(ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10తేదీల్లో హైదరాబాదులో జరిగిన ఆలిండియా సదస్సు ప్రసంగం)
అందరికీ లాల్ జోహార్. ఈరోజు ఇంత మందిని చూసి నాలో కాస్త ఆశ కలిగింది. మనం ఎప్పుడూ బస్తర్ గురించే మాట్లాడుతుంటాం, అందరూ దాని గురించే చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఇదే అతి పెద్ద సమస్య.
ఎంతకాలమని చనిపోతూ వుంటాం? ఇలా ఎంతకాలం జరుగుతుంది?
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, దేశానికి వివరించాలి. పోరాటం ఎందుకోసం జరుగుతోంది?
నక్సలిజం అనే ఒక పదాన్ని పదే పదే వాడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల అనుభవంతో నక్సలిజం వేరే సమస్య అని నేను భావిస్తున్నాను. మా సమస్యను ఎంతకాలమని నక్సలిజంతో జోడిస్తారు? ఎంతకాలమని కాల్పులు జరుపుతారు, ఎంతకాలం మహిళల మీద అత్యాచారం చేస్తారు? ఎంతకాలం మా భూములను స్వాధీనం చేసుకుంటారు? ఇలా ఎంతకాలం? నక్సల్ – నక్సల్ అనే చిన్న పదం దొరికింది ప్రభుత్వానికి. నక్సల్స్ అనే సాకు ఎందుకు? ఎంతకాలం?
బ్రిటిష్ వారి పాలనలో ఉన్న ఇంత పెద్ద దేశానికే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇది పెద్ద విషయం కాదు. చర్చలు జరిపితే ఏమైనా జరగవచ్చు, కానీ ప్రభుత్వానికి ఆ సదుద్దేశ్యం లేదు, ప్రభుత్వానికి ఆదివాసీలను నిర్మూలించాలి. ఆదివాసీలను చంపాలని నక్సల్స్ కోరుకోవడం లేదు. ఇలా అంటే సోనీ సోరీ నేరుగా నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతున్నట్లు వారికి అనిపిస్తుంది. నక్సలైట్లు కూడా మనుషులే. నక్సలైట్లు ఎలా తయారయ్యారు? ఎవరు తయారు చేస్తారు? నక్సలైట్లుగా మారేలా తప్పని పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు కల్పిస్తోంది.
ఇప్పుడు నేను నా ఉదాహరణ ఇస్తాను. నేను ఉపాధ్యాయురాలిని. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ఎంతలా చిత్రహింస పెట్టారంటే…. నాతో దౌర్జన్యంగా ప్రవర్తించారు, నా దుస్తులు విప్పదీసారు, కరెంట్ షాక్ ఇచ్చారు, నా మర్మాంగంలో రాళ్ళు దూర్చారు. ఎందుకని ?
నేను ఇక్కడ టీచర్ గా ఉన్నప్పుడు 250 మంది పిల్లలు వుండేవాళ్లు. వారిలో 50 మంది సల్వాజుడుమ్ పీడితులు. అడవిలో వుంటున్నారు. వారికి ఇల్లు లేదు. వారిపై కాల్పులు జరిపారు, ఇళ్లకు నిప్పు పెట్టారు, ఆ సమయంలో చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు? నేను ఒక ఆదివాసీ ఉపాధ్యాయురాలిగా, పిల్లలు అడవిలో ఉంటున్నారని తెలిసి, 30, 40 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళను తీసుకువచ్చాను. వారికి మంచి విద్యను అందించడానికి ప్రయత్నించాను. “మీరు యిప్పుడు మమ్మల్ని తీసుకువెళ్తున్నారు, మాకు ఇల్లు లేదు, మేము ఎక్కడికి వెళ్తాము?” అని వాళ్ళు నాతో అన్నారు. “మీ చేతుల్లో కలం వుంటుంది మిమ్మల్ని ఆత్మ నిర్భరులని చేస్తానని” ఆ పిల్లలకు వాగ్దానం చేశాను. “మీ హక్కుల కోసం, మీ అధికారాల కోసం మీరు పోరాడతారు” అని చెప్పి తీసుకువచ్చాను.
నేను అరెస్టు అయిన తరువాత ఆశ్రమంలో పోలీసులు చాలా గందరగోళం సృష్టించి, పూర్తిగా ధ్వంసం చేసినప్పుడు, పిల్లలు ఈ విషయాలన్నింటినీ చూశారు. విసిగిపోయి వున్నారు. వస్తువులను ధ్వంసం చేయడం కూడా రికార్డు అయింది. నా సమాచారం ప్రకారం 30 మంది పిల్లలు నక్సలైట్లుగా మారారు. ఎందుకు? ప్రభుత్వం సమాధానం ఇస్తుందా? 30 మంది పిల్లలు ఎందుకని నక్సలైట్లుగా తయారయ్యారు?
నేను జైలు నుండి బయటకు వచ్చాక పిల్లలను కలిసినప్పుడు, నా విద్యార్థుల చేతుల్లో తుపాకీలు ఉన్నాయి. వారు నన్ను అడిగారు, “దీదీ, మీరు మా చేతుల్లో కలం ఉంటుందని చెప్పారు. కానీ మా చేతులు చూడండి, కలం లేదు. తుపాకీ ఉంది. ప్రభుత్వం మాకు తుపాకీ ఇస్తుంది కానీ ఎప్పుడూ కలం ఇవ్వదు” అని అన్నారు. చదువు నేర్పించదు. ఆసుపత్రులు పెట్టదు, మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించదు. ఆదివాసీలను చంపడాన్ని గురించి ప్రభుత్వానికి ఏమీ పట్టదు.
ఈ పోరాటం ఎందుకోసమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన ఆదివాసీలకు ఏమి జరుగుతోంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంతోకాలం నుంచి గొంతు చించుకొని చెబుతున్నాం? కానీ, ఎందుకు జరుగుతోంది అనేది అసలు విషయం. మీ అడవిని, భూమిని ఎందుకని లాక్కొంటున్నారు? ఆదివాసీలు బ్రతికి ఉన్నంత కాలం వారు తమ భూమిని ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలి? ఆ అడవి, ఆ భూమి మాది, ప్రాణాలైనా యిస్తాం కానీ వాటిని వదులుకోం. మా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, భరిస్తాం… కానీ ఇవ్వం.
అదానీ గురించి మాట్లాడదాం. అదానీ దేశాన్ని నడుపుతున్నాడు అని అంటారు. అలాంటప్పుడు మా బస్తర్‌లోకి వచ్చి భిక్ష ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు? అదానీ మా దృష్టిలో ఒక బిచ్చగాడు, అధికారానికి, ప్రభుత్వానికి చాలా పెద్దవాడు కావచ్చు, మాకు కాదు. మా కొండల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసే వాడిని మేం ఒక రకమైన బిచ్చగాడిగానే చూస్తాం.
ఇంత పెద్ద దేశాన్ని నడిపించే అదానీ బస్తర్‌లో బిచ్చగాడిగా ఎందుకు వస్తున్నాడు?
ఇప్పుడు మళ్ళీ నంద్‌రాజ్ కొండ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 2018లో మేం నంద్‌రాజ్ కొండ కోసం పోరాడాం; విఫలమయ్యాం. బూటకపు గ్రామసభలు జరిపి తీసుకునేందుకు ప్రయత్నించారు. గ్రామసభలు రద్దు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.
ఈ రోజు మళ్ళీ నంద్‌రాజ్ కొండ మీదకు వచ్చి కూర్చుని, కావాలి అని అంటున్నాడు. ఇప్పుడు అదానీ వచ్చాడు. అదానీ ఎవరు? అదానీకి మా బస్తర్‌కి రావాల్సిన అవసరం ఏమిటి?
ఆరు నెలల శిశువు మీద కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు జరిపారు? ఎందుకంటే ఆ శిశువు తల్లి, అక్కడి ప్రజలు మా చెట్లను నరికివేయవద్దు అని అన్నందుకు. ఆ చెట్లు పండ్లనిస్తున్నాయి, మామిడి పళ్లనిస్తున్నాయి, చింతపండు ఇస్తున్నాయి, మహువానిస్తున్నాయి. ఇవి మా అటవీ జీవన ఆధారం. ఈ విధంగా విధ్వంసం చేసి అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఎవరి అభివృద్ధి? ఆ తల్లి ఆ విధ్వంసాన్ని ఆపటానికి వచ్చింది. మా చెట్లను నరికివేయవద్దని చెప్పడానికి ఆ తల్లి వచ్చింది. అవి మాకు ప్రాణాన్నిస్తాయి. వాళ్ళ మీద కాల్పులు జరిపారు. బిడ్డకు తూటా తగిలింది, తల్లి బతికి వుంది. బిడ్డ చనిపోయింది. చిన్నారిని కాల్చి చంపారు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ ఆరు నెలల శిశువు కూడా ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకని?
ప్రభుత్వం రోడ్ల గురించి మాట్లాడుతుంది. మీరు అభివృద్ధికి వ్యతిరేకులని అంటుంది
ఇంత విశాలమైన రోడ్‌లు ఎందుకు? ఒకేసారి మూడు ట్రక్కులు వెళ్ళచ్చు. అవి ఎటు వైపు వెళ్తున్నాయి? కొండ వైపు. ఇంత పెద్ద రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారు? గ్రామసభల్లో, గ్రామస్థులను అడగండి వాళ్ళకు ఎలాంటి రోడ్లు కావాలో. వారికి ఎలా సౌకర్యంగా వుంటుందో తెలుసుకోవాలి. మా పిల్లల మీద తూటాలు పేల్చి, రోడ్లు కట్టించి, ఆ తర్వాత క్యాంప్ తీసుకువచ్చారు.
అలాగే జరిగింది… పిడియాలో కూడా మనపైన తూటాలు పేలుస్తున్నది కేవలం అక్కడి భూమిని, పెద్ద పెద్ద కొండలను పెట్టుబడిదారులకు ఇవ్వడానికే.
ఒక వైపు దేశవ్యాప్తంగా నక్సలైట్లతో పోరాడుతున్నారు. నక్సలైట్లతో పోరాడటానికి వేలాది లక్షల సైన్యం ఉన్నప్పటికీ, పోరాడుతూనే వున్నారు. ఆదివాసీల మీద కాల్పులు జరుపుతున్నారు, కాల్చి చంపుతున్నారు, ఆ విషయం ఎందుకు బయటకు రాదు?
మీ మధ్య నేను ప్రస్తుత విషయం గురించి మాట్లాడతాను. ఎందుకంటే మన సమాజంలో ప్రతి రోజూ ఏదో ఒక ఘటన జరుగుతుంది. జనవరి నుండి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఇళ్లలోకే కాల్పులు జరిపారు. ఇంట్లో వున్నవారి మీదకు కాల్పులు జరిపారు. రాజే ఓయామ్ పై కూడా ఇంట్లో వున్నప్పుడే కాల్పులు జరిపితే, ఆ మహిళ గాయపడింది.
మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఇంద్రావతి నది పక్కన ఆడుకుంటున్నారు. వారికి ఏమి తెలుసు? నక్సల్స్ పేరిట వారు తమ ల్యాండ్ మైన్‌లు, బాంబులు, అన్ని రకాల పరికరాలను పాతిపెడుతున్నారు. తెలియక అక్కడికి వెళ్ళిన మా ఆదివాసీలు చనిపోతున్నారు. వాళ్ళు అడవికి వెళ్తారు, వ్యవసాయం చేస్తారు, చెట్లు, మొక్కల కోసం వెళ్తారు. వాళ్ళను ఎవరూ ఆపలేరు. పెద్ద పెద్ద పత్రికలలో వార్తలు రాస్తున్నారు నక్సల్స్ అక్కడ బాంబు పెట్టారు, ల్యాండ్ మైన్ పెట్టారు అని. ప్రతిదానిలోనూ నక్సల్స్. ఇద్దరు పిల్లలు తునికాకులను సేకరించి, వాటిని ఎండబెట్టడానికి వెళుతున్నప్పుడు, ఏదో తెల్లటి వస్తువు కనిపించింది. ఆటవస్తువు అనుకుని రాళ్ళతో కొట్టారు. బాంబు పేలింది. ఇద్దరు పిల్లలూ మరణించారు. భయంకరమైన మరణం.
ఇప్పుడు బస్తర్‌లో ఒక కొత్త వ్యూహం నడుస్తోంది. ముద్వేండి, కర్చోలి అన్నిచోట్లా. ఆదివాసీలు ఇన్ని సంవత్సరాలు జీవించలేదా? ఇంతకుముందు ఎప్పుడూ ఫిర్యాదు రాలేదు. ఎవరూ ల్యాండ్ మైన్‌లో చిక్కుకోలేదు. బాంబులు పేలుతున్నాయి. కాలిన గాయాలు అవుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు కొత్త రూపం మొదలైంది. అటవీ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగితే నక్సలైట్లు చేసారంటున్నారు.
నా ఉద్దేశ్యం నక్సలైట్లు అడవిలో వుంటారు. తమ మరణాన్ని తామే ఎన్నుకుంటారా? ఎందుకు వారు అలా చేస్తారు? ఇది పోలీసుల కొత్త వ్యూహం, ఇది ప్రభుత్వ కొత్త వ్యూహం. ముద్వెండిలో ఇంతకుముందెన్నడూ బాంబు పేలుళ్లలో ఎవరూ చనిపోలేదు. ఇన్ని సంవత్సరాల్లో… జరగలేదు. కానీ ఇప్పుడు రెండు మూడు ఘటనల్లో చనిపోయారు. ఇది నక్సలైట్ల పని అని పోలీసులు అంటున్నారు.
నేను పోలీసులను అడిగాను “సార్, ఇన్ని సంవత్సరాలుగా లేదు. మీరు క్యాంప్‌ను ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడ ల్యాండ్ మైన్‌లను పెట్టడం మొదలైంది”అని. “అవును, మీరు మేమే పెట్టామని అంటారు” అని అన్నాడు. అవును మీరే పెట్టారు. అదే అందరూ అంటున్నారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి మరణాలు జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ప్రజలు ల్యాండ్ మైన్‌ల వల్ల మరణిస్తున్నారు?
బస్తర్‌లో చాలా ప్రమాదకరమైన రీతిలో ఈ వ్యక్తులు చేస్తున్నారు. డిఆర్‌జి, బస్తర్ ఫైటర్స్ – ఇవన్నీ ఆటలుగా మారాయి. ఆదివాసీలు తమలో తాము కొట్లాడుకునేలా మంచి పద్ధతి కనిపెట్టారు. పిల్లలకు కూడా నచ్చచెప్పడానికి ప్రయత్నించి అలసిపోయాను. వాళ్ళు అంగీకరించరు. ఆ పిల్లలు నాతో అంటున్నారు “అవకాశం దొరికేతే వెయ్యి ముక్కలు చేస్తాం ఎవరికీ తెలియదు”. వాళ్ళు నా పిల్లలు. వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఈ స్థితికి తీసుకువచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ లో చేసినట్లే ఆ అబ్బాయిల విషయంలో కూడా చేసారు. వారిలో కరుణ, మానవత్వం అంతా పోయింది.
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంలో ఎస్‌పి ఆదివాసీ కాదు కదా; పోలీసు స్టేషన్ లో ఎవరూ ఆదివాసీలు లేరు కదా; కానీ ఆ తుపాకీ పట్టుకునేవాళ్ళు ఆదివాసీలు. అడవిలో వుండే వాళ్ళు ఆదివాసీలు. ఇప్పుడు వారిద్దరూ కొట్లాడేటట్లు చేస్తున్నారు.
ఇటీవల కాంకేర్‌లో 29 మంది మరణించారని మీ అందరికీ తెలుసు. నాలుగు వైపులా చుట్టుముట్టి కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్ అని చెప్పారు. విషయం తెలిసి మేము కూడా అక్కడికి వెళ్ళాం. అక్కడ పన్నెండు లేదా పదమూడు మందిని చంపారు. 17మందిని హత్య చేసారు. పట్టుకొని తీసుకువచ్చిన తరువాత వాళ్ళను కాల్చి చంపారు. మేము కాల్పులు జరపం, జైలుకు పంపిస్తాము అని వారు అంటారు. ఎస్‌పి ఆర్డర్ ఇచ్చాడు డిఆర్‌జికి, “వాళ్ళని సజీవంగా తీసుకురావద్దు. మీకు బహుమతి కావాలి కదా? చంపేసి తీసుకు రండి.” బహుమతి కావాలి. ప్రమోషన్ కూడా కావాలి. వాళ్ళందరినీ చంపేశారు. ఇలా అక్కడ జరుగుతోంది. దానిలో ఎంత బహుమానం ఉంది? ఒక కోటి తొంభై లక్షలు. అక్కడ ఒక చోటనే కాదు. ఈ సమాచారం వచ్చింది. ఇలా ఇస్తే వారు చంపేస్తారు, ఇంకేం చేస్తారు?
50 వేలు ఒకసారి, లక్ష ఒకసారి. ఈ సమాచారం మేము సేకరిస్తున్నాము. కేవలం చంపినందుకు వారు మూడు, నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నారు.
లొంగిపోయిన వారి గురించి చెప్పాలంటే, లొంగిపోయిన వారికి కూడా బహుమానాలు వున్నాయి. బలవంతంగా తీసుకువస్తున్నారు. లొంగిపోయారని చెబుతున్నారు. ప్రతి లొంగుబాటుకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రివార్డులు ఉన్నాయి. జనవరి నుండి ఇప్పటి వరకు డేటా సేకరించినట్లయితే, 8, 9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? ప్రభుత్వం ఈ విధంగా చంపినవారికి, హత్య చేసిన వారికి డబ్బులు ఇస్తోంది. ఇలా జరుగుతుంటే ఎలా?
దొరికితే జైలు వుంది కదా? కోర్టు వుంది కదా? పోలీసు స్టేషన్ వుంది కదా? ఎందుకు తీసుకువెళ్ళరు? ఎందుకు జైలులో పెట్టరు? పీడియాలో 13 మందిని చంపారు. హైదరాబాద్ లోని మా సహచరులు నిజనిర్ధారణ కోసం పీడియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని ఎందుకు రానివ్వలేదు? నిజం ఉన్న చోట ప్రభుత్వం భయపడకూడదు. వారిని రానివ్వాలి. పరిశోధన చేసే అవకాశమివ్వాలి. కానీ భయంతో అలా చేయలేదు. చాలా ప్రయత్నాలు చేశారు కాని వెళ్ళలేకపోయారు.
పీడియాలో 12 మందిని చంపారు. వారు తునికాకులను తెంపుతున్నారు, ఎండబెడుతున్నారు. వారంతా రైతులు. వ్యవసాయం పనుల్లో వున్నారు. పోలీసులు వారిని చుట్టుముట్టారు, కాల్పులు జరిపారు. కొందరు స్త్రీలు, పురుషులు, బాలికలు కూడా చెట్లపైకి ఎక్కారు. చెట్లపైకి కాల్పులు జరిపారు. పండ్లు రాలి పడినట్లు మృతదేహాలు కింద పడ్డాయి. ఇదంతా ఏమిటి?
పీడియాలో ఊంగాను చంపేశామన్నారు. వేరొకరి మృతదేహాన్ని ఊంగాది అన్నారు. నేను ఊంగాను కలిశాను. అతను చెప్పాడు, “దీదీ, నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను”అని. పోలీసుల రికార్డులో చనిపోయాడు. రికార్డు రెండు లక్షల బహుమతిని చూపిస్తోంది. నాకు చిన్నాన్న అవుతాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. పిడియాలోనే నివాసం. కానీ అతని పేరు మీద బహుమతి. ఊంగాను చంపామని చెప్పి, మరొకరి మృతదేహాన్ని పారేసారు. ఉంగా తాను సజీవంగా వున్నానంటాడు. రెండు లక్షల వెల కట్టారు.
మరొక మిత్రుడు వున్నాడు. బహుశా జోగా అతని పేరు. రెండు లక్షల బహుమతి కూడా ఉంది. అదే ఘటనలో పోలీసులు అతనిని చంపి మృతదేహాన్ని మోయించుకెళ్ళారు. తాము ఎవరిని చంపాము, ఎవరి శవాన్ని మోయించుకు వెళ్తున్నాము అనే విషయం పోలీసులకు తెలియదు. ఇప్పుడు జైలులో ఉన్నాడు. రెండు లక్షల బహుమతి, జైలుకు పంపినందుకు మూడు లక్షల బహుమతి. ఒక వ్యక్తికి ఐదు లక్షల బహుమతి. ఒక రోజు రికార్డు – చంపినందుకు రెండు లక్షలు. అతను సజీవంగా జైలులో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిని చంపితే రెండు లక్షలు, జైలుకు పంపిస్తే మూడు లక్షలు.
దీన్ని ఎలా సవాలు చేయాలి? మనం ఎలా పోరాడాలి? మనం పోరాడాలి. బస్తర్‌ను కాపాడుకోడానికి; బస్తర్ కోసం పోరాడడడానికీ మీరంతా అవసరం. కానీ ఒక పద్ధతి ప్రకారం డేటాను సేకరించాలి. ప్రశ్నించాలి. ఇంత మందిని సరెండర్ చేయిస్తున్నారు, వారికి చాలా డబ్బును ఇస్తున్నారు. మరణం తరువాత పది లక్షలు, ఐదు లక్షలు. తూటా పేల్చే ముందే వారిపై బహుమతి ఎందుకు ప్రకటించడం లేదు? అలా చేయాలి కదా! ఇన్ని లక్షల రూపాయల బహుమతి వుంది అని ప్రకటించాలి. కానీ వారు అలా చేయరు. సర్పంచికి కూడా చెప్పాలి. గ్రామ సర్పంచ్‌కి కూడా తెలియదు. చంపినప్పుడు, లొంగిపోయినప్పుడు నక్సల్స్ అని అంటారు. మేము ఈ విషయంలో కూడా పోరాడతాం? నక్సల్ ఎవరు? ఎవరు నిర్ణయిస్తారు నక్సల్స్ అని. పోలీసులు మీడియాకు చెప్తారు, వారు ప్రసారం చేస్తారు. మాకు పోలీసులు చెప్పారు అతను నక్సల్స్ అని అంటారు. మీడియాకు ఏమి తెలుసు? వారికి చెప్పింది వ్రాస్తారు. మీరు నక్సల్ అని ఎలా చెబుతారు? రుజువైందా? పోలీసులు చెప్పారు కాబట్టి మీరు నక్సల్స్ అంటున్నారా? వీళ్ళు నక్సల్స్ కాదు. పోలీసులు చెబుతున్నారు. కేసు విచారణ నడిపితే తేలిపోతుంది, వారు నక్సల్స్ అవునా, కాదా అన్నది.
పిడియాలో పన్నెండు మందిని చంపారు. వాళ్ళు రైతులు. కొర్చోలి దగ్గర 13 మందిని చంపారు. మేము కూడా అక్కడికెళ్ళాం. అక్కడ వుండే దేవతను ఆరాధించడానికి అందరూ సమావేశమయ్యారు. పోలీసులు తెల్లవారుఝామున నాలుగు గంటలకు వచ్చారు, విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. జలియన్‌వాలాబాగ్ కాండలా ఉంది. అందరూ అడవిలోకి పారిపోతున్నారు. ఒకరు చెట్టు పైకి ఎక్కుతున్నారు. ఒకరు సొరంగంలో నిశ్శబ్దంగా దాక్కున్నారు. ఒకరు పెద్ద బండ పక్కన దాక్కున్నారు. ఒకరిని చంపేశారు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. ఉదయం 6 గంటల వరకూ అలా పరుగెత్తుతూనే వున్నారు. చెట్టు మీదకి ఎక్కి, కాల్పులు ఆగిపోయాయని కిందికి రావడం.. మళ్ళీ కాల్పులు.. . ఒకరు కందకంలో దాక్కుని బయటకు రావడం.. మళ్ళీ కాల్పులు…, మళ్ళీ దాక్కోవడం, పరుగెట్టడం… తిండి లేదు, నీళ్ళు లేవు… అలా పారిపోతూ చనిపోయారు. ఎందుకు ఇంత క్రూరత్వం? ఎలా?
లక్కే దీదీ. అత్యాచారాలు ఎక్కడైనా జరుగుతాయి. కానీ బస్తర్‌లో జరిగే అత్యాచారం వేరు. చాలా చోట్ల జరుగుతాయి. నేను విన్నాను కానీ ఇక్కడ జరిగే అత్యాచారం చాలా భిన్నంగా ఉంది. తన ఇంట్లో వున్న లక్కేని బయటకు తీసుకెళ్ళారు. అక్కడ వున్న మహిళలు చెబుతున్నారు, అరుస్తున్నారు, “తీసుకెళ్లకండి, మీరు తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్లండి. కానీ అడవివైపుకి తీసుకెళ్లకండి” అని. మహిళలను లాఠీలతో, తుపాకీతో కొట్టారు, లక్కీని తీసుకెళ్లారు, చాలా దూరం కూడా తీసుకెళ్లలేదు, ఆమె ఆర్తనాదాలు వినిపిస్తూనే వున్నాయి. ఆమె శ్వాస ఆగిపోయేంత వరకు అత్యాచారం చేశారు. ఆమె అరవడం ఆగిపోయాక విడిచిపెట్టారు. ఆ వూరి నుంచే లక్కేని తీసుకొచ్చారు. దంతేవాడ ఆసుపత్రిలో చెప్పినట్లుగా, ఆమెకు తూటాలు తగులలేదు. అక్కడే మేం గొడవ పడ్డాం; “అత్యాచారం జరగలేదు, మీరు ఎప్పూడూ అలాగే ఆరోపణ చేస్తారు” అని అన్నారు; మేం అన్నాం, “ మొత్తం శరీరాన్ని చూడండి. అత్యాచారం జరిగిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది?” మాకు పోరాటాల ద్వారా ఎలాంటి ప్రశ్నలు అడగాలనే అనుభవం వచ్చిందని వారికి తెలియదు. అప్పుడు సంచి తెరిచారు. ఒక్క తూటా తగిలిన గుర్తు లేదు. మరి ఎలా చంపారు? చెప్పండి! అంటే ఎవరూ మాట్లాడలేదు.
కానీ వాస్తవమని నిరూపించినప్పటికీ కేసు నమోదు చేయరు. నేను చెప్పాను, ఒక్క తూటా తగిలిన గుర్తు లేదు, శరీరంలో లేదు, తలపై లేదు, కానీ ఆమె తొడల మీద… నా దగ్గర ఇప్పటికీ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి… మాంసాన్ని దేనితో తీశారో తెలియదు కానీ , ఆమె మాంసాన్ని గొడ్డలితో తీశారో లేదా కత్తితో తీశారో. బాగా వాచిపోయి, రెండు తొడలూ పూర్తిగా అంటుకుని ఉన్నాయి. ఎంతకాలం ఈ అత్యాచారాలు? ఈ ఘటన ఒకటే కాదు, నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను అంతే.
అందుకే బస్తర్‌లోని మహిళలమైన మేము అంటున్నాం “మాపై అత్యాచారం చేయకండి, ఎన్ని తూటాలు పేల్చాలనుకుంటే అన్నీపేల్చండి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అత్యాచారం చేయవద్దు.” ఎవరైనా పరిగెత్తుతుంటే వారి పైన తూటా పేల్చితే చచ్చిపోతారు. మహిళలం కాబట్టి ముందుగా ఇలా శిక్షించాలా? ఒకవేళ మేం మగవాళ్ళమైతే తూటాలు మాత్రమే పేల్చుతారా? ఇలాంటి పరిస్థితి వున్నప్పుడు ఏమి చేయాలి?
లొంగుబాటు చేయించడానికి ఎవరినైనా పట్టుకున్నప్పుడు, ముందున్న టేబుల్‌పై కాళ్లనాడిస్తూ పోలీసు అధికారి, “చూడండి, మీముందు మూడు వికల్పాలు (ఎంపికలు) వున్నాయి. మొదటిది లొంగుబాటు, రెండవది జైలు, మూడవది మరణం. ఏది ఎన్నుకుంటారు” అని అడుగుతాడు. మీరు ఈ మూడింటిలో దేనిని ఎంచుకుంటారో చెప్పండి? మరణాన్ని ఎవరూ కోరుకోరు. అందరూ బతకాలనే అనుకుంటారు. జైలు లేదా లొంగిపోవడం అనే రెండు వికల్పాలు మిగిలాయి. లొంగిపోవడం తప్పనిసరి అయి లొంగిపోతాం అంటారు. అలా అనే స్థితిని కల్పిస్తారు. కొంతమంది లొంగిపోతారు. కాదని కొందరు జైలుకు వెళతారు. ఇదీ పరిస్థితి.
కానీ మహిళలకు నాలుగు వికల్పాలు వున్నాయి. లొంగుబాటు, మరణం, జైలు, అత్యాచారం. ఈ నాలుగు విషయాలకు సిద్ధపడండి లేదా వారు మీపై అత్యాచారం చేస్తారు లేదా చంపేస్తారు లేదా లొంగుబాటు లేదా జైలుకు పంపుతారు. అలాంటి ఆప్షన్లు ఇస్తే అక్కడి ఆదివాసీలు ఏం చేస్తారు?
బైలదిల్లా గని కోసం యింత జరిగింది.
పిల్లలు చనిపోతున్నారు. ఒక్కో మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిస్తోంది. పిల్లలు బతకడం లేదు. లోహా గ్రామం బైలదిల్లా గని క్రింద ఉంది. మొత్తం గనిలోని వ్యర్థ ఇనుమును అక్కడ పారవేస్తున్నారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకునే వారే లేరు. దాని విషతుల్యమైన నీటిని తాగాల్సి వస్తోంది. మహిళల్లో 3 గ్రాముల రక్తం మాత్రమే ఉంటోంది. ఏటా మరణిస్తున్నారు. నేను నేను అక్కడి మహిళలను అడిగాను, అంతమంది పిల్లలు ఎందుకు అని? ఇద్దరు-ముగ్గురు పిల్లల తర్వాత, మెడికల్ స్టెరిలైజేషన్ చేయించుకోండి అని సలహా యిచ్చాను. తమ పిల్లలు బతకడం లేదని, అందుకే పిల్లలను కంటున్నామని, కనీసం ఒక్క బిడ్డ అయినా బతకాలి కదా అని వాపోతున్నారు. 150 ఇళ్ళు వుంటే, నేడు 30 లేదా 15 ఇళ్ళలో మాత్రమే పిల్లలు ఉన్నారు.
ప్రతి సంవత్సరం అక్కడ మరణిస్తున్నారు. దీనికి బాధ్యులెవరు? బైలదిల్లా గని. ఆ డబ్బు ఎక్కడికి పోతుంది? మాపై కాల్పులు జరిపినందుకు వేలకోట్లు, కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారు. అంటే మనం కొండలు ఇవ్వాలి, వారు మైనింగ్ చేయాలి, డబ్బు తీసుకోవాలి, ఆ డబ్బుతో ఆయుధాలు కొనుక్కోవాలి, క్యాంపులు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చేసి మనపై కాల్పులు జరపాలి. ఇది మన జీవితం. మనం ఎందుకు ఇవ్వాలి?
వీటన్నింటి కోసమూ పోరు జరుగుతుంది. అక్కడి యువతకు ఉపాధి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మూల్‌వాసీ బచావో మంచ్ కార్యకర్తలు ఒక అద్భుత, ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కూడా నక్సలైట్లతో సంబంధం వుంది అని అంటున్నారు. ఇది నక్సలైట్లకు సంబంధించిన సంఘం అని అంటున్నారు.
మేమనేది ఏమంటే మాకు మెదడు లేదా? మాకు జ్ఞానం లేదా? మా ఎదురుగా చెట్లు నరికివేస్తున్నారు. మనుషులను చంపుతున్నారు. కూతురు, చెల్లి గౌరవం దోచుకుంటున్నారు. మేం గళం ఎత్తమా?
ప్రతిదానికీ నక్సల్‌తో ముడిపెట్టడం ఎందుకు? మేము నేరుగానే మాట్లాడుతాం కదా! ఎన్నోసార్లు ఎస్‌పి అన్నాడు నువ్వు నక్సలైట్‌వి అని. అవును. నేను నా గళాన్నెత్తుతాను. నా ప్రజల మంచి కోసం నేను గళాన్నెత్తుతున్నాను. నీరు, అడవి, భూమి గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను నక్సలైట్‌ని అని మీరంటే అవును నేను నక్సలైటునే. నేను కూడా దీనికి సిద్ధంగా ఉన్నాను. నేను నక్సల్‌ని. అలా అనడం నాకేమీ ఫరక్ పడదు. (తేడా కలుగదు)
మా పైన నక్సల్ అని ముద్రవేసి దౌర్జన్యాలు, అత్యాచారాలు ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? ఇది చాలా పెద్ద సవాలు. అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది, పిల్లలు చనిపోతున్నారు. ల్యాండ్ మైన్‌లు పెడుతున్నారు. ఇదే మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎవరైనా అడవికి లేదా కొండ పైకి వెళితే, ల్యాండ్ మైన్ పేలి చనిపోతున్నాడని వారికి తెలుసు. మేము ఆకుల సేకరణకి వెళ్తున్నాము. ఏదో ఒకటి జరుగుతోంది. పూర్తిగా నక్సలిజం గురించి మాట్లాడుతున్నారు.
ఇది నక్సల్స్ యుద్ధ నీతి కాదు. పోలీసు, ప్రభుత్వ యుద్ధనీతి. పరిపాలనకు చెందినది. ఆదివాసీలు కొండల పైకి వెళ్లకూడదు. ఎక్కడికీ వెళ్లవద్దు. భయంతో కొండపైకి వెళ్లకపోతే, రోడ్డు త్వరగా తయారవుతుంది. గనుల తవ్వకం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఖనిజాలను వెలికితీస్తారు. ఇదీ వారి వ్యూహం.
ఇప్పుడు నక్సల్ అని అంటున్నారు. ఇంతకు ముందు గన్‌పౌడర్, బాంబులు ఎప్పుడూ పేలలేదు. ఎప్పుడూ లేదు. నారాయణపూర్ జిల్లాలో చిన్న పిల్లలు కూడా ఎనిమిది మందిని చంపారు. వారు సొరంగంలో దాక్కున్నారు. వాళ్ళను బయటకు లాగారు. కర్రలతో గుచ్చి గుచ్చి బయటకు లాగారు. సొరంగంలోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపాక ఎలా బతుకుతారు? చనిపోయారు. కొంతమందిని బయటికి తీయలేకపోయారు. అక్కడే కుళ్ళిపోయారు. ఆ తరువాత, గ్రామస్తులు మేమైతే తీస్తాం అని బయటకు తీసారు. ఇదంతా ఏమిటి? సొరంగాల్లో ఎందుకు దాక్కోవాల్సి వస్తోంది?
యుక్త వయసులో ఉన్న ఈ చిన్న పిల్లలను ఏం చేస్తున్నారు? డ్రెస్‌లు వేయిస్తున్నారా? ధరించారా? ఆ అమ్మాయి చెప్పింది నేను డ్రెస్ వేసుకోను అని. నా దగ్గర ఆ వీడియోలు కూడా ఉన్నాయి. పిల్లలకు డ్రెస్‌లు వేస్తారు. చంపేసి వాళ్ళను నక్సలైట్లు అంటారు.
నక్సలైట్లు అనే పేరుతో బతకకుండా చేశారు. బతకలేం, ఎక్కడికీ వెళ్లలేం. పెద్ద డాంబర్ రోడ్డు వేసారు. బీజాపూర్ నుండి గోపాల పట్నం, దంతేవాడ వరకు. ఆ రోడ్ల మీద మేం నడవలేం. వారిని క్యాంపు దగ్గర ఆపుతారు. దాని అర్థం ఏమిటి? ఒకవైపు ఆదివాసీల కోసం గ్రామంలో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. ఎక్కడా మంచి ఆసుపత్రులు లేవు. ఐఎండిసి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉంది. ఒక మంచి కాలేజీ లేదు. ఒక సరియైన ఆసుపత్రి లేదు. కొందరు హైదరాబాద్‌కు లేదా విశాఖపట్నంకు తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్లాలి. ఆ డబ్బులు ఎందుకోసం? వాళ్ళు కొండల యజమానులు, వారికి ఆసుపత్రి ఎందుకు లేదు? చనిపోతున్నారు. చాలా మంది బయటకు తీసుకెళ్ళలేరు.
అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా? ఆసుపత్రి ఎందుకు లేదు? మంచి కాలేజీ ఎందుకు లేదు? మంచి కోచింగ్ సెంటర్ ఎందుకు లేదు? విద్య పూర్తిగా పాడైపోయింది. మీరు మౌలిక సౌకర్యాలు కల్పించాలనుకుంటే గ్రామంలో మంచి నీరు, కరెంటు, విద్యను అందించండి.
బుల్లెట్లతో గ్రామాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి, నేను మీ మధ్యకు ఒక ఆశతో వచ్చాను. ఇన్ని కోట్ల రూపాయలను తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఐదు లక్షల రివార్డు, ఆరు లక్షల రివార్డు అంటున్నారు. కాబట్టి మనం అడగాలి, డబ్బు ఒక వ్యవస్థ నుండి వచ్చి ఉండాలి; బహుమానం గురించి మాకు ఎందుకు చెప్పరు? పేపర్లో ఎందుకు ఇవ్వరు? అతడు ఎంత పెద్ద నేరస్థుడు? గ్రామంలో ఎందుకు ఉన్నాడు? చెప్పరు. చట్టం ఉంది కదా? సర్పంచ్‌కి తెలియజేయాలి. మనలాంటి సామాజిక కార్యకర్తలకు చెప్పాలి. ఇంతమంది మావోయిస్టులు వున్నారు, ఇంత రివార్డు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పాలి. చెబితే, మేము కూడా ఏదో ఒక పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. అవునా?
చంపిన తర్వాత ఐదు లక్షలు, ఆరు లక్షల రివార్డు ప్రకటించడం ఏమిటి?
మేం ఆదివాసీలం మూర్ఖులం అనుకుంటున్నారా? ఈ విధంగా వారు తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. మా పిల్లలకు డబ్బు, ప్రమోషన్‌లు ఇస్తున్నారు. దీన్ని ఆపండి. ఒకవేళ అతను మావోయిస్టు అయితే, లొంగిపోయి ఉంటే మళ్లీ తుపాకీ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. ఇంకొక ఉద్యోగం ఇవ్వాలి. ఒకవేళ అతను ఇరవై హత్యలు చేసాడనుకుందాం..
లొంగిపోయిన తర్వాత ప్రజలను చంపినట్లయితే క్షమార్హులా? ఇది ఎలాంటి క్షమాపణ? ఇద్దరిని చంపేశారని, పార్టీలో ఉంటూ ఏదైనా కారణంగా ఏదైనా అయివుండచ్చు. లొంగిపోయిన తర్వాత ఎలా క్షమిస్తారు? సాధారణ పౌరులైతే, విచారణ జరుగుతుంది, శిక్ష ఉంటుంది.
ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.. ఇది అన్నిటికంటే ప్రమాదకరం..
లొంగిపోతున్న వారిదీ ఇదే పరిస్థితి. ఇక్కడకు వచ్చి తుపాకీ పట్టుకుని పోరాడతారు; లొంగిపోయిన తర్వాత వారు స్వతంత్రులని నా నమ్మకం. తన జీవితాన్ని ఎలాగైనా గడపవచ్చు. అతనికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ వాళ్ళు మళ్ళీ పంపిస్తారు; ఏం చెబుతారు? పది మందిని చంపితే ప్రమోషన్, డబ్బు వస్తుంది అంటారు. పోలీస్ సర్వీస్‌లో ఉన్నవాళ్ళు ఏమంటారు? నక్సలైట్, లొంగిపోయి నెల కూడా కాలేదు, గొప్పోడైపోయాడు అనంటారు . ఈ రకమైన వ్యవస్థను సవాలు చేయవలసి ఉంటుంది, ఇది ఎలా ఆగుతుంది? అతడికి తుపాకీ ఇచ్చి అతని గ్రామానికే పంపిస్తారు హత్యలు చేయమని.
కోర్చోలిలో మూగ, చెవిటి అమ్మాయిని ఇంటి నుండి అడవికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపారు. ఆమె అస్సలు మాట్లాడలేదు. మూగది; అమ్మాయిలు వాకిట్లో మహువా ఎండబెడుతున్నారు, ఎటువంటి కారణం లేకుండా ఇంట్లోకి ప్రవేశించి, ఇంటి నుండి వెనక్కు తీసుకువెళ్లి, డ్రెస్ వేయించి, బయటకు తీసుకువెళ్లి ఇంటికి ఒక రెండువందల యాభై అడుగుల దూరంలోనే తుపాకి పేల్చి చంపేసారు. ప్రజలంతా చూశారు. అలా చేయడం వాళ్ళకు ఎలా బాధకలిగించదో నాకు అర్థం కాదు. “అలా నిలబడు” అని అన్నాడు అమ్మాయితో. మా దగ్గర సాక్ష్యం వుంది. మాట్లాడకుండా నిలబడింది. ఒక్క బుల్లెట్‌తో చంపాలి అని అంటూ రెండు బుల్లెట్లు పేల్చారు, చంపేశారు.. జిల్లీ (పాలిథిన్ షీట్)లో కట్టి తీసుకువెళ్లారు.
ఈ పరిస్థితి ఇలాగే ఎలా కొనసాగుతుంది? ప్రధాన పోరాటం నక్సల్స్ గురించి కాదు, ప్రధాన పోరాటం మా ఆదివాసీలను నాశనం చేయడం గురించి; మీరు అర్థం చేసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశ్యం నక్సల్ అని పేరు పెట్టి ఆదివాసీలమైన మమ్మల్ని నాశనం చేయడం. వెళ్ళగొట్టడం. అదానీలాంటి, జిందాల్ లాంటి వాళ్లకు, బడా వడ్డీ వ్యాపారులకు ఇవ్వడం. ఈ వ్యక్తులు తమ కంపెనీల కోసం ట్రక్కులు తెస్తున్నారు. ఒక తమ్ముడు నాకు చెప్పాడు.. అక్కా, ట్రక్కులు వస్తున్నాయి ఇక్కడకు. మన కొండల మీదకు వెళ్తున్నాయి. నేను చెప్పాను “వాళ్ళని సరుకులు నింపనీ. ఆ తర్వాత కాల్చేద్దాం. నక్సలైట్లు చేయడం కాదు మనమే కాల్చేద్దాం.. వాళ్ళు నీరు, అడవి భూమి గురించి కూడా మాట్లాడతారు; మనం కూడా అందుకే పోరాడుతున్నాం. ఆ తర్వాత ట్రక్కులు రాలేదు. ట్రక్కు వస్తే మనకు తెలియాలి. ఈ వ్యవస్థతో ఎంతకాలం ఉండగలం అనే బలమైన ఆలోచన మాలో కలుగుతోంది. ఎంతకాలం అని భావజాలంతో పోరాడాలి? ఎంత కాలమని ఒక రాజ్యాంగం గురించి మాట్లాడగలం? మన ఎదురుగా ఏం జరుగుతోందో చూస్తున్నాం.
నందరాజ్ కొండ గురించి కూడా మాట్లాడుతున్నాను. వర్షాకాలంలో మేఘాలను అడ్డుకోవడం నందరాజ్ కొండకు వున్న ప్రాముఖ్యత. అప్పుడు వాన పడుతుంది, నీళ్ళు వుంటాయి. కొండలు లేకపోతే రుతుపవనాల తాకిడికి అడ్డు ఉండదని, మేఘాలు ముందుకు వెళ్లిపోతాయని, వానలు పడవని, నీళ్ళు వుండవని, వ్యవసాయం ఎలా చేస్తామని ప్రజలు ఆందోళన పడుతున్నారు; ఇలా ఇందులో చాలా విషయాలు వున్నాయి.
ఈ అన్నింటిపై విస్తృత చర్చ జరగాలని నేను ఆశిస్తున్నాను. చర్చ జరగాలి. సరెండర్ పాలసీని సవాల్ చేసి పద్ధతి ప్రకారం పోరాడితే ఆపవచ్చని అనుకుంటున్నాను. డబ్బుపై దురాశతో తూటాలు పేల్చి పారితోషికం గురించి మాట్లాడే వారికి సవాల్ విసరాలి. ఇలాంటి వ్యవస్థపై పోరాడితేనే ఆగుతుంది,. ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి తమ యిష్టప్రకారం ఖర్చుపెడుతున్నారు? మన అక్కచెల్లెళ్లు, కూతుళ్లతో ఆడుకుంటున్నారు. బస్తర్‌కు మీ అందరి అవసరం వుంది.
మన ఆదివాసీలను భయపెట్టి, వాళ్ళను పిరికిపందల్లా చేశారు. అందుకనే వాళ్ళు చెప్పుకోడానికి రావాలంటే వెనుకాడుతున్నారు.
మిత్రులందరికీ జోహార్ (సలాం).