మేము మన కాలపు పిల్లలం.
ఇది రాజకీయ కాలం.
దినమంతా, రాత్రంతా
అన్ని వ్యవహారాలు, మీవి, మావి, వాళ్ళవి -
అన్నీ రాజకీయ వ్యవహారాలే
మీకిష్టమైనా, కాకపోయినా.

నీ జన్యులకి రాజకీయ గతం వుంది
నీ చర్మం ఒక రాజకీయ కులం
నీ కళ్ళు ఒక రాజకీయ దృష్టి
నువ్వేం చెప్పినా అది ప్రతిధ్వనిస్తుంది
నువ్వేం చెప్పకపోయినా దానికదే ఒక వ్యక్తీకరణ.
కనుక రెండు విధాల నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు.
నువ్వు అడవిలోకి ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడ
నువ్వు రాజకీయ కారణాలతో రాజకీయ ఎత్తుగడలే వేస్తున్నావు.

వి/రాజకీయ కవితలు కూడా రాజకీయమే

మామీద ప్రకాశిస్తున్న చంద్రుడు
ఇంకెంత మాత్రమూ
శుక్ల వర్ణము కాదు
అస్తిత్వంలో ఉన్నామా లేమా
అదీ అసలు ప్రశ్న.

అది జీర్ణం చేసుకోవడం కష్టం కావొచ్చు
కాని అది ఎల్లప్పుడూ ఒక రాజకీయ ప్రశ్న.
రాజకీయ అర్థాన్ని పొందడానికి
నువ్వు మనిషివే కానక్కర్లేదు
ముడి సరుకైనా పర్వాలేదు
లేదా పోషకాహారమైనా కావొచ్చు
ముడి చమురయినా కావొచ్చు
కాన్ఫరెన్స్ టేబిల్ అయినా కావొచ్చు
దాని ఆకృతి ఎలా ఉండాలి అనే విషయంలో
నెలలకొద్దీ కలహించుకోవచ్చు

మనం జీవితం గురించి, మరణం గురించి
ఒక గుండ్ర బల్ల దగ్గరనా
ఒక చతురస్ర బల్ల దగ్గరనా
మధ్యవర్తిత్వం వహించేది

ఈలోపల,
ప్రజలు ధ్వంసమైపోయారు
జంతువులు చనిపోయినవి
ఇళ్లు తగలబడిపోయినవి
పొలాలు బీళ్లయిపోయినవి
తక్కువ రాజకీయాలున్నాయనుకునే
స్మృతిలో కూడా లేని కాలాల్లో వలె.

విస్లావా జింబోర్స్కా
Wislawa Szymborska

ఇంగ్లీషు : స్టానిస్లా బరంక్జాక్, క్లేర్ కవనాగ్
Stanislaw Baranczak and Clare Cavanagh

అరుణారాయ్ – ది పర్సనల్ ఇజ్ పొలిటికల్: ఎన్ యాక్టివిస్ట్’స్ మెమొయిర్
Aruna Roy – The Personal is Political: An Activist’s Memoir నుంచి

Leave a Reply