ఎప్పడు మాట్లాడేదే అయినా
ఇంకా ఇంకా మాట్లాడాలి
కొత్త నినాదాలతో మాట్లాడాలి
కొత్త రూపాలను సంతరించుకొని
అన్ని తలాలకు విస్తరించే విధంగా
నువ్వు- నేను కలిసి కట్టుగా మాట్లాడాలి
కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి
నిజాన్ని నిగ్గు తేల్చేలా మాట్లాడాలి..!
ప్రపంచ నలుమూలను దిగ్బంధనంగా మార్చినా
అమెరికా సామ్రాజ్యవాదం
ఆయుధ భాండాగారంతో
ఆధిపత్యానికి అర్రులు చాస్తూ
దేశ దేశాల మీద గుత్తాధిపత్యానికి తెర లేపే
యుద్దాలకు బలైపోతున్న దేశ ప్రజలు ఎందరో
ఈ గాయాలకు మందు రాయడానికైనా మాట్లాడాలి
ఇప్పుడు ఎప్పడు మాట్లాడాలి
నువ్వు- నేను కలిసి కట్టుగానే మాట్లాడాలి
కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి
కాశ్మీర్ జాతి కోసం పోరాడుతున్న వాళ్ళు
మణిపూర్ మంటలను ఆర్ప అడుగులేస్తున్న చోట
మత కలహాలను రేపుతున్న వేల
అక్షరమై చేతి మునివేళ్లు తారసపడిన కాడ
పౌర హక్కుల కోసం పోరాడే నేల మీద
మౌనాన్ని బద్దలు కొట్టి మాట్లాడాలి
నువ్వు - నేను కలిసి కట్టుగా మాట్లాడాలి
కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి
ఆకలి కేకల ఆర్తనాదం పోయి
అత్యాచారం లేని ప్రపంచం కాంతి కోసం
పితృస్వామ్య భావాలను తుంచే మాతృస్వామిక వ్యవస్థ నిర్మాణంకై
దేశ దేశాల నుదిటి మీద చంద్రబింబమై
విధి వీధుల్లో విద్యుత్ దీపాల వలె
నక్షత్రాల జిలుగులు పూసే నవ్వుల కోసం
నువ్వు- నేను నిరంతరం మాట్లాడాలి
కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి..!
Related