A poem is what happens when it is read- Christopher Caudwell
భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో స్థిరపడ్డప్పటికీ దేశంలో జరిగే ప్రతిపరిణామాన్ని నిశితింగా పరీశిలిస్తూనే ఆ నేల మీదినుండి అక్షరయుద్దం చేస్తూనే ఉన్నారు. యుద్దం అంటే గుర్తొస్తుంది. ఆయన కవిత్వం యుద్దమైదానం. ఆయన కవిత్వం రెండంచుల ఖడ్గం. మనసనే యుద్దమైదానంలోంచి పోరాటం చేస్తున్న నవసమాజ నిర్మాణ స్వాప్నికుడు అఫ్సర్. యుద్దమైదానం అని ముఖస్తుతికో, అతిశయోక్తికో చెబటం కాదు. ‘నాకవిత్వపాదానికి విగ్రహం లేదు/ నిగ్రహం లేదు/ ఆగ్రహం తప్ప’ అని రెండున్నర దాశాబ్ధాల క్రితమే ప్రకటించిన కవి అఫ్సర్. అందుకే భారతీయ సాహిత్యంలో అఫ్సర్ అంటే తెలియని కవి ఉండకపోవచ్చు. ఈ మధ్య అఫ్సర్ ‘యుద్దం మధ్యలో నువ్వు’ అంటూ కవిత్వం తెచ్చారు. ఈ కవిత్వం గూర్చి ఆయన చెబుతూ ‘అనేక కారణాల వల్ల నిర్భంధంలో కూరుకుపోయిన మనిషిజాడ. ఆ నిర్భంధాల మీద చేసే మనిషి పోరు’ అంటారు. నిజమేనేమో ఆ జాడను చూద్దాం.
ఆయన సాహిత్యంతో కలసి నడిచిన భాషావేత్తలేమో అఫ్సర్ ఉత్తమ పురుషలో రాస్తాడంటారు. విమర్శకులైన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారేమో కుల, మత, ప్రాంత పరిమితులతో మానవ జీవితం సహజ మానవ సంబంధాలకు దూరమైపోతూ వలసీకరింపబడుతున్న తీరు మీద అక్షరాగ్రహం అఫ్సర్ అంటారు. వర్ధమానకవులైతే మాత్రం ఉన్మాదపాలనపై గొంతెత్తి నిరసించే ధిక్కారస్వరమంటారు. ఇంతమంది ఇన్ని నిర్వచనాలిస్తున్నందున అఫ్సర్ తెలుగుకవిత్వంలో భిన్నమైన కవి. కవిత్వపు అంతరంగాల్లో ప్రయాణించే సాహసి. తెలుగు కవిత్వంలో కవిత్వనిర్మాణం వొక్కొక్కరిదీ వొక్కోశైలి కలిగి ఉంటుంది. అఫ్సర్ కొన్ని కవితల్ని వ్యాసరూపంలో రాస్తే మరికొన్నింటిని క్రమపద్దతిలోనూ, ఇంకొన్ని అపసవ్యంగా రాయడం అఫ్సర్ కవిత్వంలో ప్రత్యేకత. ఇదిలాగే ఉండాలనేదేమీ లేదు. అది పాఠకుణ్ణి ఆకట్టుకునేలా చేస్తుంది కూడా.. పేరా మాదిరి రాసిన కవిత చూడండి..అదెలాగంటే..
‘‘బతికిన క్షణాలన్నీ కథలే. బతకని క్షణాలూ కథలే. యే కథ యెంత దగ్గిరగా నిన్ను హత్తుకుంటుందో తెలీకపోవచ్చు కానీ, శకలాలు కొన్ని మాత్రమే యిద్దరి శరీరాల్లోనూ మిగిలే వుంటాయి. మిగలని దుఃఖమేదో వుంటుంది కదా, దాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. యెక్కడిదాకా వెళ్తామో అదే చివరి అడుగు అవుతుందేమో అనుకుంటూనే వెళ్తాం. ఆఖరిసారి దేహాన్ని తనివితీరా తడిమిచూసుకునే అరక్షణమూ వుండదు.’’
కవిత్వతాత్వికత అఫ్సర్ కవిత్వం నిండా ప్రవహిస్తుంది. మనసును మెలిపెట్టి చిలికి చిద్రం చేస్తాయి. వస్తువును భావుకతతో నిర్మిస్తూనే ప్రతి అక్షరాన్ని శిల్పమయం చేస్తారు. తెలుగు కవిత్వంలో అరుదుగా కనిపించే కవిత్వ శైలి అఫ్సర్‌ది. అయితే ఉత్తమపురుషలో కవిత్వాన్ని అద్భుతంగా రాసే కవులు కూడా అరుదుగానే ఉంటారు. ఎందుకు రాయకూడదు..
‘నువ్వేమీ పల్లెకడుపులో పుట్టక్కర్లేదు/బియ్యం నేలకింద పుడుతుందో/ చెట్టుసిగన మెరుస్తుందో కూడా తెలియక్కర్లేదు/నువ్వు తినే మెతుకులో/యిప్పుడు నీ అహంకారం మూలుగులు వినిపించాలి’
ఉత్తమపురుషలో అత్యుత్తమ కవిత్వవస్తుశిల్పనిర్మాణం చేయగల సమర్ధుడీకవి. అయితే వివరించుకుంటూనో, విశ్లేషించకుంటూనో వెళ్లడానికి ఆయన సాదారణ వచనం రాసేకవి కాదు. ఆయన కవిత్వం రాసేకవి. గాఢతతో కూడిన కవిత్వం మాత్రమే రాసే కవి. ప్రతి కవితలో కవిత్వశైలి ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరైనా ఆయన కవిత్వ తీరులోని వస్తుసమగ్రత గూర్చి చెబటమే తప్ప ఇతరత్రా ఏ విషయాలు చెబటానికి సాహసించరు. కవిత్వపాఠకుణ్ణి అటెన్షన్ చేయగల సమర్ధుడు అఫ్సర్. ప్రాచీన సాంప్రదాయాల పద్యకవిత్వజడివానల్లో నడుస్తూ అధునిక కవిత్వపు గొడుగుల్ని అడ్డం పెట్టి ఆపగలిగిన కవుల సరసన అఫ్సర్ కూడా ఉన్నాడు. సాంప్రదాయ కవిత్వం జనబాహుళ్యంలోకి వెళ్ళలేదని అధునిక తెలుగు కవిత్వాన్ని తమ భుజంపై మోసిన కవుల జాబితాలో తనూ ఉన్నాడు. ఐసోలేషన్ అని వొకకవిత రాస్తాడు. ‘యెన్ని అందాలుగా /సర్దుకుంటూ కూర్చుంటామో/ జీవితాన్ని..ఈ వొక్కకవితా వాక్యం చాలదా? కవి ఎంతా తాత్వికంగా చెబుతాడోననడానికి..ఈ కవిత్వంలో చాలా యుద్దాల గూర్చి మాట్లాడతాడు..చాలా యుద్దాలు చర్చిస్తాడు..అతడి యుద్దాలు చూద్దాం..
‘యుద్ధాలు యిప్పుడు యెక్కడెక్కడో కాదు యిదిగో యిక్కడే మన పక్కనే జరుగుతాయి./మనం కళ్ళారా చూస్తూ వుండగానే చెవులారా/వింటూ వుండగానే/రాలిపోయే శవాల్ని లెక్కపెట్టుకోలేక అలసిపోతూ వుండగానే!యుద్ధాలు యిప్పుడు యెక్కడెక్కడో కాదు/యిదిగో యిక్కడే మన పక్కనే జరుగుతాయి./మనం కళ్ళారా చూస్తూ వుండగానే చెవులారా/వింటూ వుండగానే/రాలిపోయే శవాల్ని లెక్కపెట్టుకోలేక అలసిపోతూ వుండగానే!’.. అంటూ యుద్దాన్ని వీక్షిస్తూ ప్రకటిస్తాడు. యుద్దంలో వాలిన దేహాల్ని, యుద్దంలో రాలిన శిరస్సుల్ని ఎన్నని లెక్కబెడతాం. లెక్కపెట్టలేక అలసిపోతే మళ్ళీ పక్కనే యుద్దమంటాడు. మన పక్కనే యుద్దమంటాడు. అందుకే అతడి కవిత్వమే యుద్దమైదానమని మొదట్లోనే అన్నాను. అతడు చేస్తున్నది అనివార్యయుద్దం. ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్దాలను తన మన:ప్రపంచంలోంచి చూస్తున్న యుద్దం. అనేక యుద్దాలు చేస్తున్నాడు. అందుకే వరవరరావు దృష్టిలో ఆయన చేస్తున్న యుద్దమిలా..యుద్ధం మధ్య నిలబడ్డాడు అఫ్సర్ అంటూ రాస్తాడు.‘కవిత్వంలోనే కాదు, సాహిత్య విమర్శ, సామాజిక విశ్లేషణ, తెలంగాణలో వచ్చిన పురోగమన, తిరోగమన మార్పులను అర్థం చేసుకోవడానికి చేసిన క్షేత్రస్థాయి అధ్యయనాలు, పరిశోధనలు, తెలంగాణ విమోచనోద్యమ కాలపు మతసామరస్యం, గడ్డివేళ్ల స్థాయి భూసంస్కరణలతో కూడిన ప్రజారాజ్య బీజరూపం, రాజ్యం జోక్యం, రజాకార్ల ఫేజ్, ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ఆపరేషన్ పోలో, హిందుత్వ ఆక్రమణ, దాడి ఇవన్నీ జీర్ణించుకున్న కవిత్వం… దర్గాల క్షేత్రస్థాయి అధ్యయనం, సూఫీ కవితలు, రోజా (ఉపవాస) కవితల్లో ప్రతిఫలించే ఉన్నత మానవీయ విలువలైన సమానత్వం, ప్రేమ, స్నేహాలనే కవి ప్రపంచానికీ మనిషికి నిలవ నీడలేని, విస్థాపన, ఆక్రమణ సామ్రాజ్యవాద కార్పొరేట్ల విస్తరణ యుద్ధానికీ మధ్య సంఘర్షణలో అఫ్సర్ ఇప్పుడు ఈ యుద్ధం మధ్య నిలబడ్డాడు-పాలస్తీనా న్యాయం కోసం, ఆదివాసీ న్యాయంకోసం-అఫ్సర్దే అయిన అభివ్యక్తితో..’అంటూ ముగిస్తారు.
యుద్ధం మధ్యలో నువ్వు – 1 కవితాశీర్షికలో..
యిప్పుడే కాదు-యెప్పుడూ యే పద్యమూ నీలోపలి లోయల్ని పూడ్చడు./ఆ లోయ మొదట్నించీ అలాగే వుందని, నువ్వు తలకిందులుగా దాని లోతుల్లోకి అవరోహణ చేస్తూ వున్నావని ప్రతిపద్యం చివరా అర్ధమవుతుంది./యిప్పుడే కాదు – యెప్పుడూ యే కలయికా నీలోపలి నిద్రిత మైదానాల్ని తట్టిలేపదు./ఆ మైదానం ఆదినుంచీ అలాగే యెడతెగని నిద్రలో వుందని/నువ్వు కలల్ని నటిస్తున్న పెనునిద్దురవే అని/ప్రతి మెలకువ చివరా పట్టుబడిపోతావ్./యెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని అనుకుంటూ/యిక్కడేదో కాస్త శాంతిలాంటిదేదో వుంది కదా అని/చన్నీటి స్పర్శలాగా వుంటావ్ కానీ-/నువ్వొక రణరంగమైన పెనుమంట అని/ పొరపాటున కూడా అనుకోవు కదా!/మసీదులూ గుళ్లూ గోపురాలూ చర్లూ మానవసమూహాలన్నీ /దిక్కులు పగిలిపోయే రోదనల్లో మార్మోగిపోతున్నప్పుడు కూడా నువ్వేదో /వొక సాంద్ర స్థిర బిందువులాగా/ లోపలెక్కడో గడ్డకట్టుకుంటూ వుంటావే గాని-/బయటికొచ్చి వొక మంటని కాసింతైనా కావిలించుకోవు కదా!/నువ్వే మంటవు కాలేవు – మంటగా కాలలేవు/కానీ/నీ చేతుల్ని యే కొంచెమో/ఆ మంటవైపు కదిలించావే అనుకో`/అదే/నీ/పెనునిద్దురలో/
కార్చిచ్చు!
ఈ కవితలో ఇప్పుడు యుద్దం మధ్యలో నిల్చున్న మనిషిదృశ్యం ఆవిష్కృతమయ్యిందా..? నిల్చున్న మనిషి నిల్చున్నట్టే దహించుకుపోవడమంటే ఇదే కదా..యుద్దాన్ని కలగనడమేనా..? కవి ఎవరి పక్షాన నిల్చుని యుద్దం చేస్తున్నాడు. గోర్కీ చెప్పినట్లు కవులు ఏ పక్షాన నిల్చోవాలి. పాలస్తీనా యుద్దంలో శిథిలాల క్రింద ఊపిరి అనంత వాయువుల్లో కలసిపోతే కవులెక్కడున్నారు. పాలస్తీనా నుంచి బిసాన్ ఓవ్‌డా అనే జర్నలిస్టు కూలిన ప్రతి శిథిలాన్ని చూపి ప్రపంచమా చూడండి మా బతుకులంటూ, చూడండి పారుతున్న రక్తపుటేరులంటూ చెబుతూ వుంటే కన్నీళ్లవంతకవే పెల్లుబుకుతాయి. అందుకే అఫ్సర్ యుద్దం గూర్చి మాట్లాడతాడు. గోర్కీ చెప్పినట్లు బాధితుల పక్షాన నిల్చున్నాడు. సంక్లిష్ట, సందిగ్ధల మధ్య కొట్టుమిట్టాడుతూ వైరుధ్యాల మధ్య సాగుతున్న జీవితంలో మనిషి నిల్చున్నదెక్కడ? పై కవిత మన పాత్రను చెబటం లేదా..?
యుద్ధం మధ్యలో నువ్వు-2 కవితాశీర్షికలో..
‘గాయాల్ని కుట్టుకోవడం తెలీక వాక్యాలు కుదురుకోవడం లేదని హింసపెట్టుకుంటావ్ గానీ/కుదురుకునేంత-/లేదూ ఆనక కునుకుతీసేంత నిలకడే లేదని అనుకోవు కదా!!/కొన్నీటిని చూడడానికి కన్ను మొరాయించడం/ వల్ల రెండు కళ్ళనీ మూసుకొని అయినా సంచారం చేస్తావే గానీ/కాళ్ళ కింద పెనుమంటల సయ్యాటని తాకనైనా లేవు కదా!/నీకీ నొప్పి తెలిసే క్షణాలు/పెద్ద దూరమేమీ లేవు/నీ అరిపాదాల కింద స్వర్గమే లేదు./అదీ/యింకా నోరు తెరుచుకోని నరకద్వారమే!/మూసుకుపోతున్న నీ కళ్ల కింద/అడుగు తీసి/అడుగెయ్యి/తళుకులీనే అందాల కింద మెరుస్తున్న కందకాలున్నాయి./నువ్వు వాక్యం కాలేకపోవడానికి వంద కారణాలున్నాయి./పుట్టిన గడ్డ కూడా శాపంపెట్టే/క్షణం/యీ/మూలమలుపులోనే వుంది.’
గాయపడ్డదెవరు.? గాయమైందెవవ్వరికీ.? దేశానికా..దేహానికా..? అన్నీ తెలిసి ఎందుకు మనిషి మౌనంగా ఉన్నాడు. స్వర్గనరకాలు భ్రమలే కదా..ఈ కవిత్వం చదువుతున్నంత సేపూ అఫ్సర్ విప్లవనినాదం చేస్తున్నాడనిపించింది. బహుశా ఆయన మీద, ఆయన కవిత్వం మీద ఉన్న ప్రేమపూర్వక భాషణగా చెప్పట్లేదు. ఎందుకలా అన్నానంటే కారణమూ లేకపోలేదు..‘పీడితులు అమూర్త మానవులు కాదు, రా./బాధితులు కేవలం పదచిత్రాల రంగులు కాదు కాదు, రే!/కళ్ల ముందు యుద్ధభూమి యిప్పటికే నెత్తురోడుతోంది రా./యిన్ని వాక్యాల పిరికి పరుగు పందాల నడుమ వొకే వొక్క ధిక్కారమై/నిటారుగా నిలబడరా!/పోరాడే/చేతులున్నాయ్,/కదనరంగమవుతున్న/కాళ్లున్నాయ్/మరఫిరంగులవుతున్న ఆలోచనలున్నాయ్./యిప్పుడు నా నేల పలాయనవాది స్వప్నవిహారం కాదు, రా’/‘అవున్నిజం/యిది అందరి యుద్ధం. అందరి కల. వీవీ అంటే ఇవాళ రెండక్షరాలే కదా అనుకుంటే/ఆ వెనక కదను తొక్కుతున్న అరణ్య సమూహాల్ని నువ్వు చూడలేవ్./ప్రాణం పొదువుకున్న వొక్క అక్షరంతోనే మొదలవుతుంది యెంత పెద్ద యుద్ధమైనా!’
ఈ కవిత చదివాక విప్లవాన్ని ఆలకించండంటూ..అలెగ్జాండర్ బ్లాక్, ఇది నా విప్లవమంటూ పిలుపునిచ్చిన మయకోవస్కీలు గుర్తొచ్చారు. నిజానికి వీళ్ళద్దరూ రష్యన్ విప్లవం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అఫ్సర్ అమెరికా నేలమీదనుంచి ప్రపంచపరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ ఆ నేలపై నుండి మనదేశంలోని మతోన్మాద చేష్టలకు వ్యతిరేకంగా కవిత్వాన్ని కథల్ని రాస్తున్నకవి. ‘మొన్నటి నా పేరు కంచికచర్ల కోటేశు. నిన్న అల్లాఖ్./యివాళ/షమ్స్ తబ్రీజ్ అన్సారీ./1947లో నాపేరు నీకు గుర్తుందా?/ 1992..2002../ ఆ తర్వాత వన్స్‌మోర్లు కొట్టించుకున్న నా కాలంలో అవి సంవత్సరాలో కుప్పకూలుతున్న వేల అన్సారీలో తెలియని ఆ కాలంలో/కేవలం/సమాధి రాళ్ళ మీద మాత్రమే కనిపించడానికి పుట్టిన/ యివాల్టి యీ పేరొక్కటే/నేను/ నిరాకరిస్తున్నా/ యివాళ/జైశ్రీరామ్ అనిపించగలరు వేల గొంతులతో/ వొక్కశరీరంలో గుక్కెడు ప్రాణం పోయగలరా/ దయచేసి చెప్పండి అనేక అన్సారీలు నడివీధుల్లో శవాలు కాకముందే! ’షమ్స్ తబ్రీజ్ అన్సారీ:2019 జూన్ 17న జార్ఖాండ్ రాష్ట్రంలో అన్సారీ పాతికేళ్ళ యువకుణ్ణి చెట్టుకు కట్టిపడేసి, జైశ్రీరామ్ నినాదాలు చేసేదాకా కొట్టి చంపారు హిందుత్వ ఉగ్రవాదులు. ఇదప్పుడు దేశవ్యాప్తంగా సంచలమైన ఘటన జార్ఖండ్‌లోని తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో దోషులు 10 మందికీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.సరైకేలా జిల్లా కోర్టు మరో ఇద్దర్ని సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది.ఈ కేసు విచారణ నాలుగేళ్ళు నడిచింది. దొంగతనానికి పాల్పడ్డారనే కారణంతో తబ్రేజ్‌ను కట్టేసి కొట్టడంతోపాటు నినాదాలు చేసేదాకా కొట్టిచంపారు. ఇలా ప్రతి ఘటన అఫ్సర్ చేత కవిత్వం రాయించాయి.
ఈ కవిత్వంలో రూపం బాగా ఇమిడిరది. రూపం అన్నది కవి భావజాల స్వభావాన్ని కవిత్వంలో చూపెట్టగలుగుతుంది. సాహిత్య, సమాజ మార్పును సూచించడం రూపంలో భాగమే. అఫ్సర్ నిర్దిష్టమైన భావజాలం కలిగి ఉండటం వల్ల కవిత్వ రూపం అత్యున్నత శిఖరాలకు ఈ కవిత్వాన్ని చేర్చింది. అసీఫా ఘటన తీసుకుంటే ‘అసీఫా, నువ్వే నా జాతీయ గీతం!’ అంటాడు. ఈ వొక్కమాట చాలదా కవిత్వరూపాన్ని చెబటానికి..అలాగే ‘యివాళ నా వొంట్లోని ఆ వొక్క చుక్క నెత్తురు చచ్చిపోయింది, నీతోపాటే’ ఇవి చాలదా? 2018లో అసీఫాబానో అనే చిన్నారిని జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో ఒక గుడిలో ఉన్మాదులు అత్యాచారం చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? అందుకే ఈ సమీక్షావ్యాసానికి శీర్షికగా అఫ్సర్ కవితా వాక్యాన్నే ఎంచుకున్నాను. మన్ కీ బాత్ ఎవరు చేస్తున్నారో తెలుసుకదా. అబద్దాలకోరు ఎవరో తెలుసుకదా. అందుకే కవి బాధితుల పక్కన నిల్చుని యుద్దం చేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ బాధితులున్నా..ఎవరికి అన్యాయం జరిగినా వారికి అండగా కవిత్వ యుద్దం చేస్తున్నారు. అఫ్సర్ సాహిత్యాన్నే కాదు..సమాజక్రమాన్ని అర్థం చేసుకుంటూ యుద్దం చేస్తున్న అక్షరాలనూ చూడాలి.
ఈ కవి ప్రపంచానికి ఈ కవిత్వం ద్వారా రిమైండర్ ఇస్తున్నాడు. భవిష్యత్తులో అన్నం మెతుకులకు కరువుంటుంది/ గుక్కెడు నీటికి కరువే/ మనిషికీ మనిషికీ మధ్య మరఫిరంగులు మాత్రం/దర్జాగానే తిరుగుతూనే ఉంటాయి/ ఇంకా రాబోయే యుద్దాలకు ఏదో వొక Reminder అందుతూనే ఉంటుంది’ అని అంటారు. అందుకే ప్రసిద్ద రష్యన్ రచయిత లియోనిడ్ లియొనోవ్ చెప్పినట్లు.. A true work of art and a work of literature is always an invention in from and discovery in content.. అందుకే ఈవాక్యం అఫ్సర్‌కు సరిపోతుందనిపించింది.
గొప్ప విశ్లేషణ కంగారో మోహన్ అఫ్సర్ గార్లకు హృదయపూర్వక అభినందనలు