భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, తద్వారా ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్న మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆదాయ అసమానత ఉపాధి దృష్టాంతం భయంకరంగా ఉందని తన నివేదికను 27 మార్చి 2024న విడుదల చేసింది. 2000-2024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ సర్వేలను ఉపయోగించి ఈ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2022లో ఉత్పత్తిలో శ్రామికుల వినియోగం (ఎల్‌ఎఫ్‌పిఆర్‌) 59.8  శాతంగా ఉంటే భారత దేశం 55.2 శాతంగా ఉంది. భారతదేశంలో పని చేయగల వయస్సు (15 నుంచి 59 సం॥) జనాభా 2011లో 59 శాతం ఉండగా, 2022 నాటికి 63 శాతానికి పెరిగింది. శ్రామిక శక్తి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి లభించటం లేదు. కొద్ది మందికే పని దొరికిందని నివేదిక తెలిపింది.

స్వయం ఉపాధి గణాంకాల విభాగం విడుదల చేసిన జూలై 2022 నుంచి జూలై 2023 వరకు మోడీ ప్రభుత్వంలో అత్యంత వినాశకర ఉపాధి తీరు వెల్లడైంది. దేశం మొత్తం ఉపాధిలో 58 శాతం స్వయం ఉపాధి పొందుతున్నారు. 2017-18లో వీరు 52 శాతం మాత్రమే ఉన్నారు. దీన్ని గమనిస్తే ప్రభుత్వం కల్పించే ఉపాధి లేనందున ప్రజలు స్వయం ఉపాధిని ఆశ్రయించటం ఎక్కువైంది. స్వయం ఉపాధి పొందుతున్న వారు చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులే. ఆర్థిక వేత్త సంతోష్‌ మెహ్రోత్రా చెప్పిన దాని ప్రకారం స్వయం ఉపాధి కార్మికుల సంఖ్య 2017-18లో 4 కోట్ల మంది ఉండగా, 2022-23 నాటికి 9 కోట్ల, 50 లక్షలకు పెరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచించిన పద్ధతి ప్రకారం జీతం చెల్లించని ఇలాంటి వారిని 92 దేశాల్లో ఉపాధి పొందిన కార్మికులుగా పరిగణించటం లేదు. దీన్ని గమనిస్తే ఉపాధి కల్పనలో ఎంతగా మోడీ ప్రభుత్వ వైఫల్యం చెందిందని తెలుస్తుంది. దేశంలో వ్యవసాయ రంగం ద్వారానే ఇప్పటికీ ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎస్‌ఎస్‌ఎస్‌), స్లాటిస్టిల్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ (ఎంఒయస్‌పిఐ) నిర్వహించిన పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం 2023 నాటికి 45.76 శాతం గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి కొనసాగించడానికి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నాయి.

జాతీయ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 43 శాతం నుంచి 16 శాతానికి తగ్గింది. అందుకు కారణం సేద్యపు ఖర్చులు పెరగడం, పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలు లభించకపోవటం, వ్యవసాయం వల్ల వచ్చే ఆదాయం చాలకపోవటం, అప్పుల పాలు కావడం వల్ల రైతులు వేరే ఉపాధి చూసుకోవటం కారణాలు ఉన్నాయి. ఇదే క్రమంలో గమనించాల్సిన అంశం ఒకటుంది. అది మహిళల వ్యవసాయ ఉపాధి రేటు ఇప్పటికి 82 నుండి 72 శాతానికి మాత్రమే తగ్గింది. వ్యవసాయ పనులైన నాట్లు, కోత, కలుపుతీయటం, విత్తనాలు వేయడం మొదలైన పనుల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఇప్పటికీ ఉంది. మహిళల ఉపాధి కూడా కొద్ది మేర తగ్గడానికి కొన్ని ప్రాంతాల్లో యంత్రాల  వినియోగంతో పాటు ప్రకృతి సృష్టిస్తున్న కరవు, వరదలు కూడా వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గడానికి కారణం. వీటిని గమనించినప్పుడు గ్రామీణ ఉపాధికి వ్యవసాయమే ప్రధానంగా ఉండి అత్యధిక గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నదని విధితమవుతుంది. 

మరో ముఖ్యమైన విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 2000 నుంచి 2012 వరకు వ్యవసాయంలో ఉపాధి పొందే వారి వాటా స్వల్పంగా తగ్గినా, కొవిడ్‌ కాలంలో వ్యవసాయ రంగమే ఎక్కువ ఉపాధి కల్పించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు, నగరాలకు వలసలు వెళ్లిన పేదలు కొవిడ్‌ వలన ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని వ్యవసాయ రంగం ఆదుకున్న వాస్తవాన్ని గ్రహిస్తే వ్యవసాయ రంగ ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ రిపోర్టు 2024 ప్రకారం భారతదేశ పారిశ్రామిక జనాభా 2011లో 61 శాతం ఉంటే, 2024లో 64 శాతానికి పెరిగింది. 2036 నాటికి 67 శాతానికి పెరుగుతుందని అంచనా. యువత ఉపాధి 37 శాతం క్షీణించింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) తాజా వివరాల ప్రకారం మే 2024లో నిరుద్యోగం 7 శాతం కాగా, జూన్‌ 2024లో 9.2 శాతంకి పెరిగింది.

కన్జ్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌ హోల్‌ సర్వే ప్రకారం 2023లో మహిళా నిరుద్యోగం 15 శాతంగా ఉంది. జూన్‌ 2024లో మహిళా నిరుద్యోగం 18 శాతానికి దిగజారింది.ఉపాధి అవకాశాలు మరియు ఆదాయాలలో లింగ అసమానతలను నివేదిక స్పష్టంగా హైలైట్‌ చేస్తుంది. 2024లో, 69.2 శాతం మంది పురుషులతో పోలిస్తే 45.6 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ 23.6 శాతం పాయింట్‌ గ్యాప్‌ ప్రాథమికంగా కుటుంబ బాధ్యతలకు ఆపాదించబడిరది, ఇది లేబర్‌ మార్కెట్‌లో పాల్గొనే మహిళల సామర్థ్యాన్ని అసమానంగా ప్రభావితం చేస్తుంది. స్త్రీలు చెల్లించని సంరక్షణ పనిలో గణనీయమైన వాటాను కొనసాగిస్తున్నారు, ఇది లింగ ఉపాధి అంతరాలను మరింత పెంచుతుంది. పురుషల కంటే మహిళల సంపాదన చాలా తక్కువగా ఉందని నివేదిక వెల్లడిరచింది. ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, ఐరాస సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను ఆమోదించిన 2015 నుండి పేదరికం తగ్గించడంలో పురోగతి మందగించింది. అనధికారిక (అసంఘటిత రంగం) ఉపాధిలో ఉన్న కార్మికుల సంఖ్య 2005లో సుమారు 1.7 బిలియన్ల నుండి 2024లో 2.0 బిలియన్లకు పెరిగింది. ఈ ధోరణి ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించే స్థిరమైన సమ్మిళిత కార్మిక మార్కెట్లను సృష్టించే విధానాల అవసరాన్ని నొక్కి చెబుతుంది.

ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక- 2024  లెక్కల ప్రకారం దేశ జనాభాలో 63.64 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో 20-30 సంవత్సరాల మధ్య వయసు గల యువత 68 శాతం మంది ఉన్నారు. 18 నుండి 35 సంవత్సరాలలోపు ఉన్న గ్రామీణ యువకుల్లో 77.1 శాతం మంది, యువతుల్లో 66.2 శాతం మంది స్థానికంగా దొరుకుతున్న పనులతో ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. అయితే యువకుల్లో 82 శాతం మంది, ముఖ్యంగా 18-25 సంవత్సరాల యువకుల్లో 84.7 శాతం మంది, అలాగే యువతుల్లో 72 శాతం మంది, అందులో 18-25 మధ్య వయస్కులలో 74.2 శాతం మంది ప్రస్తుతం చేస్తున్న పనుల్లో కొనసాగడానికి ఇష్టపడడం లేదని ఈ సర్వే తెలిపింది. దీనికి ప్రధాన కారణాలు వ్యవసాయ దిగుబడులు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయని 68 శాతం మంది, తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనంత భూమి లేదని 46 శాతం మంది, కుటుంబ అవసరాలకు సరిపడ ఆదాయం వ్యవసాయ పనుల నుండి రావడం లేదని 63 శాతం మంది యువత అభిప్రాయపడినట్లు ఈ నివేదిక ప్రకటించింది.

కార్మిక శక్తి వినియోగం 2024 మేలో 40.8 శాతం ఉంటే, జూన్‌లో 41.4 శాతానికి తగ్గింది. పట్టణ నిరుద్యోగం మే 2024లో 6.3 శాతం ఉంటే, జూన్‌లో 8.9 శాతానికి పెరిగింది. భారతదేశ ఉపాధి నివేదిక 2024 ప్రకారం నిరుద్యోగ శ్రామిక శక్తిలో దాదాపు 83 శాతం యువత ఉన్నది. మొత్తం నిరుద్యోగ యువతలో మాధ్యమిక లేక ఉన్నత విద్య పూర్తిచేసిన యువకుల వాటా 2000 సంవత్సరంలో 32.2 శాతం ఉంటే 2022లో 65.7 శాతంకి పెరిగింది. మోడీ ప్రభుత్వం ఉద్యోగ కల్పన కల్పించపోగా ఉన్న ఉద్యోగాలు కూడా తగ్గించింది. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశం మొత్తం మీద ఉన్న 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2022లో ఈ సంఖ్య 14.6 లక్షలకు తగ్గింది. ఒక్క బిఎస్‌ఎస్‌ఎల్‌ లోనే గత 9 సంవత్సరాల్లో లక్షా 81 వేల మందిని ఇంటికి పంపింది. ఈ విధంగా మోడీ ప్రభుత్వ పాలనలో ఉపాధి తగ్గి నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగం అనేది భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తూనే ఉన్న ఒక క్లిష్టమైన సమస్య.

విభిన్నత గల  శ్రామికశక్తితో  ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటిగా, నిరుద్యోగ రేటులో హెచ్చుతగ్గులు దేశం అభివృద్ధికి అటంకంగా పరిణమిస్తున్నాయి. భారతదేశంలో నిరుద్యోగిత రేటును ప్రభావితం చేసిన ప్రధాన ఆర్థిక సంఘటనలు మన ఆర్థిక చరిత్రలో, అనేక ముఖ్యమైన సంఘటనలు భారతదేశంలో నిరుద్యోగ రేటును గణనీయంగా ప్రభావితం చేశాయి. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌ (2008-2009) 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది, ఇది వృద్ధి మందగమనానికి దారితీసింది, వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను తగ్గించింది. 2016లో డీమోనిటైజేషన్‌ అధిక-విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక అంతరాయాలను కలిగించింది. ముఖ్యంగా అనధికారిక రంగంలో, తాత్కాలిక ఉద్యోగ నష్టాలకు దారితీసింది. వస్తువులు సేవల పన్ను అమలు (2017) జిఎస్‌టి యొక్క ప్రవేశం పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి ఉద్దేశించారు. అయితే ఇది ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థలో స్వల్పకాలిక అంతరాయాలను కలిగింది. వ్యాపారాలు, ఉపాధిని ప్రభావితం చేసింది. కొవిడ్‌-19 విపత్తు మరియు తదుపరి లాక్‌డౌన్‌ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఉపాధి కల్పన దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటిది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నిర్ణయించడంలో కీలక అంశం నిరుద్యోగం. ఉత్పత్తి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటే ఆదాయాలు పెరిగి వస్తు సేవలకు గిరాకి ఏర్పడి మార్కెటు పుంజుకుంటుంది. అప్పుడు మరింత ఉత్పత్తి పెరిగి మరిన్ని ఉద్యోగాలు లభ్యమవుతాయి. తద్వారా ప్రజల ఆదాయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. అందువల్ల ఉపాధిని సహాయ కార్యక్రమాల స్థాయికి దిగజార్చకూడదు. సరైన పాలసీ విధానాలను అవలంబిస్తే విరివిగా అందుబాటులో ఉన్న కార్మికులను ఉపయోగించుకొని త్వరితగతిన అభివృద్ధి సాధించవచ్చు. కానీ రాజకీయ లక్ష్యాలు అధికార పీఠం కోసం మాత్రమే పరితపిస్తున్నప్పుడు ప్రజా జీవితాల్లో సహాయక కార్యక్రమాలు తప్ప దూరదృష్టి గల పునాదులు నామమాత్రంగానే కనిపిస్తాయి. దేశంలో ప్రతి ఐదు రోజులకు ఒక శతసహస్ర కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడంటే దానికి వేల రెట్లు ప్రజలు పేదలకుగా మారుతున్నట్టేనని గతంలోనే ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు తేల్చేశాయి. సామాన్యులు బిలియనీర్లు కావాలని కోరుకోవట్లేదుగానీ బికారులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే నిరుద్యోగ సమస్యను ముంచుకొస్తున్న ముప్పుగా భావించకపోతే మూల్యం మరీ భారమౌతుంది.

2024లో అంతర్జాతీయ శ్రామిక సంస్థ నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నిరుద్యోగిత ప్రబలమవుతున్నది. ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎక్కడలేని విధంగా మన దేశంలో ఒక్క శాతం జనాభా దగ్గర 40 శాతం పైగా ఆదాయం ఉంది. ఇది బ్రిటిష్‌ కాలంలో కన్నా ఎక్కువ ఆదాయ అసమానతలు ఉన్న పరిస్థితి. అందువలన 20 శాతం జనాభా కూడా మార్కెట్లో వస్తు సేవలను కొనలేకపోతున్నారు. ఫలితంగా నిరుద్యోగిత ఇంకా పెరుగుతున్నది. మనం ఎన్ని రాయితీలు పెట్టుబడిదారులకు కల్పించినా దేశంలో ఉద్యోగ కల్పన జరిగే పరిస్థితి లేదు. 2019లో ఉత్పత్తిని పెంచేందుకు కార్పొరేట్లకు పన్నులు 32 శాతం నుంచి 22 శాతానికి తగ్గించినా, పెట్టుబడులు పెరగలేదు. ఉద్యోగిత పెరుగలేదు. అందువల్ల స్థానిక అవసరాల రీత్యా స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో, స్థానిక వనరులతో స్థానిక పెట్టుబడులతో పెట్టుబడుల వికేంద్రీకరణ జరిగి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థిక అభివృద్ధి జరిగితే అప్పుడు ఈ వృద్ధి సమ్మిళిత వృద్ధిగా నిరుద్యోగ సమస్య తీరుతుంది. 

Leave a Reply