ఇవ్వాల్టి సగటు ముస్లిం జీవితం ఈ కథలో ఉంది.
నేటి పెహెల్గాం సందర్భమే కాదు. నిన్నటి కరోనా సందర్భమూ కూడా ముఖ్యంగా మోషాల నాయకత్వంలో బీజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భయం! అభద్రత! మరీ ఎక్కువయ్యింది.
చదువుకున్నవారు చదువురానివారు అనే తేడా లేదు. వయసు బేధం అంతకూ లేదు. మతం మత్తు ఎక్కితే చాలు.
అందులో భాగమే చదువుకున్న రఘు”రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్లా వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట”
అంతా “అట” ప్రచారమే.
వాస్తవ పరిశీలన ఉండదు. మంచీ చెడుల ఆలోచన ఉండదు. నిజనిజాలకు తావేలేదు. అంతా ఏప్రిల్ ఫస్ట్ నాటి ఏప్రిల్ ఫూల్ ప్రచారాలే.
“నేరస్తుల్ని” చట్ట ప్రకారం శిక్షించకుండా చంపెయ్యడానికి ఈ మధ్యకాలంలో సీన్ రికన్స్ట్రక్షన్ ఒక సాధనమయ్యింది.
ఆ మధ్య వరంగల్ జైల్లో ఉన్న “ఉగ్రవాదులను” సీన్ రికన్స్ట్రక్షన్ పేరుతో చంపేయడం జరిగింది.
ఆ సందర్భంలో నల్గొండ నుండి హైద్రాబాదు వచ్చి భారంగా బతుకు బండి నడుపుతున్న సగటు ముస్లిం అనుభవించిన భయం! అభద్రతా భావాన్ని….ఈ కథలో చూడొచ్చు. సగటు ముస్లిం జీవితంలోని ఆందోళన ఇది . యుద్ధం పేరుతొ ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగిందో ఊహించవచ్చు . మన ఇరుగు పొరుగున ఉన్న మనుషుల ప్రపంచం ఈ కథలో లాగే ఉంది . ఇది చాలా చిన్న కథే . కానీ ఆ ప్రపంచాన్నంతా పట్టి ఇస్తుంది . అందుకే సాగర్ కథ ….భయం! అభద్రత! మరోమారు నెమరేద్దాం.
భయం, అభద్రత
సాగర్
ఎగ్జామ్స్ అయిపోయాయి. అందరం ఎవరి హడావిడిలో వాళ్లం ఉన్నాం. ఇంటికెళ్ళటానికి తొందరపడుతున్నాం.
నేను, రఘు బస్టాప్ వైపు నడుస్తున్నాం. రోజూ మేం ఇలా కలిసి వెళుతుంటాం.
‘రఘూ.. ఎగ్జామ్స్ ఎలా రాశావ్’ అని అడిగాను.
తను బాగానే రాసి ఉంటాడని నాకు తెలుసు. చాలా తెలివైనవాడు. చదువులోనేగాక కరెంట్ ఇష్యూస్లో కూడా ఇంట్రెస్టు ఉంటుంది. మేమిట్లా కలిసి నడుస్తున్నప్పుడు ఎన్నో చెబుతుంటాడు. అందుకే నాకు తనంటే చాలా ఇష్టం.
‘అంత బాగా రాయలేదు. నిన్న మా అన్నయ్య ఆర్ఎస్ఎస్ వాళ్ల మీటింగ్ ఉందని పిల్చుకెళ్లాడు. ఇంటర్నల్ ఎగ్జామ్సే కదా రమ్మన్నాడు. దాంతో సరిగా ప్రిపేర్ కాలేదు…’ చెప్పాడు రఘు.
రఘు వాళ్లన్నయ్య ఆర్ఎస్ఎస్ అని నాకు తెలియదు. మా మాటల్లో కూడా ఎన్నడూ రాలేదు. రోజూ న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో ఆర్.ఎస్.ఎస్. గురించి చూస్తుంటాను.
అందుకని ఆసక్తిగా ‘అక్కడ ఏం చెప్పారు?’ అని అడిగా.
‘రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్ల వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట. అందుకే ముస్లింలను జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. ఎవరైనా అనుమానంగా అనిపిస్తే ఆర్.ఎస్.ఎస్. వాళ్లకు చెబితే వాళ్ళ సంగతి చూస్తామన్నారు. అవసరమైతే మమ్మల్నే చూసుకోమన్నారు, తరువాత ఏమి జరిగినా వాళ్లు వస్తామన్నారు’
నేను షాకయ్యాను. రఘు ఇలాంటివి మాట్లాడతాడని ఊహించలేదు. నేను వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. ఒక నిమిషం తర్వాత…’ మీరు ఇలా చేయడం తప్పు కదా?’ అన్నాను.
దానికి రఘు సీరియస్ గా రియాక్టయ్యాడు.
‘ముస్లింలనే కాదు.. ఎవరైనా సరే హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడితే కొట్టి చంపమన్నారు..’
మామూలుగా అయితే రఘు ఇట్లా మాట్లాడంగ నేను చూడలేదు.
‘మీరు ఇలా చేస్తే వాళ్ళు పోలీసులకు కంప్లైట్ ఇవ్వరా?’ అని అడిగాను.
‘గవర్నమెంట్ ఆర్.ఎస్.ఎస్. చేతిలో ఉంది. ఇంకెవరు ఏం చేస్తారు’ నిర్లక్ష్యంగా అన్నాడు.
నాకు తన మాటలు నచ్చలేదు. ఎవరో ఏదో చేశారని ముస్లింలందరినీ ఇలా అనడం మంచిదేనా? అనే డౌట్ వచ్చింది. నేను ఆలోచించుకుంటూ ఏమీ అనకపోయే సరికి రఘు ‘ఆర్.ఎస్.ఎస్., బిజెపి వాళ్లే కాదు. పేపర్స్, న్యూస్ ఛానల్స్లో కూడా ముస్లింలు చేస్తున్న పనులను చూపిస్తున్నారు కదా?. వాళ్ళు అబద్ధాలు చెబుతారా?’ అన్నాడు.
దీంతో నాకు కొంచెం కోపం వచ్చింది. వీడేంది ఇట్ల తయారయ్యాడని భయం కలిగింది. అయితే ఇంకేమైనా మాట్లాడితే గొడవ అవుతుందేమోనని మౌనంగా ఉండిపోయాను. తన మాటలు నాకు నచ్చలేదనే సంగతి రఘు గుర్తించినట్లుంది. ఇంకా కొనసాగించలేదు. మా ఇద్దరి మధ్య నిశబ్ద వాతావరణం ఏర్పడిరది.
మౌనంగానే బస్టాప్కి చేరుకున్నాం.
బస్సులో కూర్చున్నాక రఘు మళ్లీ మొదలు పెట్టాడు. తను మామూలుగా అంతే. ఏదైనా మొదలు పెట్టాడంటే చాలా చెబుతుంటాడు. నాకు తను చెప్పేవి వినడం ఇష్టం. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నవి నచ్చడం లేదు.
రఘు మాటలు వింటుంటే వీడు ముస్లింలందరిని తీవ్రవాదులనుకుంటున్నాడా? అని భయం కలిగింది. వీడి మాటలు వింటుంటే మా ఊర్లో ఈ మధ్య జరిగింది గుర్తొచ్చింది.
మా ఊరు పేరుకే పల్లెటూరు కాని చాలా కంపెనీలు ఉన్నాయి. పత్తి, పొగాకు, ఆయిల్ కంపెనీల్లో పని చేయడానికి ఉత్తరాంధ్ర, ఒరిస్సాల నుంచి కూలీలు వస్తారు. అలా వచ్చిన వారు మా ఊరి జనాభాలో సగానికి పైగా ఉంటారు. అంత మంది బయటివాళ్లు ఉన్నా మా ఊళ్లో ఏ గొడవలూ జరగవు. అందరూ ప్రశాంతంగా ఉంటారు.
అలా వచ్చిన వారికి ఏదైనా డబ్బు అవసరమైతే ఫైనాన్స్ తీసుకునేవారు. ఫైనాన్స్ వాళ్లు ఆధార్ కార్డు జిరాక్సు తీసుకుని అప్పు ఇచ్చేవారు. నేను సెలవులకి ఊరికి వెళ్లినప్పుడల్లా మా ఫ్రెండ్ నెట్ పాయింట్లో కూర్చునేవాడిని.
గత వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లినపుడు ఎప్పటిలానే ఉదయం అక్కడికి వెళ్లాను. టీవీలో న్యూస్ చూస్తున్నాను. సెలవులు కావటంతో పిల్లలందరూ వీడియోగేమ్స్ ఆడుకోడానికి వచ్చారు. దీంతో షాపంతా గొడవ గొడవగా ఉంది.
కస్టమర్ రావటంతో మా ఫ్రెండ్ పిల్లలను గొడవ చేయవద్దని చెప్పి అతనికి ఏం కావాలో అడిగాడు. ఇంతలో ఒకతను వచ్చి జిరాక్సు కోసం నిలబడ్డాడు. అతని డ్రస్సు చూడగానే ఆటో డ్రైవర్ అని అర్థమౌతుంది. అతని ముఖం పీక్కుపోయి బాధలో ఉన్నట్టు కనబడిరది. ముస్లింలా ఉన్నాడు. అతను ఆధార్ కార్డులిచ్చి ఒక్కొక్కటి ఐదు జిరాక్సులు తీసి ఇవ్వమన్నాడు. అందులో మూడేళ్ళ చిన్నపిల్లాడిది కూడా ఉంది.బయట ఎవరో ముగ్గురు వ్యక్తులుండి ఇతనిని తొందరపెడుతున్నారు. వాళ్లు ఫైనాన్స్ ఇచ్చే వాళ్లేమో అనుకున్నాను.
అందుకని ‘ఫైనాన్స్ తీసుకుంటున్నారా?’ అని యథాలాపంగా అతడ్ని అడిగాను.
దానికి అతను ఏమి మాట్లాడలేదు. అయితే తనలో తానే బాధపడుతున్నాడని అర్థమైంది.
మా ఫ్రెండ్ జిరాక్స్ కాపీలు తీసి అతనికి ఇచ్చాడు.ఆయన ‘ఇవి వాళ్లకు ఇచ్చి వచ్చి డబ్బులు ఇస్తా’ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ ముగ్గురు దేని గురించో ఇతనితో మాట్లాడుతున్నారు. రెండు నిమిషాలు ఉండి వాళ్లు వెళ్లిపోయారు.
ఇతనొచ్చి డబ్బులిస్తుంటే ‘అప్పు ఇవ్వడానికి ష్యూరిటీ అడుగుతున్నారా?’ అని అని అడిగాను. నాకు అతడి గురించి తెలుసుకోవాలని చాలా ఇదిగా ఉంది. ఆయన ముఖంలోని దయనీయత నన్ను ఊరకే ఉండనివ్వలేదు.
ఈసారి ఆయన లేదన్నట్టు తలూపాడు.
టివిలో మోదీ ఉపన్యాసం వస్తోంది. నేను ఆ వైపు కూడా ఓ చెవి వేసి వింటున్నాను. ఇంకో కస్టమర్ ‘ఈయన వచ్చాక రోజూ టివిలో కనపడుతున్నాడు. కానీ ఏమి చేస్తున్నాడో అర్థం కావటంలా. రోజుకో దేశం తిరుగుతూ మాటలు మాత్రం భలే చెప్తున్నాడు’ అని వెళ్లిపోయాడు.
ఈ మాటలకు ఇంతక ముందు జిరాక్స్కు వచ్చిన ముస్లిం ‘ఈసాబ్ వస్తే మమ్మల్ని పట్టించుకోడు అనుకున్నాము కాని మమ్మల్ని ఈడ బతకనిచ్చేట్టు కనబడ్డలేదు’ అన్నాడు.
ఈ మాట నాతో అన్నాడో, తనలో తానుగా అనుకున్నాడో తెలియలేదు.
ఆయన గురించి తెలుసుకోవాలనిపించింది.
‘ఏమైంది మీకు?’ అని అడిగాను.
‘మాది నల్గొండ. ఆక్కడ గడవక ఈడ బంధువులుంటే సంవత్సరం క్రితం ఆటో నడుపుకుందామని వచ్చినాం. మొన్నటి దాకా బానే ఉంది గాని. వరంగల్ జెయిలు నుంచి నలుగురిని కోర్డుకు తీసకపోతూ మధ్యలో పోలీసులు నల్గొండ దగ్గర కాల్చేశారు కదా. నల్గొండ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ చనిపోయిన వాళ్లతో సంబంధాలు ఉన్నాయా? అని పరేషాన్ చేస్తున్నారు. వారం వారం ఇంట్లో వాళ్ళందరం పోయి సంతకాలు పెట్టి రావాలంట, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలంట లేదంటే జైలులో పెడతామంటున్నారు.చివరికి ఐదేళ్ళ పిల్లాడిని కూడా స్టేషన్కి తెమ్మంటున్నారు. మా ఇంటికి పోలీసులు వచ్చినప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్లు మమ్మల్ని చూసి భయపడుతున్నారు. అసలు మాట్లాడటమే లేదు. పోలీసులకు తోడు పేపర్లు, చానళ్ల వాళ్లు కూడా…’ అని కంటతడి పెట్టాడు. నేను ఆయనట్లా చూడలేకపోయాను.
రఘు ముస్లింల గురించి మాట్లాడుతోంటే నాకు ఇదంతా గుర్తు వచ్చింది. తన మాటలు వినడం లేదని రఘుకు అర్థమైనట్టుంది.
‘ఏం ఆలోచిస్తున్నావు?’ అని అడిగాడు.
నేనేమీ చెప్పలేదు. స్టాప్ వచ్చింది.
‘వెళదాం పదా’ అని రఘు అనడంతో ఇద్దరం దిగాం. తనకు బాయ్ చెప్పి ఇంటికెళ్లాను. కానీ రఘు మాటలే గుర్తుకు వస్తున్నాయి. మా ఊళ్లో ఆ ముస్లిం కంటతడి, ఆందులోని భయం నన్ను అంతకంటే వెంటాడుతున్నాయి.
వార్తలు చూద్దామని టివి పెట్టాను. దీపావళి నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసు అధికారి చెబుతున్నాడు. ముఖ్యంగా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై నిఘా పెట్టినట్టు తెలిపాడు. ఆయన మాటలు వింటుంటే ముస్లింలంటే తీవ్రవాదులని నేరుగానే అంటారేమో అనిపించింది. ఛానల్ మార్చాను.
అరుణతార డిసెంబర్ 2015
మీరు రాసింది తప్పు….కమ్యునిజం నాకు ప్రాణం కానీ ముస్లిం లు అందరు తప్పు కాదు కానీ తప్పు చేసిన వారందరు ముస్లిం లే