వాస్తవం వేరు వాస్తవికత వేరు అని విన్నాను. వాస్తవానికున్న మూలాన్ని విశ్లేషిస్తే వాస్తవికత అవుతుందని కూడా విన్నాను. వాస్తవికత కళగా మారితే మూలంలోని సమస్య విస్తృత ప్రచారాన్నందుకుంటుంది. ప్రజల్లోకి చొచ్చుకు పోతుంది. ఇలా ప్రజల్లో ప్రచారం కావటం పాలక వర్గాలకు నచ్చదన్న విషయం విదితమే.
ఈ నెల నాల్గవ తేదీన హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జల్ జంగల్ జమీన్ హమారా అన్న లఘునాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో వస్తువు ఆదివాసులు కార్పొరేట్ విస్తరణను అడ్డుకుంటారు. ప్రభుత్వం వారిని అణచివేస్తుంది. పోలీసు కాల్పుల్లో ఒక పాప మరణిస్తుంది. పిల్లలు ప్లకార్డులు పట్టుకుని ఈ అణచివేతను వ్యతిరేకిస్తారు. మొత్తం నాటిక అరగంట నడుస్తుంది.
ఈ నాటికలో పాల్గొన్న ఐదు మంది పిల్లల్ని పోలీసులు అరెస్టు చేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఈ నిర్బంధాన్ని వివరించుకోవాలి.
పోలీసులు వ్యతిరేకిస్తున్నది నాటకంలోని అంశాన్నే అయినా పిల్లలు పాల్గొనడం వారికి నచ్చలేదు. పోరాటం ఒక తరం నుంచి మరొక తరానికి విస్తరిస్తుందన్న భయం వారికుంది. పిల్లల నటనా కౌశలాన్ని, సంభాషణలోని వ్యక్తీకరణ తీరుని అభినందించకుండా మనమే కాదు పోలీసులు కూడా వుండలేరు. మరి సినిమాల్లో నటిస్తూ పిల్లలు అవార్డులు తీసుకుంటున్నారు. దర్శక నిర్మాతలు అవార్డులు తీసుకుంటున్నారు. వారిని వ్యతిరేకించగా లేని పోలీసులు నాటక ప్రదర్శనలోని వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది?
నేటి సినిమా ప్రజా సమస్యలకు దూరమైన కళ. అందులో సాంకేతిక పరిజ్ఞానం అధికంగా వుంటుందన్న విషయం ప్రేక్షకులకు తెలుసు. యంత్ర పరిశ్రమలు తెచ్చి పెట్టే ఆర్థిక సాంఘిక సమస్యలు పెట్టుబడి దారుకీ, ప్రజాస్వామ్యానికి కూడా విషమ సమస్యలుగా పరిణమిస్తాయని. కొ.కు. అంటారు. ఇప్పుడు సినిమా రంగం ఆ సమస్యల్ని ఎదుర్కొనటానికి సిద్ధంగా లేదు. సినిమాలు కోట్లాది రూపాయల పెట్టుబడి కోట్లాది రూపాయల లాభాన్ని ఆశిస్తాయి గదా! కాబట్టి వ్యాపార కళలు వాస్తవికతను చిత్రించవు. అది సినిమా వాళ్ళకు విషతుల్యం. జల్ జంగల్ జమీన్ హమారా నాటికలో పెట్టుబడులు లేవు. లాభాన్ని ఆశించేవారు అటు నటులూ రచయితలూ కాదు. వాస్తవిక సంఘటనను కళాత్మకంగా ప్రేక్షకుల కందించింది.
పెట్టుబడితో మిళితం కాని వాస్తవికత కళారూపాన్ని సంతరించుకుని అత్యంత సహజంగా ప్రేక్షకుల మనసుల్ని కదిలిస్తుంది. సందేశం బలీమైంది ఈ నాటికలో. సినిమా భ్రమాత్మకమైనది. నాటిక వాస్తవికమైనది. ప్రజానుకూలమైన, సందేశాత్మకమైన ఏ కళను పాలకవర్గాలు అంగీకరించవు. గతంలో కొన్ని సినిమాల్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.
ఈ నాటికలో ఆంగిక, వాచికాభినయాలు సహజంగా ఉన్నాయి.. స్వాభావికంగా వున్నాయి. ప్రేక్షకులను ఇందులోని సన్నివేశాలు కదిలించాయి. ఈ క్రమంలో పిల్లలు రంగస్థలం పైకి రావడం, వాళ్ళు విలపించడం, కార్పొరేట్లకు వ్యతరేకంగా నినదించడం, సైనికీకరణను అడ్డుకోవాలని అనడం ప్రేక్షకులను ధర్మాగ్రహానికి లోను చేస్తాయి. ఇదీ పోలీసులకు నచ్చలేదు.
ఇటీవల ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులను పసిపాపల్ని హతమారుస్తున్నారు. స్త్రీలను ఎన్నో విధాలుగా హింసించి, అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలున్నాయి. కషాయి మూకల దాడులు అమానుషంగా కొనసాగుతున్నాయి. బుల్డోజర్ దాడులు నిరంతరమైనాయి. ఈ రాజ్య హింసను వ్యతిరేకిస్తూ ప్రజాకళలను ప్రచారం చేయడమే విరసం చేస్తున్నపని.
ఈ పని పోలీసులకు కంటగింపు అయింది. పిల్లలతో ఇలాంటి నాటకాలు వేయించడం బాలల హక్కులకు వ్యతిరేకం అన్నారు. వాస్తవానికి చిన్న పిల్లల హక్కులను భంగపరచే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తూ వుంది. గాంధీ సమకాలికులు గిజూభాయి బధేకా విద్యాతత్త్వవేత్త. ఆయన రచనలు తెలుగులో వెలువడినాయి. ఆయన పిల్లలతో వీధి నాటకాలు వేయించారు. వారిలోని ప్రజ్ఞాపాటవాల్ని పరీక్షలకు నిలబెట్టారు. పిల్లల్ని నాటికల్లో నాటకాల్లో నిలపడం అవసరం. పిల్లలలోని ఉత్సాహానికి ఊతమిచ్చినట్లవుతుంది. ఇటీవల పిల్లలతో తీయించిన సినిమాలకు గొప్ప గుర్తింపు వచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి. పోలీసులు వ్యతిరేకించింది ఆది వాసుల రాజకీయాల్ని, వాటిలో కలిసిపోయిన కళల్ని. ఈ సంఘర్షణ అనాదిగా జరుగుతున్నదే! గతంలో మా భూమి నాటకాన్ని నిషేధించి ప్రభుత్వం అభాసుపాలైంది. ప్రజా కళలపై సాహిత్యంపై సాహితీ కారులపై నిషేధాలు అభాసుపాలవుతాయి.
ఈ నాటికలో ప్రారంభాంకం కొంత సాధారణంగా నడచినా ఆదివాసుల ప్రవేశంతో నాటిక ఊపందుకున్నది. పోలీసులతోడి ఘర్షణ, కాల్పులతో వేడెక్కింది. కాల్పుల తరువాత పిల్లల ఏడ్పులతో సన్నివేశం హృదయ విదారకమై ప్రేక్షకుల మనస్సు ఆర్ధ్రమై ఆవేశపూర్తిమౌతుంది. నాటిక పతాక స్థాయికి చేరింది. ఇంకా కథను నడిపించవలసి వుండిరది. ఆదివాసుల సభలు సమావేశాల్లో చర్చలు వారి ధృడ సంకల్పాన్ని చూపించవలసి వుండిరది. కథ వేగంగా నడిచింది.
మొత్తానికి సందేశాత్మక నాటిక రావడం సంతోషం. సంభాషణాంశాల్లో పడికట్టు పదాలు ఉపసంహరించుకుంటే సహజత్వం బలపడేది. ఏడుపుల సన్నివేశంలోనూ, విలాపరాగంలోనూ ఒకే గొంతు కాకుండా వైవిధ్యాన్ని పాటించాలి. పాట కర్తవ్యోపదేశంగా వుంది. నటీనటుల అనుభవం కలవారుగా వున్నారు. కళారూపాలపై దాడులు నిషేధాలు ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించే కాలం నుంచి ప్రారంభమైనాయి. దాడులు, నిషేధాలు అభాసు పాలవుతూనే వున్నాయి. వాస్తవిక ధాతురూపం నాశనం కాదు కదా!
ఇటువంటి నాటికలను విరివిగా ప్రదర్శించవలసిన అవసరం ఏంతైనా వుంది.
ప్రజాకళలపై పోలీసుల జులుం నశించాలి! ప్రజాకళలు వర్ధిల్లాలి