(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి)
పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో ఉండగానే కామ్రేడ్ గౌతం కనిపించాడు.
ఆయన విప్లవోద్యమంలో సీనియర్ నాయకుడు.
నేను అక్కడికి వస్తానని ఆయనకు ముందే తెలుసు. నన్నెంతో ఎరిగినవాడివలె ఆలింగనం చేసుకొని నా కళ్లలోకి ఆత్మీయంగా చూశాడు. అందులో ఎన్నో పరామర్శలు.
నా ప్రయాణంలో పార్టీ నాయకులు ఎవరెవరు కలుస్తారో నాకెలాంటి ఊహ కూడా లేదు. అయితే నేను విని ఉన్న వాళ్లెందరినో కలవాలనే ఆశ ఉండేది. అయితే ఇన్ని రోజుల్లో అలాంటివారేమైనా కలుస్తారా? అని నేను కామ్రేడ్ ఇడిమెను ప్రత్యేకించి అడగలేదు. ఎందుకంటే, దండకారణ్య జనతన సర్కార్ గురించి నేను ఆదివాసీ ప్రజల నుంచి, కింది స్థాయిలో పని చేస్తున్న కార్యకర్తల నుంచే తెలుసుకోవాలనుకున్నాను. అదే నా పర్యటన లక్ష్యం. దండకారణ్య రచయితలు, నాయకులు ఎన్నో రచనలు చేశారు. కీలక పత్రాలు ఈ పర్యటనలో చదవగలిగాను. ఇడిమెతో సుదీర్ఘంగా విడతవారి సంభాషణలు సాగాయి. అయినా మిగతా నాయకులెవరైనా కలిస్తే మరికొన్ని వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని ఉండింది. ముఖ్యంగా దండకారణ్య ఉద్యమం చుట్టూ, లోపలా పొంచి ఉన్న సమస్యలు వినవచ్చు. వాటిపై వాళ్ల అంచనాలు, విశ్లేషణలు, పరిష్కారాలు గ్రహించవచ్చు.
అందువల్ల కామ్రేడ్ గౌతంను చూడగానే సంతోషం కలిగింది.
ఆయన తెలుగు సమాజపు వివరాలు అడగడం మొదలుపెట్టాడు.
మా ప్రయాణ వివరాలు, భోజనాలు అయ్యాక గౌతం తన గుడారానికి తీసుకెళ్లాడు.
ఆ రాత్రి పొద్దు పోయేదాక ఆయనతో దీర్ఘ సంభాషణ సాగింది. అంతా తెలుగు సాహిత్యం గురించే. అదలా మొదలయ్యాక నేను ఆయన ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నానో ప్రస్తావించాను.
తెలుగు పత్రికల్లో నడుస్తోన్న ఎన్నో సాహిత్య వాద వివాదాలను ఆయన సన్నిహితంగా పరిశీలిస్తున్నాడు. ముఖ్యంగా కథలను శ్రద్ధగా, ఇష్టంగా చదువుతున్నాడు. కొత్త తరం కథకులను, విమర్శకులను సహితం ఆయన ప్రస్తావించాడు.
‘కొన్ని కథలు చదువుతుంటే-అందులోని వస్తువు ఎలా ఉన్నా, వాళ్ల దృక్పథం ఎలా ఉన్నా… కొందరు కొత్త మార్పుల మీద కూడా రాస్తున్నారు. విప్లవ కథకులు కూడా అలాంటి వాటి మీద చాలా రాస్తున్నారు. అవి బాగుంటున్నాయి. యింకా బాగా రాయవచ్చు కదా? అని కొన్ని కథలు చదివినపుడు అనిపించింది. మీరు ఈ మధ్య నడుపుతున్న కథల వర్క్‌షాపుల నివేదికలు బాగుంటున్నాయి. అవి చదివినప్పుడు విప్లవ కథ గురించి చాలా లోతైన విషయాలు చర్చిస్తున్నారనిపిస్తోంది. అయితే అవి అంతే బలంగా అన్ని కథల్లోకి రావడం లేదేమో అని నా అనుమానం. కొన్ని కథలు చదివినప్పుడు ఇట్లా అనిపించింది…’ అని చెప్తూ అప్పట్లో వచ్చిన అరుణతార కథా ప్రత్యేక సంచికలో కథలు చాలా బాగున్నాయని, కవిత్వం ప్రత్యేక సంచిక మాత్రం కొంత నిరాశపరిచిందనీ అన్నాడు.
తెలుగు ప్రాంతానికి దూరంగా ఉన్న విప్లవకారుడి నోటెంట తెలుగు సాహిత్యం గురించి వినడం నాకు అపురూపమనిపించింది.
ఆయన ఇంకో మంచి పరిశీలన చేశాడు.
విప్లవ కథా వస్తువుకు తగిన శిల్పం విషయంలో ఈ వర్క్‌షాపుల వల్ల కూడా కావచ్చు కొంత ప్రయత్నం జరుగుతోంది. అది ఇంకా ముందుకు పోవాలి. ఆ దిశగా చాలా ఆలోచించాలి. ఒక దశలో మన కథా శిల్పం వస్తువుకు, దృక్పథానికి తగినట్లు ఉన్నత ప్రమాణాలు స్థిరపడ్డాయి. ఇప్పుడు కథా రచనలోకి వచ్చినవాళ్లు వాటిని ఇంకా ముందుకు తీసికెళ్లాలి. ఇక్కడ దండకారణ్య రచయితలు కూడా ఈ విషయంలో ఒక పద్ధతిలో కృషి చేస్తున్నారు. ఇక్కడి వస్తువుకు తగిన శిల్పం కోసం ప్రయత్నిస్తున్నారు. అని చెప్పుకొచ్చాడు.
విప్లవ సాహిత్యం మీద ఒక విప్లవకారుడి సునిశిత గుణదోష విశ్లేషణ ఇది.
మేమిలా మాట్లాడుకుంటూ ఉంటే కామ్రేడ్ నాగాల్ గుడారంలోకి వచ్చి ఓ చివర్న రాత్రిళ్లు వాడే లైట్ వేసుకొని ల్యాప్‌టాప్‌లో పని మొదలుపెట్టాడు.
గౌతం మాటలు వింటూ ఆ కామ్రేడ్ గురించి మొదట పట్టించుకోలేదు. నాగాల్ తదేకంగా ఓ నోట్‌బుక్‌లోకి చూస్తూ హిందీ టైప్ చేస్తున్నాడు.
ఎప్పటికో అడిగాను… ‘అతను ఏం చేస్తున్నాడు?’ అని.
దీనికి గౌతం అతడిని గోండీలో అడిగాడు. అతని సమాధానం విని..
‘ఉ-ఎన్-టూ రాసిన కార్మిక పుత్రుడు నవల గోండీలోకి అనువాదమైంది. అది టైప్ చేస్తున్నాడు’ అని చెప్పాడు.
ఎంతో స్ఫూర్తిదాయకమైన నవల కదా.
‘గోండిలోకి ఎవరు చేశారు?’ అని అడిగాను.
దానికి గౌతం… ‘ఇన్ని రోజులు ఇడిమెతో కలిసి ఉన్నావు కదా. తన సాహిత్యం గురించి మాట్లాడలేదా?’ అన్నాడు.
‘ఏదో దినపత్రికలో తన రచన అచ్చయిన కటింగ్ చూచాను. కానీ మిగతా రచనల గురించి అడగనేలేదు. అసలు మా ఇద్దరి మధ్య సాహిత్య ప్రస్తావనే రాలేదు. పైగా తనకు సాహిత్యంతో సంబంధం ఉన్నట్లు ఆమె మాటల్లో నాకు స్ఫురించలేదు.’గౌతం చెప్తూ పోయాడు. ఆమె పెన్ నేమ్ తెలిశాక నేను చదివిన తన రచనలు గుర్తుకు రాసాగాయి.
‘తెలుగులోకి అనువాదమైన చైనా నవల బంగారమ్మ కథను కూడా తను గోండిీలోకి చేసింది’ అని చెప్పాడు.
మర్నాడు పొద్దున్నే చిన్న సమీక్ష సమావేశం లాంటిది జరిగింది.
ఇడిమె, గౌతం నా పర్యటన వివరాలు అడిగారు. ఈ సమావేశం నాకు చాలా మేలు చేసింది. ఎందువల్లంటే దాదాపు నా పర్యటన ముగింపుకు వచ్చింది. ‘తెలుసుకోవడం’ గురించి నాకున్న ఊహకు, అనుభవానికి పూర్తి భిన్నమైన, అనూహ్యమైన మార్గాల్లో తెలుసుకోవలసి వచ్చింది. క్షేత్ర పరిశీలనలో ఎంత కచ్చితమైన పద్ధతి పాటించాలని అనుకున్నా… మనం నిలబడి ఉన్న చోటి నుంచి ఆ పద్ధతిలోనే తెలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎన్నో ప్రశ్నల ద్వారా, ఎన్నో గణాంకాల ద్వారా తెలుసుకోవలసిన అంశాలు మనం నిలబడి ఉన్న తావులోని పరిస్థితుల వల్ల, ప్రత్యేకతల వల్ల ఊహించని కోణంలో అక్కడి సంగతులు కనిపించవచ్చు. అది తప్పక మన సంవిధానాన్నే తీవ్రస్థాయిలో ప్రభావితం చేయవచ్చు. అలాంటి అనుభవాలు కొన్ని కలిగాయి.
వీటన్నిటి దృష్ట్యా నేను దండకారణ్యంలో ఏం గమనించానో, ఎలా విశ్లేషించుకొని ఏ నిర్ధారణకు వచ్చానో ఇక్కడే ఒకసారి చర్చకు పెట్టడం బాగుంటుంది కదా? స్థూలంగా నా పరిశీలనలు చెప్పాను…
నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కామ్రేడ్ గౌతం ‘నీ పరిశీలనలు క్రాస్ చెక్ చేసుకోడానికి ఏమైనా ప్రయత్నించావా?’ అనే ప్రశ్న వేశాడు. దానివల్ల నా పరిశీలనలను తర్వాత్తర్వాతైనా ఇంకో వైపు నుంచి ఆలోచించడానికి ఉపయోగపడే కొత్త కోణాలు తెరుచుకున్నాయి.
క్షేత్ర పరిశోధనలో పట్టించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఆయన ప్రస్తావించాడు. అవి దండకారణ్య పరివర్తనా క్రమం పట్ల ఆయన విమర్శనాత్మక దృష్టిని తెలియచేశాయి.
దండకారణ్య ఆదివాసీ ప్రజల, కార్యకర్తల అట్టడుగు క్రియాశీల, చైతన్యయుత భాగస్వామ్యం గురించీ, సమిష్టి, సహకార ఉత్పత్తి ప్రక్రియల గురించీ నేను గుర్తించినవి స్థూలంగా చెప్పాను. ఒక పరివర్తనా దశలో భాగంగా ప్రజలు సాధించిన విషయాలు, వాటి పరిమితులు, ప్రత్యేకతలు, సవాళ్లు… నాకు ఎలా అర్థమయ్యాయో వివరించాను. వాటినుంచి నేను ఏర్పరచుకుంటున్న నిర్ధారణలను వాళ్ల ముందు పెట్టాను.
‘అయితే ఈ కొద్ది రోజుల్లోనే వచ్చిన పని ఏదో మేరకు అయిందనే సంతృప్తి కలిగిందన్న మాట…’ అన్నది కామ్రేడ్ ఇడిమె.
నేను చెప్పిన విషయాలేగాక, నా కంఠస్వరాన్ని బట్టి కూడా తనకు అలా అనిపించి ఉండవచ్చు.
కొనసాగింపుగా ఆమె ఇంకా ఇలా అన్నది.
‘ఇప్పుడు నీవు చూస్తున్న ఈ పరిస్థితులను అంచనా వేయాలన్నా `ఈ మూప్పై ఏళ్లలో ప్రజలు ఏం సాధించారు? ఏం సాధించలేకపోయారు? సాధించిన దాని విలువ ఎంత? అనే అంచనా వేయాలన్నా`వాళ్లు ఈ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నారో గమనంలోకి తీసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. నాయకత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ముప్పై ఏళ్లలో ఇంకొన్ని ఫలితాలు వచ్చి ఉండొచ్చు. పార్టీ ఆలోచనల అభివృద్ధి కూడా మొత్తం విప్లవోద్యమ అభివృద్ధిలో భాగమే. ఒక్కొక్క విషయాన్నే తెలుసుకుంటూ నాయకత్వం ముందుకెళ్లాల్సి వచ్చింది. వేర్వేరు ప్రాంతాల్లో సాధిస్తున్న విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు… వాటి పరిష్కారాలు కలబోసుకుంటూ ఇంకో ప్రాంతానికి అక్కడి పరిస్థితులకు తగినట్లు అన్వయించడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. ఉద్యమం ఇక్కడ మొదలైనప్పుడే అన్నీ ఇట్లా… ఇట్లా… చేయాలని అనుకోలేదు. అంటే ప్రజలకే కాదు… నాయకత్వానికి కూడా కొత్తే. ఒక క్రమంలో ఆదివాసీ నాయకత్వం వచ్చేశాక ఉద్యమం పుంజుకున్నది…’ అని చెప్పుకొచ్చింది.
ఆమె మాటలకు ముక్తయింపుగా కామ్రేడ్ గౌతం ‘దండకారణ్యంలోని ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను, ప్రజారాజ్యాధికార నిర్వహణను వర్గపోరాటంలో భాగంగా చూడాలి. వర్గపోరాట పర్యవసానంగా విశ్లేషించాలి. ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలన్నీ ప్రజా యుద్ధంలో భాగమే. ప్రజాయుద్ధ అభివృద్ధి క్రమంతో సంబంధం లేకుండా చూస్తే అర్థం కావడం కష్టమే. జనతన సర్కార్‌కు సంఫీుభావంగా బైటి నుంచి వస్తున్న విశ్లేషణ రచనల్లో ఇది అంత స్పష్టంగా, గాఢంగా ఉండటం లేదని మా అభిప్రాయం. విప్లవ రచయితలు ఈ విషయాన్ని మరింత పట్టించుకోవాలి. అట్లాగే ఇక్కడ జరుగుతున్న మార్పులను చెప్పేటప్పుడు అతిశయం పనికి రాదు. అది మంచి పద్ధతి కాదు. నష్టదాయకం కూడా. ఉదాహరణకు ఇప్పటి దాకా దండకారణ్యం గురించి నీవు రాసిన వ్యాసాల్లో ఈ ధోరణి అక్కడక్కడా ఉన్నది. వ్యవస్థకు దండకారణ్య విప్లవోద్యమం ప్రత్యామ్నాయం అని చెప్పడం, బైటి రాజ్యాన్ని టార్గెట్ చేయడం సరైందే. అయితే ఈ క్రమంలో ఉద్యమ అభివృద్ధి దశను దృష్టిలో పెట్టుకోవాలి. వర్గపోరాటాన్ని కేంద్రం చేసుకుంటే ఈ సమస్య ఉండదు. ప్రజా యుద్ధంలోని సాదకబాదకాలన్నటి మధ్య, బలబలాల మధ్య ప్రజా ప్రత్యామ్నాయాన్ని సరిగా చూడగలం. ప్రజలు ప్రత్యామ్నాయ ఉత్పత్తి, పాలనా వ్యవస్థలను నిర్మించుకుని కొనసాగించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ పర్యటనలో నీవు గమనించినట్లు ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు పూర్తిగా పోలేదు. కొన్ని బలంగానే ఉన్నాయి. పార్టీ చెబితే కొన్ని వింటున్నారు. కొన్ని మార్చుకోడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి సమస్యలు ప్రజలకు ఉన్నాయి. వాటన్నిటినీ విమర్శనాత్మకంగా చూడటంలో అన్ని స్థాయిల్లో నాయకత్వం ఇంకా పరిపక్వం కావాల్సే ఉన్నది. ఇవన్నీ సజావుగా చేయడానికి ప్రజాయుద్ధంలోని ఆటుపోట్లు అనుమతించడం లేదు. యుద్ధాన్ని తీవ్రం చేయడం, ఎక్కువ సందర్భాల్లో, ఎక్కువ ప్రాంతాల్లో పైచేయి సాధించడం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. యుద్ధంలో ఎప్పుడు, ఎక్కడ ప్రజలు వెనకబడితే అక్కడ నష్టం జరుగుతున్నది. అనుకున్న పనులు కుంటుపడుతున్నాయి. నాయకత్వం వాటిని గుర్తించి మళ్లీ ముందుకు తీసుకుపోవాల్సి వస్తోంది. ప్రజల అవసరాలన్నీ జనతన సర్కార్ తీర్చడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.
ఉదాహరణకు సీజన్ మొదలయ్యాక సహకార, సమిష్టి పద్ధతుల్లో వ్యవసాయ పనులు చేస్తున్నారు. అంతక ముందు ఏడాది పండిన ధాన్యం ఎప్పుడో అయిపోయి ఉంటుంది. గతంలో అయితే వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే కొంత మందికి కూలీ పనులకు వెళితే కొంత వరకు ఏ రోజు కారోజు గింజల సమస్య తీరేది. ఇప్పుడు అట్లా కాదు. ఇంట్లో ఉన్న వాళ్లంతా సర్కారు వ్యవసాయ శాఖ ప్లాన్ ప్రకారంగా పనుల్లోకి వెళుతున్నారు. గతంలాగా కూలీ రావడం లేదు. జనతన సర్కారు దీన్ని పరిష్కరించాల్సి వస్తున్నది… ఆ సమయంలో ఇంట్లో తిండి గింజలు లేని వాళ్లకు సర్కారు ధాన్యం పంపిణీ చేస్తోంది. గతంలాగా కూలి పనులపోతే కాసిని తిండి గింజలు వచ్చేవి కదా? అని పేద ప్రజలు అనుకోవచ్చు. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి…? స్థానిక సర్కార్ ధాన్యం నిల్వలు పెంచుకోడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. లేదా పక్క సర్కార్లు సాయం అందించాలి. ఇది ప్రత్యామ్నాయ అభివృద్ధి పాలనా రంగాల ముందున్న కీలకమైన సమస్య. క్షేత్రస్థాయిలో జనతన సర్కార్లను కొంత మందిమి పరిశీలించినప్పుడు చాలా కాలం కిందే ఇది గమనించాం. ఇప్పుడు నీ పర్యటనలో కూడా దీన్ని చూశావు. అంటే ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కావాల్సే ఉన్నది. ఏ కారణం వల్లో ఈ ఏడాది పంటలు రాకపోతే, లేదా సరిగా రాకపోతే ఆ ఊళ్లో సంవత్సరమంతా తిండి సమస్య వస్తుంది. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ అవుతుంది. సల్వాజుడుం ఉధృతంగా ఉన్న రోజుల్లో అనేక గ్రామాల్లో వ్యవసాయం కుంటుపడిరది. పండిన పంటలు, నిల్వ చేసుకున్న ధాన్యం ధ్వంసం చేసేశారు. ఇలాంటివి నీకు ప్రజలు చాలా చెప్పారు. అయితే ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో ఉంటాయని పార్టీకి అవగాహన ఉంది… అందుకే అన్నిటినీ ప్రజాయుద్ధం అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి…’ అని చెప్పుకొచ్చాడు.