ముమ్మాటికీ నిజమే. ప్రపంచమంతా వేధనతో నెత్తుటిధారల్లో తడిసిపోయింది. పీడితులకు అండగా నిలిచేరాజ్యం ఈ భూగ్రహంమీద మొలవలేదనిపిస్తోంది. నూతనప్రపంచావిష్కరణకు ఇంకెన్నాళ్లో..సామ్రాజ్యవాదకాంక్షలో దేశాలకు దేశాలు నాశనమౌవుతున్నాయి. దుర్నీతి దురంహంకార పాలకులు రాజ్యాలనేలేందుకొస్తున్నారు. పసిపిల్లలు, వృద్దులు, ఎవ్వరూ వీళ్ళకడ్డులేదు. కాజీనజ్రుల్ ఇస్లాం కలలు కన్న రాజ్యం ఇంకా ఉద్భవించలేదు. ఆయన కలలు కన్న పాలకులింతవరకూ రాలేదనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎర్రపూలు పూస్తున్నాయి..ఆ ఆశతోనే సామాన్యుడు, పీడితుడు, బాధితుడు బతుకుతున్నాడు. ఐనా కాజీనజ్రుల్ ఇస్లాం యుద్దం ద్వారా మా హక్కులన్నీ సాధించుకుంటామన్నారు. ఆయన రాసిన గొప్పకవిత్వం మనకిటీవల అందుబాటులోకి వచ్చింది.
ముస్లింలు దానికంటి ముత్యాలు/హిందువులు దాని జీవితం/ఆకాశమాత ఒడిలో సూర్య చంద్రుల వలె/వాళ్ళ ముందుకు వెనక్కు ఊగుతుంటారు/మన లోపల రక్తంలోనూ గుండెలోనూ/ అవే స్పందించే రక్తనాళాలు/ మనం ఒకే నేల గాలిని పీలుస్తున్నాం /అదే నేల నీళ్ళు తాగుతున్నాం/మనం ఒకే గుండెల మీద పెరుగుతున్న ఫలపుష్పాలం/ ఒకే భూమి స్థలంపై మనం విశ్రమిస్తాం/ఒకరం ఖనన స్థలంలో, ఒకరం దహన వాటిక/మనం మన తల్లిని ఒకే భాషలో పిలుస్తాం/ఒకే వాణితో పాడుతాం/రాత్రి ఒకరికొకరం అంధకారంలో గుర్తించలేక/మనం కలహించుకుంటాం/ఉదయమే మనం ఒకరి ఒకరు/స్నేహితులుగా పోల్చుకుంటాం/మనం దు:ఖిస్తూ ఒకరినొకరు ఆలింగనం/చేసుకుంటాం/మనం పరస్పరం/క్షమాపణలు చెప్పుకుంటాం/ఆరోజు ఈ దేశం గర్వంతో దరహాసం చేస్తుంది (మనం ఒకే కొమ్మ పూవులం)
ఇంతకంటే సామరస్యతగీతం ఎవ్వరు పాడగలరు. మరింతకంటే సమైక్యతను ఇంకెవ్వరు కవిత్వీకరించగలరు. విప్లవకారుడనో విద్రోహి కవి అనో అనాలని లేదు. ఈ ప్రపంచపుచిటికెన వేలు పట్టుకుని శాంతిపథంవైపు నడిపించగల శక్తి ఉన్న శాంతి కాముకుడు. తను చెబుతున్న కవితాత్మక వాక్యాలు భూమిపొరల్లోకి ఇంకి, మానవులంతా ఒకటేనని చాటి చెబుతూ శాంతి పుష్పాలై విరబూస్తాయి. కాజీనజ్రుల్ ఇస్లాం బెంగాల్ సాంస్కృతికోద్యమ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలో తనకంటూ వొక పుటను లిఖించుకుని అస్తమించిన విప్లవ సూరీడు. కవిగా, సంగీతజ్ఞానిగా ఆనాటి రాజకీయ సామాజిక రంగాల్లో చెరగని ముద్రవేసి పాలితుల పక్షాన నిల్చుని పోరాటం చేసిన యోధుడు. అతను పై కవితలో హిందూ ముస్లీంలను రక్తనాళాలతో పోలిస్తే ఇవాళ మన పాలకులు మాత్రం ఏ మాత్రం సిగ్గులేకుండా విభజిస్తూ రాజకీయం చేస్తున్నారు.
కాజీనజ్రుల్ ఇస్లాం రాసిన కవితల్ని వరవరరావు అనువదించగా విద్రోహి పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకం తీసుకొచ్చింది. ఈ పుస్తకంలో అతని జీవితం, ఆతని కవిత్వమే కాకుండా మరూ ప్రపంచాన్ని కోరుకున్న మనదేశ వర్థమాన కవులైన గురజాడ, కాళోజి, శివసాగర్, జాషువా, శ్రీశ్రీ సాహిత్యజీవితం, కవిత్వంతో కాజీనజ్రుల్ ఇస్లాంను పోలిక చేస్తూ ఈ పుస్తకం కొనసాగుతుంది.
కాజీనజ్రుల్ ఇస్లాం కోరుకున్న దేమిటి..?
వెనుక దాగి ఉంటావు/ఇవాళ స్వర్గం నిర్ణయులైన నియంతలచే/అణచివేయబడి ఉన్నది/దేవుని బిడ్డలను కొరడాలతో కొడుతున్నారు/ వీరులైన యువకులను ఉరితీస్తున్నారు/ఇవాళ భారతదేశం ఒక వధ్యశాల వలె ఉన్నది/విధ్వంసినీ నీవు ఎపుడొస్తావు?/దైవభయుడు విసిరివేయబడ్డ/దీపాలతో ప్రవాసునులు కఠిన శిక్షలు/అనుభవిస్తున్నారు/నువ్వు ఖడ్గం ధరించి వస్తే తప్ప/యుద్ధరంగంలోకి ఎవరొస్తారు?/యుద్ధరంగంలోకి ఎవరొస్తారు?(ఆనందమయి ఆవాహన)
అప్పటికీ ఇప్పటకీ ఏం మారింది. మరి ఎవరు పోరాడతారు. ఎవరికివారం పట్టనట్లు ఈ దేశాన్ని ఉన్మాదుల చేతుల్లోకి అప్పజెప్దామా? కాజీనజ్రుల్ ఇస్లాం సమానత్వం గూర్చి ఎంతగొప్పగా పాడిన మన హృదయాలు ఎందుకు తెరచుకోలేదు. అతనెవరు పాడటానికని ప్రశ్నిద్దామా?..మా నైజం మతోన్మాదమని చాటుదామా? కాజీనజ్రుల్ ఇస్లాంను అందరితో పోల్చి బసవేశ్వరుడి ఆలోచనలతో ఎందుకు పోల్చలేదనిపించింది. కారణం లేకపోలేదు. ‘వృథాగా దేవుని కోసం ఎందకు వెతుకుతావు?/దరహాసంతో నివసిస్తున్నారు’ ఎక్కడ నివసిస్తున్నారు వీళ్ళంతా..కాజీనజ్రుల్ ఇస్లాం మాత్రం ‘ఈ హృదయం మసీదు, దేవాలయం, చర్చి’ అని అన్నట్లు బసవేశ్వరుడు కూడా ‘కాయకవే కైలాస అనలేదా?’
సమానత్వపు పాట:
దేశపునాదులను సమానత్వంతో పాడాలనుకున్నాడు. పాడాడు, కవిత్వీకరించాడు. ఆచరణాత్మకంగా జీవించాడు. ఎంచుకున్న మార్గంలో ఎన్నో ముళ్ళు..మరెన్నో గాయాలు కాజీనజ్రుల్ ఇస్లాం దేహాన్ని మనసుని చిద్రం చేశాయి. బతికినన్నాళ్ళు యుద్దం చేశాడు. కవిత్వతత్వంతో, శ్రమైక పాటలతో ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. మనుషుల లోతుల్లోకి తన అక్షరాలు ఇంకేలా చేశాడు. దేశమంతా విముక్తి కావాలనుకున్నాడు. ఈ దేశం గూర్చి కాజీనజ్రుల్ ఇస్లాం గొప్పగా కలగన్నాడు.ప్రతీదాన్ని తడిమాడు. దైవమా, దేశమా, కార్మిక కర్షకలోకమా, విద్యార్థిప్రపంచమా, వొక్కటేమిటి అన్నింటినీ తనదైన శైలిలో కవిత్వకరించాడు.
కవిగా కాజీనజ్రుల్ ఇస్లాం బతికినన్ని రోజులు అక్షరయుద్దం చేశాడు. ఆనాటి భారతదేశ చరిత్రలో హిందూ`ముస్లీంల ఐక్యతకు పునాది వేశారు.మనం ఒకే కొమ్మ పూవులం అంటూ..ముస్లీంము దానికంటి ముత్యాలు/ హిందువులు దాని జీవితం/ ఆకాశమాత ఒడిలో సూర్యచంద్రుల వలె/ వాళ్ళు ముందుకు వెనక్కు ఊగుతుంటారు./ మన లోపల రక్తం లోనూ గుండెలోనూ/ అవే స్పందించే రక్త నాళాలు/ మనం ఒకే నేల గాలిని పీలుస్తున్నాం/ అదే నేల నీళ్ళు తాగుతున్నాం/ మనం ఒకే గుండెల మీద పెరుగుతున్న ఫల పుష్పాలం./ ఒకే భూమి స్థలంపై మనం విశ్రమిస్తాం/ ఒకరం ఇననం స్థలంలో, ఒకరం దహన వాటిక/ మనం మన తల్లిని ఒకే భాషలో పిలుస్తాం/ ఒకే వాణితో పాడుతాం.
ఈదేశంలో హిందూ`మస్లీంల మధ్య కలహాలు సృష్టించి, నిత్యం మారణహోమం చేస్తూ, చేయిస్తున్న మతోన్మాదులకు కాజీనజ్రుల్ ఇస్లాం ఎలా అర్థమవుతాడు. గత దశాబ్ధకాలం నుండి ఇప్పటికీ, ఇప్పటికీ చిచ్చుపెట్టి హిందూ ముస్లీంల మధ్య విభజన విధ్వంస రేఖల్ని గీస్తూ ఓట్లతో సీట్లతో గద్దెమీద కూర్చుని ఉన్నారు. వీళ్ళ దుర్నీతి రాజకీయాలకు బలవుతున్నది మాత్రం బడుగు, బలహీనవర్గాలు, ఆదివాసీలు, అణగారిన వర్గాలు. ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే కాజీనజ్రుల్ ఇస్లాం నుండి నేటి వరకు మతాన్ని ప్రాతిపాదికగానే జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు అశాస్త్రీయతను, మనస్మృతిని ఆధారంగా చేసుకుని సాగిస్తున్న జీవనప్రయాణం. భగవద్గీత జాతీయగ్రంథమవ్వాలని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి అమలవ్వాలన్నది వీరి అభిలాష. అందుకే ఎంతటి విధ్వంసానికైనా తెగిస్తారు. ఇవాళ మణిపూర్‌లో ఎన్ని విధ్వంసాలు, రక్తపాతాలు జరిగినా జరిగినా ఒక పక్క ఆజ్యం పోస్తూనే మణిపూర్ తమ పరిధిలోనే లేనట్టు వ్యవహరిస్తున్నారు.
కాజీనజ్రుల్ ఇస్లాం ఈ పుస్తకంలో స్త్రీవాదిగా, మానవతావాదిగా, తాత్వికుడుగా, యువతరంలో నూతనోత్తేజాన్ని నింపే దార్శనికుడుగా, శాంతికాముకుడుగా బహుముఖీయంగా కనబడ్తాడు.‘మహిళలారా మేల్కొనండి జ్విలించే అగ్ని శిఖలైమేల్కొనండి’ అని అంటూ చైతన్యాన్ని నింపుతాడు. స్త్రీవాది అని అనడానికి కారణాలున్నాయి. ఈ కవిత్వంలో స్త్రీలపై అనేక కవితలు రాశారు. వేదనకు కన్నీళ్ళకు సగం పురుషుణ్ణి నిందించాలంటాడు.
ఈ కవి దార్శనికుడు అనడానికి చాలా నిదర్శనాలున్నాయి. ఇవాళ మనదేశాన్ని పాలిస్తున్న పాలకుల వెనకు ఎవరున్నారో మనందకీ తెలిసిందే. కార్పోరేట్ల కనసన్నల్లో దేశం ప్రయాణిస్తున్నది. దేశసంపదను దారాదత్తంం చేసే పాలకులున్న రాజ్యంలో మనమున్నాం. అందుకే కాజీనజ్రుల్ ఇస్లాం ఒక కవితలో ‘నిన్నెవ్వరు బందిపోటు అన్నారు/ మిత్రమా నిన్ను ఎవరు దోచుకొనే/దొంగ అన్నారు/ మనచుట్టూ బందిపోట్లూ దొంగలూ/సంపదలు కూడ బెడుతూ ఏలుతున్నారు/దొంగలనీ..బందిపోట్లనీ ఎవరు/ తీర్పుచెప్తున్నారు.’ మన దేశానికి చెందిన అదాని, అంబానీలు ప్రపంచకుబేరుల జాబితాలో స్థానం సంపాదించేసుకున్నారు. కవితలో చెపినట్లు ఏలడం లేదు గానీ, ఏలికలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు.
పదేళ్ళలో దేశంలో నిర్భందాలు, ప్రశ్నించేవాళ్ళను ఉక్కుపాదంతో అణచేయడం ఇంకా చెప్పాలంటే చంపేయడం చేశారు.ప్రజాస్వామ్యం అన్నమాటే లేకుండా కేవలం మనుధర్మాన్నే అమలు చేశారు, చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే ఇక సామాన్యుల బతుకులుండవు. రాజ్యానికి వ్యతిరేకంగా గొంతులు ఐక్యంకావాలి. వొక చోట కాజీనజ్రుల్ ఇస్లాం పోరాడు అనే కవితలో..‘నువ్వు చాల కాలంగా జీవిస్తున్నావు /ఇప్పుడు నీ జీవితాన్ని సార్థకం చేసుకో/ప్రార్థనకే ఉపయోగించిన నీ చేతులలో/ఇప్పుడు ఆయుధాలు ప్రకాశించనీ/ ఆకాశం నుంచి అరుణిమలు సంగ్రహించి/నీ జెండాను అరుణారుణం చేసుకో/మతి తప్పిన వారు చాల కాలం బతకనీ/నీవు జీవితాన్ని అర్పించు/ముందుకీ నడువ్..’అంటాడు. కానీ ఈ దేశంలో పోరాటాలను బలహీనం చేశారు. మానవహక్కులకు భంగం కలిగినా, ప్రజాసమస్యల్ని లేవనెత్తినా నిర్భందించి బంధిస్తున్నారు. ఏరకమైన అసమ్మతి ఉండకూడదనుకుంటున్నారు. ప్రముఖచరిత్రకారులు రోమిల్లా థాపర్ ‘అసమ్మతి అనేది భారతీయులకు మౌలికంగా ఉండే లక్షణం. అది సర్వసాదారణం. వాక్ స్వాతంత్య్రంలో అంతర్భాంగం. నాగరికతకు అసమ్మతి ఒక ప్రమాణమని, దాన్ని ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు. ప్రస్తుతం రాజ్యాన్ని ప్రశ్నిస్తే అర్భన్ నక్సల్‌గా ముద్రవేస్తున్నారు’ అంటారు. ఈ మతోన్మాదుల రాజ్యంలో ప్రజాస్వామ్యం, లౌకికత్వం అనే పదాలేనాడో అంతరించిపోయాయి.
మరేం చేద్దాం..? పోరాడాలి. పోరాడి ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈదేశం అందరిది. చరిత్రను ప్రతివొక్కరి ఇటుకతో నిర్మించుకున్నాం. ఎలా పోరాడాలో చెప్తున్నాడు..
పదండి ముందుకు ప్రయాణికులారా/నూతన గమ్యానికి/మనిషి వీరుడు అని బిగ్గరగా ప్రకటిచండి/ప్రతి చోటా పిరికివారు గుంపులుగా చేరుతున్నారు./వచ్చి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు/ఎగసి పడే కెరటాల్లోకి నీ పడవను దూరిపోనివ్వు, విజయవంతంగా/ప్రయాణం సాగించు కొత్త ప్రపంచంలోకి/దూసుకుపో అది మరో ప్రపంచం స్వర్గం/యుద్ధ కవచాలన్ని ధరించే సమయం లేదు/ అంతా బయటకు రండి/నగ్నమైన నీ భుజాలను ప్రయాణం/ సృశిస్తున్నది ఆ స్పర్శను అనుభవించండి/ మొట్ట మొదలు యుద్ధం కొరకు సంసిద్ధం/ కావాలి కదా అని ఆలోచనలు చేయకుండా/రాత్రి ముగుస్తుంది తెలవారుతుంటుంది/
పక్షులు గానం చేస్తాయి/ ప్రభాతానికి తగిన రాగం పాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్లంతా బైటికి రండి/స్వయం వినాశనాన్ని కోరుకొనే వాళ్లు చీకట్లలోనే మగ్గిపోండి/ గందర గోళంలో ఒకరి నొకరు కొట్టుకోకండి/ కదం తొక్కి సాహసిక సైనికులారా/కాగడాలను వెలిగించండి/ కదలండి ముందుకు/ భావావేశంతో కదం తొక్కే వీరులను/పాడండి ప్రభాత రాగం పాడండి/ మీరు నమ్మకంగా ప్రభాత ద్వారం వద్దకు చేరుతారు/మీ ప్రయాణం విజయం అగుగాక..
ఈ దేశం అందరిదీ అని, సమానత్వంతో ఉండాలని ప్రతి సందర్భంలోనూ కాజీ నజ్రుల్ ఇస్లాం చెప్తాడు. దేశంలోని ప్రతి వొక్కరిని పలకరిస్తాడు. కార్మికులా, కర్షకులా, శ్రామికులా, పేదలా, ఆదివాసీలా, విద్యార్థులా, యువజనులా ప్రతి ఒక్కరు, ప్రతివొక్కరినీ పలకరిస్తాడు. కవిత్వంతో చైతన్యజ్వాలా రగిలించి చేతికందిస్తాడు. కాజీ నజ్రుల్ ఇస్లాం గొప్పకవి..ఈ దేశ నిర్మాణం గొప్పగా ఉండాలని కలలు కన్నవాడు. వివి చేసిన ఈ కవిత్వానువాదం చదివిస్తుంది. ఆకట్టుకుంటుంది. ఒకబిగిన చదివేలా చేస్తుంది. ఇద్దరి జీవితాలకు సారూప్యత ఉంది..ఇద్దరి దారి ఒకటే..కాజీ నజ్రుల్ ఇస్లాం తన ఇస్లాం మతంలో పేర్కొన్నదానికి భిన్నంగా ఈ ప్రపంచం నుడుస్తుందని బాధ పడ్తాడు. అందుకే ఆయన చెప్పిన వొక కవిత ఉదహరించి ముగిస్తాను..
ఉన్మాదం మతంకాదు అనే కవితలో..‘మూర్ఖమత సిద్ధాంతమే సమగ్ర మత సూత్రం కాదు./అది కేవలం గుంపు పొగరుబోతు తనం/వంచన అనే పవిత్ర గ్రంథాలలోనూ/పిడి వాదులను మతమూర్ఖులను/దుష్టశక్తి శిష్యులని పేర్కొన్నాయి/సృష్టికర్త కేవలం ఒక్కడే ఏ మతమూ అంతకన్నా ఎక్కువ చెప్పదు/ ఆయన సమస్త సృష్టికి అత్యున్నత అధినేత/ కాని ఎవడైనా సైతాన్ తన అజ్ఞానంతో/ సత్యం మీద తనకే గుత్తాధిపత్యం ఉన్నదంటే/ అల్లాకు మాత్రమే అతని గురించి తీర్పు చెప్పే అధికారం ఉందని ఖురాన్ పేర్కొంది’ అంటాడు.
ఈ దేశంలో సమానత్వం పాటపాడిన గొప్ప కవి కాజీ నజ్రుల్ ఇస్లాం..ఆయన ఆలోచనలు ఈదేశ ప్రగతిశీలవాదుల ఉద్యమానికి దారులు పరుస్తాయి. ప్రతివొక్కరూ చదవాల్సిన కవిత్వమిది..