మొదటగా ఇది నాకు చాలా ఇష్టమైన కథల పుస్తకం. ఈ “టోపి జబ్బర్” పుస్తకంలో 11 కథలు ఉన్నాయి. ఒక కథ ద్వారా ఒక్క విషయం మాత్రమే చర్చించాలని రచయిత వేంపల్లె షరీఫ్ గారు అనుకోలేదు. ఒక ముస్లిం మనిషి చుట్టూ ఉన్న కులం, మతం, ప్రాంతం, లింగ వివక్షత ఎంత లోతుగా ప్రభావితం చేస్తాయో నాలుగు కథలు మినహా కథల్లో తన రచనా శైలితో పరిచయం చేశారు. ముస్లింల ఉనికి ఏ స్థితిగతుల్లో ఉందో ఈ కథల ద్వారా చెప్పారు. వాళ్ళ మతంలో వున్న ఆచారాలు, సంప్రదాయాలు. ఇంకా ఏ విధంగా వాళ్ళు సమాజంలో అవమాన పడుతున్నారో చెప్పారు. ఏ మతంలోనైనా ఉన్నది మనుషులే కదా! వాళ్ళకు జాలి,దయ, ప్రేమ,అభిమానం, అనురాగం,ఆకలి ఉంటాయని చదవరులకు ఆయన చెప్పిన తీరు నిజంగా మెచ్చుకోదలచినది.

“గోషా”ముస్లింల యొక్క ఆచారం. గోషా పెట్టించుకున్న ఆడాళ్ళు బయటకు రాకూడదు. వాళ్ళ ముఖాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్లకు తప్పితే పరాయి మగాళ్ళకు చూపించకూడదు. ‘దారి తప్పిన కల’ కథలో, రాయలసీమలో నీటికరువు వున్న గ్రామంలో పుట్టిన చాందిని, రోజూ గంటసేపు కష్టపడి ఒక నీళ్ళబిందెను ఇంటికి తేవడం కన్నా ఈ గోషాను పెట్టించుకొవడమే సుఖం అనుకుంటుంది. భయాలు, బంధాలు, జీవనం, ఆర్థికం దృష్టిలో పెట్టుకొని మనోహర్ తో వెళ్ళిపోతుంది. మనోహర్ హిందువుల అబ్బాయి. గోషా కలైతే దారి తప్పింది. కానీ దానికి కారణం??? చాందిని మాటకు తల్లి నిర్లక్ష్యమా? చాందినికి తల్లిమాట మీద అపనమ్మకమా?? అవేమీ కాదు కావాల్సింది గుక్కెడు నీళ్లు అని చాందిని తండ్రి ఫకృద్ధీన్ నమ్మిన మాటనా? ఇక్కడ ఆడపిల్ల మనసు, భయం, పేదరికం, ప్రాంతంలో కరువు, అమ్మ మనసు, నాన్న బాధ, ఇన్ని అంశాలను చర్చించారు.

‘కోయేట్ లెక్క’ కథలో గోషా పెట్టుకున్న తల్లి రుబీనా ఎన్ని అవస్థలు పడుతుందో వివరించారు. వాళ్ళ ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఊర్లో కమ్లక్క దగ్గర డబ్బు అప్పు చేసి దొంగ వీసాతో కోయేట్ కి పోయి పోలీసులకు చిక్కకుండా ఎంతోకొంత సంపాదించి పోస్ట్ చేస్తాడు. ఆ డబ్బుతో రుబీనా అప్పు తీరుస్తుందా? ఇంట్లో ఖర్చులకు సర్దుతుందా? బయటకు వెళ్లి ఎంతోకొంత సంపాదించుదాం అంటే గోషా పెట్టుకున్నదానివి. “ఏమే నేనింగా సావలా.. నేను బ్రతికి ఉన్నంతసేపు పెండ్లానికి పనికి పంపిచ్చానా… అట్టా ఆ పని ఈ పని అంటూ తిరిగేవు. వచ్చినానంటే నరికిపారేస్తా ముండా” అని అంటాడు. ఇన్నేళ్ళు కాపురం చేసిన రుబీనాకు ఆ మాట వెనుక ప్రేమ ఉందో? అనుమానం ఉందో? ఆమేనే తేల్చుకోవాలని రచయిత చెప్తారు. అది పురుషుడి బాధ్యతో, ఆధిపత్యమో అని తేల్చుకోలేని మనుషులు ఉన్నవారకు మతంలో ఆచారాలు పరుగెడుతునే ఉంటాయి మనుషుల మీద నుంచి. మొత్తానికి కమ్లక్కకి అబద్ధం చెప్పేసి, వాళ్ళ పిల్లోడు ముబారక్ కు మామిడికాయలు కొని సంతోష పడుతుంది కానీ తన ఆత్మకు అబద్ధం చెప్పడంలో కూడా న్యాయం, మానవత్వం ఉందని సర్దిచెప్పుకోవడంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తుంది.

అదేవిధంగా తన మతాన్ని ఇది నా మతమే అని చెప్పుకోవడానికి ఎందుకు వెనుకడుగు వెయ్యాల్సి వస్తుందో “టోపి జబ్బర్” కథలో చెప్పారు. గొడ్డుమాంసం తినేవాళ్ళ మనసు, ఆలోచనలు, ఆత్మాభిమానం ఎంత తీవ్రతలో ఉన్నాయో “తలుగు” కథతో చెప్పారు. అన్ని కథలు నిజజీవితం నుంచి ఎలా తీసుకోవాలో, ఎలా అక్షరీకరించాలో ప్రావీణ్యం గల వ్యక్తి రచయిత. ముస్లింలను “అంకెలు” గా మాత్రమే పరిగణించే రాజకీయ నాయకుల వైఖరి కథ ఉంది. “దహనం”, “ఒంటి చెయ్యి”, “వింత శిశువు”కథలు అట్టడుగున పడిపోతున్న ఇంగిత జ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎంత లోతుకు నెట్టుకుపోతుందో, చెప్తారు. “ఇద్దరు తల్లుల బిడ్డ”, “గోళ్ళు” ఒక భాషతో ఒక అలంకరణతో కూడుకున్నవి. ఒక కథ చదివామంటే మనలో ఎంతోకొంత ఖాళీ ఏర్పడి మరలా పూరింపబడాలి కదా! ఈ కథలు కూడా అలాంటివే.

ఈ కథలు ఇప్పుడే ఎందుకు చదవాలి అంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పబడే మాటలో ఎంత న్యాయం ఉందో తెలుసుకోవడానికి. ఫాసిజానికి తావిస్తున్న ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలసిన అవసరం ఖచ్ఛితంగా ఉంది. అన్నింటినీ మించి ఓ మనిషి, మనిషివే కద నువ్వు? అని ప్రశ్నించుకునే గుణపాఠం ఉన్న కథలు. కాబట్టి ఈ కథలు తప్పకుండా చదవాల్సిన కథలు అని మాత్రం గట్టిగా చెప్పగలను.

Leave a Reply