‘ఏప్రిల్ అత్యంత క్రూరమైన మాసం’
వాళ్ళకు ఆమె మీద చాల కోపంగా ఉన్నది
ఎర్రటి ఎండల్లో ఎర్రెర్రని జెండా కప్పించుకోడానికి
విప్లవపాటలు పాడించుకోడానికి
అమర కామ్రేడ్ అనిపించుకోడానికి
నీ ఆశయాలను కొనసాగిస్తామని
ప్రతిజ్ఞ చేయించడానికి
సాయుధ పోరాట ప్రగల్భాలు
ప్రచారం చేయడానికి
మారిన పరిస్థితుల్లో లొంగిపోకుండా
ఎన్‌కౌంటర్ ఎంచుకున్నందుకు
వాళ్ళకు ఆమె మీద
చాల చాల కోపంగా ఉన్నది
అన్నింటికన్న మించి ఇపుడు
ఆమె ఎలాగూ ఈ కీర్తనగీతాలు వినలేదుగానీ
తాము వినాల్సి వస్తున్నందుకు
తాము చూడాల్సి వస్తున్నందుకు
చాల చాల కోపంగా ఉన్నది
వాళ్ళను చాలామంది ఇపుడు
మార్చ్ 31 తర్వాత దొరికి
లొంగిపోనంటే చంపకండి
జైల్లో పెట్టండి అని అడుగొచ్చు కదా
అంటున్నారు
అది చాలా ఇబ్బందిగా ఉంది.
వాళ్ళ కిపుడు ఏప్రిల్ 22 కన్నా
మార్చ్ 31 పవిత్రమైన దినమైంది
పార్టీ నిర్మాణం చేసి
రాజ్యంపై సాయుధంగా విప్లవించే రోజుకాదు
‘ఆత్మ సమర్పణ’ చేసుకునే దినం
వాళ్లకిపుడు ఏప్రిల్ 20
ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల
సంస్మరణ దినం కాదు
‘జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ –
ఎవరి సమస్య – ఎనిమిది శాతం
అడవి మనుషుల సమస్య’
వికసిత్ భారత్ ముందు
జనతన రాజ్యం ఏ పాటిది
వాళ్ళు జనమూ కాదు,
అది రాజ్యమూ కాదనుకొనే కదా
వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసింది
వాళ్లకిపుడు దండకారణ్య పర్‌స్పెక్టివ్ కాదు
సూరజ్‌కుండ్ వ్యూహం
సూర్జాగడ్ లాయిడ్స్
రచించిన ‘రాజ్యాంగం’ భావి కార్యాచరణ దర్శిని
దాన్ని గుండెలకు హత్తుకుంటారు వాళ్ళు
స్టేక్ హోల్డర్స్ ఏమొచ్చె
‘షేర్ హోల్డర్స్, యజమానులూ
అవుతారు వాళ్ళు’
కనీసం దళారులైనా అవుతారు
ఆమె గిరాయిపల్లి అమరుల నుంచి
బాబూరావు, సముద్రుడు, భాను,
మహేందర్, అప్పారావు, కౌముది,సుగుణల
దారి ఎంచుకున్నట్లున్నది
మెతుకుసీమ దారి బతుకుబాట అయ్యే
మార్గం ఎంచుకున్నట్లున్నది
చారు మజుందార్ నుంచి తన
సహచరుడు అమరుడు సుంకాలు
త్యాగం ఎంచుకున్నట్లున్నది
ఆమె నక్సల్బరి మహిళల, పిల్లల
అమరత్వం రచించిన
ఆదివాసీ మహిళ
ఆధునిక మహిళ అయిన
మావోయిస్టు మార్గం ఎంచుకున్నది
‘అభాగ్య జీవుల భాగ్య యుగానికి’ భాగ్య
మావోయిస్టు రూపిగా ఆమె రాజ్యాన్నే కాదు
లొంగిపోయిన అధినాయకత్వాన్ని
ధిక్కరించింది.
(భాగ్య @ రూపి స్మృతిలో)
17 ఏప్రిల్ 2026
-----
*April is the cruelest month – టి.ఎస్.ఇలియెట్
Related