పల్లవి:
ఓ.. సాయి బాబా - జన సమర భేరి
నిత్య సంఘర్షణే-నీ త్యాగ నిరతి
నీ తలను చూసి
ఏ శిలకు వణుకు
నీ గళం కలముకు
లేదాయె బెణుకు
ఆ కొండ కోనలే
నీ గుండె బలము
ఆదివాసే కదా
విముక్తి దళము
బండి చక్రం పైనె ఎడతెగని పయనం
బందించినా జైలు కౄర పరిహాసం
||ఓ సాయి బాబా||
అమలాపురమొక ఉద్యానవనము
ఏ తల్లి నినుగందొ ప్రజలకే వరమూ
కళాశాల కదన రంగమయ్యిందో
కవిగా నీ కలల పంట పండిందో
అక్షరాల పరుగు ఆగనిది వెలుగు
దీక్షగా ఢిల్లీకి చేరింది అడుగు
ముంబై ప్రతిఘటన
నీ కాయకష్టం
విశ్వజన పీడితుల
శంఖారావం
సామ్రాజ్యవాదాన్ని ఎదిరించె లక్ష్యం
పోరాట ప్రపంచమొకటయ్యె గమ్యం
||ఓ సాయి బాబా||
మండేటి కాశ్మీరు మనసుల్ని గెలువా
రగిలేటి ఈశాన్య రాష్ట్రాల తెగువా
కార్పోరేట్ల దృష్టి కారడవి పైనే
కడుపులో దాగిన ఖనిజాల పైనె
ఎన్ని అవతార్ ల గ్రీన్ హంట్ మద్య
మొలకెత్తె జన రాజ్య మెత్తిపట్టావు
ప్రజలదే గెలుపన్న
ప్రతిఘటన రూపం
ప్రశ్నలకు నిలబడని
వైకల్య రాజ్యం
నీ పైనే అల్లారు కట్టు కథలన్ని
ఉపా చట్టంతో కుట్ర వలపన్ని
||ఓ సాయి బాబా||
వలస వాసన నిండె న్యాయమొక రోత
ముద్దాయి అపరాధి ఇద్దరొక చెంత
భావాలు నేరమనె ముద్దరొక వింత
జైలులో జైలుతో ఒక అణిచివేత
స్టాన్ స్వామి పాండులను చంపుతూ
చితిలోన చలికాగె పాలకులంతా
దోపిడీ పీడనలు
ప్రశ్నిస్తే ద్రోహం
కదలలేని మనిషి
కెంతటి నరకం
అండ జైలే నీ అమర సందేశం
కదిలి రారమ్మంటూ పీడీతలోకం
||ఓ సాయి బాబా||
Related