(కా. మిడ్కో గా పాఠకులకు సుపరిచితమైన కా. జి.రేణుక స్వస్థలం వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామం. తిరుపతిలో ఎల్‌ఎల్‌బి చదువుతుండగా “మహిళాశక్తి” సభ్యురాలిగా మహిళా ఉద్యమంలో పనిచేసింది. 1995 లో మహిళా శక్తి మరొక 9 సంఘాలతో కలిసి చైతన్య మహిళా సంఘంగా ఏర్పడిన తరవాత రాష్ట్రవ్యాప్త మహిళా ఉద్యమంలో తిరుపతి కేంద్రంగా 2000 వరకూ విశాఖపట్నం కేంద్రంగా 2004 వరకూ పనిచేసింది. మహిళామార్గం పత్రిక లో సంపాదక వర్గ సభ్యురాలుగా పనిచేసింది. తరవాత 2004 లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుని ఆంధ్ర ఒడిష బోర్డర్ జోన్ లోనూ, దండకారణ్యంలోనూ పనిచేసింది. అనేక కలం పేర్లతో 30 కి పైగా కథలు రాసింది. తన కథలన్నిటిలోను స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలు బలంగా రూపొందిన క్రమాన్ని చాలా అద్భుతంగా చిత్రించింది. అనేక వ్యాసాలు, నిజ నిర్ధారణ నివేదికలూ రాసింది. బి.డి.దమయంతి పేరుతో సల్వాజుడుమ్ చేసిన హింస గురించి, ప్రజల పై ప్రభావం గురించి, వారి తిరుగుబాటు గురించి పుస్తకాలు రాసింది. నారాయణపట్నా పోరాటబాటలో ప్రజల భాగస్వామ్యం గురించి వ్యాసాలు, ఒక పుస్తకం రాసింది. అనేక పుస్తక పరిచయాలు, సమీక్షలు, స్పందనలు రాసింది. నిరంతరం విప్లవోద్యమాన్ని వివిధ రచనా ప్రక్రియల్లో నమోదు చేస్తూనే ఉంది. 
కడివెండిలో చిన్నప్పడు ఇంటి పక్కనే ఉన్నప్పటి నుండి పరిచయం ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు అమరుడు కా. మహేశ్ (కా. సంతోష్ రెడ్డి) తో వివాహం జరిగింది. చాలా కొద్ది కాలానికే కా.సంతోష్ అమరుడయ్యాడు. చాలా కాలం తరవాత కా.శాఖమూరి అప్పారావుని వివాహం చేసుకుంది. ఆయన కూడా 2010లో అమరుడయ్యాడు.
సున్నితమైన మెత్తని మనసుతో అందరితో ఎంతో స్నేహంగా ఉండే రేణుక వ్యక్తిత్వం మాత్రం చాలా దృఢమైనది. చివరివరకూ విప్లవోద్యమంలో నిలబడడమే అందుకు తిరుగులేని నిదర్శనం. ఆమె ఒక నిఖార్సయిన విప్లవకారిణి, విప్లవ రచయిత. 2025 మార్చి 31 న దంతెవాడలోని ఒక గ్రామంలో ఉండగా బూటకపు ఎదురు కాల్పుల పేరిట రాజ్యం హత్య చేసింది.  కా.రేణుక అమరత్వం విప్లవోద్యమానికి తీరని నష్టం. ఆమెకు విప్లవ జోహార్లు!. ఆమె స్మృతిలో పాఠకుల కోసం ఈ  కథను పునర్ముద్రిస్తున్నాం .. వసంతమేఘం టీం )

‘ఏమాలోచించుకున్నావ్‌’? అడిగాడు రవి ఆమె మొహం కేసి చూస్తూ.

‘చెప్పినాను కదా ఇంక వేరే ఆలోచనేం లేదు!’ చెప్పింది శోభ తన కాళ్ల వైపు ప్రవహిస్తున్న నీటిని చూస్తూ.

‘అంటే, నీ నిర్ణయం మార్చుకోవా?’ అతని గొంతులో అర్థింపు.

‘ఉహు!’ నీటి ప్రవాహం నుండి చూపును మరల్చలేదామె. బాధగా ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు ఓ నిమిషం పాటు. ఎడమ చేతిని బండరాయిమీద వేసి ఎడం వైపుకి కొంచెం ఒరిగి నీటివైపు చూస్తూ కూర్చొనుందామె. కుడివైపు చిన్న బండకానించి తుపాకీని పెట్టింది, అది సరిగ్గా ఇద్దరి మధ్యనుంది.

‘అరె! కనీసం నా వైపు కూడా చూడ్డం లేదే’ అనుకున్నాడతను. రవి అక్కడికి వచ్చేప్పటికి ఆమె ప్రవాహం వైపు చూస్తూ ఉంది. అతను వచ్చి పక్కన కూర్చున్నా ఆమె కనీసం చూపులు తిప్పలేదు. ఓ మూడు నాలుగు నిమిషాలు చూసి అతను సంభాషణ మొదలెట్టాడు.

‘నువ్వట్లంటే ఎట్లా? నువ్వు లేకుండా నేనుండలేను’ నిమిషం విరామం తర్వాత అన్నాడతను.

కొంచెం తలతిప్పి అతని కళ్లలోకి చూసిందామె. బహుశా అతని కళ్లలో నిజాయితీని వెతుకుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ‘అట్లయితే ఉండిపో ఉద్యమంలోనే’ అంది.

ఆ మాట అన్నవెంటనే అనుకుందామె ‘తను వెళ్లిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత నేనీ మాట అనడం అనవసరం కదా’ అని.

‘నేనిక ఉండలేను. పార్టీ నన్నర్థం చేసుకోవడం లేదు. నువ్వయినా అర్థం చేసుకుంటా వనుకున్నా. జరిగిన పరిణామాల్లో నా తప్పేం లేదు.’

‘దానికి పార్టీనొదిలిపోవడం పరిష్కారమా? ఉండి కొట్లాడాలి గానీ’ వద్దు అనుకుంటూనే ఉండబట్టలేక మళ్లీ అంది శోభ.

‘ఉహూ! నా వల్లకాదు కొట్లాడి కొట్లాడి నేనలసిపోయాను. సంవత్సరం నుండి సాగుతున్నదే కదా’

‘అం­తే ఇంకేముందీ! నీ నిర్ణయం నువ్వు తీసుకున్నవు నా నిర్ణయం నేను తీసుకున్నను’

‘బిడ్డ గురించయినా ఆలోచించవా?’

‘బిడ్డ గురించి ఇప్పుడు కొత్తగా ఆలోచించేదేముందీ? ఏడేళ్ల క్రితమే ఆలోచించాను. ఇంకిప్పుడు ఆలోచించేదేం లేదు.’

‘నువ్వింత మొండిగా మాట్లాడితే ఎట్లా వరా!’

‘నన్నట్ల పిలవొద్దు!’ అప్రయత్నంగా పక్కనే ఉన్న తుపాకిపై చేయివేసిందామె.

‘ఏం పిలుస్తే? అప్పట్లో నువ్వు అడిగి అడిగి ‘వరా!’ అని పిలుపించుకునే దానివి కదా!’ ఆమె చేయిమీద చేయివేస్తూ అన్నాడతను. చేతిని విసురుగా లాక్కుందామె.

దెబ్బ తిన్నట్లుగా చూసాడామె కేసి. ప్రవాహం కేసి చూస్తోన్న ఆమె ముఖం కఠినంగా వుంది.

అతని పిలుపునూ అతని స్పర్శనూ భరించలేక పోతోందామె. కానీ ఒకప్పుడు ఆ పిలుపుకోసం ఆస్పర్శ కోసం ఎంతో తపించిపోయేది. అప్పుడామెకు అతను సర్వస్వం.

తల్లిదండ్రులకు వరలక్ష్మి ఒక్కతే కూతురు. వరలక్ష్మి తల్లి తమ్ముడు గోవిందు. వాళ్లిద్దర్నీ చిన్నప్పట్నుంచి కాబోయే మొగుడూ పెళ్లాలుగానే వ్యవహరించే వాళ్లందరూ. పదో తరగతి పాసయిటవున్‌లో ఇంటర్‌లో చేరినాడు గోవిందు. ఉన్న ఊర్లో ఏడో తరగతి వరకూ చదివించిన తల్లిదండ్రులు పై చదువులకు పొరుగూరికి పంపలేక వరలక్ష్మిని చదువు మానిపించారు. వాళ్లిండ్లల్లో ఆడపిల్లల్ని ఏడో తరగతి దాక చదివించడం గొప్పే.

ఇంటర్‌లో చేరిన గోవిందు చదువు ముగించుకోకుండానే ఊళ్లో కొచ్చాడు. అతను రావడం కాదు, ఉవ్వెత్తున చెలరేగుతున్న పోరాటం అతన్ని లాక్కొచ్చింది. ఊళ్లో జరిగిన అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.

వరలక్ష్మి తల్లిదండ్రులకు గోవిందు పద్ధతి నచ్చలేదు.

‘ఏరా! గోవిందూ, నువ్విట్ల ఇల్లూ వాకిలీ పట్టకుండా తిరిగితే ఎట్లారా? నువ్వేదో చదువుకొని ఉద్యోగం చేసి వరాలును చేసుకొని సుఖంగ ఉంటవనుకుంటే, నువ్వేందిరా ఇట్ల తిరుగుతున్నావ్‌’ అడిగేది వరలక్ష్మి తల్లి.

‘ఏం, బతకాలంటే ఉద్యోగమే సెయ్యాల్నా! మనకున్న రెండెకరాల్లో ఇద్దరూ కష్టం సేసుకుంటే చాలదా?’ అనేవాడు వరలక్ష్మి తండ్రి.

వాళ్ల మాటలకేం సమాధానం చెప్పేవాడు కాదు గోవిందు. గోవిందుతో విసిగిపోయిన వరలక్ష్మి తల్లిదండ్రులు కూతురికి వేరే సంబంధాలు వెతికారు. పక్కూర్లో కూలినాలీ చేసుకుని బతికే నారాయణ అనే అనాధతో పెళ్లి కుదిర్చారు.

గోవిందు మీద ఇష్టమున్న వరలక్ష్మి ‘ఉహూ! నేనతడ్ని చేసుకోను’ అంది. అతనికి నా అన్నవాళ్లెవరూ లేరు. కాబట్టి మనింట్లోనే ఉంటాడు. మనకున్న పొలంలో కష్టం చేసుకుంటూ అందరం కలిసుండొచ్చు. మాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు’ నచ్చజెప్పింది వరలక్ష్మి తల్లి. తలవంచింది వరలక్ష్మి. ఫలితంగా నారాయణ ఆ యింటికి ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు. పోరాటాల ఊపులో ఉన్న గోవిందు ఈ వ్యవహారాన్నసలు పట్టించుకోలేదు. కానీ వరలక్ష్మి తల్లిదండ్రులు ఊహించినట్లుగా సాగలేదు వాళ్ల జీవితం. నారాయణకు అంతకు ముందే ఉన్న తాగుడు అలవాటు మరింత ఎక్కువయ్యింది. ఏ పనీ చేయకుండా తాగుతూ ఉండేవాడు. అత్తమామల్ని డబ్బుల కోసం పీడించేవాడు. వాళ్లు డబ్బులీయకపోతే బూతులు తిట్టేవాడు. వరలక్ష్మిని చచ్చేలా కొట్టేవాడు.

ఓరోజు గోవిందు ఇంటికొచ్చేప్పటికి వరలక్ష్మిని కొడుతూ ఉన్నాడు నారాయణ. వరలక్ష్మి మొత్తుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు అరుస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సహించలేకపోయాడు గోవిందు. రెండంగల్లో వెళ్లి నారాయణ చేతిలో వరాలును విడదీసి నారాయణను ఇంటి ముందుకు లాక్కొచ్చి బాగా కొట్టాడు. గోవిందు ఆగ్రహధాటికి నారాయణ తట్టుకోలేకపోయాడు. ఇరుగు పొరుగు గోవిందుని గట్టిగా పట్టుకొని ఆపకపోతే నారాయణ చచ్చేవాడే!

ఇరుగు పొరుగు నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ‘రేయ్‌ నారాయణా ఇక్కడ్నుంచి పోరా! ఇక ముందు నా కళ్లకు కనబడినావంటే నరికి పోగులు పెడ్తా!’ అని ఉరిమాడు గోవిందు.

నారాయణకు ఏం చేయాలో తోచలేదు. అక్కడున్న వారెవరయినా ‘పోనీలే గోవిందూ, ఈ ఒక్కసారికి క్షమించి ఒదిలేసేయ్‌!’ అని సర్దిచెప్తారేమోననుకున్నాడు. కానీ ఎవ్వరూ నోరెత్త లేదు. గోవిందు ఉగ్రరూపాన్ని చూసి అంత సాహసానికి ఎవరూ సిద్ధపడలేదు. గత్యంతరం లేక నారాయణ అక్కడ్నుంచి కదిలాడు.

గోవిందుని ఇంట్లో మంచంలో కూర్చోబెట్టి మెల్లగా ఇరుగుపొరుగంతా వెళ్లిపోయారు. ఇంట్లో నలుగురూ మిగిలిపోయారు. నల్గురూ మనిషోచోట నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరూ ఏడవడం లేదు. ఎవరూ తిట్టడం లేదు. ఎవరూ ఓదార్చడం లేదు. కాసేపు అందరూ అన్నీ మరిచిపోయినట్లుగా కూర్చుండి పోయారు.

వరలక్ష్మి తల్లి తేరుకుని గొంతు పెగుల్చుకుని  ‘మొగుడూ పెళ్లాలన్న తర్వాత సవాలక్ష రచ్చలుంటాయి. కొట్టుకుంటారు, తన్నుకుంటారు, కలుసుకుంటారు. దాని మొగుడ్ని అట్లా కొట్టి బెదిరించి తరమేస్తివి. మళ్లీ ఎట్లా వొస్తాడురా!’ అంది. ఆమె తలెత్తకుండానే మాట్లాడింది.

తగ్గుతున్న కోపం మళ్లీ బుస్సుమంది గోవిందులో ‘అంటే మళ్లీ రావాలనా వాడు, వాడొస్తే నిజంగానే చంపేస్తానే.’

‘అవేం మాటల్రా, వాడు దాని మొగుడు’ ఈసారి తలెత్తిందామె.

‘వాడు మొగుడా! అయినా మిమ్మల్ననాలే, వెనుకా ముందూ చూడకుండా దాని గొంతుకోసారు.’

‘ఏదో అయిందేదో అయింది. దాని ఖర్మట్లా కాలింది. ఏం చేస్తాం. మనం తొందర పడితే ఎట్లా’ అన్నాడు వరలక్ష్మి తండ్రి.

‘ఖర్మలేదు గిర్మ లేదు. తొందర పడిరదేముంది. సంవత్సరం నుండి అది తన్నులు తింటూనే వుంది. ఇంక చాలు. వాడినిక ఈ ఊళ్లో అడుగు పెట్టనియ్యను నేను.’

‘అట్లంటే ఎట్లారా దాని బతుకేం కాను’ గట్టిగానే అంది వరలక్ష్మి తల్లి.

‘ఏం కాదు దాని బతుకు! దాన్ని నేను పెళ్లి చేసుకుంటా’ ఇంకా ఆవేశంగానేఉందతని గొంతు.

ఆ మాటలకి తలెత్తి ఠకీమని అతని వైపు చూసింది వరలక్ష్మి. తన వైపు చూస్తున్న వరలక్ష్మి మొహంలోకి చూస్తూ ` ‘నిజం చెప్పవే వరాలు! నేనంటే నీకిష్టం లేదూ! ఈ పెళ్లి నువ్విష్టపడే చేసుకున్నావా?’ గద్దించినట్లు అడిగాడు.

తలొంచుకుంది వరలక్ష్మి.

‘అట్లా తలొంచుకుంటావేందే. అట్లా తలొంచుకునే ఇష్టం లేకున్నా వాడి చేత తాళి కట్టించుకున్నవ్‌. నీ బతుకిట్లా చేసుకున్నవ్‌. ఇప్పుడు కూడా తలొంచుకునే నోర్మూసుకునే పడుండు. ఛీ! ఛీ! నీకు బుద్ధి రాదు!’ అంటూ ఆవేశంగా మంచంలోంచి లేచి బయటకు వెళ్లిపోయాడు గోవిందు.

అలా వెళ్లిపోయిన గోవిందు వారం తర్వాత ఇంటికొచ్చాడు. నారాయణ ఇక జాడ లేదు. బతుకుంటే బలుసాకు తినొచ్చు అనుకున్నాడతడు. గోవిందు ఇంటికొచ్చేప్పటికి వరలక్ష్మి ఒక్కతే మంచంలో పడుకొని వుంది. గోవిందు వచ్చిన అలికిడికి లేచి కూర్చుంది. గోవిందు వెళ్లి మంచంలోనే ఆమెకు కొంచెం దూరంలో కూర్చున్నాడు.

‘వరాలూ! ఆ రోజు అనవసరంగా నిన్ను తిట్టినాను. కానీ నాకు తెల్సు, మన సమాజంలో ఆడపిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే పెళ్లిళ్లవుతాయి. జరిగిందాంట్లో నీ తప్పేం లేదు’  ప్రశాంతంగా ఉందతని గొంతు. తలవాల్చుకునే కూర్చోనుంది వరలక్ష్మి.

‘ఆరోజు ఆవేశంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇప్పటికీ నా ఆలోచన మారలేదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే పూర్తిగా నువ్విష్టపడితేనే. లేదంటే నువ్వు నారాయణతోనే కాపురం చేయడానికి ఇష్టపడితే చెప్పు. నే వెళ్లి అతనితో మాట్లాడి ఇకనైనా బుద్ధిగా ఉండమని చెప్పి తీసుకొస్తాను.’

‘లేదు మామా! నేనింక వానితో కాపురం చేయను!’ ఖచ్చితంగా అంది వరలక్ష్మి అతని మాటలకడ్డుపడుతూ.

‘మరి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?’

తలొంచుకుంది వరలక్ష్మి.

‘చెప్పు వరాలూ’

‘ఎట్లా కుదురుతుంది మామా. నేను ఓసారి పెళ్లయినదాన్ని’ సంశయంగా అందామె.

‘అయితేనేం నా మీద మనసునిండా ఇష్టమున్నదానివి! భార్యా భర్తల బంధానికి కావాల్సింది ఒకరిపై ఒకరికి ఇష్టమేనే, కాదంటావా!’ అంటూ ఆమె భుజం మీద చేయివేసాడు.

అవునన్నట్లుగా తన భుజం మీది చేతిని గట్టిగా పట్టుకుంది వరలక్ష్మి. ఇంక ఆ చేయిని ఎప్పటికీ విడవకూడదనుకుంది. త్వరలోనే గోవిందు వరలక్ష్మి భార్యభర్తలయ్యారు. వరలక్ష్మి తల్లి తండ్రులు అడ్డు చెప్పలేకపోయారు.

పెళ్లయ్యాక గోవిందు తన తిరుగుడు తగ్గించుకుంటాడేమో అనుకున్నారు వరలక్ష్మి తల్లిదండ్రులు. కానీ అతని తిరుగుడు మరింత ఎక్కువయింది. ఇంటి దగ్గర ఉండే రోజులు తక్కువయిపోసాగాయి.

ఓసారి వరలక్ష్మి తల్లి ‘వరాలూ! మొగుడ్ని కొంగుకు కట్టేసుకోవడం ఆడదాని చేతిలోనే ఉంటదే. నువ్వే ఎట్లయినా నచ్చజెప్పి వాడి తిరుగుడు తగ్గించవే’ అని చెప్పింది.

కానీ వరలక్ష్మి ఆమె మాటల్ని చెవిన బెట్టలేదు. భర్తంటే బాగా గురి ఏర్పడింది వరలక్ష్మిలో. అతనేం చేసినా మంచే చేస్తాడు. అతను చేసేదానికి సహకరించాలే గానీ అడ్డు చెప్పకూడదు అనుకుందామె. అతనింట్లో ఉండేది తక్కువే అయినా ఉన్న సమయంలో ఆమెతో ప్రేమగా మాట్లాడేవాడు. మార్దవమైన గొంతుతో అతను చెప్పే కబుర్లు ఇష్టంగా వినేది. ఆమె చేసే పనుల్లో అతనూ సాయం చేసేవాడు. ‘అబ్బా! నువ్వు కూర్చో మామా నే చేస్తా గదా’ అని ఆమె అడ్డుచెప్తున్నా పట్టించుకునేవాడు కాదు.

గోవిందు క్రమంగా ఆమెను ‘వే’ అనడం మానేసాడు. ‘వరా’ అని పిలిచేవాడు. ‘ఏదీ మళ్లీ పిలువు’ అని అడిగి మళ్లీ మళ్లీ పిలిపించుకుని, అతను పిలుస్తూ వుంటే గల గలా నవ్వేదామె.

ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ వేధించే నారాయణతో గడిపిన జీవితానికీ, ఇంట్లోఉండేది తక్కువయినా ఇద్దరి మనసులూ పెనవేసుకుపోంయినా ఇప్పటి జీవితానికి పోలికే లేదనుకునేది వరలక్ష్మి.

గోవిందు తరచూ ఇంటికి ఎవర్నో ఒకర్ని తీసుకొచ్చేవాడు. ఒక్కోసారి ముగ్గురు నల్గురు కూడా వచ్చేవాళ్లు. వాళ్లు రాగానే స్నానానికి నీళ్లు కాచేది. ఉన్నంతలో వండి వడ్డించి కొసరి కొసరి తినిపించేది. వాళ్లెవరో ఏమిటో తెలియకపోయినా గోవిందుకోసం వాళ్లకి మనస్పూర్తిగా చేసేది. అందరూ ఆమెను ‘అక్కా’ అని పిలిచేవాళ్లు. పెద్దన్న అనే ఆయన మాత్రం ‘ఏమ్మా!’ అని పిలిచేవాడు. వరలక్ష్మి అందర్ని ‘అన్నా’ అని పిలిచేది. ఒక్కోసారి రాత్రి తిని పడుకున్నాక నలుగురయిదుగురు వచ్చే వాళ్ళు. అందర్నీ ప్రేమగా పలకరించి వంట మొదలెట్టేది. ఆమె వంట చేస్తున్నంత సేపూ వాళ్లంతా కూర్చుని మాట్లాడుకునేవాళ్లు. వంట ముగించి పిలవగానే వచ్చి తిని మళ్లీ కూర్చుని మాట్లాడుకునేవారు. ‘బాగా శ్రమ ఇచ్చినామక్కా’ అనేవాళ్లు. ‘అయ్యో! ఏముందిలే అన్నా’ అనేది వరలక్ష్మి. వాళ్లు కూర్చొని మళ్లీ మాట్లాడుకుంటుంటే తను వెళ్లి పడుకునేది. వరలక్ష్మి తల్లికి వాళ్లు రావటం ఇష్టం లేదు కాబట్టి చిన్నసాయం కూడా చేసేది కాదు.

ఎప్పుడో తెల్లవారు జామున గోవిందు పక్కనే పడుకుంటున్న అలికిడికి మెలుకువ వచ్చి ‘పోయినారా వాళ్లు?’ అని అడిగేదామె.

‘ఆ! పోయినారు. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాం కదూ’ అనో ` ఇదే అర్థం వచ్చే మరో మాటో మాట్లాడేవాడు గోవిందు.

‘ఛ! ఇబ్బందేముంది, పాపం రాత్రంతా నిద్రపోలేదు కదా పడుకో!’ అనేదామె.

ఓ రోజు మధ్యాహ్నం వరలక్ష్మి పొయ్యి ఊదుతూ ఉంది. పచ్చికట్టెలు మండక ఇబ్బంది పెడుతున్నాయి. గోవిందు వచ్చి పక్కనే కూర్చుని ‘ఇటియ్ నేనూదుతాను’ అంటూ పొయ్యి ఊదే గొట్టం చేతిలోకి తీసుకున్నాడు.

‘అబ్బా! ఉండు మామా! రాగానే ఎందుకీ పని నీకు, కూర్చో’ అంది.

ఆమె మాటల్ని వినిపించుకోకుండా మాటలు మొదలు పెట్టాడు. ఇంక తనకి చెప్పి లాభం లేదని కూరగాయలు తరుగుతూ కూర్చొని వినసాగింది వరలక్ష్మి. తన మాటల్తో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడతడామెకు. అబ్బురంగ వినసాగింది. ఆమెకు అర్థం కాని విషయాలను మళ్లీ మళ్లీ అడిగింది.

వాళ్ల మాటల్లో అన్నం కుత కుత ఉడకసాగింది. ఆమె లేచి ‘నువ్వు జరుగు మామా! నేను గంజి వార్చేస్తా!’ అంది.

గంజి వార్చేసి కూరగిన్నె పొయి మీద పెడ్తూ ‘అవును మామా, ఈ మధ్య మనోళ్లు రాలేదే!’ అడిగింది. ఈ మధ్యకాలంలోనే వాళ్లను ‘మనోళ్లు’ అని అంటోంది వరలక్ష్మి.

‘ఇటువైపు రాలేదులే ఈ మధ్య’

‘పెద్దన్నను చూడక ఎన్ని రోజులయిందో’ వరలక్ష్మికి పెద్దన్నంటే ప్రత్యేకాభిమానం. ఉన్నట్టుండి గోవిందు ‘మనోళ్లందరూ నిన్ను బాగా మెచ్చుకుంటారు తెల్సా’ అన్నాడు.

‘నన్నా! ఎందుకు?’ ఆశ్చర్యంగా అడిగింది.

‘నువ్వు మనోళ్లందర్ని బాగా చూసుకుంటావని, ప్రేమగా తిండి పెడ్తావని.’

‘ఆ తిండి పెట్టేది కూడా గొప్పేనా!’ అంది. ఆమె మొహంలో సిగ్గూ సంతోషవూ కలగలసి పోయాయి.

‘ఎందుక్కాదు ఒక్కోసారి చిన్న పనులు కూడా విప్లవానికి పెద్ద సాయం చేస్తాయి’

‘అంటే, నేనిప్పుడు విప్లవానికి సాయం చేస్తున్నట్టేనా!’

‘ఓ బ్రహ్మాండంగా చేస్తున్నావు’

తళుక్కున మెరిసాయామె కళ్లు. మెరిసే ఆమె కళ్లను మురిపెంగా చూసాడు గోవిందు.

ఓ రోజు సాయంత్రం తండ్రి పొలం నుంచి వస్తూనే ‘వాన్ని కాస్త ఇంటిపట్టున ఉంటూ చేని పనులు పట్టించుకోమని చెప్పమని చెప్తూనే ఉన్నాం. ఏనాడైనా మా మాట చెవిన బెట్టినావా నువ్వు’ అన్నాడు వరలక్ష్మితో. అతని గొంతులో కోపం ఆందోళన కలగలసి ఉన్నాయి.

‘అబ్బ! ఏంది నాయినా వస్తూనే మొదలు పెట్టినావు. అయినా మామ అస్సలు పొలం పనులే పట్టించుకోనట్టు మాట్లాడుతున్నావే. కోతలు నాట్లు తనే కదా చూసుకుంటాడూ…’

‘నువ్వట్ల వెనకేసుకు రాబట్టే వాడట్లాతయారవుతున్నడు. ఊళ్లో అందరూ ఏమనుకుంటున్నారో తెల్సా. పోలీసులు గోవిందు కోసం వెతుకుతున్నారట, దొరికితే పట్టుకుంటారట, వాళ్ల చేతుల్లోకి పోతే యమనోళ్ల చేతిలోకి పోయినట్టే గదే!’

నిలువెల్లా వణికిపోయింది వరలక్ష్మి ‘ఎవరన్నారు నాయినా!’

‘అందరూ అనుకుంటూనే ఉన్నారు’ అన్నాడాయన.

గుమ్మంలో కూలబడింది వరలక్ష్మి. పక్కనే వాళ్లమ్మ కూర్చొని అనునయంగా ‘నేను చెప్తూనే ఉన్నా గదే. ఆడు జేసేవేవన్నా కూడుబెట్టే పనులా!

ఇప్పుడంటే మా వంట్లో ఓపికుంది, చేస్తున్నాం. ముందు ముందు మీరు చేసుకోవాల్సిందే కదా. ఇట్ల తిరుగుతే ఎట్ల చెప్పు. నువ్విప్పుడు కడుపుతోనున్నవు. బిడ్డలు పుడితే ముందు ముందు కర్చులు పెరుగుతాయి. నా మాట విని వాడికి నచ్చ జెప్పు. వాడు నీ మాట ఖచ్చితంగా వింటాడు’ చెప్పింది.

‘వస్తాడా రాత్రికి’ అడిగింది కూతుర్ని.

వస్తాడన్నట్లుగా తలూపింది వరలక్ష్మి.

‘వస్తే ఈ రాత్రికే అడుగు’ నొక్కి చెప్పిందామె.

మళ్లీ తలూపింది వరలక్ష్మి.

రాత్రి తొమ్మిది వరకూ చూసి వరలక్ష్మి అమ్మా నాయన తిని పడుకున్నారు. వరలక్ష్మిని తినమంటే ‘మామొచ్చాక తింటానంది.’

ఆలోచిస్తూ కూర్చుంది వరలక్ష్మి.  ‘మామనెందుకు పట్టుకపోతారు? మామతో పాటు ఇంటికొచ్చే వాళ్లయితే రహస్యంగా  ఉంటారట. వాళ్లను చూస్తే పోలీసులు పట్టుకుంటారని మామ చెప్పినాడు. కానీ మామ బయటే ఉంటాడు కదా తనేం చేస్తున్నాడని పోలీసులు పట్టుకుపోతారూ…’

ఆలోచనలకు అంతరాయం కల్గిస్తూ పదిన్నరకు గోవిందు వచ్చాడు. వాకిట్లో కూర్చున్న భార్యను చూసి ‘అరె! నువ్వింకా పడుకోలేదా? ఎందుకిట్ల చలిలో కూర్చున్నావు’ అంటూ భుజం పట్టి లేపాడు.

‘అదింకా అన్నం కూడా తినలేదురా నువ్వొచ్చినంకనే తింటాననింది’ అప్పుడే మెలుకువొచ్చిన వరలక్ష్మి తల్లి చెప్పింది.

‘అవునా! నేను తొందరగా వస్తానని చెప్పినాను కదా. కానీ పొద్దుపోయింది. పక్కూర్ల తినేసి వచ్చినాను’ అంటూ భార్యని వంటింట్లోకి తీసికెళ్లి గబగబా పళ్లెం కడిగి అన్నం కూర వేసుకొచ్చి తినమంటూ ఆమె ముందర పెట్టాడు.

‘ఉహూ! నా కొద్దు మామా’

‘అరే! అన్నం తినకపోతే ఎట్లా? ఉండు నేను ముద్దలు పెడతా’ అంటూ అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టసాగాడు.

తింటున్న వరలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాత్రి పొద్దు పోయినంక తాగొచ్చి పెళ్లాల్ని చావబాదే మొగుళ్లని చూసింది గానీ ఇట్ల అన్నం తినిపించే వాళ్లని గురించి కనీసం ఎప్పుడూ వినలేదామె. అతను పెట్టినదంతా బుద్ధిగా తినింది. ‘నువ్వూ కొంచెం తిను మామా’ అనడం కూడా మరిచిపోయింది.

వరలక్ష్మి తినడం పూర్తయిన తర్వాత పడుకోవడానికి మంచం పరిచాడు.

‘వరాలూ, మంచినీళ్లు తేవే’ పిలిచింది తల్లి.

మంచినీళ్లు తీసికెళ్లిన వరాలుతో ‘వరాలూ, ఇప్పుడే వాడికి నచ్చజెప్పు’ గుసగుసగా చెప్పింది.

వరాలు మంచం దగ్గరకు వెళ్లేప్పటికి దుప్పటి కప్పుకుంటూ ఆవులిస్తున్నాడు భర్త. అతని మొహం చూస్తే జాలనిపించింది. ‘ఇప్పుడు మాట్లడ్డం ఎందుకు రేపు పొద్దున మాట్లాడొచ్చులే’ అనుకుని దీపం తగ్గించి మంచంలో కూర్చొని అతని నుదుటిపై చేయివేసి ‘నిద్రపో మామా! ఎక్కడెక్కడ తిరిగినావో’ అంది.

‘నువ్వు పడుకో నువ్వింత రాత్రి వరకూ మేలుకోకూడదు’ అన్నాడతను. వరలక్ష్మి తల్లి ఈ మాటలు విని తలకొట్టుకుంది.

రెండు మూడు గంటలు నిద్రపోయారో లేదో తలుపు బాదిన చప్పుడయితే ఆదెమ్మ తలుపు తీసింది. ఎదురుగా పోలీసుల్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయామెకి. ‘గోవిందేడే’ అంటూ గది నాల్గు మూలలా చూసారు. రెండు గదుల ఇంటిని వెతకడానికి ఎంతోసేపు పట్టలేదు వాళ్లకు. ఇల్లంతా గోలగోలగా మారడంతో వంటింట్లో పడుకున్న గోవిందు కళ్లు తెరిచి అప్రయత్నంగా నిద్రమత్తులోనే మంచం దిగాడు. మరుక్షణం పోలీసులు వచ్చి కొట్టుకుంటూ లాక్కెళ్లారు. జరిగిందేమిటో అతనికర్థం అయ్యేలోగానే అతని వళ్లు హూనమయింది. కళ్లు తెరిచిన వరలక్ష్మికి భర్తను కొడుతూ లాక్కెళ్తున్న దృశ్యమే కనబడింది. గబుక్కున మంచం దిగి ‘అయ్యో! మా మామను కొట్టొద్దు’ అంటూ వెనకాలే పరుగెత్తింది. ఆమె తల్లిదండ్రులు కూడా ‘అయ్యా! మావోన్ని ఏమనొద్దు’ అంటూ కాళ్లా వేళ్లా బడ్డారు.

‘అరేయ్‌, వాళ్ల నింట్లోనే వుంచి తలుపు లేసేయండిరా’ ఆదేశించాడు ఎస్‌.ఐ. ` వాళ్లని బయటకు రాకుండా తలుపులేసి గోవిందును కొట్టుకుంటూ గుద్దుకుంటూ తీసికెళ్లారు.

ఇంట్లో ఉన్న ముగ్గురూ కొట్టుకొని మొత్తుకొని ఏడుస్తుంటే ఇరుగు పొరుగు వచ్చి తలుపు తీసారు. వీళ్ల ఏడుపుల్లో, వాళ్ల ఓదార్పుల్లో, మరికొందరి వ్యాఖ్యానాల్లో తెల్లవారిపోయింది. ఇంతలో ఎవరో మోసుకొచ్చారు వార్త. ఊర్లో మరో నలుగురయిదుగుర్ని పట్టుకున్నారట. అందర్నీ గ్రామ పంచాయితీ ఆఫీసులో వేసి కొడుతున్నారట. అందరూ పరుగెత్తారక్కడికి. లోపల్నుండి దెబ్బలు తింటున్న వారి అరుపులు, బయట వారి సన్నిహితుల ఏడుపులు వేడుకోళ్లు. వాళ్లని బయటకు రానీయరు. వీళ్లని లోపలికి పోనీయరు. ఇరువైపుల మధ్య ఖాకీల సాయుధ సరిహద్దు. వాతావరణం హృదయ విదారకంగా ఉండింది. ఆరోజంతా కొడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం కోడికూర వండించుకుని బాగా తిని తాగారు. సాయంత్రం కొట్టినవాళ్ల సంబంధీకుల దగ్గర డబ్బులు తీసుకొని జీవచ్ఛవాలుగా మారిన వాళ్లందరినీ వదిలేసి ‘మళ్లీ అన్నల్తోని తిరిగినారంటే కాల్చి పడేస్తాం’ అని బెదిరించి వెళ్లిపోయారు పోలీసులు. తమ వాళ్లను విడిపించుకోవడానికి వంటి మీద ఉన్న, కాస్త నగలు కుదువబెట్టిన వాళ్లూ ఉన్నారు.

దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న గోవిందును ఇంటికి తీసుకు వచ్చారు. డాక్టర్‌ని తీసుకొచ్చి వైద్యం చేయించారు. వేడి నీళ్లతో వొళ్లంతా తుడిచి కాపడం పెట్టారు. రాత్రంతా బాగా జ్వరం వుంది. మూల్గుతూ ఉన్నాడతడు. డాక్టరిచ్చిన మాత్రలు వేస్తూ వేడి వేడి పాలు తాగిస్తూ ముగ్గురు మంచం చుట్టూ కూర్చునే వున్నారు.

రెండో రోజు జ్వరం తగ్గి కళ్లు తెరిచాడతడు. కళ్లు తెరవగానే మంచం దగ్గర కూర్చుని   ఉన్న వరలక్ష్మి మంచంపట్టెమీద తల ఆనించి ‘మామా!’ అంటూ ఏడ్చింది.

‘ఊరుకో వరా!’ నీరసంగా అంటూ ఆమె తలమీద చేయివేసి ఓదార్చాడు గోవిందు. వారం రోజుల్లో దాదాపు కోలుకున్నాడు గోవిందు. ఇంక ఇంటిపట్టునే ఉంటాడని అందరూ ఆశించారు. కానీ గోవిందు మునుపటికంటే ఇంటికి రావడం బాగా తగ్గించాడు.

‘నువ్విట్లా తిరిగితే ఎట్లా మామ’ ఓసారి అడిగింది వరలక్ష్మి.

‘నేను చేస్తున్నది తప్పా వరా!’ అన్నాడతడు.

‘లేదు మామా! నువ్వు చేస్తున్నది తప్పని అనను కానీ…’ ఏం మాట్లాడాలో తోచలేదామెకు. కొన్ని రోజులు గడిచిపోయాయి. వరలక్ష్మికి పాప పుట్టింది.

గోవిందుని మరో రెండు సార్లు పోలీసులు పట్టుకున్నారు. మూడోసారి కేస్‌ కూడా పెట్టారు. రెండు నెలలు జెయిల్లో ఉండి బెయిల్‌ మీద విడుదలయ్యాడు. ఓ రోజు రాత్రి పాపకు పాలిచ్చి నిద్రబుచ్చి ఉయ్యాల్లో వేసి మంచం దగ్గరకు వచ్చింది వరలక్ష్మి. ఆలోచిస్తూ మంచంలో కూర్చొని వున్నాడు గోవిందు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చాడా రోజు.

‘ఏంది మామ ఆలోచిస్తున్నావు’ అడిగింది వరలక్ష్మి.

ఆలోచనల నుండి బయటపడ్తూ ‘కూర్చో వరా’ అన్నాడతడు. అతని గొంతు కొత్తగా ధ్వనించింది. కొద్దిసేపు మాట్లాడ్డానికి ఇబ్బంది పడ్డాడు. మెల్లగా మాటల్ని కూడతీసుకుంటూ మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

‘వరా! నువ్వర్థం చేసుకుంటావనే ఆశతో చెప్తున్నా…’ భారంగా ఉందతని గొంతు.

‘ఏంది మామ’ ఆందోళనగా వుందామె గొంతు.

‘నువ్వు చూస్తూనే వున్నావు ఇప్పటికి మూడుసార్లు నన్ను పోలీసులు పట్టుకున్నరు. ముందు ముందు ఏం చేసినా చేస్తరు. అందుకే నేనిక మీదట ఇంటికి రాను.’

‘ఇంటికి రావా? అంటే…’ ఏం మాట్లాడాలో తోచలేదామెకు గొంతు జీరబోయింది.

‘నేను దళంలో పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక మీదట నేను దళంలోనేఉంటా.’

‘దళంలో ఉంటావా? అంటే నన్నూ బిడ్డనూ అన్యాయం చేస్తావా?’ ఏడుస్తూ అడిగిందామె.

‘మీకు అన్యాయం చెయ్యాలని నాకే కోశాన లేదు వరా! పోలీసులు బయట నన్ను బతుకనీయరు. పార్టీవొదిలేసి నేనూ బతుకలేను. నన్నేం చేయమంటావు చెప్పు. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు పార్టీలో పని చేయటమంటే ఏమిటో నాకు స్పష్టంగా తెలియదు. అందుకే నిన్ను చేసుకొని అన్యాయం చేసాను. బహుశా నాకప్పుడే తెలిసుంటే నిన్ను చేసుకునే వాడిని కాదు…’

రెండు చేతులతో అతన్ని చుట్టేసి ‘అంత మాటనకు మామ, నాకు నువ్వేం అన్యాయం చేసినావు? నిన్ను చేసుకున్న తర్వాత నేను సంతోషంగా ఉన్నాను కదా…’ అంది. ఆమెకింకా చాలా చెప్పాలనిపించింది. మాటలు దొరకలేదు. గొంతు పెగల్లేదు. కొద్దిసేపాగి ‘మరయితే మమ్మల్ని కలువవా? నన్నెట్ల మర్చిపోతావు మామా!’

‘నిన్నెట్ల మర్చిపోతాను వరా! నిన్ను రోజూ గుర్తు తెచ్చుకుంటా. మిమ్మల్నందర్నీ కలుస్తా, అయితే రహస్యంగా కలుస్తా’ ఆమె వీపు నిమురుతూ అన్నాడతడు.

‘అట్లా కలువొచ్చా?’

‘ఎందుకు కలువగూడదూ’ అంటూ వివరించాడు గోవిందు.

‘మరయితే ఎన్ని రోజులకోసారి కలుస్తవు’

చిన్నగా నవ్వి ‘నువ్వెప్పుడు కలువమంటే అప్పుడు కలుస్తా’ అన్నాడు.

‘అమ్మా నాయనకేమని చెప్పాలి?’

‘నువ్వే తర్వాత మెల్లగా చెప్పు. ఇప్పుడు చెప్తే గొడవ చేస్తారేమో’ అన్నాడు.

‘కోపమొస్తోందా నా మీద?’ అన్నాడతను.

‘ఉహూ!’

‘బిడ్డను బాగా చూసుకో. దానికి తల్లిప్రేమను తండ్రి ప్రేమను నువ్వే అందించాలి.’

అతని గొంతు జీరబోయింది.

మళ్లీ ఏడ్చింది వరలక్ష్మి.

అతను దుఃఖాన్ని ఆపుకుంటూ ‘వరా! నువ్వేడవొద్దు నువ్వు ధైర్యంగా పంపిస్తేనే నేనక్కడ సంతోషంగా ఉంటా.’

వాళ్ల మాటల్లో… వాళ్ల దుఃఖంలో … వాళ్ల ఓదార్పుల్లో నాలుగైదు గంటలు దొర్లిపోయాయి. తెల్లవారు జామున మూడు గంటలకు మంచంలో నుండి లేచి ‘నేనిక పోయివస్తా వరా!’ అన్నాడు.

‘ఇంత రాత్రిలో పోతావా ఇంకో గంటాగి పోవచ్చుగా’ జీరగొంతుతో అంది వరలక్ష్మి.

‘ఉహూ! ఇప్పుడు పోతేనే దళం కాంటాక్ట్‌ను అందుకుంటా’ అంటూ ఉయ్యాల్లో పాపను చూసి చేత్తో తడిమి ముద్దుపెట్టుకొని భార్యకేసి చూసి వస్తానంటూ వడివడిగా బయటకడుగులేసాడు. ఇంకాసేపుంటే అక్కడే ఏడ్చేస్తాడేమోననే అనుమానంతో వేగంగా బయటపడ్డాడు. ఓ పదినిమిషాలు కన్నీళ్లు తుడుచుకుంటూనే నడిచాడతను.

అతనటు వెళ్లగానే మంచంలో వాలిపోయివెక్కి వెక్కి ఏడ్చింది వరలక్ష్మి. భర్త తనకు అన్యాయం చేశాడా అని ప్రశ్నించుకుంది. ఎంత ఆలోచించినా భర్త తనకన్యాయం చేసాడనిపించలేదామెకు. ‘నాకన్యాయం చేయాలని మామ అనుకోలేదు’ అనుకుంది. పోలీసులను కసి తీరా తిట్టుకుంది. ‘ఎవరికి ద్రోహం చేసినాడని పట్టుకొని తన్నినారు? పోలీసుల భయమే లేకుంటే మామ ఇట్లా నన్ను వదిలిపోయేవాడే కాదు’ అనుకుంది.

నాలుగైదు రోజులకు వరలక్ష్మి తల్లిదండ్రులకు చెప్పింది. వరలక్ష్మి తల్లి గోవిందుని శాపనార్థాలు పెట్టింది. కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసాడంది. ‘అమ్మా! ఊరుకో మామనేమనొద్దు. తనేం చేసిండు, నారాతే ఇట్లుంది గానీ’ అరిచింది వరలక్ష్మి.

‘మొదట్నుంచీ వాన్నొక్క మాట అననీయకుండా నువ్వింతకాడికి చేసుకున్నావే’ కోపంగా అంది వాళ్లమ్మ.

‘ఇప్పుడు నాకే కదా బాధ నువ్వు గమ్మునుండు’ కసిరింది తల్లిని.

గోవిందు దళంలో చేరి రవిగా మారి రెండు సంవత్సరాలయింది. ఆ రెండు సంవత్సరాల్లో భర్తను అప్పుడప్పుడూ కల్సింది వరలక్ష్మి. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. రెండు మూడు సార్లు పోలీసులు వచ్చి ప్రశ్నించారు. ‘జాడే తెలియదయ్యా’ అని అమాయకంగా చెప్పింది.

ఓసారి వరలక్ష్మి వెళ్లినపుడు దళం దగ్గర పెద్దన్న ఉన్నాడు. పెద్దన్నను చూసి చాలా సంతోషపడింది. తను వెళ్లిన రెండో రోజు సాయంత్రం వంటరిగా కూర్చొని పత్రిక తిరగేస్తోందామె.

‘ఏమ్మా, చదువుతున్నావా?’ అంటూ పెద్దన్న వచ్చి పక్కన కూర్చున్నాడు.

అవునన్నట్లుగా నవ్వింది వరలక్ష్మి.

‘ఇంటి దగ్గర చదువుతుంటావామ్మా’

‘అప్పుడప్పుడు చదువుతానన్నా’

ఓ అరగంటసేపు అదీ ఇదీ మాట్లాడి ‘ఏమ్మా, నువ్వు బయట రవి లోపల ఇట్లా కలవడం ఇబ్బందిగా లేదా?’ అడిగాడు.

‘ఇబ్బందిగానే ఉంది’ సిగ్గుగా నవ్వింది వరలక్ష్మి.

‘ముందు, ముందు పోలీసుల నుండి కూడా నీకు వత్తిడి పెరుగుతుంది కదా’

‘అవునన్నా ఇప్పటికే అడుగుతున్నారు’

‘ఇద్దరూ ఒక చోట వుంటే ఈ బాధలు ఉండవు కదమ్మా’

‘నిజమే కానీ ఎట్లా కుదురుతుందన్నా’

‘కుదిరే మార్గం ఒకటుందమ్మా’ పెద్దన్న పెదవులపై కొంటె చిరునవ్వు.

‘ఏంటన్నా అది’ ఆశ్చర్యంగా అడిగింది.

‘నువ్వు కూడా దళంలోకొస్తే ఇద్దరు కలిసే ఉండొచ్చు కదా’

‘నేనా!’ మరో మాట రానంత ఆశ్చర్యం ఆమె మొహంలో.

‘అవును నువ్వే, నిన్ను పార్టీ గమనిస్తూనే వుంది. నీలో సిన్సియారిటీ వుంది. పార్టీ పట్ల అభిమానమూ ఉంది. మరి నీలాంటి వాళ్లు దళాల్లోకి రాకపోతే ఎట్లమ్మా?’

‘అన్నా, కానీ… నాకయోమయంగా వుంది’

చిన్నగా నవ్వాడు పెద్దన్న. ‘తీరిగ్గా ఆలోచించుకోమ్మా. పార్టీ ప్రపోజల్‌ నీ ముందు పెట్టాన్నేను. మళ్లీ మనం రేపు కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం. నీకున్న సందేహాలు, అనుమానాలు అన్నీ రేపు మాట్లాడుకుందాం’ అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయాడు పెద్దన్న.

ఆ రోజు రాత్రి రవి అడిగాడు ‘ఏమని చెప్పినావు పెద్దన్నకు’ అని.

‘ఏమని చెప్పాలి?’

‘అరె! నన్నడుగుతావే నువ్వే ఆలోచించుకో’

‘అదికాదు నేనేం చేయగలుగుత దళంలో’

‘ఎందుకు చేయలేవు’

‘నాకు మీ అందరిలాగ రాజకీయాలు మాట్లాడేది వస్తుందా?’

‘నేర్చుకుంటే అదే వస్తుంది’

‘కానీ ఆడవాళ్లకు కష్టం గదా’

‘ఇప్పుడు చాలామంది అక్కలు అన్నలతోటి పోటీపడుతున్నారు’

‘మరయితే మన చిన్నతల్లి సంగతి’

‘అమ్మ చూసుకుంటుంది గదా, మనదాంట్లో పిల్లలను వదిలొచ్చిన అక్కలుకూడా ఉన్నారు.’

‘నిజమా!’

‘నేనబద్ధం చెబుతానా? పెద్దన్న భార్య కూడా పార్టీలో పనిచేస్తోంది. ఆమె బాబునొదిలిపెట్టి వచ్చింది. తొందరేం లేదు. నువ్వు టైం తీసుకోని ఆలోచించుకో’ అంటూ ఆవులించి కళ్లు మూసుకొని పడుకొన్నాడు. కొద్ది సేపట్లోనే సన్నగా గురక పెడ్తూ నిద్రపోయాడతను.

కానీ ఆ రాత్రి వరలక్ష్మి నిద్రపోలేదు.

రెండోరోజు పెద్దన్న వివరంగా మాట్లాడాడు. వరలక్ష్మి తన సందేహాలన్ని వెలిబుచ్చింది. అన్నింటికి ఓపిగ్గా చెప్పాడతను. నెలరోజులు గడువు పెట్టి ఆలోచించుకోమని చెప్పాడు. వరలక్ష్మి మరో రెండు రోజులుండి ఇంటికి బయల్దేరింది.

ఇంట్లో గడిపిన నెలరోజులు రకరకాలుగా ఆలోచించింది. అనేక విధాల ఘర్షణ పడింది. ‘అమ్మో! బిడ్డనొదిలి నేనుండగలనా? తల్లిదండ్రీ ఇద్దరూ లేక బిడ్డేమవుతుంది’ అనుకుంది. ‘కానీ దళంలోకిపోతే మామతో కల్సుండొచ్చు. ఇంటిదగ్గర ఉండి తనెలా ఉన్నాడోనని రోజూ ఆదుర్దా పడేకంటే తనతోటే ఉంటే’ అన్ని రకాలుగా ఆలోచించి చివరకు తన రెండున్నర సంవత్సరాల కూతుర్ని తల్లి చేతిలో పెట్టి ఓ వేకువ జామున ఇప్పటికి సరిగ్గా ఏడేళ్ల క్రితం అడవి దారి పట్టింది వరలక్ష్మి.

దళంలో చేరిన వరలక్ష్మి శోభగా మారింది. మొదట్లో భర్తకు నీడలా ఉండేదామె. అతని సొంతపనులు కూడా చేస్తూ ఉండేది.

‘శోభక్కా! అన్న పనులు అన్న చేసుకుంటాడు నువ్వెందుకు చేస్తావు’ అనే వాళ్లు మిగతా దళ సభ్యులు.

‘అరె! వీళ్లు ప్రతిదాన్ని పట్టించుకుంటారే ఆయన పని నేను చేస్తే తప్పేంది! వీళ్లకేం తెల్సు ఆయన నాకెంత మంచి బతుకిచ్చాడో! వీళ్లకేం తెల్సు మా ఇద్దరి అనుబంధం గురించీ’ అనుకునేది.

భర్త మీద విమర్శలు పెట్టేది కాదు. ‘అక్కా, రవన్న మీద విమర్శలేమన్నా చెప్పు’ అని కమాండర్‌ అడిగితే ‘ఛ! ఆయనమీదేముంటాయి’ అనుకునేది. రవిని ఇంకెవరు విమర్శించినా భరించేది కాదు. చాలా బాధపడేది. విమర్శలు పెట్టిన వాళ్ల మీద కోపాన్ని పెంచుకునేది.

క్రమంగా ఆమె తన వ్యక్తిత్వాన్ని పెంచుకుంది. దళ ఏరియా కమిటీలో మెంబరయింది.

రవి క్రమంగా ఎదిగి జిల్లా కమిటీ మెంబరయ్యాడు. అయితే కమిటీలో వచ్చిన కొన్ని విభేదాలను సరిగా అర్థం చేసుకోలేక ఓ నెల క్రితం తానింక ఉద్యమంలో ఇమడలేనని బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భార్య తనను కచ్చితంగా అనుసరిస్తుందని అనుకున్నాడు.

అతడు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత పార్టీ బాధ్యులు శోభతో మాట్లాడారు. సుదీర్ఘంగా చర్చించారు. మొదట ఆమె తట్టుకోలేకపోయింది. బాగా ఏడ్చింది. అనేక రకాలుగా ఆలోచన చేసింది. చివరకు పార్టీ ఆశించినట్లుగానే ఉద్యమంలో కొనసాగడానికే నిర్ణయించుకుంది.

ఇప్పటికి భార్యాభర్తలిద్దరూ రెండుసార్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడిది మూడోసారి.

‘నా గురించి కొంచెం గూడా ఆలోచించవా?’

‘వ్యక్తుల కోసం కంటే సమష్టి కోసం ఆలోచించడం గొప్పదని నువ్వే చెప్పినావు గదా’

‘అప్పుడు నేనే చెప్పిన, ఇప్పుడు నేనే చెప్తున్న మరిప్పుడు వినవేంది’ అసహనంగా ఉందతని గొంతు.

‘అప్పుడు నువ్వు మా నాయకుడివి మరిప్పుడు …’ పూర్తి చేయలేదామె.

‘కానీ అప్పుడూ ఇప్పుడూ నీ భర్తనే! నువ్వు నన్ను భర్తగా ఇష్టపడ్డావా నాయకుడిగా ఇష్టపడ్డావా?’

‘నేను నిన్ను భర్తగానే ఇష్టపడ్డానని అనుకున్నా కానీ తర్వాత అది నిజం కాదని నాకర్థమయింది. నువ్వొక మామూలు భర్తవయితే నిన్ను నేను ఇష్టపడేదాన్నే కాదు. నీకు తెల్సుగా ఓ మామూలు భర్తను నేనెంత తృణప్రాయంగా వదిలేసినానో? నీకు పార్టీ ఇచ్చిన చైతన్యమే లేకుంటే మంచి భర్తగా నువ్వుండేవాడివి కాదు. నేను నిన్ను ఇష్టపడేదాన్ని కాదు. నేను నిన్ను బాగా ఇష్టపడ్డాను. నిన్నింత మంచిగా తయారు చేసింది పార్టీ అని అర్థమయింతర్వాత పార్టీని ఇంకా ఎక్కువ ఇష్టపడ్డాను’

వాళ్ల మాటల్లో ఎప్పుడో పొద్దుకుంకింది.

‘అమ్మా నాయన పెద్ద వాళ్లయిపోతున్నారు. వాళ్లకు బిడ్డను చూసుకోవడం కష్టం కదా. బిడ్డ భవిష్యత్తు గురించయినా నువ్వాలోచించాలి!’

‘మన బిడ్డ భవిష్యత్తు గురించి, ఇంకా ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్లమయితే కచ్చితంగా  ఉద్యమంలోనే పని చేయాలి.’

‘బిడ్డను అనాధగా చేసి ఏం ఉద్ధరిస్తావు నువ్వు! జీవితాంతం కల్సుండాల్సిన భర్తకూ, బిడ్డకూ ద్రోహం చేస్తున్నావు’ కోపంగా అన్నాడతను.

చిన్నగా నవ్వింది శోభ. ఆ నవ్వులో వెటకారం ధ్వనించిందతనికి ‘ద్రోహమా! నేనా!! పెద్దన్నను పోలీసులు చంపేసినపుడు నేనేడుస్తుంటే నువ్వేమన్నావు. ఆయన వారసులం మనమున్నాం. ఆయన కన్న కలల్ని తుదకంటా కొనసాగిద్దాం అని చెప్పినవు గదా. మరి ఆయన అమరత్వానికి ద్రోహం చేయగూడదనే నేను ఉద్యమాన్ని వదిలిపోకూడదనుకుంటున్నా’

‘నేనప్పుడు చెప్పిన మాటల్ని పట్టుకొని నువ్విప్పుడు మాట్లాడకు’

‘ఎందుకు మాట్లాడకూడదు? బహుశా నువ్వు పెదవుల చివర్ల నుంచి ఆ మాటలు చెప్పినావేమో నేను మనసుతో విన్నా. గుండె నిండా నింపుకున్న ఆ మాటల్ని ఎన్నడూ మర్చిపోలేను.’

కోపంగా మాట్లాడి ప్రయోజనం లేదని ‘ప్లీజ్‌ వరా! నా మాట విను’ అనునయంగా అన్నాడు.

‘ఓసారి చెప్పిన గదా! నన్నట్లా పిలవొద్దు నీకు మాత్రమే సొంతమైన వర ఇప్పుడు లేదు. ఇప్పుడీ శోభ ప్రజలందరికీ సంబంధించినది. ఇంక మనం మాట్లాడుకొని ప్రయోజనం లేదు. నాకు సెంట్రీ టైం అయినట్టుంది. వెళ్తా!’ అంటూ లేచి తుపాకి తీసుకొని భుజానికి తగిలించుకొని వెన్నెల దారిలో ప్రవాహానికి ఎదురుగా రాళ్లను తప్పించుకుంటూ చక చకా నడవసాగింది.

(మే-జూన్‌ 2000 అరుణతారలో నిర్మల పేరుతో ప్రచురితం)

Leave a Reply