అమరుల బంధుమిత్రుల సంఘం 22వ వార్షికోత్సవం కగార్ వ్యతిరేక దినంగా జరుపుకుంటున్న ఒక రోజు ముందు కారంచేడు దళిత ఆత్మగౌరవ పోరాటాలను దేశమంతా స్మరించుకున్న రోజు గడ్చిరోలీ (మహారాష్ట్ర) జిల్లాలో, మావోయిస్టుల రాజకీయ చిత్రపటంలో దండకారణ్యం మీద భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు భారీ ఎన్‌కౌంటర్ జరిపి 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు, ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు ప్రకటించింది. పూర్తిగా బిజెపి ప్రభుత్వం కానప్పటికీ శివసేన నుంచి ఏక్‌నాథ్‌శిండేను మరికొందరు ఎంఎల్‌ఏలను ఎత్తుకుపోయి అస్సాం ముఖ్యమంత్రి కరడుగట్టిన బ్రాహ్మణీయ ఫాసిస్టు హేమంతశర్మ అజమాయిషీలో క్యాంపు పెట్టి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని (ఎంవిఎ సంకీర్ణ ప్రభుత్వాన్ని) కూల్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇప్పుడు శరత్‌పవార్ ఎన్‌సిపి నుంచి చీలి వచ్చిన అనుయాయుల సంఖ్య అప్పటికే తనకే ఎక్కువగా ఉన్న అజిత్ పవార్ కూడ ఉప ముఖ్యమంత్రిగా చేరినా, ఏక్‌నాథ్‌శిండే ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆ సంకీర్ణ ప్రభుత్వానికి బ్యాక్‌సీట్ డ్రైవింగ్ మరొక కరడుకట్టిన బ్రాహ్మణీయ ఫాసిస్టు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిజ్వారే ఉప ముఖ్యమంత్రి) (డిఫ్యాక్టో ముఖ్యమంత్రి) ఫడ్నవీస్ ఈ ఫడ్నవీస్ పీష్వాల వంశం నుంచి వచ్చాడని, అతని ఎన్నికల ప్రచారంలో నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ మళ్లీ పీష్వాల సుపరిపాలన రావాలంటే వాళ్ల వారసుడు ఫడ్నవీసుకు ఓటు వేయాలని పోస్టర్స్ వేశారని గతంలో రాసిఉన్నాను. అందుకే మహరాష్ట్రలో ఉన్నది కూడ డబుల్ ఇంజన్ ప్రభుత్వమనడం, ఆయనది నాగపూర్ ` అంటే గడ్చిరోలీ కూడ కలుపుకున్న విదర్భ. ఒకప్పటి నాగజాతి ఆదివాసీ రాజ్యానికి రాజధాని. మొత్తం గోండ్వానా రాజ్యం ఉన్న మధ్యభారతానికి (సెంట్రల్ ప్రావిన్సెస్) కు రాజధాని. మహరాష్ట్ర ఏర్పడేదాకా ఇప్పటి విదర్భ అప్పటి ఛత్తీస్‌గఢ్‌లు కూడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగమే.
ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇప్పుడు మహరాష్ట్ర ప్రభుత్వ హోంమంత్రి కూడ. మరొక ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు గడ్చిరోలీలో ఎన్నో విధ్వంసక పూర్వక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటిస్తున్న సమయంలో ఈ ఎన్‌కౌెంటర్ అదే జిల్లాలో జరిగింది. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర స్థానమనదగిన అహెరిలో (ఇది తెలంగాణకు రోడ్డు మార్గంగా కాళేశ్వరం సిరొంచ నుంచి, రైలు మార్గంగా చంద్రపూర్ నుంచి చాల దగ్గరలో ఉంటుంది. చాల మంది తెలుగువాళ్లు ఉంటారు. తెలుగు అందరికి అర్థమవుతుంది.) మావోయిస్టు పోరాటాన్ని వ్యవస్థీకృత హింస ద్వారా ఎదుర్కోవడానికి ఒక ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించడానికి వాళ్లు వచ్చారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ అభివృద్ధి నమూనా ఎన్‌కౌంటర్‌కు ఫడ్నవీస్, అజిత్ పవార్ నెత్తుటి ముగ్గుపోశారు. వెనుకట రాజులు దళిత, ఆదివాసులను బలి ఇచ్చి కోటలు, తోటలు, కొలనులు నిర్మాణంచేసే వాళ్లు కదా. ఈ పీష్వా రాజుల వారసుడు పన్నెండు మంది మావోయిస్టుల రక్తంతో ఆధునిక అభివృద్ధి సంకేతమైన ఉక్కు ఫ్యాక్టరీతో ముగ్గు పోసాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో డిఎస్‌పి నాయకత్వంలో పాల్గొన్న వాళ్లలో సి`60 కమాండోలు ముఖ్యులు. సి`60 కమాండోలంటే మన గ్రేహౌండ్స్ వంటి వాళ్లు. జిల్లాలో ముఖ్యంగా ఆహిరి డివిజన్ కేంద్రంలో బస్ స్టాండ్‌లలో, హోటళ్లలో, ఆసుపత్రిలో మావోయిస్టు ఎవరో, అభిమాని ఎవరో, ఇన్‌పార్మర్ ఎవరో, సి`60 కమాండో ఎవరో పోల్చుకోలేనంత సందడిగా ఆయుధం దాచుకొని సివిల్ దుస్తుల్లో తిరుగుతుంటారు వాళ్లు. ఇటువంటి ఆపరేషన్‌లకు పోయినపుడే చిరుతపులుల ఆహార్యం. ఈ వార్త అందగానే పడ్నవీస్ సి-60 టీమ్‌కు 51 లక్షల రివార్డు ప్రకటించాడు.
ఈ 12 మందిని ఇంకా గుర్తించలేదు. ఇప్పటికి డివిజన్ నాయకుడు ఆత్రం లక్ష్మణ్‌ను మాత్రమే గుర్తించారు. ముందుగా హిందుస్థాన్ టైమ్స్ పోలీసు అధికార ప్రకటనను కూడ ఉల్లేఖిస్తూ 18వ తేదీన చేసిన రిపోర్టు.
‘‘ఈ గాలింపు చర్య (ఆపరేషన్) బుధవారం 17 జూలై ఉదయం వాండోలి గ్రామంలో మావోయిస్టు క్యాంపు వేసారని వాళ్లు సాయుధులైన 15 మంది అని వచ్చిన ఇంటిలెజెన్స్ వర్గాల సమాచారంతో ప్రారంభించాం. గడ్చిరోలీలో ఉదయం 10 గంటలకు ఏడు సి`60 పార్టీలతో డిప్యూటీ సూపరెండెంట్ నాయకత్వంలో ఛత్తీస్‌గడ్ సరిహద్దులకు పంపించాము.’’ అని చెప్పాడు ఎస్.పి. నీలోత్పల్.
గెరిల్లా వ్యతిరేక ఆపరేషన్స్‌లో సుశిక్షితులైన సి-60 పోలీసులకు సాయుధ మావోయిస్టులకు మధ్యన ఆరు గంటలకు పైగా ఎదురుకాల్పులు జరిగాయని, ఆ ప్రాంత ఛత్తీస్‌గడ్ కాంకేర్ జిల్లాకు గడ్చిరోలీ జిల్లాకు సరిహద్దు అయిన జరాబండి అడవి అని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారట. ఆ ఎదురు కాల్పుల్లో ఒక సీనియర్ కమాండర్‌తో పాటు 12 మంది మావోయిస్టులు మరణించారని, ఇద్దరు పోలీసులకు కూడ బుల్లెట్ గాయాలయ్యాయని, ఈ ఆపరేషన్‌ను సన్నిహితంగా చూసినామని ఆ అధికారులు చెప్పారు. ఆ ఇద్దరు అధికారులకు ప్రాణాపాయ స్థితి ఏమీ లేదని కూడ చెప్పారు.
‘సాక్షి’ 18 జూలై ముంబై ఎడిషన్ మొదటి పేజీలోనే చివరి కాలమ్ కింద ఒక ఫొటో వేసి ‘గాయపడిన భద్రతాధికారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం’ అని రాసింది. ‘గడ్చిరోలీ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, మృతుల్లో మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు ఆత్రం లక్ష్మణ్. ఎదురు కాల్పుల్లో ఒక ఎస్‌ఐ, ఒక జవాన్‌కు గాయాలు (హిందుస్థాన్ టైమ్స్ ‘పోలీసు పర్సనల్’ అని మాత్రమే రాసింది) అని చాలా పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో ప్రచురించి ఐదో పేజీల రిపోర్ట్ రాసింది.
పోలీస్ టీంలకు మావోయిస్టులకు మధ్యన భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయని, అవి ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఐదు గంటలకు పైగా కొనసాగాయని ‘‘ఈ ఎన్‌కౌంటర్‌లో’’ 12 మంది మావోయిస్టులను నిశ్చలం (న్యూట్రలైజ్) చేసి ఎన్నో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్.పి. చెప్పాడు. ఆ తర్వాత పోలీసు టీంలు ఆ ప్రాంతాన్ని అంతా పహరా కాస్తూ మూడు ఏ.కె. 47, రెండు ఇన్సాస్ రైఫిళ్లు. మిగతా ఏడు శవాల దగ్గర ప్రతి ఒక్క శవం దగ్గర ఒక కార్బన్ ఎస్.ఎల్.ఆర్. రైఫిల్ ఆ స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామన్నారు. మరణించిన వారిలో ఒకరిని విశాల్ ఆత్రంగా పోలీసులు గుర్తించారన్నారు. ఆయన టిపాగడ్ గెరిల్లా దళనాయకుడుగా కీలకమైన మావోయిస్టు డివిజన్ దళకమాండర్ అన్నాడు. మిగతా వారిని ఇంకా పోలీసులు గుర్తించాల్సి ఉన్నది. ఇద్దరు పోలీసు అధికారులకు బుల్లెట్ గాయాలయ్యాయి కానీ వాళ్లను హెలికాప్టర్‌లో నాగపూర్ పంపించారు. వాళ్లకు చికిత్స జరిగి అపాయం నుంచి బయటపడ్డారన్నాడు.
ఈ జూలై 17 బుధవారం ఎన్‌కౌంటర్ వామపక్ష తీవ్రవాదం ప్రబలంగా ఉన్న ఈ ప్రాంతంలో చేపట్టిన గాలింపులలో ఈ జిల్లాలో 2024 లో ఇది సుస్థిరమైన విజయానికి సంకేతం అని సీనియర్ పోలీస్ అధికారులు అన్నారు.
ఇంతకన్నా ముందు జూన్ 13న గడ్చిరోలీ జిల్లా బామ్రాగడ్ డివిజన్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ కమాండర్, ఇద్దరు మహిళా సభ్యులు మరణించారు. ఒక ఏ.కె.`47, ఒక కార్బన్, మరొక ఇన్సాఫ్ రైఫిల్ వాళ్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన విషయమని జూన్ 22న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో సిపిఐ మావోయిస్టు గడ్చిరోలీ డివిజనల్ కమిటీ నాయకుడు గిరిధర్ (నాగ్సు టుమ్రెమ్) లొంగిపోవడాన్ని పేర్కొన్నారు.
జూలై 17 సాయంత్రం నాగపూర్ లో మీడియాతో మాట్లాడుతూ మేం మా సి-60 జవాన్ ల విషయంలో గర్వంగా ఉన్నాం. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంటే ఎంతో సాహసోపేతంగా పోరాడుతూ, తమ వైపు ఏ నష్టాలు లేకుండా విజయవంతంగా వాళ్లు 12 మంది మావోయిస్టులను నిర్మూలించారు. ఆ టీం కంతా మేము 51 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తున్నాం అన్నాడు.
ఈ మాటలు హిందుస్థాన్ టైమ్స్ ఫడ్నవీస్ ఫొటో కూడా వేసి పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో కూడ ఉప ముఖ్యమంత్రి నోట వెలువడినట్లుగా ఉటంకించింది.
ఇదే సమాచారాన్ని సాక్షి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం కాళేశ్వరం నుంచి మహరాష్ట్ర ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రిపోర్టు చేశాడు.
‘‘మృతుల్లో మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్‌తో పాటు పొగడ్ దళ కమాండర్ ఆత్రం లక్ష్మణ్’’ ఉన్నట్లు శీర్షిక కిందనే ప్రకటించింది… వీరిలో డివిజనల్ కమిటీ మెంబర్‌తో పొగడ్ దళ కమాండర్ ఆత్రం లక్ష్మణ్ అలియాస్ విశాల్ ఉన్నట్టు సమాచారం అని రాశాడు. హోరా హోరీ కాల్పులు అని చూసినట్లుగానే ఉప శీర్షికపెట్టి సాక్షి రిపోరింగ్‌లో మాత్రం ‘‘సి`60 కంపెనీకి చెందిన కమాండోలు మధ్యాహ్నం ఒంటి గంటకు మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి చేరుకోగా ఎదురుకాల్పులు మొదలయ్యాయి..! సాయంత్రం 6 గంటల వరకు కాల్పులు జరుగగా అని రాసింది.
‘తెలుగు వారు ఉన్నారా?’ అని ఒక ఉప శీర్షిక బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆత్రం లక్ష్మణ్ అలియాస్ ఆత్రం విశాల్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మృతులను (ఇసి రిపోర్టర్ వాక్యమే) పోలీసు వర్గాలు ఇంకా గుర్తించలేదు. ఇది ‘సాక్షి’.
ఈ ఎన్‌కౌంటర్‌లో అమరులైన వారి వివరాల కోసం ఇన్ని రోజులు నిరీక్షించగా ఆ 12 మంది వివరాలతో ఒక ప్రకటన విడుదలయింది. దాని ప్రకారం అమరుడు ఆత్రం లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు డివిజినల్ కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు.
అందులో న్యూట్రలైజ్ చేయబడిన మావోయిస్టు శ్రేణుల వివరాలు అని ఉంది. పోలీసు భాషలో న్యూట్రలైజ్ చేయబడిన అంటే ప్రజల భాషలో చంపబడిన అని అర్థం. ఆ వివరాలు
మొత్తం 12 మందిలో ఏడుగురు పురుషులు, ఐదుగురు స్త్రీలు అందరూ మావోయిస్టులేనని వివరాలిస్తూ 12 మృతదేహాల వీడియో ఎ. కె. న్యూస్ లో వచ్చింది. అన్ని మృతదేహాలు పూర్తిగా కప్పబడి తాళ్లతో కట్టివేయబడి ఉన్నాయి. ఒక్కటి మాత్రం ముందే పసుపు రంగు టార్పాలిన్ క్లాత్ లో ఉంది. మిగతావన్నీ లేత ముదురు బూడిద రంగులో ఉన్నాయి. ఒకటి గానీ, రెండు గానీ అరికాళ్ళు కనిపిస్తున్నాయి. వీరి కుటుంబాలకు సమాచారం అంది వచ్చి మృతదేహాలను తీసుకుపోయారో లేదో తెలియదు. 6 క్రమ సంఖ్య రెండుసార్లు ఉంది. బహుశా బిజు అలియాస్ సరిత పర్సా కావచ్చు. కాక పోతే 13 మంది చనిపోయినట్లు అవుతుంది.
మృతుల కుటుంబాల నుంచో, మావోయిస్టు పార్టీ నుంచో ప్రకటన వస్తే తప్ప లేదా ఏ రూపంలో నైనా సమాచారం వస్తే తప్ప ఇందులోని వాస్తవాలు తెలియదు గానీ పేర్లను బట్టి వీళ్లంతా ఆదివాసులనీ, స్థానికులని అనిపిస్తున్నది.
పోలీసులకు వీరి దగ్గర దొరికినాయని చెబుతున్న ఆయుధాలను బట్టి (ఈ వీడియోలో శవాల పక్కన ఆయుధాలు చూపలేదు) మూడు ఎ.కె. 47లు ఉన్నాయన్నారు గనుక ముగ్గురు డివిసిఎంలన్నారు. కావచ్చు, కాకపోవచ్చు. పార్టీ సభ్యులని చూపినవాళ్లు మాత్రం ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు కచ్చితంగా గ్రామస్తులే అని చెప్పవచ్చు.
2014లో జార్ఖండ్ లోని ‘మావోయిస్టుల ఎవరు’ అని ప్రశ్న వేసుకొని ఫాదర్ స్టాన్ స్వామి ఇట్లా జవాబు ఇచ్చారు.
జార్ఖండ్ లో ఎక్కువగా ‘మావోయిస్టులు’ అని పిలువబడే వారు స్థానిక ఆదివాసులు అనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అగ్రనాయకత్వంలో కొంతమంది రాష్ట్రం బయటి నుండి వచ్చి ఉండవచ్చు. కానీ కార్యకర్తలు ఎక్కువగా ఆదివాసీలు స్థానికులు. 2014 జనవరి 1 నుండి జూన్ 30 వరకు (ఇప్పుడు దీనిని మనం జనవరి 1 నుండి జూలై 17 వరకు అని చదువుకోవచ్చు. 2024 సంవత్సరంలో 10 ఏళ్లు గడిచాయి. – ఫె.ట్రా)
ఆరు నెలల వ్యవధిలో జార్ఖండ్‌లో మావోయిస్టు అనే అభియోగంతో అరెస్టు చేసిన 243 మందిలో 186 (77శాతం) మంది స్థానిక ఆదివాసీలు అనే వాస్తవం దానిని రుజువు చేస్తుంది. వాటిలో ‘ఎన్‌కౌంటర్‌లు’, అని పిలువబడే వాటిలో 10 మంది మరణించారు. వారిలో 7 గురు (70 శాతం) ఆదివాసీలు. ఆదివాసి అంటే మావోయిస్టు అని ప్రభుత్వం అనేసుకుంటుంది అనడానికి ఇది తగినంత రుజువు కాబట్టి ఆదివాసి సమాజంపై అణిచివేత మావోయిస్టుపై చర్య పేరిట జరుగుతుంది.
ఇది జార్ఖండ్ లో మాత్రమే బిజెపి ప్రభుత్వం ఉన్నప్పటి పరిస్థితి. అప్పటికింకా ‘పథల్ గడీ’ (పెసా చట్టాన్ని శిల పై రాసి జార్ఖండ్ అడవుల్లో కుంతి జిల్లా పరిసరాల్లో సంప్రదాయ దుస్తులతో, విల్లంబులు పట్టుకొని ఆదివాసి యువకులు గ్రామ సభల ద్వారా అమలు చేస్తూ ఆదివాసేతరులు వీటిని ఉల్లంఘించడాన్ని అడ్డుకున్న ఉద్యమం) ఉద్యమం కన్నా ముందు స్థితి. ఈ స్థితి 2020 అక్టోబర్ 8న ఆయన అరెస్టయ్యే నాటికే ఎంతో మారిపోయింది. కేంద్రంలో రెండవసారి బిజెపి ప్రభుత్వం. మోషాల నాయకత్వంలో ఏర్పడిరది. ఎంత మార్పు అత్యున్నత న్యాయస్థానం లో కూడా వచ్చిందో చూపడానికి మళ్లీ స్టాన్ నే కోట్ చేస్తాను.
ఆదివాసీలు ఎవరు?
ఒక అపూర్వమైన తీర్పులో భారత సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత సంస్థ దీనికి సమాధానం ఇచ్చింది.
(క్రిమినల్ అపీల్ నెం.11/2011)
భారతదేశంలో మూలవాసులు ద్రవిడులు కారు. ద్రవిడ పూర్వ ముండా ఆదివాసులు, వారి వారసులు ప్రస్తుతం చోటా నాగపూర్ (జార్ఖండ్), ఛత్తీస్ గడ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ మొదలైన ప్రాంతాల్లోనూ, తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే తోడాలు, అండమాన్ దీవులలోని ఆదివాసులు, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా అడవులు, కొండ ప్రాంతాలలో ఉండే వారు. ఉదాహరణకు గోండ్లు, సంతాల్, భిల్లులు మొదలైన వారు.
భారతదేశంలోని ఆదివాసి ప్రజలకు జరిగిన అన్యాయం దేశ చరిత్రలో ఒక సిగ్గుపడే అధ్యాయం. ఆదివాసీలను రాక్షస్ (రాక్షసులు) ‘అసురులు’ అని పిలిచారు. వారిని పెద్ద సంఖ్యలో హత్య చేశారు. మిగిలిన వారిని, వారి వారసులను నీచంగా చూశారు. అవమానించారు. శతాబ్దాలుగా వారిపై అన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయి. వారు తమ భూములను కోల్పోయి, పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులతో, అడవులు, కొండల్లో దయనీయమైన అస్తిత్వానికి నెట్టబడ్డారు. వారు నివసిస్తున్న అడవులు, కొండల భూమిని, జీవనాధారమైన అటవీ ఉత్పత్తులను కూడా లాక్కోడానికి ఇప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. (ఇవి సుప్రీం కోర్టు చెప్పిన యథాతథ వాక్యాలు)
ఇటువంటి తీర్పు సుప్రీం కోర్టు 2011 తర్వాత ముఖ్యంగా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనం కోసం అధికారంలోకి వచ్చిన మోషా పాలన మొదలైన 2014 నుంచి ఇప్పటి వరకు సుప్రీం కోర్టు ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ కాపాడుకోవడానికి ఒక్క అనుకూలమైన తీర్పయినా ఇచ్చిందా? కాకపోగా ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వం జుడిషియల్ కమిషన్‌లు వేసి రుజువయిన హత్యాచారాలు, అత్యాచారాలను తీసుకొని ఆదివాసులను పిటిషనర్లుగా ఢల్లీికి హిమాంశుకుమార్ వస్తే, ఇటువంటి కేసులు, పిటిషన్లు తీసుకొనివచ్చి కోర్టు సమయం వృధా చేసినందుకు సుప్రీం కోర్టు ఆయనకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. మరొక సందర్భంలో గుజరాత్ మారణకాండ (2002) వ్యాజ్యాలు ముస్లింల తరఫున తెచ్చినందుకు జస్టిస్ కన్విల్కర్ తీస్తా సెతల్వాద్‌పై అభియోగాలు మోపి జైలుకు పంపించే తీర్పు ఇచ్చి నట్లుగా.
2014 లోనే ఎంత ముందు చూపుతో స్టాన్ స్వామి రాసాడో చూడండి : అపారమైన లాభాలను గడిరచడానికి, ఖనిజ, అటవీ సంపన్న భూమిని కాజేయడానికి పాలకవర్గాలు ప్రభుత్వాన్ని అనుకూలమైన సాధనంగా ఉపయోగించుకొని సాగిస్తున్న దోపిడీ భరించడానికి ఇంక ఆదివాసీలు ఏమాత్రం సిద్దంగా లేకపోవడంతో ఆశ్చర్యం లేదు. కార్పొరేట్, వ్యాపారవర్గం, పట్టణ మధ్యతరగతి, పై నుండి కింది స్థాయి వరకు వున్న ప్రభుత్వాధికారులు, పోలీసులు, పారా మిలిటరీ దళాలు ` అందరు వారికి శత్రువులుగా తయారయినపుడు, పేద ఆదివాసీలు తాము పూర్తిగా అంతమై పోకుండా కనీస రక్షణను కలిగించే కామ్రేడ్స్ (అడవి అక్కలు, అన్నలు) దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్తారు. (స్టాన్ స్వామి. 2014)
ఇది ఆయన రాయడానికి 24 ఏళ్ల ముందే 1980 లో మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పడిన పీపుల్స్‌వార్ పార్టీగా గడ్చిరోలీ, బస్తర్‌లలోకి దళాలుగా ప్రవేశించింది. మొదట తెగ పెత్తందార్లతో, సంప్రదాయ ముఖియాలతో, రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసుల దోపిడీకి వ్యతిరేకంగా సంఘటితమైన ఉద్యమం ఆదివాసుల విశ్వాసాన్ని చూరగొనే నాటికి 1980లలోనే, రెండవసారి ఇందిరాగాంధీ విజయం, 1984 భోపాల్ గ్యాస్ విషాదం, సిఖ్ఖుల ఊచకోత నాటికి రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఎన్నిక కావడమే ఇరవై ఒకటో శతాబ్దంలోకి, ఆధునికతలోకి ప్రవేశించే నూతన ఆర్థిక విధానం అమలయ్యే దశకు చేరుకున్నది. బెంగాల్, బీహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ లలోని సంతాల్ తెగలు నివసించే ఆదివాసి ప్రాంతాలన్నీ కలిపి జార్ఖండ్ ఏర్పాటు చేయాలనే డిమాండు, జార్ఖండ్‌కో లాల్‌ఖండ్ బనాయింగే అనే ఎంసిసి డిమాండు కేవలం బీహార్‌లోని జార్ఖండ్ రాష్ట్రంగానే.
వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలోనే ఏర్పడిరది. ‘విశాల బస్తర్’ డిమాండుతో దండకారణ్య పర్‌స్పెక్టివ్ తో అప్పటికే ఇరవై ఏళ్లుగా పీపుల్స్‌వార్ పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌లో మొదటి నుంచీ ఛత్తీస్‌గడ్ సంస్థానాధీశుల డిమాండుగా (రవిశంకర్ శుక్లా, పి.సి. శుక్లాలు ముఖ్యమంత్రులుగా ఉండి వాళ్లే ఈ రాష్ట్ర డిమాండును కూడ పెట్టారు.) ఉన్న ఛత్తీస్‌గడ్‌ను ఏర్పాటు చేశారు.
ఒకప్పటి గోండ్వానా రాజ్యాన్ని కాపాడుకోవడానికి, ఆఖరి అస్తిత్వ పోరాటం నెహ్రూ ప్రభుత్వంతో చేసిన జగదల్‌పూర్ రాజు 1965 కేంద్ర సైన్య బలగాలతో హత్యకు గురయినాడు. ఆ తర్వాత ఆ రాజవంశీకులయినా, అహిరి వంటి ఛత్తీస్‌గడ్‌లోని ఎన్నో సంస్థానాలలో ఉన్న రాజవంశాలైనా కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతకాలం అందులో చేరి ఎం.ఎల్.ఎ.లు, ఎం.పి.లయ్యారు. ఇపుడయితే బిజెపి నాశ్రయించారు.
పాలకులకు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మైదాన ప్రాంత ప్రజలకు లాభసాటి అయిన, ప్రయోజనకరమైన అంశాలు కూడ ఆదివాసులను దోచుకోవడానికి, వాళ్ల పాలిట విధ్వంసకరమైన చర్యయే అవుతుంది. రైలు రావడమే విప్లవం, విద్యుత్తు రావడమే విప్లవమని మనం మైదాన ప్రాంతాల సగటు ప్రజల ప్రయోజనంతో కూడ అనుకునే సందర్భాలు చాల
ఉంటాయి.
ఈస్టిండియా కంపెనీ రాకతోనే అడవిలోకి పెట్టుబడి ప్రవేశం ప్రారంభమైంది. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంతో ఇట్ట రైతాంగ పోరాటం ఓడిపోయి అటు సంస్థానాధీశులతో బ్రిటిషిండియా బంధమేర్పడి, సంస్థానాలు, బ్రిటిషిండియా కలిసి ప్రజలను దోచుకునే చట్టాలు వచ్చాయి.
అందులోను దేశంలో కల్లా పెద్దదయిన నిజాం హైదరాబాదు సంస్థానం 1857లో కూడ బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా నిలిచి ` రైతాంగ పోరాటానికి వ్యతిరేకంగా ఇక్కడి నుంచి సైన్యంలో చేర్చి బ్రిటిషిండియాకు నమ్మిన బంటుగా పనిచేసింది. ఈ సహకారం వల్ల బ్రిటిష్‌వాడు వేసిన రైల్వేకు నిజాం స్టేట్ రైల్వేను అనుసంధానం చేస్తూ 1883లో ‘చందా రైల్వే స్కీము’ అని ఒక ఒప్పందం చేసుకున్నారు. చందా అంటే ఇప్పటి చంద్రపూర్. ఇప్పటి గడ్చిరోలీ జిల్లా అప్పటి గోండ్వానా గత పాలకుల రాజధాని అయిన చంద్రపూర్ లో భాగమే. ఇది మధ్య రైల్వేలో నాగపూర్ ` బలార్షాల ముందు వచ్చే రైల్వే స్టేషన్. ఈ స్కీము వల్ల అప్పటి దాకా వాడి వరకే ఉన్న రైల్వే లైను చందా (చంద్రపూర్) వరకు విస్తరించడమే కాదు ‘ఆనాడు హైదరాబాదు నుండి వాడి వరకున్న రైల్వే స్టేషన్‌లన్నింటినీ ఒక బ్రిటిష్ కంపెనీకి అప్పగించడం, ఆ కంపెనీ వారు రైల్వే మార్గాన్ని వరంగల్ వరకూ తూర్పున భద్రాచలం వరకు, ఉత్తరాన చందా వరకు విస్తరించడం ఈ పథకంలో ప్రధానాంశాలు.
అంటే ఇప్పటి గడ్చిరోలీ, చంద్రపూర్ అడవుల నుంచి గోదావరి పొడుగునా భద్రాచలం వరకు ఉన్న అటవీ సంపదలను తరలించుకపోవడానికి బ్రిటిష్ పాలకులకు నైజాం సహకరించే ఒప్పందం అన్న మాట.
మనం చరిత్రలో మన దేశంలో రైలు మార్గం రావడం, మన దేశంలో అడవిలో ఉపరితలం పై ఉన్న కలప (చెట్లు) భూగర్భంలో ఉన్న బొగ్గు, ఇనుము ఇంగ్లాండ్‌లో ఉన్న మాంచెస్టర్, ల్యాంక్‌షైర్ వంటి బట్టల మిల్లుల కోసమని ఈస్టిండియా కంపెనీ దోపిడీ సందర్భంగా చదువుకునే వాళ్లం. ఈ సెంట్రల్ రైల్వే మీద డోర్నకల్ నుంచి కొత్తగూడెంకు రైలు మార్గం వేయడానికే డోర్నకల్ రైల్వే జంక్షన్ అయింది. బలార్షా, నాగపూర్, కాజీపేటలు అటువంటి ప్రయోజనాలకే రైల్వే జంక్షన్‌లు అయ్యాయి. అది ఇవ్వాటి గ్రహింపే కాదు.1883 నాటికే నిజాం సంస్థానంలోని ప్రజలు గ్రహించి ఆందోళన జరిపారు. అప్పటికే బ్రిటిషిండియాలోని బలార్షా నుంచి చంద్రపూర్ వరకు బొగ్గు గనులు వచ్చాయి. ఈ ప్రాంతమంతా విస్తారంగా వెదురు కూడ దొరుకుతుంది గనుక కాగితపు మిల్లులొచ్చాయి. ఇంక హైదరాబాదు రాష్ట్రంలోనైతే నైజాం గోదావరి నదీలోయ అంతటా ఆదిలాబాదు నుంచి కొత్తగూడెం వరకు సింగరేణి బొగ్గు గనుల కోసం కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. బ్రిటిష్ పరిపాలన పోయినాక కూడ ప్రభుత్వ షేర్లు ఉన్నప్పటికీ ఈ ప్రైవేట్ పారిశ్రామికాధికారులకు భల్లార్‌పూర్ కాగజ్ మిల్లు, కాగజ్‌నగర్ పేపర్ మిల్లు, సింగరేణి బొగ్గు తరలింపు ఈ ప్రాంత ప్రయోజనాలకు ముఖ్యంగా భూసారం, వ్యవసాయానికి నష్టదాయకం, అన్నిటికీ మించి అది ఆదివాసులను అడవి నుంచి పరాయీకరిస్తుంది.
అప్పుడు నిజాం కాలేజీ ప్రిన్స్‌పల్‌గా ఉన్న అఘోరనాథ్ ఛటోపాధ్యాయ ఈ చందా రైల్వే స్కీంను వ్యతిరేకించే ప్రజాందోళనకు నాయకత్వం వహించాడని మనకు తెలిసినంతగా, ఆయనతోపాటు హైదరాబాదు నగర ప్రముఖుడు ముల్లా అబ్దుల్ ఖయ్యూం కూడ ఈ పోరాటానికి నాయకత్వం వహించినాడని ‘భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ముస్లిం యోధులు’ అనే పుస్తకంలో సయ్యద్ నశీర్ అహ్మద్‌గారు రాసారు.
‘‘ఈ చందా రైల్వే స్కీం నష్టదాయకమంటూ నిజాం నవాబును నేరుగా ప్రజలు ప్రశ్నించిన తీరు నిజాం సంస్థానంలో కలవరం సృష్టించింది. ఈ ఇరువురి అభిప్రాయాన్ని నిజాం సంస్థానంలోని రెవెన్యూ అధికారి దస్తూర్ జీఫాజీ హోషంగ్ కూడా సమర్థించారు.
ఈ వ్యవహారం మీద చందా రైల్వే స్కీం వ్యవహారాల కమిటీ ఒకటి ఏర్పడిరది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా పరిణమించింది. సంతకాల సేకరణ మొదలై హైదరాబాదు ముస్లిం సమాజానికి చెందిన 18 మంది ప్రముఖులు సంతకం చేశారు. దానితో ప్రభుత్వం దీనికంతా కారణమని అఘోరనాథ్ చటర్జీని దస్తూరీ ఔఫాజీ హోషంగ్‌ను ప్రవాస శిక్షకు గురి చేశారు. (హైదరాబాదు రాజ్యం నుంచి వెలుపల) ముల్లా అబ్దుల్ ఖయ్యూంను నగర బహిష్కరణ చేశారు. 1886లో ఆ విధంగా స్కీం ను అమలు చేయగలిగారు.
అంతకు పూర్వమే అటు బ్రిటిష్ ఇండియా అడవి దోపిడీకి ఇటు నైజాం సంస్థాన సహకారాన్ని ప్రతిఘటిస్తూ తొలి ఆదివాసి ప్రతిఘటనకు రాంజీ గోండు అనే యోధుడు నాయకత్వం వహించిన విషయం ఆదివాసి పోరాటాల చరిత్రలో ఒక వీరగాధగా నమోదయింది. నిర్మల్ లో ఉన్న చాలా ప్రాచీనమైన ఊడల మర్రి కి రాంజీ గోండును ఆయన సహచరులను 1000 మందిని ఉరితీసారని ఇప్పటికి ఆ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు.
తెలంగాణలోని నారాయణ ఖేడ్‌కు చెందిన కుర్దుమియా సాహెబ్ నిర్మల్‌కు చెందిన తిరుగుబాటు నేత రాంజీ గోండు పక్షాన బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 1860 ఏప్రిల్ 9న రాంజీ బలగాలతో కలిసి, నిర్మల్ వద్ద ఆంగ్ల బలగాలతో పోరాడుతూ కుర్దుమియా అమరుడయ్యాడని సయ్యద్ నజీర్ అహ్మద్ రాసాడు. (భారత స్వాతంత్రోద్యమం తెలంగాణ ముస్లిం యోధులు. పే.73)
1910 లో బస్తర్‌లో గుండాదర్ నిర్వహించిన పోరాటానికి భూంకాల్ పోరాటంగా ఈనాటికి మనం దండకారణ్య చరిత్రలో ఇప్పటి విముక్తి పోరాటానికి అన్వయించి చెప్పుకుంటున్నాం. అట్లే 1940 లలో బ్రిటిష్ ఇండియా, నైజాం పాలన జోక్యాన్ని పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను ప్రతిఘటించి సైన్యము ` తుపాకులు తయారు చేసుకొని ‘మా ఊళ్లో మా రాజ్యం’ అని పోరాడిన కొమురం భీం అమరత్వాన్ని మార్గాన్ని మనం జనతన రాజ్యంలో ఆవిష్కరించుకుంటున్నాం.
ఈ చరిత్ర నేపథ్యంలో రచించిన దండకారణ్య పర్స్‌పెక్టివ్ లో ఏడు దళాలు 1980లో బస్తర్‌ల్లో ప్రవేశించగా ఒక దళం గోదావరి నది దాటి గడ్చిరోలీ జిల్లాలో భాగమైన సిరొంచలో ప్రవేశించింది. ప్రవేశించిన కొన్ని నెలల్లోనే 1980 నవంబర్ 2న మోయిన్‌బిన్‌పేట అనే చోట పోలీసుల చేత చిక్కి ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఇటీవల కగార్ దాడిలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో పెద్ది శంకర్‌తో పాటు సిరొంచలో ప్రవేశించిన కామ్రేడ్ కూడా అమరుడైనట్లు వసంతమేఘంలో చదివే ఉంటారు.
చంద్రపూర్‌లో విప్లవోద్యమానికి అండగా నిలిచిన ప్రముఖ ప్రజాస్వామ్యవాది ఏక్ నాథ్ సాల్వే, మంతెనకు చెందిన కృష్ణారెడ్డి అనే న్యాయవాదుల సహాయంతో ఈ ఎన్‌కౌంటర్ నిజనిర్ధారణకు వెళ్లిన సిపిడిఆర్ మహారాష్ట్ర కమిటీ రాష్ట్రంలో ఇదే మొదటి ఎన్‌కౌంటర్ కనుక జగిత్యాల సిరిసిల్ల ‘కల్లోలిత ప్రాంతాల’ (1978) విషయంలో ఢల్లీి పియుడిఆర్, ఎపిసిఎల్‌సి చేసిన నిజనిర్ధారణ అంతటి సమగ్రమైన నివేదిక తయారుచేసి శిరొంచ, గడ్చిరోలీ. చంద్రపూర్, అహెరి, ఏటపల్లి అడవులు అక్కడి ఆదివాసులు వారి రాజకీయార్థిక సామాజిక నేపథ్యాల గురించి రాసి ఉన్నారు. అట్లే అరుణతారలో ‘అడవిలో అన్నలు’ గా సీరియల్ గా వచ్చి పుస్తక రూపంలో ‘సరిహద్దు’గా వచ్చిన సాధన నవల ఇతర రచనలు మొదలు దండకారణ్యోద్యమం దశాబ్ది’, ‘దండకారణ్య రచయితలు’, (1993) దండకారణ ఉద్యమం ` సాంస్కృతిక ఉద్యమం 30 ఏళ్లు, మహిళా ఉద్యమం వంటి అడవి నుండే వచ్చిన ఎన్నో సాధికార రచనల నుంచి వియ్యుక్క ఆరు కథల సంపుటాల దాకా గడ్చిరోలి భూగోళం చరిత్ర మొదలు ఆదివాసుల జీవితం, పోరాటాల దాక విస్తృతమైన సాహిత్యం వచ్చింది. తెలంగాణ వలె కాకుండా మహారాష్ట్ర ప్రజలకు దాని తూర్పు అంచున ఉండి దండకారణ్యంలో భాగమైన గడ్చిరోలీకి ఒక విప్లవకారుని ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమం అమరుల త్యాగాల ఒక నూతనోత్తేజమై గోవింద నిహ్లానీ, ఆక్రోశ్, పార్టీ వంటి సినిమాలు మొదలు ఈనాటికీ గడ్చిరోలీ…. ఒక మావోయిస్టు విప్లవ ప్రతీకగా చూపే సినిమాలు వస్తున్నాయి. అయినా గడ్చిరోలీ దండకారణ్య పోరాట చరిత్రలో భాగమైనంతగా మహారాష్ట్ర పౌర జీవితంలో భాగం కాలేదు.
మైదాన ప్రాంత ప్రజలకు, పౌర సమాజానికి ఆదివాసి జీవితం, పోరాటాలు తమ చైతన్యంలో భాగం కాకపోవడం ఎంత విషాదమో, అంతకన్నా ఎక్కువగా పాలకవర్గాల కుట్ర. దానికి ఆదివాసుల అవగాహనలో చెప్పాలంటే తెల్ల బట్టల వాళ్లందరూ వాళ్లను అనాగరికులుగా, ఆటవికులు, అడవి మనుషులుగా చూస్తారు గనుక నమ్మదగనివారుగా కనిపిస్తారు.
మినరల్స్, (ఖనిజాలు) మైనింగ్ (ఖనిజాల తవ్వకాలు) విషయంలో నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూడండి. (జూలై 25) ఇప్పటిదాకా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే ఒక విధాన నిర్ణయాధికారం ఉంది. అడవి చట్టాలన్ని కేంద్ర ప్రభుత్వం చేసేవి. కానీ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కూడా మినరల్స్, మైనింగ్ విషయంలో వాటా ఉండాలని, నిర్ణయాధికారంలో భాగం కావాలని తీర్పు ఇచ్చింది. అంటే దోపిడీలో భాగస్వాములయ్యే (స్టేక్ హోల్డర్స్) అధికారం వాటా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఆదివాసులను, అడవులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దోచుకోవచ్చు. కానీ వేల సంవత్సరాలుగా కాపాతుకున్న ఆదివాసులు మాత్రం భాగస్వాములు (స్టేక్ హోల్డర్స్) కూడా కాదు. ఇది ఆదివాసేతరులు అన్నప్పుడు బయటి వారు మాత్రమే కాదు రాజ్యం (స్టేట్) అన్న ‘సమత’ తీర్పుకు ఎంత విరుద్ధమో చూడండి.
గడ్చిరోలీ జిల్లాలో 80 శాతం ప్రాంతం అడవులు గుట్టలతో కూడుకొని ఉన్నది. ఈ జిల్లాలో అపార ఖనిజ సంపద ఉన్నది. జిల్లా మధ్యభాగంలో సూర్జాఘడ్ గుట్టలు ప్రత్యేకించి ఇనుప ఖనిజం నిల్వలకు ప్రసిద్ధి. ఈ విలువైన నిక్షేపాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు లాయిడ్స్ అనే ఒక బహుళ జాతి కంపెనీకి, తర్వాత జి.ఎస్.డబ్ల్యూ. ఇస్పాట్ట్ స్టీల్స్ లిమిటెడ్ అనే మరో భారీ కంపెనీకి అనుమతి ఇచ్చింది. జిందాల్ సోదరులు, నవీన్, సజ్జన్‌లు నడిపిస్తున్న ఈ కంపెనీ దేశంలోనే ఒక అతిపెద్ద బహుళజాతి కంపెనీ. 2013లో ఈ సూర్జాఘడ్ గుట్టల్లోని దంకోడ్వాడీ ప్రాంతంలోని 751.04 హెక్టర్ల విస్తీర్ణం గల ప్రాంతంలో గనులు తవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీకి 20 సంవత్సరాల పాటు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇంకా బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటువంటి ఒప్పందాలు మరిన్ని చేసుకొని, ఆనాడు మాత్రమే కాకుండా ఈనాటికి ఏ గ్రామ సభ అనుమతి తీసుకోకుండా తవ్వకాలు, పరిశ్రమల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇటీవలనే 280 గ్రామాలలో స్థానిక మూలవాసి సంఘాల కార్యకర్తలను అరెస్టులు చేసి, దాడులు జరిపిన విషయం కూడా గతంలో రాసి ఉన్నాను. ఈ సూర్జాఘడ్ అడవులు, కొండలు ఇక్కడ మైనింగ్ దీనికి వ్యతిరేక పోరాటమే ఈ జిల్లాల్లో కీలకమైన సంఘర్షణ. ఇక్కడ పెద్ది శంకర్ తర్వాత ప్రత్యేకించి వచ్చిన నాయకత్వమంతా రామన్న పేరుతో పటేల్ సుధాకర్ రెడ్డి, సాంస్కృతిక కార్యకర్త సుఖదేవ్, ఐ.వి., రాంజీ పేరుతో పనిచేసిన మల్లోజుల కోటేశ్వర్ మొదలు, చంద్రపూర్ బొగ్గుగనుల్లో కార్మికుడిగా పనిచేస్తూ విప్లవోద్యమంలోకి వచ్చిన మిలింద్ తెల్‌తుంబ్డే దాకా అమరులు నిర్మించిందే. చిరకాలం గడ్చిరోలీ జిల్లా మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన నర్మద (కృష్ణకుమారి, నిర్మల) కేంద్ర కమిటీ దాకా ఎదిగి ఇటీవలే అమరుడైన మిలింద్ తెల్‌తుంబ్డేలు నిర్మించిన పోరాటం ఇది. ఇందులో అహెరి, గడ్చిరోలీలను కేంద్రంగా చేసుకొని పెట్టిన కేసులు అన్నింటిలోనూ నర్మద మిలింద్‌లను సహ ముద్దాయిలుగా చూపుతూనే దేశానికి అంతా తెలిసిన రెండు కేసుల గురించి చెప్పాలంటే నర్మదను కేంద్రంగా చేసుకున్న సాయిబాబా ఆయన సహచరుల కేసు (2013) సురేంద్ర గాడ్లింగ్ తక్కిన ఆదివాసుల మీద పెట్టిన అహెరి కేసు (2016). మిలింద్‌ను కేంద్రంగా చేసుకున్నది భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసు.
ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు డివిజన్ కమిటీ కార్యదర్శులు అమరులైనట్లుగానే 2018 ఏప్రిల్ లో నక్సల్బరీ ఉద్యమంలోనే అన్నిటికన్నా పెద్దదైన 40 మంది ఆదివాసులు మరణించిన ఎన్‌కౌంటర్‌లోనే చల్లగరిగె విజేందర్ అమరుడయ్యాడు. ఆ 40 మందిలో 20 మంది పార్టీ సభ్యులు, మిగతా 20 మంది ఆదివాసులు. కానీ అందరికందరూ ఆదివాసులు. నాయకుడు విజయేందర్. సుధాకర్, శంకర్ గురించి వసంతమేఘంలోనే చీమల నర్సింహులు, జోగన్న గురించి చైతన్య, శంకర్ మిత్రులు రాసినట్లు గడ్చిరోలీలో 1980 నుంచి ప్రవేశించి విప్లవోద్యమాన్ని నిర్మాణం చేస్తున్న అద్బుతమైన నాయకత్వం అక్కడి ఆదివాసి ప్రజల పోరాటాలు, త్యాగాలు అన్నింటినీ సుర్జాఘడ్ విప్లవ పోరాటంగా అభివర్ణిస్తే, బస్తర్‌లో మాడ్ లక్ష్యంగా ఎట్లా సూరజ్‌కుండ్ పాలక వ్యూహంలో భాగంగా కగార్ అంతిమ యుద్ధాన్ని పాలక వర్గాలు చేపట్టాయి. దాని ప్రతిఘటనగా సుర్జాఘడ్ పోరాటాన్ని మావోయిస్టు పార్టీ నాయకత్వంలో గడ్చిరోలీ ఆదివాసులు దండకారణ్యలో భాగంగా చేపట్టారని చెప్పవచ్చు.