్గానికి రాజధాని
అక్కడ దేవతలు, వాళ్లకోసం
ఇహ లోకంలో పుణ్యం చేసుకొని వచ్చిన
భోగ లాలసులుంటారు - విప్రులు, ద్విజులు
సనాతన ధర్మ రక్షకులు.
అక్కడ బాధితులెవ్వరూ
ప్రతీకారానికి సాహసించరు
అమృతం దొరకక చచ్చిపోతారు
దొంగిలించబోయి చంపబడతారు
అనామకంగా మట్టిలో కలిసిపోతారు
కాష్ఠంలో కాల్చినా, బొందపెట్టినా
‘బాబ్రీ మసీదును కూల్చినప్పుడు కూడా
నాగపూర్ లో హింస చెలరేగలేదు’1
ఈ కుట్ర ఎవడో సమాధిలో ఉన్నవాడు చేశాడు
పీష్వాల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం
కంపెనీతో యుద్ధంలో ఓడిపోయినప్పటి నుంచీ స్నేహంగానే ఉన్నాం
ఛత్రపతి శంభాజీ మహారాజ్ను చంపినా
తండ్రిని చంపి తనను చెరసాలలో పెట్టినా
ఛత్రపతి సాహు మహారాజ్
సమాధిని సందర్శించి
సహనమే ప్రదర్శించాడు
చరిత్ర పుటలు ఇప్పుడు
‘చావా’2 తో విప్పాం
ఔరా, శత్రువు ‘రణ’ రంగంలో లేడు
జేబులో లేడు
‘కుట్ర చేసినవాడు సమాధిలో ఉన్నా
తవ్వి తీసి’3 సమాజం ముందు
వారసుల్ని దోషులుగా శిక్షిస్తాం.
‘ఎందుకంటే కూల్చాల్సింది
నీతిలేని అతని వారసత్వాన్ని’4
మార్చి 17న ఔరంగజేబ్ సమాధిని కూల్చాలని నాగపూర్ లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తదితర సంఘపరివార్ చేసిన మూక దాడిలో గాయపడిన వారిలో ఆసుపత్రిలో మార్చి 22న అమరుడైన ముప్పై ఎనిమిదేళ్ల ఇర్ఫాన్ అన్సారీ కోసం కన్నీళ్ళతో...
--------------------------------------------------------------------------------------------------------------
1,3 నాగపూర్ హింసాకాండ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి శాసన సభలో మార్చ్ 19న చేసిన ప్రసంగం లో నుంచి.
2. చావా అంటే మరాఠీలో సింహం పిల్ల అని అర్థం. ‘చావా’ ఇటీవల విడుదలయిన మరాఠీ సినిమా కూడ. ఛత్రపతి శంభాజీని సింహం పిల్ల అని పిలుచుకుంటారు.
4. రామ్ మాధవ్ once upon a Ruler ఇండియన్ ఎక్స్ ప్రెస్, 22 మార్చ్-వ్యాసం నుంచి.
Related