(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట)
కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్ మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది. కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే కథ సాంద్రమౌతుంది. ఒక సామాజిక సంఘటనని లేదా ఒక జీవిత అనుభవాన్ని కవిత్వంగా మలచే సందర్భంలో కథన శైలిని ఆశ్రయిస్తే ఆ కవితలో వాస్తవికత పాలు పెరిగే అవకాశం వుంది.
కవిత్వ భాషాభివ్యక్తిలో తార్కికత లేకున్నా ఫర్వాలేదు. పైగా అలా లేకుండటం వొక అలంకారం. కథలో వాక్యం తర్క బద్ధంగా వుండటం అగత్యం. కవిత్వంలో ప్రతీకల వెనకో అలంకారాల వెనకో దాగి వుండే అవకాశం తక్కువ. కథలో పాత్రల వెనక దాగి వున్నా రచయిత కంఠ స్వరం తెలిసిపోతుంది. అలా అన్జెప్పి చేయి తిరిగిన రచయితలు కథలో ప్రతీకాత్మకత అసంబద్ధత వంటి ప్రయోగాలు చేయకుండా వుండరు. రచయిత రెండు ప్రక్రియలూ సాధన చేసినప్పుడు కొత్త ప్రయోగాలకు అవకాశం వుంటుంది. కథలో కవిత్వ పరిమళం కథనాన్ని తప్పకుండా యేదో మేరకు సౌందర్య భరితం చేస్తుంది. ఒక్కోసారి పేరాలు పేరాల్లో వచనంలో చెప్పలేని విషయాన్ని వొక్క కవితాత్మక వాక్యం ద్వారా వ్యక్తీకరించగలగడం చూస్తాం.
కవిత్వం క్లుప్తతను గాఢతను కోరుకుంటుంది కాబట్టి కథలో వాటికి ప్రాధాన్యం లభిస్తుంది. కథనం చిక్కబడుతుంది. కవిత్వంలో వుండే వుద్వేగగుణం కథని ఆశ్రయించడం వల్ల కథనం పదునెక్కుతుంది. వేగవంతమౌతుంది. పాఠకుల హృదయాలకు చేరువై ఆత్మీయమౌతుంది. అయితే ఇందుకు ప్రతిగా కథా రచనతో సాన్నిహిత్యం పెరిగి వచన మోహంలో పడ్డ కవి వాక్యం కవిత్వంలో పలుచబడే అవకాశముంది. కవిత్వంలో వచనమై పోయే ప్రమాదం వుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాహిత్య సవ్యసాచులుగా కొందరే రాణించగలరు. ఆ కొందరిలో బాల సుధాకర్ వొకడు.
***
కవిత్వంలో చెప్పలేని అంశాల్ని చెప్పడానికి కథను వాహికగా చేసుకున్నాం అన్నది కవులు సాధారణంగా అనేమాట. కానీ యెక్కడైనా ప్రక్రియ ముఖ్యం కాదు. రచయిత రచనా దృక్పథం ముఖ్యం. ఆ దృక్పథంలో మనిషి ముఖ్యం. మానవ సంబంధాలు ముఖ్యం. మనిషి జీవితంలో యెదురయ్యే ఆనంద విషాదాలు సమస్త సంవేదనలు వుద్వేగాలు విలువల మధ్య చోటుచేసుకునే సంఘర్షణలు .. వాటిని బలంగా వ్యక్తీకరించగలిగినప్పుడు సాధనం యేదైనా పఠితల హృదయాన్ని తాకగలదు. ఈ యెరుక సుధాకర్ లో బలంగానే వుంది.
‘ఉత్సాహపు రెక్కలు కట్టుకుంది ఊరు ఊరంతా’
‘అడవి నెత్తురంతా థింసా రంగే’
‘తూర్పు .. కొండ వాకిలికి సింధూరం పూసింది’
‘కొండే .. వారి బతుకుల్లోకి తొంగిచూసే చీకటి వెలుగులుకి సాక్షి’
కవి కథకుడైతే అతని కథన శైలి యిలా ఉంటుంది. ఇటువంటి కవితాత్మక వర్ణనా వాక్యాలు కథలో వొక వాతావరణాన్ని యేర్పరచడానికి వుపయోగపడతాయి. అలాగే పాత్రల్ని రూపు కట్టించడానికీ వారి ప్రవర్తనకు అద్దంపట్టడానికి కవిత్వ భాష కథలో యెంత చక్కగా అల్లుకుపోతుందో చూడండి.
‘పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా ..
తీగె పవిటంచుకు పూసిన ఎర్రటి పువ్వులా’
కొండపిల్ల పార్వతి వర్ణన యిది. భూషణం అప్పలనాయుడు సువర్ణముఖి మల్లిపురం జగదీష్ మౌళి .. కళింగాంధ్ర కథకుల వచనంలో కవిత్వ ధోరణి యిలా వొక సహజ పరంపరగా కొనసాగుతున్నట్టుంది. ఆధునిక వచనంలో మనం యీ తేడాలను ప్రత్యేకంగా గుర్తిస్తున్నాం గానీ ప్రాచీన ఆలంకారికులు గద్యరచనే కవిత్వానికి గీటురాయి అని భావించారు.
వాస్తవానికి మౌళి పుష్కర కాలం కిందటే కథలు చెప్పడం మొదలెట్టాడు (2012). తొలినాళ్లలో తాను దగ్గరిగా చూసిన గిరిజన జీవితాన్ని అతను కథలుగా మలిచాడు. థింసా అడుగులు, కొండపిల్ల, ఎరుకల రాముడు ఆ క్రమంలోనే వచ్చాయి. ఆ తర్వాత కరోనా కాలంలో మనిషి, మనిషితనం మరణిస్తున్న వేళ మానవసంబంధాలు లుప్తమౌతున్న చోట మనుషుల మధ్య ‘వుండాల్సిన’ మానవీయ విలువల్ని యెత్తిపట్టడానికి అతను కథను మాధ్యమంగా యెన్నుకున్నాడు (చీమలు). నిజమే మనలోని కొందరే (వాళ్ళ పేర్లన్నీ రచయిత ప్రస్తావించాడు) కానికాలంలో ప్రాణాలకు తెగించి వలస కార్మికులకు అండగా నిలిచి వాళ్ళు తమ సొంత యిళ్ళకు చేరేందుకు సహకరించారు. ‘మడిసితనం’ మీద నమ్మకం కల్గించిన వాళ్ళూ, వాళ్ళలాంటి మరెందరో అతని కథలకు స్ఫూర్తినిచ్చారు. ఈ సంపుటిలో తాము నమ్మిన విలువలకు కట్టుబడి వుండటానికి సంఘర్షించే ప్రధాన పాత్రల్ని చూసినప్పుడు ఈ విషయాన్ని గమనించగలం.
గదబ సముదాయానికి చెందిన గిరిజన సామూహిక సాంస్కృతిక జీవితమే మౌళి రాసిన తొలినాటి కథల్లో ప్రధాన నేపథ్యంగా కనిపిస్తుంది. థింసా కొండకూ పల్లానికీ ముడివెట్టే సాధనం. అడవి బిడ్డలు థింసా ఆడటానికి పల్లపు ఊర్లకు దిగివచ్చినా ‘పల్లపోల సెడి బుద్దుల్ని నేర్చి కొండకు మోసుకుపోగూడదు’(థింసా దారిలో). ఇది కొండ పెద్ద ఈడ ఉంబయ్య హెచ్చరికే కాదు; రచయితగా మౌళి ఆశయం కూడా. ఈ యెరుక వున్నప్పటికీ విశృంఖలంగా వెల్లువలా విజృంభించే సాంస్కృతిక దాడిలో పరాయీకరణకు గురి కాకుండా స్వీయ అస్తిత్వాన్ని ఆదివాసీలు యే మేరకు కాపాడుకోగలరన్నది ‘మిలియన్ డాలర్ల’ ప్రశ్న.
కొండపిల్ల కథలో పార్వతి యీ అంశాన్ని సరిగానే గుర్తించింది. సమస్త బాధల్నీ మరపించే వుపశమనం, ప్రాణంలో ప్రాణం, ఆదివాసీ సహజసిద్ధమైన థింసా ‘కళ’ కేవలం ఆకలితీర్చే ఆటగానే మారిందని పార్వతికి బెంగ. ‘దిగువ ఊర్ల గురించి ఆ మనుషుల గురించి వాళ్ళ మాయా మర్మం’ తెలుసున్నప్పటికీ తల్లి లచికలాగానే పార్వతి కూడా పల్లపు నాగరికుల చేతిలో మోసానికి బలైంది. కొండ బిడ్డలైన ‘కొండోల గుడిసెలన్నీ కూల్చేసి’ మొత్తం కొండనే పేల్చేసి క్వారీ తవ్వకాలు మొదలయ్యాకా కొండోల్లంతా చెట్టుకొకరు పుట్టకొకరూ చెదిరిపోయాకా థింసా ఆకలిదీర్చే ఆటగా కూడా మిగల్లేదు. కొండా కొండపిల్ల బతుకూ పర్యాటకులకు వినోద కేంద్రమయ్యాయి. చివరికి కొండే మాయమైంది. లచిక సమాధి మాయమైంది. కొండకి దూరమైన పార్వతి అమ్మనీ అమ్మమ్మనీ అమ్మలాంటి అడవినీ అడవి యిచ్చిన థింసానీ చివరికి బతుకునే కోల్పోయింది. అయితే కథ చివరికి వచ్చేసరికి ఆమె తన శక్తులన్నీ కూడగగట్టుకొని ‘థింసా ఆడి రాటుదేలిన కాళ్ళు రెండిటినీ దగ్గరకు లాగి నిటారుగా నిలబడి’ తాను కోల్పోయిన బతుకుని తిరిగి పొందడానికి ‘తన సంస్కృతిని, తన జాతిని రక్షించుకోవడమనే మహాసంకల్పంతో’ ఆయుధం ధరించి అడవిలోపలికి నడిచింది. ఆమె నడక సామూహిక ఫార్మేషన్ లో భాగమౌతుందని కథలో సూచన వుంది.
‘ఎరకల రాముడు’ కథలో కూడా విలువల మధ్య ఘర్షణ వుంది. అది పందులపై జీవనాధారం కోల్పోయిన రాముడి కథే కాదు; అత్యాచారానికి గురైన అతని భార్య రావుడిది కూడా. అయితే ఎరుకల రాముడి మరణానికి కారణమెవరు? న్యాయాన్ని చంపిందెవరు? అతనికి దక్కాల్సిన న్యాయాన్ని అడ్డుకున్నదెవరు? యీ ప్రశ్నలకు సమాధానం కోసమే కథ అన్వేషిస్తుంది. కథను మూడో వ్యక్తిగా ‘సిన్నమ్మ’ ముఖతః గాక ఆమె తండ్రి అంతర్మథనంగా చెప్పి వుంటే బాగుండేది. కానీ న్యాయాన్యాయాలను తాటస్థ్యంతో నిష్పాక్షికంగా విశ్లేషించడానికి రచయిత ఆ కంఠ స్వరాన్ని స్వీకరించినట్టు భావించాలి.
గిరిజన ప్రాంతాల్లో వచ్చిన నూత్న చైతన్యాన్ని చిత్రిస్తూ యిటీవలే వెలువరించిన ‘కొండమీద సంత’ కథ తక్కిన కథలకంటే భిన్నమైంది. ‘తాతల నుంచి .. కొండోడు మోసపోడమేనా? కొండోడు అంటే పరాయోడి సేతికి కొండ మేకలా అమిరిపోడమేనా? కొండోడంటే అంత సిన్నసూపా? కొండకి ఎవులొచ్చిన పేమగా ఆదరిస్తం కద.. అలాటి మమ్మల్ని మోసం సేత్తున్రేమి? మేము ఏ రోజూ యెవుల్నీ మోసం సేసి ఎరుగమే!’ ఆదివాసీ లందరికీ కలిగే ప్రశ్నలే యీ కథలో సుక్కాయికి కలిగాయి. కానీ మందిని కూడగట్టి తరతరాల పల్లపోడి దోపిడీకి అతను విరుగుడు కనిపెట్టాడు. ఆదివాసీ సమాజంలో సుక్కాయి లాంటి కొత్త తరం పొందుతున్న ఆర్థిక చైతన్యాన్ని మౌళి గుర్తించాడు. లేదా కొత్త స్పృహ వాళ్ళకి కలగాలని రచయితగా కోరుకుంటున్నాడు.
ఇటీవల బాలసుధాకర్ వుపాధ్యాయుడిగా తరగతిగది అనుభవాలను పిల్లలతో తన అనుబంధాన్ని కథీకరించాడు. వాటితో నేను తొందరగా కనెక్ట్ అయ్యాను. పిల్లల్ని ప్రేమించటమే అధ్యాపకుడికి వుండాల్సిన మౌలిక లక్ష్యం, లక్షణం అని నమ్మిన వాడిగా నాకు యీ కథలు చాలా నచ్చాయి. అజయ్ లాంటి పిల్లలు యెందరో వొక టీచర్ గా నేను యెలా వుండాలో నాకు పాఠం చెప్పారు. బహుశా మౌళీ నేనూ వొకే పాఠం నేర్చుకున్నామేమో! కరోనాకాలంలో బడికి వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకోలేని పిల్లల కథని మరో రకంగా పిల్లలు లేని/రాని బడి ఎలా ఫీల్ అవుతుందో, అటువైపు నుంచి, బల్ల నల్ల బల్ల సుద్దముక్కల లాంటి వుపకరణాల్ని పాత్రలను చేసి కొత్త టెక్నిక్ తో రచయిత కథ చెప్పాడు.
మౌళి రాసిన బడి కథల్లో పిల్లల మీద వుపాధ్యాయుడిగా అతని ప్రేమ ప్రత్యక్షరంలోనూ కనిపిస్తుంది. బాగా చదువుకుని యెదగాల్సిన విద్యార్థులు ఆర్థిక తదితర కారణాలవల్ల డ్రాప్ అవుట్ అయితే మొత్తం సమాజానికే నష్టం కలుగుతుంది అన్న కోణంతో చెప్పిన కథ ‘మాస్టారూ .. జవాబు చెప్పరూ!’. యశోద అడిగిన యీ ప్రశ్న మౌళినీ మౌళిలాంటి మాష్టార్లనేనా? మనందరినీ కదా? మొత్తం సమాజాన్ని కాదా? యశోద కథ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన పాలకుల కళ్ళు తెరిపిస్తుందా? ఈ ప్రశ్నలు వొక యెత్తు అయితే తరగతి గది బయట వుండాల్సిన స్టూడెంట్స్ టీచర్స్ రిలేషన్ గురించి అనేక అంశాల్ని కథ బయటికి వెళ్ళి చర్చించుకోవచ్చు. పాఠశాలల దగ్గర్నుంచీ విశ్వవిద్యాలయాల వరకూ వుపాధ్యాయుల విద్యార్థుల మధ్య సంబంధాలు యాంత్రికమైపోయాయనీ అధ్యాపకులు పిల్లలతో emotional bonding (కథకుడు దాన్నే ‘సంభాషణ’ అంటున్నాడు) పెంచుకోవడం ద్వారా విద్యార్థుల డ్రాప్ అవుట్ లనూ ఆత్మహత్యలను నివారించవచ్చనీ చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. అజయ్ యశోదల కథ చెప్పడంలో రచయిత ఆశయంకూడా అదేనేమో! కథ వెలుపలి విషయాల వైపు ఆలోచింపజేసే కథలు యెప్పుడూ ప్రత్యేకమైనవే.
‘కుట్టు’ కథ చదివితే నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. మేం కూడా పాత నోటు పుస్తకాల్లో మిగిలిపోయిన తెల్ల కాగితాల్నీ ఆశల్నీ కలిపి అలాగే కుట్టుకొని బడి చదువులు కొనసాగించాం. దాదాపు 70 యేళ్ళు గడిచిన స్వతంత్ర దేశంలో సంక్షేమ రాజ్యంలో యింకా బడి పిల్లలు అదే పరిస్థితిని యెదుర్కొంటున్నారు. అదే అసలు విషాదం.
‘మానిగంప’, ‘ఎత్తిన పిడికిళ్ళు’ కథల్లో కూడా యిటువంటి విషాదమే మరో రూపంలో కనిపిస్తుంది.
కులవృత్తి కూడు పెట్టని పరిస్థితిలో కూడా మట్టినే నమ్ముకున్న కుమ్మరి ఈరన్న కథ మానిగంప. సాటి మనిషి పట్ల జాలితో వెదురు బుట్టలల్లే నూకాలమ్మ సాయం చేసిప్పటికీ ప్రత్యామ్నాయ వుపాధి అవకాశాల్లేక మరో పని చేతగాక కులవృత్తినే అంటిపెట్టుకుని వుండటం యెందుకో బెంగ పుట్టిస్తుంది. పర్యావరణ విధ్వంసంతో వాగులు వంకలు యెండిపోతే వూళ్ళు వల్లకాడులైపోయిన వైనాన్ని వర్ణించే కథ ‘ఎత్తిన పిడికిళ్ళు’. ఒకప్పుడు వూరందరికీ దాహార్తి తీర్చిన ‘నిండుకుండలాంటి గెడ్డ.. ఎవరొచ్చినా కాదనకుండా కావుల్ల కావుల్ల నీళ్లిచ్చి పంపిన గెడ్డ.. ఆ ఊరోలు ఈ ఊరోలు అనకుండా అందరిని కలిపి .. ఈత ఆడటానికి ఒడి ఇచ్చిన గెడ్డ’ నీళ్ళెండిపోయి నిలువెల్ల గాయాలతో చావు దగ్గర పడినట్టు తయారయింది. ఇసుకను ఇష్టా రాజ్యంగా తవ్వేయడం వల్ల రాకాసి నోరెట్టుకొని అడుగుజలంతటిని పీల్చేసే బోరు బావుల వల్ల వూరిలో మనుషులకి పశువులకి కూడా నీళ్లు లేకుండా పోయాయి. మనిషి దాహం తీరకపోవడం అటుంచి ‘బక్కల’ నోటికి నీళ్ళు దక్కనందుకు, దగుల్బాజీ పెద్దల పంచాయతీలో న్యాయం దక్కనందుకు వురేసుకుని ముసలి అసిరయ్య చనిపోతాడు. అతని చావు సాక్షిగా జీవధార కోసం వూరంతా యేకమై పిడికిలెత్తడం యీ కథలో కొసమెరుపు. అతలాకుతలమైన కళింగాంధ్ర పల్లె జీవితం మౌళిని కలవరపరుస్తున్నప్పటికీ ప్రజలు జీవన పోరాటంలో వోడిపోరనీ, వోడిపోకూడదనీ అతని బలమైన ఆకాంక్ష నుంచే యీ కథలు రూపొందాయి.
ఈ సంపుటిలోని ‘కున్నెమ్మ’ కథకు వచ్చేసరికి మౌళి వచనంలో గొప్ప మార్పు కనిపిసుంది. ఇదే అతను రాయాల్సిన భాష అని నాకు అనిపించింది. అప్పటివరకు పాత్రోచితంగా మాట్లాడిన బాల సుధాకర్ మౌళి కథనంలో సైతం తన ప్రాంత భాషను శిరస్సున పెట్టుకున్నాడు. ‘కుట్టు’ కథ కూడా మాండలికంలోనే నడిచినప్పటికీ ‘కున్నెమ్మ’ లో రచయిత కథన భాష, పాత్రోచిత సంభాషణల భాష, వారి మనోగతాల భాష .. వీటి మధ్య దూరం రద్దుచేసి గీతలు చెరిపివేసి కథకుడు పాఠకుల్ని కథావరణంలోకి లాక్కుపోయాడు. అదంతా సహజ శైలిగా కథలో వొదిగిపోయింది. అది కున్ని కథో కున్ని చెల్లి (అగస్త్య భ్రాతలా నిగమ శర్మ అక్కలా యీ చెల్లిక్కూడా పేరు లేదు) కథో తెలియనంతగా కలిసిపోయాయి. తొలినాటి ఆదివాసి జీవితం మౌళికి రొమాంటిక్ గా భాసించిందేమో కానీ కున్నెమ్మ కథకు వచ్చేసరికి అందులోని కఠోర జీవన వాస్తవికత అతన్ని బాగా డిస్టర్బ్ చేసినట్లు ఉంది.
తరచి చూస్తే మౌళి కథలు వాస్తవికత కాల్పనికతల మధ్య వూగులాడుతూ కనిపిస్తాయి. తన చుట్టూ వున్న ప్రపంచంలోని సంక్షోభం ప్రజల దుర్భరమైన బతుకులు అతణ్ణి వూపిరి తీసుకోనివ్వడం లేదు. కానీ పొడుగాటి సొరంగం చివర వెలుతురు కిరణం వుండకపోదు అన్నది రచయితగా అతని ఆశ. అదే యీ కథలన్నిటా ప్రతిబింబించింది. సాధ్యమైనంతవరకు పాజిటీవ్ ముగింపులే కథల్లో చోటుచేసుకున్నాయి. సారంలో .. అది కవితయినా కథయినా మనిషి పట్ల మనిషితనం పట్ల సడలని విశ్వాసమే బాల సుధాకర్ రచనకు జీవధాతువు. అందుకే వైయక్తిక తలంలో జీవితానికి యెదురొడ్డి నిలిచిన కున్ని, సమూహంలో కలవడానికి అరణ్యం వైపు చూపు సారించిన పార్వతి, సామూహికంగా తమ సమస్యలకు పరిష్కారం కనుగొన్న సుక్కాయి, నీళ్ల కోసం రాజకీయాధికారంపై పిడికిళ్లెత్తిన పల్లె ప్రజలు యీ కథల్ని జ్వాజ్వాల్యమానం చేస్తారు. కథకుడిగా మౌళి సాధించిన విజయం యిది.
ఇటీవల సుధాకర్ విమర్శ వైపు దృష్టి సారించినట్లు గమనించాను. అది మరింత తీక్షణమై అతని సృజనాత్మకతలోకి విస్తరించాలని కోరుకుంటూ..
హైదరాబాద్ అభినందనలతో,
మార్చి 6, 2025 ఎ. కె. ప్రభాకర్