అర్ధాంతర భౌతిక నిష్క్రమణల వెనుక ఏ కారణాలు ఉంటాయి. పుట్టుక ,మరణానికి ఈ మధ్య ఉన్న విరామమేదో ప్రేరేపించవచ్చు. ఈ జీవితం ఇక చాలు అనిపించవచ్చు. ముగింపునకు మనిషి సిద్ధం చేసుకోవచ్చు. తనకి ఈ ప్రపంచం నచ్చలేదని, అసంతృప్తి ఉందనే,భావన కలగవచ్చు. భౌతిక నిష్క్రమణ తన అంతరంగ ఘర్షణ కావచ్చు .
మనిషి వెళ్ళిపోయాడు. సాధారణ మరణం అయితే, ఆకస్మిక మరణం అయితే, యాక్సిడెంట్ అయితే, లేదా హత్యకు గురి అయితే మరణం తర్వాత మన దుఃఖ సమయాల తీవ్రత ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి మరణానికి ఒక దుఃఖపుకొలత ఉంటుంది. ఆ కొలతలతో ఆ మనిషి పట్ల చివరి అంకాన్ని ముగిస్తాము. చివరకు జ్ఞాపకమై, మన జ్ఞాపకాల్లో అతని భౌతిక రూపం కనబడుతుంది .మనుషులు తమ భౌతిక నిష్క్రమణ వరకు జ్ఞాపకాలనుమోస్తారు.
అర్ధాంతర భౌతిక నిష్క్రమణ తర్వాత అనేక విశ్లేషణలు కొనసాగుతాయి. మన నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన మనిషి గురించి మన అంచనాలు మనకు ఉంటాయి .కుటుంబం, అతని సాహచర్యంలోని, వ్యక్తులు అతను లేదా ఆమె పడిన మానసిక హింస. జీవితం కూడా పోరాటం బహుశా ఆ పోరాటం చేయలేక ఓడిపోయారని మన అంతిమ తీర్పులు ఉంటాయి .అనేక వాస్తవికతలు వెనుక అసలైన వాస్తవికత ఉంటుంది. అది మానవ ఆలోచనా సరళికి అందదు. నూరేళ్ల కాలవ్యవధిలో అనేక భౌతిక నిష్క్రమణలను విని ఉంటాం. దగ్గరగా చూసి ఉంటాం.కుటుంబంలో చిన్న, చిన్న మానసిక సంఘర్షణలు దాటలేని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన వారు ఉంటారు. ఎందుకు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారనే భావన మనలో కలగవచ్చు. ఇక్కడ జీవితం విసుగనిపించింది. ప్రపంచంతో తాను కనెక్ట్ కాలేకపోతున్నాడా! జీవితానికి ముగింపును తనే ఎందుకు నిర్ణయించుకుంటున్నాడు.
మానసిక శాస్త్రవేత్తలు అన్నిటికీ మనసే కారణమంటారు .అయితే మానసిక సంఘర్షణకు కారణం భౌతిక జీవనమే. చావుకొరకు ఎవరు ఎదురుచూస్తారు. వ్యక్తి చుట్టూ చేరిన మనుషులు ఈ మనుషుల ప్రవర్తన వెనుక, కుటుంబం ,ఆర్థిక కారణాలు ఉండవచ్చు .
సుదీర్ఘకాలం రాజకీయాల్లో మరీ ,ముఖ్యంగా విప్లవ రాజకీయాల్లో పనిచేస్తూ నాయకత్వంలో ఉన్న నాయకుల అర్ధాంతర భౌతిక నిష్క్రమణకు కారణాలను ఎలా వెతకాలి. సుదూరదృష్టి, మానవ సంబంధాల విషయంలో అవగాహన, రాజకీయ సామాజిక చలనం పట్ల జాగరుగత ఉన్న నాయకుడే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుంటే దాని వెనుక ఉన్న ఖాళీలను ఎలా అంచనా వేయాలి. తమ జీవన కాలంలో అనేక ప్రజా ఉద్యమాలతో మమేకమై, ప్రజలలో ఒకరిగా నిలిచిన నాయకుడి హృదయంలో మరణించాలనే కోరిక ఎందుకు ధ్వనించింది. బతుకు ఆశ,ఆశయం అని నిరూపించిన నాయకుడు తన వ్యక్తిగత జీవితం లోనే ఓడిపోయారు అనే భావనతో ఒంటరితనానికి లోనై భౌతిక నిష్క్రమణ గురించి ఆలోచన చేస్తే ఎక్కడ లోపం ఉన్నది .తన అధ్యయనం, ఆచరణ అన్నిటిని మించి ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ రాజ్య ధిక్కరణ ఇవన్నీ కలగలిసిన మానవుడిలోఎందుకు మరణించాలనే కోరిక కలుగుతుంది.
కాలగమనంలో చాలా భౌతిక నిష్క్రమణలు జరిగాయి .ఇందులో మహిళలు వాటా ఎక్కువ. కుటుంబ శారీరక మానసిక హింస ఇక్కడ ప్రధానమైన విషయం. స్త్రీ మొట్టమొదటి బాధితురాలు. స్త్రీల భౌతిక నిష్క్రమణకు ,రాజకీయ పరిణితి చెందిన వ్యక్తుల భౌతిక నిష్క్రమణకు స్పష్టమైన విభజన రేఖ ఉన్నది. మనసుకు సంబంధించిన నిర్వేదం , ఒంటరి తనం అన్ని ఒకే విధంగా ఉండవచ్చు. కాని రాజకీయ కార్యాచరణలో ప్రేరేపిత భౌతిక నిష్క్రమణలకు కారణాలు వెతకాలి. డబ్బు ప్రధాన కారణం. కుటుంబ ఆవరణ చుట్టూ గౌరవం, ఆశ, ధనం ఈ మూడు కలగలిసిన బంధువులు, కుటుంబ సంబంధాలు .అవి రాజకీయ అవగాహన కలిగిన కుటుంబాలైనా సరే ఈ విలువ ధనఆధారతమే
‘జాతస్యః మరణం ధృవమ్’ ఈ శ్లోకం పండిత భావన కావచ్చు. పుట్టుక, మరణము దీని మధ్య గడిచిన జీవితం గురించి సమాజం మాట్లాడుతుంది. కమ్యూనిస్టు రాజకీయాలలో పనిచేసిన వ్యక్తి అర్ధాంతరం నిష్క్రమణ వెనుక ప్రజల అంచనాలు ప్రజలకు ఉంటాయి. ఆలోచన జీవులుగా మన అంచనాలు సరే.విప్లవ రాజకీయాలను బయట నుండి చూస్తున్న వాళ్ళు సహజంగానే స్పందిస్తారు .వారికి ఒక ఆసరా దొరికింది. ఓటమి చెందుతున్న ప్రతి చర్య వెనుక వారి ఆలోచన ధోరణి ఉంటుంది. అది పరాయికరించబడిన కృత్రిమ ఆనందం.మిగతా శ్రేణుల నుండి వారికి మద్దతు లభిస్తుంది .కాని జీవితం కదా! విప్లవ రాజకీయాలలో ఉన్న వ్యక్తులు ఎంత సున్నితంగా ఉంటారు. ఆ సున్నితత్వం వెనుక భౌతిక నిష్క్రమణ అనే భావన కూడా దాగి ఉండవచ్చు.
రక్త మాంసాలతో తయారైన మనిషిని సమాజం, ఆచరణ, అధ్యయనం అతనిని దృఢంగా చేయవచ్చు. ఎక్కడో ఒక చోట చిన్న ఓటమి వుంటుంది. ధనం మిగిల్చిన విలువ. మళ్లీ కుటుంబం, సమాజం హేళన చేసే క్రమం ఉంటుంది. నేటి కాలాన్ని దాని చలనాన్ని విస్మరిస్తూ తుది తీర్పులు ప్రకటిస్తాము. చివరి క్షణం వరకు మనిషి జీవించాలని ఆశిస్తాడు .ఎవరు అర్ధాంతరంగా భూమిని ఖాళీ చేయాలని అనుకోరు. సామాజిక ఆవరణలో తాము ఊహించిన స్వప్నం ముక్కలు కావడం కూడా. ఒకే కాలంలో అనేక సంవేదనల అంతర్మధనం ఒక కారణం. మృత్యువును ఆహ్వానిస్తున్నారంటే, మానవుడిలోని మానసిక సున్నితత్వం ముందు అన్ని అపజయం చెందాయి.జీవించి ఉన్న మనుషులతో సహా.
అర్ధాంతర భౌతిక నిష్క్రమణలు విప్లవ రాజకీయాల్లో ఉన్నాయా! అధికార రాజకీయాల్లో ఉన్నాయా! ఈ భౌతిక నిష్క్రమణలకు తూకం రెండు వైపులా ఉంది. అధికారాన్ని అనుభవించినవారు దానికోసం హత్యలు చేసిన వారు. తమ ఇంటిలోనే మానవహననానికి పాల్పడినవారు రాజకీయాలలో ప్రజల స్వీయ రక్షకులుగా కొనియారబడుతున్నారు. ఆ చట్రంలో భౌతిక నిష్క్రమణలు చాలా తక్కువ. రచయితలు, ఉద్యమకారులు చిత్రకారులు, కళాకారులు భిన్న సాంస్కృతిక వారసులు అర్ధాంతర నిష్క్రమణను అంచనా వేసినప్పుడు, సరైన తూకం అవసరం . మానవ ప్రవృత్తి ని సామాజిక తలం నుండి అంచనా వేయాలి. జీవితం ఇంత సంక్లిష్టంగాఎందుకు మారింది. కుటుంబము, రాజకీయాలు లేదా ఆశయాల సమతుల్యతలో అంతరమున్నదా. ఘర్షణ ఉన్నదా. వస్తు వినియోగ సంస్కృతి యొక్క విలాపం జీవితాలలోకి ప్రవేశించిందా. అసలు చికిత్స ఎక్కడ అనే ఆలోచన చేయగలిగితే భౌతిక నిష్క్రమణనకు గల కారణాలను విశ్లేషించగలుగుతాము. లోతైన పరిశీలన లేకుండా అర్ధాంతర భౌతిక నిష్క్రమణలను ఆయా వ్యక్తుల మానసిక బలహీనతగా అంచనా వేయకూడదు .బహుశా ఆ బలహీనత కూడా సామాజిక తలం నుండి అల్లుకున్నదే. ఇక్కడే మార్క్స్ నిర్వచించిన మాటలను అనువర్తింపజేయడం అవసరం. ప్రతి యుగంలోనూ పాలకవర్గ భావనలే పాలక భావనలుగా ఉంటాయి. అంటే సమాజపు భౌతిక శక్తిని పాలించే వర్గమే. అదే సమయంలో దాని మేధోశక్తిని కూడా పాలిస్తుంటుంది ఉత్పత్తి సాధనాలు దేని అందుబాటులో ఉంటాయో ఆ వర్గం అదే సమయంలో మానసిక ఉత్పత్తి సాధనాలపై కూడా అదుపు కలిగి ఉంటాయి. సాధారణంగా చెబితే మానసిక ఉత్పత్తి సాధనాలు లేని భావనలు ఆ వర్గాలకు ఆధీనమై ఉంటాయి. మార్క్స్ భావనలు అంగీకరిస్తే ఇవాల్టి భౌతిక నిష్క్రమణలను వర్గాలకు అతీతంగా అంచనా వేయవలసి ఉంటుంది. పెట్టుబడి ఏ వర్గాన్ని అయినా ఈ అంచులు దాకా తీసుకొని వెళ్ళగలదు కోటీశ్వరుడు, రాజు, సామాన్యుడు ఉద్యమకారుడు ,రచయిత ఇక్కడ మినహాయింపు కాదు. ఈ సమాజపు వ్యక్తీకరణలో ఉంటాయి. అట్లా ఈ అర్ధాంతర మరణాలను చూడవలసి ఉంటుంది.