జీవితాన్ని విశ్లేషించడం ఒక్క సాహిత్యానికి మాత్రమే సాధ్యమౌతుంది. మనిషిలోని మనిషితనం, మనసుతనం చెప్పడమే కాదు, ఈ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టి నడిపించేది కూడా కవిత్వమే. కవికి కవిత్వ వస్తువుల్ని వర్తమాన ప్రపంచమే అందిస్తుంది. ఈ ప్రపంచం అందించే వస్తువును గూర్చి  డా.కిన్నెర శ్రీదేవి ‘‘కవిత్వం వాస్తవ ప్రపంచంలోని నిర్ధిష్ట విషయాన్ని రచయిత సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించి మదింపు చేయడం వలన అది సాహిత్య వస్తువౌతుంది’’ అంటారు. అటువంటి నిర్ధిష్టమైన విషయంతో,  వస్తువును సౌందర్యాత్మకంగా.. మనసును లయాత్మకంగా విన్యాసం చేయించే కవిత్వం ఇటీవల వచ్చిన “వెన్నెల కురవని రాత్రి”. ఈ కవిత్వాన్ని అందించిన కవి కర్నూలు జిల్లాకు చెందిన స్వయంప్రభ. కవిత్వాన్ని బాధగాను, సున్నితంగాను, గంభీరంగానూ, రౌద్రంగానూ, లౌల్యంగానూ ఈ సంపుటిలో చెప్పారు. పూలనిప్పులు పేరుతో కవిత్వప్రపంచానికి పరిచితమైన ఈ కవి వైవిధ్యమైన కవితాత్మక శీర్షికతో వెన్నెల కురవని రాత్రి శీర్షికతో పాఠకుల ముందుకొచ్చారు.

అనుకునేదాన్ని/ యెప్పుడూ వొక మాటనుకునేదాన్ని/ ఇన్నేసి గాయాలు తగిలితే /మనిషెలా బతికుంటాడని..?(వెన్నెలకురవని రాత్రి) నిజమే కాదా..! కొన్ని గాయాలకు మందులుండవు. శరీరానికి తగిలే గాయాలైతే మందురాయొచ్చు. మనసుకు తగిలే గాయమైతే మందెలా రాస్తాం.అందుకే కవిత్వం మనసుతనం గూర్చి కూడా మాట్లాడుతుందన్నాను.సగటు మహిళ జీవితంలో ఎన్నో గాయాలను ఎదుర్కోవాలి. ఈ మాయా మార్కెట్‌ ప్రపంచంలో అంగడి సరుకయ్యాక గాయాలకు కొదువేం లేదు. ఆడ బతుకులో వొక్కో కన్నీటి చుక్కకు తుంపర తుంపర్లుగా తడియారని గాయాలుంటాయి, కనురెప్పలు మూతపడని గాథలుంటాయి.ఆ గాథలు మగువ జీవితం నిండా అందమైన ముళ్ళమొక్కల్లా ఎలా పరచుకుంటాయో ఈ కవిత్వమే ఉదాహరణ. ఆ యాతనలు బాధలు, ఆవేదనాక్షర వాక్యాలు కవిత్వంగా ఎలా మాట్లాడారో చూద్దాం..

పలక మీద అక్షరమై ఉన్నప్పుడే/బాగుండేది../ఒద్దికగా దిద్దుతూ ఉండేవాళ్ళం/ వొకరికొకరు తోడుగా..(ఎప్పటిదాకా)

పలకతో దిద్దడమంటే ఇక్కడ అక్షరాలను దిద్దినట్లుకాదు..అందమైన జీవితాన్ని వొకరిసాక్షిగా మరొకరు దిద్దడమే..సారూప్యత పలకొక్కటే కాదు. వొద్దికగా దిద్దడం కూడా..ఒక్కమాటలో, ఒక్క కవితావాక్యంలో జీవనాన్ని, జీవితాన్ని, అనిర్వచనీయ ప్రేమైకభావనను చెప్పారు. బండి ఇరుసుల్లాగా సమాంతరంగా ప్రయాణం సాగాలి. ఏ వొక్కటీ అపసవ్వ దిశలో పయనించినా  ప్రయాణం ఇద్దరివీ వేర్వేరు గమ్యాలౌతాయి. పలకమీద అక్షరాలు సరిగ్గాదిద్దనట్లే..అనేక స్వప్నాలుంటాయి..అనేక ఊహలుంటాయి. ఊహల ఊసులు తనువును స్పృశిస్తాయి. వసంతంలో కోకిలలూ పాడుతుంటాయి. అందుకే ఈమె..

తెల్లటి నా మనసులో/ నల్లటి చుక్కలా జీవిస్తానంటే/ ఆ జీవనానికి పేరు పెట్టుకుంటా/ ఊసుల ఉయ్యాల నీతోనే అలా!!  అని కవితలో తను చెబుతున్నా..ఈ వెన్నెల కురవని రాత్రి చదివాక ఈమె జీవితం మహాయుద్దమని, ఆరని అగ్ని గుండమని అర్థమౌతుంది. చరిత్రలు/తిరగేసినా తిరగరాసినా/ తరతరాల విషాదాంతాలకు/ చెరగని రాజముద్రికలు/మగువల జీవితాలు అంటుంది. స్త్రీల జీవితాల్లో విషాదాలే వుంటాయి., విషాదాంతాలే దేహం నిండా పర్చుకుంటాయి. పురుషాధిక్యతకలిగిన భావజాలం, అణువణువు లింగవివక్ష ఆహర్యంగా ధరించుకున్న  ఈ వర్తమాన సమాజంలో చరిత్రను తవ్వేకొద్ది కనబడేది స్త్రీ అంటే ఆటబొమ్మే. స్త్రీ వొక వస్తువే. ఇదిప్పటి సంస్కృతికాదు..మనువు సృష్టించిన దుర్మార్గదురాచారం. అన్నీ మతగ్రంథాలు స్త్రీని అలానే చూశాయి.. అవీ చూద్దాం..

స్త్రీ అబల అనే పదం ఋగ్వేదంలో (5`30)లో వాడారు. హైందవ సంస్కృతి ఇలా సృష్టించడం నేటిది కాదు. హైందవ సంప్రదాయంలోనే అది కొనసాగింది, కొనసాగుతూనే ఉంది. మనస్మృతిలో ‘‘పితారక్షితి కొమాతే, భర్తారక్షరతి స్థావిరే పుత్రా, నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ అన్నారు. అనగా బాల్యమందు తండ్రి, యవ్వనమందు భర్త, వృద్ధాప్యమందు కుమారుడు స్త్రీని రక్షింతురు. కాబట్టి స్త్రీ స్వతంత్రించరాదు. ఆంక్షలు ఒకపక్క విధించి, మరోపక్క ఆదిశక్తి, మాతృమూర్తి అని కీర్తిస్తుంది. దీనిబట్టి మనుధర్మశాస్త్రం పురుషులకు అనుకూలంగా వుందని అర్థమవుతుంది. 10వ శతాబ్ధం తర్వాత పెళ్ళికి వేద మంతాలు జపించే పద్ధతి కొనసాగిస్తున్నారు. అందులోనూ వివక్ష లేకపోలేదు.

‘‘మాంగల్యం తంతునానేన మతజీవన హేతునా

కంఠే బద్నామి సుభగేతం జీవశరదశ్శతమ్‌’’

దీనర్థం నా జీవనమునకు హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్ళు వర్ధిల్లు అని అర్థం. రెండు ముళ్ళు గట్టిగా ఒక ముడి వదులుగా వేస్తారు. మొదట తాటి యాకును కట్టే వారట. అది తాళిగా మారింది. తలంబ్రాలు పోయడం, తెరకట్టడం తిక్కన చెప్పాడు. కాని తాళి ప్రస్తావన తీసుకురాలేదు. పోతన‘‘మెలత మంగళ సూత్రంబు మినుకు దక్క’’ అని సీత తాళిని ప్రశంసించాడు. స్త్రీల స్వేచ్ఛను హరించి బంధీ చెసేందుకు నానా పద్ధతులు ఇతిహాసాల్లో సృష్టించారు.

మనదేశం భిన్నత్వంలో ఏకత్వం కల్గిన ఏకైక దేశం అని మతాలను, సంప్రదాయాలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవిస్తున్నాము. మత గ్రంథాలు మాత్రం మనల్ని విభజిస్తున్నాయి. అయితే ఏ మత గ్రంథమైనా లింగ వివక్ష చూపకుండా ఉండాలి. ఖురాన్‌లో…‘‘స్త్రీలకంటే పురుషులకు దేవుడెక్కువ మంచిగుణములు ఇచ్చి ఉండుట చేతను, పురుషులు తమకు ప్రసాదింప బడిన దానితో నెక్కుడుగా ఆదాయము చేయగల్గుట చేతను స్త్రీల కంటే పురుషులు అధికులు’’ (ఖురాన్‌ 5`4`6). అలాగే మీ భార్యలు మీ పొలము వంటి వారు. కావున మీకు ఇష్టము వచ్చినట్లు వారి యొద్దకు పొండు. (2`2`28). ఈ విధంగా చెప్పడం వల్ల స్త్రీల పట్ల మత గ్రంథాల్లో ఉన్న చోటు అర్థమవుతుంది.బైబిల్‌లో…‘‘స్త్రీ పురుషునికే గాని, పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు.’’ (కొరంథీ 11.9). ఇలా మత గ్రంథాల్లోను అగ్రస్థానం కల్పించకపోగా కనీసం సమానస్థానం కూడా కల్పించలేదు. తత్వవేత్తలు సైతం స్త్రీని చిన్నచూపే చూశారు. సకలపాపాలకు స్త్రీయే మూలమని సోక్రటీస్‌ అంటే, సృష్టిలో మగజాతి, ఆడజాతి కన్నా ఆధిక్యతలో ఉంది. ఒకటిపాలించేది, మరొకటి పాలించబడేది అని అరిస్టాటిల్‌ అంటారు. ఇప్పటికీ కొనసాగుతున్నదిదే..

స్త్రీ అంటే శరీరమొక్కటే కాదు..స్త్రీ అంటే హృదయం అని ఎందుకు అనుకోకూడదు..అందుకే ఈమే ‘అది హృదయమే..నీవనుకున్నట్టు శిలకాదు../ ఉలితో పలుమార్లు చెక్కి/ నచ్చినట్లుగా రూపాన్ని/మార్చి కూర్చేందుకు..’(తను) స్త్రీని మనిషిగా చూడని సమాజంలో మనం బతుకుతున్నామనిపిస్తుంది. జీవితం నిండా ఎన్ని ఉలిదెబ్బలు, జీవితం నిండా ఎన్ని గాయాలు, జీవిత పర్యంతమూ గుక్కపట్టి ఏడ్వకుండా మౌనంగా పారిన కన్నీటి ప్రవాహాలు. ఎన్నని, ఎన్నని తట్టుకోగలదు. ఈ కవిత్వం నిండా గాయాల ప్రవాహాలున్నాయి. అందుకే తనొకచోట ప్రశ్నార్ధకంగా ఉండిపోతాననడం, గాయాలెన్ని తగిలినా వేదనను తనలోనే పదిలంగా దాచుకుంటానంటుంది. అంతేకాక గాయాలేనాడో అలవాటై పొయాయి, గుర్తులు చెదిరిపోయేదేమీ లేదు గుండె మూగబోయేదాకా అంటుంది. అందుకే స్త్రీ మది, సముద్రం లాంటిది. నిర్మలంగా, నిమ్మలంగా ఉండక అలలు ఎగిసిపడ్తుంటాయి, కనుచూపుమేర నీలవర్ణపు సొగసులూ ఉంటాయి. పాదాలను తాకుతూ పరవశానికి గురిచేసి తీరాన్ని మైమరిపించే సౌందర్యమూ దాగివుంటుంది. అందుకే స్త్రీ వొక మహాసముద్రం. ఈ కవిత్వం నిండా సముద్రమన్ని కన్నీళ్ళు పారాయి.  అవి ఎలాగంటే…

ఉబికివచ్చేకన్నీళ్లు/ తుడుచుకున్న ప్రతీ సారి/ పాము కుబుసాన్ని విడిచినట్టు/ కడలిస్నానం చేసిన కలికి/తూరుపు పొద్దులా కనిపిస్తుంది/  చిత్రవధల జీవన చిత్రం/విచిత్రంగా కనిపించకూడదని..అందుకే వాస్తవజీవితమే ఈ కవిత్వం నిండా పరుచుకుందనిపిస్తుంది. ముల్లుకుచ్చుకున్నవాడికే ఆ బాధ తెలుస్తుంది..ఇతరులెంత మాట్లాడినా అవి సానుభూతి వాక్యాలే అవుతాయి. ఈ దేశాన్ని ప్రపంచీకరణ`మతోన్మాదం పాలిస్తున్నందున స్త్రీ మరింత పలుచనైంది.స్త్రీ అబలగా బలపడిరది. సబల మాటకు నిర్వచనమే మారిపోయింది.

ఈ వెన్నెల కురవని రాత్రి కవిత్వం నిండా ఆర్తి, ఆర్ధ్రతలు గాయాలే ఉన్నాయి. అందుకే ఈ వ్యాసానికి తను ఆశోకవనం కవితలో చెప్పిన ‘గాయాలు ఈనాటివి కావు..చరిత్రకు ముందు నుండీ ఉన్నవే…’అన్న మాటనే శీర్షికగా తీసుకన్నాను. మరిగాయానికి మందు వేసి, మతోన్మాద, మతరాజ్యాన్ని కూల్చివేసి, లింగవివక్షలేని, అసమానతల్ని అంతం చేసే మహిళాసాధకారతా పిడికిళ్లు పురుడుబోసుకుంటాయా? లేదా ? కాలమే నిర్ణయిస్తుంది..అటువంటి ఉద్యమాలు దేశం నలుమూలలా మొలకెత్తాలని కాంక్షిద్దాం..

Leave a Reply