చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి, విప్లవకారులకి చిహ్నంగా మారాడు.

అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. అన్యాయమైన రాచరికాలను సవాలు చేయడానికి ప్రేరణ. క్రూరమైన,  అన్యాయమైన దోపిడీదారులైన పాలకులని సవాలు చేసే యువకులు ఇప్పటికీ చె వైపు చూస్తారు, అతని మార్గాన్ని అనుసరిస్తారు.

2023 డిసెంబర్ 13, న భారత పార్లమెంటును గురిగా చేసుకున్నవారు చె గువేరా మోటార్ సైకిల్ డైరీల ద్వారా ప్రభావితమయ్యారని భారత దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నిందితుడు, పార్లమెంటును లక్ష్యంగా చేసుకున్నవారి నాయకుడు  మనోరంజన్. 2023డిసెంబర్ 13నాడు భగత్ సింగ్ శైలిలో నలుగురు యువకులు కొత్త పార్లమెంట్ భవనంలో కొన్ని కరపత్రాలను విసిరారని మీకు గుర్తుండే ఉంటుంది. వారిలో ఇద్దరు మనోరంజన్, సాగర్ శర్మ విజిటర్ గ్యాలరీ నుండి లోక్‌సభ హాల్‌లోకి దూకారు. ఆ తరువాత, పొగ లేచింది.

మనోరంజన్, సాగర్ శర్మ లోక్ సభ భవనంలోకి దూకినట్లు పోలీసులు ఆరోపించారు. నీలం రనోలియా, అనమోల్ షిండే పార్లమెంటు భవనం వెలుపల పొగ కంటైనర్ తెరిచారు. లలిత్  ఝా మీద సాక్ష్యాలను నాశనం చేశాడని, ఐదవ నిందితుడు మహేష్ కుమావత్‌కు వీళ్లతో సంబంధంవున్నదని ఆరోపించారు. ఈ ఐదుగురు కలిసి ఫేస్‌బుక్‌లో భగత్ సింగ్ ఫ్యాన్స్ పేజీ పెట్టుకున్నారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.

ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం, ఈ మొత్తం కేసులో దర్యాప్తు ఏజెన్సీ అయిన ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ 1,000 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిలో ప్రధాన నిందితుడు మనోరంజన్ తన కంప్యూటర్, మెయిల్‌లో చె గువెరా మోటార్ సైకిల్ డైరీని వున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని కనుగొన్న దర్యాప్తు ఏజెన్సీ, ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని రుజువు చేస్తోందని పేర్కొంది. ఈ సినిమాతో మనోరంజన్ ప్రభావితుడయ్యాడని, అలా అని అతను ఇతరులకు రాశాడు.కూడా దర్యాప్తు సంస్థ పేర్కొంది.

ఈ సినిమా ద్వారా ప్రేరణ పొందిన మనోరంజన్ దేశమంతటా పర్యటించి, ఆ తర్వాత తన స్వంత సంస్థను స్థాపించడానికి మార్గాలు, పద్ధతుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు అని దర్యాప్తు సంస్థ తెలిపింది. అతను భారతదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుకున్నాడని కూడా ఛార్జ్ షీట్ పేర్కొంది. దీని కోసం, ప్రజాస్వామ్య చిహ్నమైన పార్లమెంటు మీద గురి పెట్టాడు. భగత్ సింగ్ లాగా పార్లమెంటు మీద దాడికి ప్రయత్నించిన ఈ ఆరుగురు నిందితులు యుఎపిఎ కింద జైలులో ఉన్నారని మనందరికీ తెలుసు.

మనోరంజన్  భారత రాచరికాన్ని పడగొట్టడానికి, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రేరేపించేట్లుగా చె గువేరా మోటార్ సైకిల్ డైరీలలో ఏముంది? అనేది  ప్రశ్న. చె డైరీ నిజంగానే ఎవరికైనా, ముఖ్యంగా యువతకు విప్లవకారులుగా మారడానికి, అన్యాయమైన అధికారాన్ని పడగొట్టడానికి ప్రేరణనిస్తుందా?

అవును, చే గువేరా మోటార్‌సైకిల్ డైరీలు ఒకరి జీవిత దిశను మార్చగలవు, అతనిని తన దేశ, ప్రపంచంలోని సాధారణ శ్రామిక ప్రజలతో కలుపుతాయి. అణచివేత, అన్యాయానికి గురైన బాధితులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ప్రేరణస్తుంది. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే దిశకునెడుతుంది. ఇది లాటిన్ అమెరికా గొప్ప నాయకుడు, లాటిన్ అమెరికన్ విప్లవకారులకు ప్రేరణ అయిన జోస్ మార్టీ చేసిన ప్రకటన వైపుకు తీసుకువెళ్తుంది. “నేను నా భవిష్యత్తును ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల భవిష్యత్తుతో అనుసంధానించాలనుకుంటున్నాను.”

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికార శక్తులు చె  మోటార్ సైకిల్ డైరీ అంటే  ఎందుకు భయపెడుతున్నాయి? ఎందుకు తమపై తిరుగుబాటుకు ప్రేరేపించేదిగా భావిస్తున్నాయి? ఎందుకు భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఈ డైరీని ప్రమాదకరమైనదిగా భావిస్తున్నాయి?

అర్జెంటీనాలో జన్మించిన ఎర్నెస్టో చె గగువేరా, అల్బెర్టో గ్రెనడో అనే ఇద్దరు యువకుల దక్షిణ అమెరికా పర్యటనకు సంబంధించినది. చె ఈ యాత్రను 23 ఏళ్ల వైద్య విద్యార్థిగా ప్రారంభించాడు. వైద్య విద్య నుండి ఒక సంవత్సరం సెలవు తీసుకొని ఈ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయనతో పాటు ఆయన సీనియర్ 29 ఏళ్ల వవైయోకెమిస్ట్ అల్బెర్టో గ్రెనడో కూడా ఉన్నాడు. వారు దక్షిణ అమెరికా అంతటా సుమారు 9 నెలలపాటు ప్రయాణించారు. ఈ యాత్ర అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో ప్రారంభమైంది. అతను అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, పనామా, మయామిలకు వెళ్ళారు.

ఈ యాత్రను సింగిల్ సిలిండర్ 1939, 500 సిసి మోటార్ సైకిల్ మీద చేసాడు. యాత్ర ప్రారంభ ప్రధాన ఉద్దేశ్యం శాన్ పాబ్లో (పెరూ) కుష్ఠురోగుల కాలనీకి వెళ్లడం. అక్కడ ఉన్న కుష్టు రోగులను కలవాలనుకున్నాడు. ఈ వ్యాధిని అంటువ్యాధిగా, రోగులను అంటరానివారుగా భావించేవారు. అతడికి చికిత్స చేసే వైద్యులు అమెజాన్ నదికి అవతల నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. రోగులను నదికి అవతలి వైపున ఉంచేవారు. డాక్టర్లు, నర్సులు వారిని నేరుగా తాకరు. చేతి తొడుగులు ధరించి వారిని తాకడం, వారి నుండి దూరంగా ఉండటం. అయితే, ఇది అంటువ్యాధి కాదని నిరూపితమైంది. వైద్య విద్యార్థిగా వారిని  కలవాలని, వారి గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు.

ఈ ఒక ఉద్దేశ్యమే కాకుండా, ఈ యాత్ర ప్రారంభంలో  ఉద్దేశ్యం ఒక నవయువకుడి సాహసం, కాల్పనికత కూడా వుండింది. కానీ ఈ యాత్ర మెల్ల మెల్లగా లాటిన్ అమెరికాలోని పేదలు, అణచివేతకు, దోపిడీకి గురైనవారు, అనారోగ్యంతో మరణించినవారు, గనుల్లో పనిచేసే కార్మికులు, రైతుల దుస్థితి గురించి తెలుసుకునే యాత్రగా మారిపోయింది.

దాదాపు తొమ్మిది నెలల పాటు, చె, అతని సహచరులు పర్యాటక ప్రదేశాలను సందర్శించకుండా, లాటిన్ అమెరికాలోని సాధారణ ప్రజలతో కలవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వారి బాధను అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించుకున్నారు. ఇద్దరూ రైతులను కలిశారు. వారు ఎంత కష్టపడి పనిచేసినా కూడా, తినడానికి అన్నం కూడా సరిగా ఎందుకు దొరకడంలేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.

చిలీ లోని రాగి గనుల కార్మికులను కలుసుకుని, అమెరికా కంపెనీలు చిలీ వనరులను ఎలా దోచుకొంటున్నాయి,  చిలీ కార్మికుల రక్తాన్ని ఎలా పీలుస్తున్నాయి అనే బాధాకరమైన  వారి గాథలను తెలుసుకున్నాడు.

ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న, శ్రామికులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్న లాటిన్ అమెరికాలోని కమ్యూనిస్టులను కలుసుకున్నాడు. ఈ కారణంగా, రాజ్యం వారిని ప్రమాదకరమైనవారుగా పరిగణించి, అనేక విధాలా  హింసలకు గురిచేసేది. క్షయవ్యాధితో బాధాకరమైన చావును ఎదుర్కొంటున్న, తగినంత ఆహారం కూడా అందుబాటులో లేని ఒక మహిళను ఈ యాత్రలో కలిశాడు.

జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాడు. రోగులను కలుసుకున్నాడు. ఒక దేశం లోని ఆసుపత్రులు, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని కలిస్తే  ఆ దేశంలోని సామాన్య ప్రజల పరిస్థితులను తెలుసుకోవచ్చని వైద్య విద్యలో ఉన్నప్పుడు ఆయన గ్రహించాడు. పోలీసులు సామాన్యులతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవడానికి చె, అతని సహచరులు పోలీసు స్టేషన్లకు వెళ్లారు.

ప్రయాణం సమయంలో, చె తన ప్రయాణం కోసం డబ్బును సంపాదించడానికి, భోజనం చేయడానికి ధాబాలో వెయిటర్ పనిని, గిన్నెలు తోమే పని చేసాడు. అప్పుడప్పుడు కార్మికులతో కలిసి పని చేసేవాడు. ఏ దొరికితే ఆ పని చేసాడు. ఎక్కడ జరిగితే దొరికితే అక్కడే వున్నాడు. కుష్టు రోగులతో పాటు ఒక వారం రోజులు గడిపాడు. చేతి తొడుగులు లేకుండా చేతులు కలిపాడు. వాళ్ళతో పాటు కూర్చున్నాడు. భోజనం చేసాడు. వారి దగ్గర ఉన్నాడు. ఏ విధమైన దూరాన్ని పాటించలేదు. వారిని తనలాగే భావించాడు. ఈ పర్యటనలో ఆయన మార్క్సిస్టులను కూడా కలిశారు. మార్క్సిజంతో పరిచయం అయింది. లాటిన్ అమెరికా మొత్తం ఒక దేశం లాంటిదని గ్రహించాడు. అందరి దు:ఖాలు, బాధలు ఒకలాంటివే. పేదలు, శ్రమజీవుల పరిస్థితి అన్నిచోట్లా ఒకేలా ఉంది. అత్యధిక దేశాల నిరంకుశ పాలకులు  అమెరికా సామ్రాజ్యవాదులతో కలిసి తమ దేశ వనరులను, శ్రమను దోపిడీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వారిని కమ్యూనిస్టులు అని వేధిస్తున్నారు.

ఈ ప్రయాణం చె ఆలోచనా విధానాన్ని మార్చింది. లాటిన్ అమెరికాకు వైద్యవిద్య చదివిన  వైద్యుల కంటే సమాజంలో విప్లవాత్మక మార్పులు చేసే వైద్యుల అవసరం ఉందని ఆయన గట్టిగా విశ్వసించాడు. చె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. కొంతవరకు సౌకర్యాలు ఉండేవి. కానీ లాటిన్ అమెరికన్ల పరిస్థితిని చూసి, అందుకు కారణాలను తెలుసుకున్న తరువాత, జోస్ మార్టి లాగా, అతను తన భవిష్యత్తును ప్రపంచ పేద ప్రజల భవిష్యత్తుతో ముడిపెట్టుకున్నాడు.

లాటిన్ అమెరికాలోని నియంతృత్వ పాలకులు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు విప్లవం ద్వారా, ముఖ్యంగా సాయుధ విప్లవం ద్వారా మాత్రమే అధికారం నుండి తొలగించబడతాయని వారు భావించడం ప్రారంభించారు. ప్రజాధికారం పొందిన వున్న ఒక పాలనను ఏర్పాటు చేయవచ్చు. కష్టపడి పనిచేసే వారికే అధికారం ఉంటుంది. చె విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మిగిలిన ఒక సంవత్సరం వైద్య విద్యను పూర్తి చేశాడు.

అందమైన ప్రపంచం కోసం మరణాన్ని ప్రేమించే విప్లవకారుడు అయ్యాడు చే. తన మిత్రుడు కాస్ట్రోతో కలిసి క్యూబాలో విప్లవాన్ని సాధించాడు. అమెరికా సామ్రాజ్యవాదం, నియంతృత్వ బటిస్టా సంకీర్ణ అధికారాన్ని సాయుధ విప్లవం ద్వారా నేలకూల్చాడు. క్యూబాను ఒక అందమైన దేశంగా మార్చారు.

విప్లవకారుల నక్షత్రమండలంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం పేరు ఎర్నెస్టో చే గురే గా మారింది. ఆ పేరు వినగానే నరాలు ఉప్పొంగిపోతాయి. మనసు, మది ఉత్తేజితమవుతాయి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం, న్యాయమైన ప్రపంచాన్ని సృష్టించడం వంటి కలలు ఆవిష్కారమవుతాయి. వయసు చిన్నది కావచ్చు కానీ అందంగా ఉండాలన్న కల్పన మనసును కదిలించివేస్తుంది.

ఇది ఊహించటం కష్టం, కానీ ఇది నిజం. కేవలం 39 ఏళ్ల వయసులో అమరుయిన ఒక యువకుడు, వందల సంవత్సరాల వయస్సున్నా కూడా సాధించలేనిది సాధించాడు. అతను ఫిడేల్ కాస్ట్రోతో కలిసి క్యూబాలో విప్లవాన్ని సృష్టించాడు, అమెరికన్ కీలుబొమ్మ బాటిస్టాను పడగొట్టాడు. అమెరికాకు అనుకుని సరిహద్దుగా ఉన్న ఒక చిన్న దేశంలో స్థాపించిన విప్లవ స్థావరం ఈనాటికీ అమెరికాను భయపెడుతూనే ఉంది.

ప్రపంచ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఒక విప్లవకారుడు. అర్జెంటీనాలో పుట్టి, క్యూబాలో విప్లవం చేసి, వోలోబియాలో విప్లవం కోసం తయారీ జరుగుతున్నప్పుడు అమెరికా గూఢచారి సంస్థ సి‌ఐ‌ఏ చేత అమరుడు అయ్యాడు. అమెరికా సామ్రాజ్యవాదానికి అతిపెద్ద విపత్తుగా మారిన ఒంటరి వ్యక్తి పేరు చె గువెరా. అతన్ని చంపడానికి అమెరికా తన శక్తియుక్తులనన్నింటినీ ఉపయోగించింది. ఆయన మరణం తరువాత కూడా, ఆయన దెయ్యం అమెరికాను, దాని తొత్తు పాలకులను వెంటాడుతూనే ఉంది. వారు చె ను చంపగలిగారు కానీ అతని విప్లవ కలను చంపలేకపోయారు.

దక్షిణ అమెరికా ఖండంలోని ఆదిమ ప్రజలను నరసంహారం చేసి , స్పెయిన్ మొదట ఈ దేశాలను బానిసలుగా చేసుకొంది. ఈ దేశాలు స్పెయిన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతుండగా, అమెరికా తన కీలుబొమ్మ పాలకుడిని నియమించి ఈ దేశాలను తన నియంత్రణలోకి తీసుకుంది. దక్షిణ అమెరికా విప్లవకారులు స్పెయిన్‌కు, ఆ తరువాత అమెరికాకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారు. వీరిలోనే ఇద్దరు – ఫిడేల్ క్రాస్ట్రో,  చె గువేరాలు ఈనాడు ప్రపంచం మొత్తానికి తెలుసు.

జన్మతః తిరుగుబాటుదారుడు. “ఐరిష్ తిరుగుబాటుదారుల రక్తం నా కొడుకు సిరలలో ప్రవహిస్తోంది” అని అతని తండ్రి చెప్పేవాడు. చె తండ్రి స్పెయిన్‌కు వ్యతిరేకంగా దక్షిణ అమెరికా అంతటా జరుగుతున్న పోరాటాల మద్దతుదారుడు. చె తన దేశంలోని, ఖండంలోని ప్రజల పేదరికం గురించి ఆందోళన పడేవాడు. సామాజిక స్ప్సృహ కలిగిన వెంటనే, సహజ వనరులతో సంపద్వంతమైన, కష్టపడి పనిచేసే ప్రజలు వున్న నా దేశంలో, నా ఖండంలో ప్రజలు పేదవారుగా, నిస్సహాయులుగా, బానిసలుగా ఎందుకు వున్నారు?  ఎందుకు, ఎలా స్పెయిన్, ఆ తరువాత అమెరికా మన ఖండాన్ని స్వాధీనం చేసుకున్నాయి? సంపదను దోచుకున్నాయి అనే ప్రశ్నలు అతని మనసును, మెదడును వేధించాయి.

చె వృత్తిరీత్యా ఒక వైద్యుడు. చిన్న వయసులోనే దాదాపు మూడు వేల పుస్తకాలు చదివేసాడు. పాబ్లో నెరుడా, జాన్ కీట్స్‌ ఆయన అభిమాన కవులు. రూడియార్డ్ కిప్లింగ్ అతని అభిమాన రచయితలలో ఒకరు. కార్ల్ మార్క్స్, లెనిన్‌లతో పాటు, బుద్ధుడు,అరిస్టాటిల్, బెట్రండ్ రస్సెల్‌ ఆయన అభిమాన తత్వవేత్తలు, చింతకులు. చె ఒక మంచి రచయిత. క్రమం తప్పకుండా డైరీ వ్రాసేవాడు.

దక్షిణ అమెరికాలోని అనేక దేశాలలో విప్లవ పోరాటాలలో పాల్గొన్నాడు. తరువాత అతను కాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవం (1959) నాయకుడయ్యాడు. క్యూబాలో అమెరికా కీలుబొమ్మ బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టిన విప్లవం. క్యూబాలోని విప్లవ ప్రభుత్వంలో వివిధ బాధ్యతలను నిర్వహించిన ఆయన క్యూబన్ ప్రజల జీవితాలను సమూలంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. క్యూబా ప్రపంచానికి ఆదర్శంగా మారింది. వీటన్నిటిలో చె కీలక పాత్ర పోషించాడు.

క్యూబాలో తన పనిని పూర్తి చేసిన తరువాత, చె లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలలో విప్లవపోరాటం కోసం బయలుదేరాడు. 1967 అక్టోబరు 9న వోలోబియాలో జరిగిన విప్లవ పోరాటంలో 39 ఏళ్ల వయసులో అమరుడయ్యాడు .  తనను కాల్చబోతున్న సైనికులను ఉద్దేశించి ఆయన యిలా అన్నాడు.  “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికివువుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను.” ఇలాంటి చె డైరీ దెయ్యం భారత రాజ్యాన్ని వెంటాడుతోంది. ఆయన ఆత్మ నేటికీ భారత ఏజెన్సీలను భయపెడుతోందిగురిచేస్తోంది.

(సిద్ధార్థ్ రచయిత, వ్యాఖ్యాత)

Leave a Reply