ఎందుకో?
కార్పోరేట్లకు
బహుళ జాతులకు
శూలల సూపులకు
నల్ల కలువలే నచ్చుతయి

వాళ్ళు ఏం మేలు చేయాలనుకొన్నా ?
తోలునే తొలకరిని చేస్తరు
నల్లని ముఖం మీద
తెల్లని మల్లెలు ఆరబోసినట్టు
నింగి మంగుళం మీద
మక్క పాలాలు ఏంచినట్టు
వాళ్ళ నవ్వుల పువ్వుల కోసమే
పూనికతోని దీక్ష పట్టినట్టు

ఇది ప్రపంచ పెద్దలు
పేదరికం మీద విసిరిన
పరిహాసపుటస్త్రం అని
పరిపరి విధాల పరితపించినా
కాలే కడుపు సాలు దున్నదనీ
మాడే ఎండ నీడ కోరుతదనీ
మర్మం తెలిసిన వారికి
మనసున పట్టింది.

నూకలు పెడతా మేకలు కాస్తావా?
అన్నడొకడు
వివక్షల విలువల ధర్మానికి
విలుకాన్నై కావలుంటానన్నడింకొకడు.
నోరును అదుపులో వెట్టుకొని
పోరును పొరక పొరక చేసి
విలాసాల వినువీధుల్లో
కులాసాల కుటిల నీతుల్లో
కుర్చీలు ఎక్కినంక
కుత్తుకలను కోసే
కత్తులైతరు
కోరుకున్న కుదురు
కుంగుతుందంటే
నోటికి పడ్డ తాళాలు ఊడి
తైతక్కలాడుతయి

ఏరి ఏరి కొన్ని అన్యాయాల మీదనే
కోరి కోరి ఆయుధాలు ఎక్కుపెడుతరు

అవసరం తీరినంక
ఆయుధాలు ఆత్మను చాలిస్తయి
చేతులకు అంటుకొన్న
రక్తాన్ని కడుక్కొని
అహింసా మూర్తులైతరు
చేవను చంపుకొన్న
చేతనమైతరు.

One thought on “నల్లని కత్తి

Leave a Reply