స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని దు:ఖాలు, మరికొన్ని విషాదాలు కవిత్వంలో కనబడతాయి. వర్తమాన కవిత్వలోకంలో విస్తృతంగా కవిత్వం వస్తునే వుంది. నవతరం యువ కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిగమ్యం, కవిత్వ పరిణామం ఏమిటి అని ప్రశ్నించినపుడు జవాబు మనికిప్పుడు అస్పష్ట్టంగానే వినబడుతుంది. సామాజికవాస్తవాన్ని నొక్కి చెప్పగలిగిన కవిత్వం వర్తమాన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడుతుందన్న విషయం కొద్ది మందికే తెలుసు. సామాజిక వాస్తవాన్ని కవిత్వంలో చెప్పాలనుకున్నప్పుడు కవికి సైద్దాంతికబలం ఉండాలి. అలా ఉన్నప్పుడే కవి ఏది రాసినా అది కవిత్వమౌతుంది. కవిత్వానికి సైద్దాంతిక బలముండాలన్న సంగతి చాలా మంది కవులకు తెలియదు. కవి అధ్యయనం చేస్తున్న కొద్దీ నిర్ధిష్టమైన భావజాలం వైపు కవిని నడిపిస్తుంది. ఆ భావజాలమే వాస్తవికతతో కూడిన పునాదుల్ని వేస్తుంది. వాస్తవికత అనేది ఈస్తటిక్స్‌లో భాగంగా ఉంటుంది. ఈ ఈస్తటిక్స్ గూర్చి చెప్పాలనుకుంటే ఆయుధంలాంటి మనిషి కవిత్వం చదవాలి. కవిత్వాన్ని, కవి ఎలా అర్థం చేసుకుంటున్నాడో, కవిత్వానికి ఎలాంటి నిర్వచనం ఇస్తున్నాడో ఈ సంపుటిలో ప్రత్యేకంగా చూస్తాం. గ్రీకులు మొదలుకొని ఇప్పటివరకు చాలామంది తత్వవేత్తలు, కవులు కవిత్వానికి నిర్వచనాలిస్తూనే ఉన్నారు. అందులో కొన్ని శాస్త్రీయమైనవి, మరికొన్ని అశాస్త్రీయమైన నిర్వచనాలుగా లేకపోలేదు. అయితే ప్రతీకవి ఏదో వొకనిర్వచనాన్ని కవిత్వానికి కవికి ఇస్తూనే ఉన్నారు. అలా ఇస్తున్న వారిలో లోసారి సుధాకర్ కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నది, అసలు కవిత్వం అంటే ఏమిటి? అసలు కవి అంటే ఎవరు ఎలా ఉండాలి అన్న ప్రశ్నలకు అనేక సమాధానాలు తన కవితల్లో ఈ ఆయుధం లాంటి మనిషి అనే ఈ కవితా సంపుటిలో ఇస్తారు.
అవి చూద్దాం. “మంటల మహావేదిక” శీర్షికతో రాసిన ఈ కింది కవితలో..
కాలం ఘడియ ఘడియకు క్రమ క్రమంగా కాలి బూడిదైతే కదా !/ఒక్కో అక్షరం ఆవిర్భవించేది/ఎంతకాలం భస్మమో కదా ఒకవాక్యం ఒక్కోవాక్యం/ఒక్కో ప్రసవవేదన అయితే/ఎన్ని ప్రసవవేదనల పరంపరో కదా ఒక కావ్యం/ప్రతికావ్యం ఒక శిశువు అయితే/ఎందరి శిశువుల మాతృకో కదా కవి/ సమస్త సమాజ వేదన సోదనల/మంటల మహావేదిక కదా కవి. ఈ కవిత చదివినపుడు వర్డ్స్‌వర్త్ చెప్పిన ‘Poetry is the spontaneous overflow of powerful feelings’ ఈ నిర్వచనం సరితూగుతుంది. కవిత్వమంటే ప్రసవవేదన తీవ్రానుభూతి కదా..కవిత్వం ప్రసవవేదన కూడా కదా..కవి కవిత్వాన్ని తన మస్తిష్కగర్భంలో లెక్కలేనన్ని మాసాలు మోస్తాడు కదా.. ఎలా మోస్తాడో చూద్దామా!
మరణం లేని కాలం శీర్షికతో రాసిన ఈ కవిత..
కవీ! నీ అక్షరాలు/అలల సముద్రంపై నర్తించే నర్తకీమణులు/అరణ్యాల మీదుగా అశేషంగా వీచే/పవన పరంపర వీచికలు/కవీ! నీ అక్షరాలు/వెన్నెల ఎడారుల మీదుగా తరలిపోయిన/విరహిణి వియోగగీతాలు/పసర్వేది నేర్చిన పాదాన/ఆకాశయానం చేసే రాకుమారి/ఆంతరంగిక రహస్యాలు,కవీ! నీ అక్షరాలు/నదులు నడిచిన తీరమంతా/శ్రమైకజీవనసౌందర్యం పూసిన పచ్చికమైదానాలు/దిగంతాల అంచులుతాకిన లోచనాలు/కవీ! నీ అక్షరాలు రెక్కలు చాచిన ఆకాశమంతపరుచుకున్న/మిలమిల మెరిసేనేత్రాలు/కవీ! నీ అక్షరాలు నిత్యచైతన్యదీపికలు/నీ అక్షరాలు/నిరంతర ప్రవాహాలు/నీ అక్షరాలు/అజరామరాలు/నీ ఆశయం నిత్యనవోదయం/సమాజ అభ్యుదయం..
ఈ కవిత చదివినపుడు షెల్లీ ఇచ్చిన‘In a general sense may by defined as the expression of the imagination’ ఈ నిర్వచనం గుర్తొస్తుంది. ఊహప్రకటన ఎంత సౌందర్యాత్మకంగా చెప్తాడు కవి. అక్షరాలు ఆకాశమంత పరచుకోవడమేమిటి? ఎంత గొప్ప ఊహకదా.. అంతెందుకు
“నువ్వు లేని నేను లేను” శీర్షిక తో రాసిన ఈ కిందిను జాగ్రత్తగా ఒకసారి పరిశీలిస్తే..
నువ్వొక స్వప్నమాలిని/నేనొక దీర్ఘరాత్రిని/దుఃఖంలో/కష్టంలో/నష్టంలో/చెమటలో/కన్నీళ్ళలో/బాధలో/ఆశలో/నిరాశలో/దైన్యంలో/శూన్యంలో/అనేకానేక సందర్భాల్లో/అనేకానేక సందేహాల్లో/అనేకానేక సంశయాల్లో/నేనంతా నేనొక్కడినై/అన్నిదిక్కులు ఒక్కటై/గమ్యం లేని/గమనం లేని ప్రయాణంలో/నా నావకు నేనే చుక్కానినై/నేనే తెరచాపనై/నేనే సముద్రమై/నేనే తుదిలేని తీరమై/అలల అలవొడినై/కలల జడినై/త్రికాలాల్లో అన్ని ప్రతికూలాల్లో/అనివార్యంగా ముందుకు సాగుతున్నప్పుడు/ప్రియనెచ్చెలీ!/నువ్వు వెళ్లిపోయాక నీకు మల్లే/కలమే నా స్నేహం/సాహిత్యమే నాకు స్వాంతన/కవిత్వమే నా ఆలంబనం…
గొప్ప ఎత్తుగడలతో కవిత ప్రారంభమౌతుంది. నువ్వొక స్వప్నమాలిని నేనొక దీర్ఘరాత్రిని అన్నప్పుడే కవితాఎత్తుగడలో కవి విజయం సాధించారు. ఇందులో చెప్పే అనునూతి సముద్రపు అలల్లా ఎగసిపడుతుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రసిద్ద కవి జాన్ కెబెల్ చెప్పినట్లు‘A vent for over-charged feelings’ అన్నమాట పై కవితను నిర్ధారిస్తుంది.పై కవిత అభివ్యక్తి ప్రధానంగా సాగినప్పటికీ నేనే సముద్రమై నేనే తుదిలేని తీరమై అంటూ కవిత ఉప్పొంగుతుంది. ఇలా ప్రతి కవిత వైవిధ్యంగా సాగుతుంది. ఈ కవితా ప్రయాణక్రమంలో అనేక అనేక నిర్వచనాలు ఇస్తూనే లోతైన విషయాలు చర్చిస్తారు. సమాజాన్ని అద్దంలో పెట్టి చూపిస్తారు. అద్దంలో ఉన్నది ప్రతిబింబమే కావచ్చు.. అది ప్రతిరూపమే కావచ్చు. కానీ ఆ కవిత వర్తమాన ప్రపంచాన్ని, వర్తమాన సమాజాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. కవిత్వం గురించి మరో వైవిధ్యమైన కవిత
కవిత్వం శీర్షికలో చదవండి..
కవిత్వం ఏమీ చాంతాడు కాదు/మూరలు బారలు లెక్కన కొలవడానికి/కవిత్వమేమీ సరుకు కాదు తక్కెడలో తూంచడానికి/కవిత్వం అంటే/భగభగ మండే కొలిమి కావచ్చు/సలసల కాగే బాయిలర్ కావచ్చు/నిద్ర వాలని రెప్పలు చెప్పే వెతలు కావచ్చు/అన్నంమెతుకులు దొరకని పేగులు చెప్పే/ఆకలిచావులు కావచ్చు/మొలకెత్తని విత్తనం చెప్పే/కల్తీ ఎరువుల రహస్యం కావచ్చు/చమటను బొట్టు బొట్టుగా రాల్చి/మొక్కమొక్కగా పెంచుకున్న ఆశకావచ్చు/వొరుపు ముంచిన బ్రతుకుకథ కావచ్చు/ఆఖరుగా యుద్ధభూమిలో/మీసం మెలేసి మృత్యువుకు ఎదురేగిన/వీరసైనికుడి సాహసగాథ కావచ్చు కవిత్వమంటే బతుకుప్రపంచం..అంటూ కవిత్వానికి నిర్వచనం ఇస్తారు. పాశ్చాత్యులు చెప్పినట్లు అనుభూతి, ఆవేశము ప్రధానంగా కవిత్వానికి నిర్వచనాలుంటాయంటారు. నిజానికి కవిత్వానికి అనుభూతి- ఆవేశము రెండుకళ్ళలాంటివి. పై కవిత వేదనకు ప్రతిబింబంగా సాగుతున్నప్పటికీ చివరి కవితావాక్యాలు చదివేసరికి కవితావేశంలో ధిక్కారస్వరం వినిబడుతుంది. Emotion recollected in tranquility అని వర్డ్స్‌వర్త్ చెప్పిన మాట నిజమనిపిస్తుంది. అసలు ఎమోషన్ లేని వాక్యాల్ని కవిత్వ పంక్తులుగా గుర్తించలేము. ఎమోషన్ లేని అక్షరాలకు జీవముండదు. అసలు అక్షరాలకు జీవం పోసేదే ఎమోషన్.. మరొక వైవిధ్యమైన కవిత చూడండి..
కవితోత్సవం శీర్షికలో..
ఎంత మద్యం తాగినా/కవిత్వపుమత్తు వదలదు/ఎన్ని మందులు వేసుకున్నా/కవిత్వజ్వరం తగ్గదు/ఎంత శీతలపానీయం తీసుకున్నా/ఈ కవితాదాహం తీరదు/ఒకటే ఎడతెగని భావపరంపర/ఆలోచనల సంఘర్షణ/ఇదో యుద్ధం/ఇదో యుద్ధమైదానం/ఇదో భూమినూ కాదు/ఆకాశమూ కాదు/రాత్రంతా చీకటితో/చితిమంటల పెనుగులాట/తెల్లారి ఖాళీకాగితాలన్నీ/అక్షరప్రాణం పోసిన/పుస్తకాలు/పగలంతా పాటల జాతర/సాయంత్రం దివిటీలు ఊరేగింపు/ఇక లోకమంతా వెలుగు మహోత్సవం. అమెరికన్ ప్రసిద్దకవి Edgar Allan Poe చెప్పినట్లు..The rhythmic creation of beauty అంటారు. ఆయన చెప్పినట్లు లయబద్దమైన సౌందర్యసృష్టి కనబడుతుంది కదా..ఎత్తుగడ, వస్తువు, శిల్పం, అభివ్యక్తి కవితా నిర్మాణశైలంతా లయాత్మకంగా సాగుతుంది. లోసారి సుధాకర్ రాసిన ఈ ఆయుధం లాంటి మనిషి కవిత్వంలో ప్రతి కవిత దేనికదే భిన్నంగా సాగుతుంది.
నువ్వు కవి కాకుంటే శీర్షికలో రాసిన ఈ కవితలో ఎంత భిన్నంగా చెబుతాడో.. అసలు ఏం చెబుతున్నాడో చూడండి..
నువ్వు కవి కాకుంటే /మూడోనేత్రం ఎలా ఉండేది/నువ్వు కవి కాకుంటే /మూడుకాలాల్ని ఏకరీతిలో ఎలా చూడగలిగేవు/ నువ్వు కవి కాకుంటే మూడులోకాల్ని ఎలా/ఒక్క అడుగున చుట్టేయగలవు/సముద్రాల్ని ఎలా తోడగలిగేవు/ఎడారుల్ని ఎలా ఈదగలిగేవు/నువ్వు కవి కనుకనే/ మనిషినీ, మనసును/మట్టిని ప్రాణపదంగా ప్రేమించగలగుతున్నావు/పూలు, పుస్తకాలు, కవులు కదా అద్భుత సౌందర్యాలు..కవి కాకుంటే మనిషి ఏమౌతాడు. కవిత్వం ఎప్పటికైనా గొప్ప సృష్టి. ఇది కాదనని సత్యం. అందుకే రష్యన్ కవి లియోనిడ్ లియొనోవ్ A true work of art and a work of literature is always an invention from and a discovery in content..కవి వస్తువును ఎంత బాగా వొడిసిపట్టుకుని రాస్తాడు. మనసును మెలిపెట్టే భావాలను చెప్తాడు. సముద్రాల్ని ఎలా తోడగలిగావు. ఎడారుల్ని ఎలా ఈదగలిగేవు అనడం ఎంత గొప్ప సృజన కదా..కవి అనేమాట, కవిత్వమనే మాట ఎంత గొప్ప వస్తువు కదా..
కవి ఇలా కవిత్వం గూర్చి అనేక నిర్వచనాలిస్తూనే ఈ కవి ఈ కవిత్వంలో సౌందర్యం గూర్చి గొప్పగా చెబుతాడు. పైన పేర్కొన్న నిర్వచనాలు కవిని, కవిత్వాన్ని, కవిత్వతత్వాన్ని చెప్పాయి. లోసారి సుధాకర్ కవిత్వంలో వైవిధ్యత ఉంటుందని చెప్పటానికి వివరించిన ఉదాహరణలు మాత్రమే. వర్తమాన సమాజంలో కవి ఎటువైపు ఉండాలో కవిత్వం ఎవరి ప్రయోజనాలకు లిఖించబడాలో లోసారి సుధాకర్ కవిత్వం స్పష్టంగా చెబుతుంది. ఇప్పటివరకు తెచ్చిన కవిత్వ సంపుటాల్లో మైనపుబొమ్మలు, తడియారని స్వప్నం, నా రహస్యమందిరంలో.. వంటి కవిత్వ సంపుటాలన్నీ భాషాప్రయోగం, ప్రతీకలు, ఎత్తుగడలు, గొప్ప శిల్పంతో వచ్చినవే. అలాగే భిన్నమైన వస్తువుల సమాహారంగా కొనసాగినవే. కవిత్వం మానవ జీవనాన్ని, మానవ జీవిత వికాసాన్ని, సమాజ అభ్యుదయాన్ని ఎలా కోరుకుంటుందో ఈ కవి తన కవిత్వంతో చాలా సూటీగా, ఘాటుగా, గాఢతగా చెప్పారు. కవి, కవిత్వాన్ని ఉన్నత శిఖరాలను ఎలా చేర్చాలో చెప్తాడు. తను కవిత్వంలో ఎలా అనుభూతి పొందుతున్నది, తను కవిత్వం ద్వారా ఏం కోరుకుంటున్నదీ , కవిత్వం సమాజానికి ఎలా ప్రతిబింబమైనదీ చెప్తాడు. ఈ ఆయుధంలాంటి మనిషి కవిత్వంలో అనేకానేక కవిత్వనిర్మాణ రహస్యాలతో రాశారు. ఈ కవిత్వంలో అనేకానేక సిద్దాంతాలను ప్రతిపాదిస్తారు. మనిషిని, ఆ మనిషినే నమ్ముకున్న కవిత్వాన్ని చిటికెన వేలుపట్టుకుని ఎలా నడిపించాలో అన్నీ లోతైన సంగతుల్ని కవితల్లో వివరిస్తారు. ప్రత్యేకంగా ఈ కవిత్వంలో ఉన్న ఈస్తటిక్స్ గూర్చి మాట్లాడాలి. కవిత్వంలో ఈస్తటిక్స్ ఏముంటాయి? ఎలా వుంటాయి? ఈ సౌందర్యం చెబుతున్నదేమిటి? చూద్దాం పదండి..సౌందర్యశాస్త్రం వాస్తవికతను మాత్రమే చూపెడుతుంది. టి.సూర్యసాగర్ అనే ప్రసిద్ద విమర్శకులు తన సాహిత్యం-సౌందర్యం గ్రంథంలో సౌందర్యం గూర్చి, సౌందర్యశాస్త్రం గూర్చి అనేక విషయాలు చెబుతూ ఒకచోట ఇలా అంటాడు.
‘వాస్తవికతలో విభిన్న రకాల సౌందర్యం మనకు నిత్యం సాక్షాత్కరిస్తుంది. అందమైన మనిషి, అందమైన పుష్పం, అందమైన విన్యాసం, అందమైన ఉషోదయం, అందమైన వెన్నెల, అందమైన మానవసంబంధాలు, అందమైన కొడవలి, అందమైన ఇల్లు, ఇలా సామ్యంలేని వివిధ వస్తువులు, విషయాల్లో మానవుడు సౌందర్యం దర్శిస్తాడు. అందమైన వాటిని గుర్తించడం చాలా సులువు. కాని అవి ఎందుకు అందంగా వున్నాయంటే చెప్పడం కష్టం.’ అంటారు.
లోసారి సుధాకర్ సౌందర్యాన్ని ఎలా గుర్తిస్తాడో అతడు-ఆమె శీర్షికలో చూద్దాం..
‘ఆమె వెన్నెల కలువ/అతడు వేకువ స్వప్నం/ఆమె ఆకాశం/సుదూరంలో భూమ్యాకాశాలు కలిసినట్టుగా/రేఖామాత్రంగా కొంగుముడి వేసిన బంధం ఒకటి/అతడు భూమి సమాంతర నడక మాత్రమే తప్ప/కష్టసుఖాల సంగమప్రయాణం మాత్రం ఒకప్రశ్న/ రెండు వైరుధ్యాల పరస్పర సంఘర్షణలో/ఒకటి చీకటిలో మరొకటి కన్నీటిలో/మునుగుతూ తేలుతూ/తీరం మాత్రం అనంతదూరం జీవితం ఓ ఘడియపాటి నాటకం.’ లోసారి సుధాకర్ సౌందర్య దృష్టి అలాంటిది. మానవజీవితంలో సౌందర్యం ఎలాంటిదో పై కవితలో చెప్తారు. మనిషి సంఘజీవి అని ఏళ్ళ తరబడి వింటున్నాం. మనిషి సంఘజీవేకాదు సౌందర్య పిపాసి అనే విషయం పవరూ ప్రత్యేకంగా చెప్పరు. ఈ కవి కవిత్వంలో సౌందర్యాన్ని గొప్పగా ఆవిష్కరిస్తారు. తన అనుభవంలోకి వచ్చిన తనకు సాక్షాత్కరించిన విషయాల్ని అత్యంత సౌందర్యవంతంగా చెప్తారు. వేదనను, బాధను, విరహాన్ని, ప్రేమను కూడా భారంగా చెబుతారు. విలియం షేక్‌స్పియర్ చెప్పినట్టు బాధ గుండెల్లోంచి చీల్చుకొచ్చేలా రాస్తారు. మరి ఆ బాధ, ఆ విషాదాన్ని ఎంత భారంగా చెప్తాడో చూద్దాం..
ఎవడి గతం వాడిది/వద్దు రా నాయన ఈ జీవితం/ఇదో నరకయాతన/సుడిగుండంలో మునుగుతూ తేలుతూ/ఒడ్డుకు చేరుకోలేని ఉక్కిరిబిక్కిరితనం/నిప్పుల్లో కాలిపోయి విగతజీవై/భస్మరాశిగా మిగిలిన ఖాళీతనం/నేలకూలి/మనిషి తలకిందులుగా మొలచినట్టు/ఒకానొక అపసవ్యత్వం/ఎవరి శవాన్ని వాడు భుజానవేసుకుని/మోసుకు తగలబెడుతున్నట్టు/వక్రత్వం అపరిపక్వత్వం అసహజత్వం/తలబద్దలవుతున్న అగ్నిపర్వతం..మనిషి తలకిందులుగా మొలవడం కంటే విషాదం ఏముంటుంది..ఎవరి శవాన్ని వాడు భుజాన మోసి తగలమెట్టుకోవడమంత విషాదం ఏముంటుంది..? సౌందర్యం, విషాదం, హస్యం ఇవన్నీ సౌందర్య శాస్త్రంలో భాగం. వీటికి మార్క్సిస్ట్ సౌందర్యశాస్త్రం ఆమోదం తెలుపుతుంది. కానీ సామాజిక బాధ్యత లేని రచనలను మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం అంగీకరించదు. సామాజిక బాధ్యతతో సౌందర్యాన్ని అలంకరిస్తూ రాస్తే అది కవిత్వం అవుతుంది. ఈ కవి సామాజిక బాధ్యతతోనే రాస్తారు. ముఖ్యంగా కవిత్వం రాస్తారు. కవిత్వం కాని అంశాల జోలికి వెళ్లరు. ఈ కవికి మట్టిని మెతుకుగా చేయడం తెలుసు.. మెతుకును అక్షరంగా చేయడం తెలుసు.. అక్షరాన్ని కవిత్వం గా చేయడం తెలుసు.. ఈ కవికి తెలిసినంత మానవ జీవితం.. ఈ కవికి తెలిసినంత మనిషి జీవిత అనుభవం.. దాన్ని కవిత్వంగా మలచడం లోసారి సుధాకర్ కే సాధ్యం. సమాజానికి సాహిత్యానికి ఉండాల్సిన గతితార్కిక సంబంధాన్ని వదిలేసి రాస్తూ రాసిందే గొప్పకవిత్వమని, తాము రాసిందే గొప్ప రూప సారమని బతుకున్న కవిత్వ సమాజంలో మనమున్నాం. వీటికి భిన్నంగా ఒక సైద్ధాంతిక నిబధ్దతతో రాస్తున్న కవి లోసారి సుధాకర్. ఆయన కవిత్వం వేదమంత్రాలు కావు, మట్టి విగ్రహాలు అంతకంటే కావు ఊరంతా ఊరేగడానికి, ఊరంతా వినిపించడానికి..ఆయన కవిత్వం స్వేచ్ఛకోసం ఎగిరే జెండా..