(ఇటీవల విడుదలయిన కథా సంపుటికి రచయిత రాసిన ముందుమాట )

తెలుగు సాహిత్యంలో ఈ “ఏకలవ్య కాలనీ” మొదటి ఎరుకల కథా సంపుటి.

ఇవి మా జీవితాలు. ఇవి మా ఎరుకల కథలు. ఈ దేశపు మూలవాసీల్లో, ఆదివాసీల్లో ముఖ్యమైన ఎరుకల జీవనగాథలివి. ఈ కథల్లోని మా అవమానాలు, దుఃఖాలు, మా ఓటములు, గెలుపులు, మా కన్నీళ్ళు, నవ్వులు మిమ్మల్ని మా గురించి ఆలోచించమంటాయి. ఒక భరోసా కోసం ఒక ఆసరా కోసం ఒక నమ్మకం కోసం ఒక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న ఎరుకల బ్రతుకుల్లో నిజమైన మార్పు కోసమే ఈ కథలు..

1991లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా మొదటి కథ అచ్చయింది. 2023లో జీవన్ సంపాదకత్వంలో వచ్చిన “ఇప్పపూలు” గిరిజన సంచార తెగల కథాసంకలనం పరివర్తిత ముద్రణలో నేను రాసిన ఎరుకల కథ ‘మా తప్పు ఏంది సామీ’ ప్రచురితమైంది. శివరాత్రి సుధాకర్, కొలిమి వాళ్ళు ఈమధ్యే ప్రచురించిన మొదటి ఎరుకల కథా సంకలనం “ఎరుక”లో నా కథలున్నాయి. అయితే నాకు తోడుగా మరొక ఎరుకల రచయిత గొంతు వినిపించక పోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంటుంది. ఏకలవ్య కాలనీల నుంచి రాబోయే కాలంలో సాహిత్యకారులు తయారుకాకపోతారా అన్న అభిలాష నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

నేను కథలు, కవిత్వం, నవల, విమర్శ రాయడం చాలా సులభంగా జరగలేదు. ఈ ప్రయత్నం వెనుక జయమ్మ ఉంది, నాగయ్య ఉన్నాడు. పరీక్షలకు చదువుకోవాల్సిన సమయంలో పిల్లవాడు కథల పుస్తకం చదువుకుంటుంటే ఎప్పుడూ అడ్డం చెప్పని మంచి అమ్మానాన్నలు వాళ్ళు. మనుషులంటే ఇంత ప్రేమ దయ కరుణ వాళ్ళు నేర్పించినవే.

చిన్నప్పటినుంచి చూసిన జీవితాలను, అనుభవించిన దుఃఖాలను, బాధలను అక్షరాల్లోకి అనువదించడం అంత సులభంగా జరిగే పని కాదు. ఒక దుఃఖం, ఒక గాయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ప్రతిసందర్భంలో మా కన్నీళ్లే నా కలానికి తోడు.

నిరంతర అభద్రత నిరాశ్రయతలకు భయపడుతూ బాధపడుతున్న సంచార ఎరుకలు ఆశ పడుతున్నది ఆస్తుల కోసం అంతస్తుల కోసం కాదు. ఆధార్ కార్డులు, జనన మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఓటర్ కార్డులు, విద్య, వైద్యం, ఉపాధిహామీ జాబ్ కార్డులు, మంచినీళ్ల కోసమే. ఎన్నికల లెక్కల్లో జనాభా లెక్కల్లో అభివృద్ధి లెక్కల్లో అవసరం అయినప్పుడు మాత్రమే వెతికితే ఎక్కడైనా అప్పటికప్పుడు ఎరుకలు కనపడతారా?

పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభం ఏమీకాదని సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో నలిగిపోతున్న గిరిజన నిరుద్యోగులకు అర్థం అవుతుంది. చదువుకోవడంవల్లో, ఉద్యోగాలు సంపాదించుకోవడం వల్లో సమానత్వం రాదని గిరిజన ఉద్యోగులకు అర్థం అవుతుంది. పదవులు వచ్చినంత మాత్రాన గుర్తింపు, గౌరవం, అధికారం రాదని గిరిజన ప్రజాప్రతినిధులకు అర్ధం అవుతుంది. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉంటేనే లెక్కల్లో ఉంటామని ఎరుకలకు అర్థం అవుతుంది.

మంచినీళ్ళు, ఇండ్లు, మరుగుదొడ్లు, విద్యా, ఉపాధి అవకాశాలు, వైద్యం అందక అడవుల లోపల ఉండే వాళ్లే కాదు, అడవులనుండి వేరుచేయబడి నగరాల్లో పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా లెక్కల్లో లేకుండా పోతున్నారని సంచార జీవులైన ఎరుకలకు అర్థం అవుతుంది. ఎరుకల పిల్లలు, మహిళలు, ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధుల సమస్యలు ఇంకా సున్నితమైనవి. లెక్కల్లో లేకుండాపోయిన ఎరుకలవాళ్ళ లెక్కలు తేలాలి, తేలుతాయి.

ఇదే అసలైన ఎరుక.

ఈ ఎరుకతో ఎంతో సాహిత్యం వెలుగు చూడాల్సి ఉంది. చీకటి జీవితాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. ఎరుకల జీవితాలను కథల్లో నవలల్లో నాటకాల్లో కవిత్వంలో సహజంగా వాస్తవికంగా ఇంకా విస్తృతంగా చిత్రీకరించాల్సి ఉంది. ఎరుకల జీవితాలను చిత్రించిన సాహిత్యానికి సంబంధించిన అనువాదాలు, పరిశోధనలు, సదస్సులు జరగాల్సి వుంది. తద్వారా ఎంతోమంది ఎరుకలకు ఇంకా ఇంకా ఎంతో మంచి చేయాల్సి వుంది.

 ఈ కథలను ప్రచురించిన పత్రికలకు, వసంతమేఘం అంతర్జాల పక్షపత్రిక నిర్వాహకులకు, పాణి గారికి, సాహితీ గోదావరి సంపాదకుడు వంగాల సంపత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.

తెలుగుసాహిత్యంలో తొలి ఎరుకల కథాసంపుటిని ప్రచురిస్తున్న పర్ స్పెక్టివ్స్ వారికి, ఆర్ కె గారికి, ఎ. కె. ప్రభాకర్ గారికి ప్రేమపూర్వక నమస్సులు, ధన్యవాదాలు. కవర్ పేజీ కోసం ఫోటోలు అందించిన శివరాత్రి సుధాకర్, రాయల నాగవర్ధన్ లకు, ముఖచిత్ర రూపకల్పన చేసిన రమణజీవి గారికి, డిటిపిలో సహకరించిన పూజారి గంగాధర్, లేఅవుట్ చేసిన విట్టుబాబు గారికి ధన్యవాదాలు.

నన్ను ప్రేమించే సహృదయుల స్నేహానికీ ప్రేమలకీ ఎప్పటికీ రుణపడి ఉంటాను…

Leave a Reply