చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న జరిగిన ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేట కు చెందిన దళిత యువకులు. కేవలం ఆర్ధిక అవసరాల కోసం ఇతరత్రా డబ్బులు దొరకని అప్పు పుట్టని పరిస్థితుల్లో వారు దోపిడీ చేయాలనుకున్నారు.

అలాంటి ఆలోచనలకు ఆ ఇద్దరూ నెట్టివేయబడడానికి కారణం ఖచ్చితంగా సమాజమే. ఈ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతాంగానీ … ఇదే అసలు సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది.

బస్సు దహనం జరిగిన సందర్భంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజం. ఈ నిజాన్ని చలపతి విజయవర్ధనరావులు దాచి ఉంచాలనుకోలేదు. మభ్యపెట్టాలని చూడలేదు. తాము ఈ నేరానికి పాల్పడలేదని చెప్పాలని కూడా అనుకోలేదు.

ముప్పై రెండేళ్ల జైలు జీవితం తర్వాత కూడా వారు తాము చేసిన నేరానికి ఈ సమాజాన్ని క్షమాపణ వేడుకుంటున్నామనే మాట్లాడుతున్నారు. 

కోర్టు వారికి కఠిన శిక్ష విధించాలని అప్పట్లో  పౌరసమాజం నుంచీ వత్తిడి వచ్చింది. ఆ సందర్భంగా కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. పై కోర్టులు కూడా అదే శిక్షను ఖరారు చేశాయి.

నాటి రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ వీరిద్దరి క్షమాభిక్ష పిటీషన్ ను రెండు సార్లు తోపిపుచ్చారు.

అలాంటి సందర్భంలో ఇక ఉరి ఖాయం అనుకుంటున్న సమయంలో … జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత్రి మహాస్వేతాదేవి వీరి పరిస్థితిని అర్ధం చేసుకుని అప్పుడే రాష్ట్రపతి పదవి అందుకున్న కె.ఆర్.నారాయణన్ ను కల్సి వారికీ అర్ధం చేయించే ప్రయత్నం చేశారు.

ఆవిడ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న పౌరహక్కుల సంఘాలు దళిత బహుజన ప్రజాసంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించాయి.

అలా రచయిత్రి మహాశ్వేతాదేవి చొరవతో రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ విశాల హృదయంతో చలపతి విజయవర్ధనరావులకు కోర్టు విధించిన ఉరిశిక్ష జీవిత ఖైదుగా మారింది.

ఉరి రద్దు ఉద్యమంలో అనేకమంది రచయితలు మేధావులు పాల్గొన్నారు.

ఉరి రద్దు అయిన నాటి నుంచీ చలపతి విజయవర్ధనరావులు జైల్లోనే ఉండిపోయారు. అలా వారిప్పటికి ముప్పై రెండు సంవత్సరాల కఠిన శిక్ష రిమెషన్ తో కలపి నలభై సంవత్సరాల శిక్ష పూర్తి చేశారు.

నాటి ఉరిరద్దు ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది వీరిద్దరూ ఎప్పుడో విడుదలైపోయారనే అనుకుంటున్నారు. లైఫ్ ఈజ్ లైఫ్ అన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి చాలా మందికి తెలియదు. జీవిత శిక్ష పడ్డవారు జైల్లోనే కన్నుమూయాలి … అయితే జీవిత ఖైదు అంటే పద్నాలుగేళ్లే కదా అని కొందరు నేటికీ వాదిస్తారు.

ఆ అభిప్రాయం ఏర్పడడానికి కారణం ఏమంటే … జీవిత ఖైదీల విడుదలకు ఉన్న ఏకైక అవకాశం ప్రభుత్వాలు అప్పుడప్పుడూ ప్రత్యేక సందర్భాల్లో అంటే మహాత్మాగాంధీ శత జయంతికో .. అంబేద్కర్ శత జయంతికో … స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైన సందర్భం అనో … లేక రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన వచ్చిందనే అభిప్రాయంతో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆ అకేషన్ ను మార్క్ చేస్తూనో ఇచ్చే జీవోల ద్వారా జీవిత ఖైదీలు విడుదల అవుతూంటారు.

ఈ జీవోల్లో ఎంత శిక్ష పూర్తి చేసిన వారిని విడుదల చేయాలి … అన్న విషయంతో పాటు కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందించి వాటి ప్రకారం అర్హులైన జీవిత ఖైదీలను గుర్తించి వారిని విడుదల చేస్తారు.

అలా స్వతంత్ర భారతదేశంలో మొదటి సారి వచ్చిన జీవోలో రిమెషన్ తో కలిపి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన వారు … అంటే పది సంవత్సరాల కఠిన శిక్ష పూర్తి చేసిన వారు విడుదలకు అర్హులు అని జీవోలో చెప్పారు. దీంతో లైఫ్ అంటే పద్నాలుగేళ్లే అనే అభిప్రాయం చాలా మందిలో స్తిరపడింది.

మన సినిమా దర్శకులు రచయితలూ కూడా అదే రాస్తూ ఉంటారు.

అయితే ఆ పరిస్థితి మారి ప్రస్తుతం రిమెషన్ తో కలిపి పది సంవత్సరాలు పూర్తి చేస్తే విడుదలకు అవకాశం వచ్చే పరిస్తితి వచ్చేసింది. అంటే ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష చేస్తే విడుదలైపోతున్నారు.

అయితే మార్గదర్శకాలు ఇబ్బంది పెట్టకుంటా ఉండనే… ఈ మార్గదర్శకాల్లో ప్రధానంగా అడ్డు పడేవి …

– విధి నిర్వహణలో ఉన్న పబ్లిక్ సర్వెంట్ ను చంపిన కేసుల్లో విడుదల ఉండదు.

– మరణ శిక్ష పడి అది జీవిత శిక్షగా మారిన వారు విడుదలకు అనర్హులు

– కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పరిధిలో జరిగిన విచారణ సందర్భంగా శిక్షలు పడ్డవారు విడుదలకు అనర్హులు

ఇవి ప్రధానంగా చాలా మంది విడుదలకు ఆటంకాలుగా మారే మార్గదర్శకాలు.

ప్రస్తుతం చలపతి విజయవర్ధనరావుల విడుదలకు అడ్డు పడుతున్న మార్గదర్శకాల్లో మరణ శిక్ష జీవిత శిక్షగా మార్పు జరిగిన అనే నిబంధన అడ్డుపడి ఆగిపోతున్నారు.

నిజానికి ఓ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం చూస్తే వారికి శిక్ష పడ్డ సంవత్సరం జీవిత ఖైదీల విడుదల కోసం వచ్చిన జీవోలో ఉన్న మార్గదర్శకాలే వారికి అమలు జరగాలి ..

కానీ అన్ని కేసుల విషయంలో ఈ పద్దతిని పాటించడం లేదు. ఇలా చూస్తే చలపతి విజయవర్ధనరావులు మూడు జీవిత శిక్షలు అనుభవించేశారనే భావించాల్సి ఉంటుంది.     

వారి విడుదలకోసం మనం పోరాడాల్సిన అవసరం ఎందుకు ఉంది?

చలపతి విజయవర్ధనరావులు దళితులు.  నేరం చేశారు. శిక్ష అనుభవిస్తున్నారు. దళితులు కాబట్టి ఎలాంటి నేరాలు చేసినా వారిని వదిలేయాలా? అని కొందరు మర్యాదస్తులు అనుకోవచ్చు … ప్రశ్నించవచ్చు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే .. చలపతి విజయవర్ధనరావుల లక్ష్యం బస్సు ప్రయాణీకుల ప్రాణాలు తీయడం కాదు. కేవలం బెదిరించి దోపిడీ చేయడం.

మరి చంపడమే ధ్యేయంగా జరిగిన మరో నేరం గురించి ఒక్కసారి మీ దృష్టికి తీసుకువస్తాను.

1999 సంవత్సరంలో జరిగిన జూబ్లీహిల్స్ బ్లాస్ట్ కేసు విషయం గుర్తు చేసుకుందాం.

నాటి తెలుగు దేశం ఎమ్మెల్యే పరిటాల రవి ని హత్య చేయడం లక్ష్యంగా రామానాయుడు స్టూడియో సమీపంలో మద్దెలచెరువు సూరి నేతృత్వంలో మందుపాతర ఏర్పాటు చేయడం జరిగింది.  … అయితే అనుకోకుండా మీడియా ప్రతినిధులు ప్రయాణిస్తున్న వ్యాన్ పేలిపోయి అందులో సుమారు 26 మంది చనిపోయారు.

ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని … ఉరితీయాలని పౌరసమాజం ఎందుకు రియాక్ట్ కాలేదు?

అది ఫాక్షన్ హత్యలుగా చూశారా?

చిలకలూరి పేట బస్సు దహనం కేసులో శిక్ష అనుభవిస్తున్న చలపతి విజయవర్ధనరావులు ఏ విధమైన నేర చరిత్ర లేదు. వారి మీద పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఇదొక్కటే. కానీ జూబ్లీ బ్లాస్ట్ కేసులో పాల్గొన్న వారికి పాత ఫాక్షనిస్ట్ హత్యల్లో పాల్టొన్న అనుభవం ఉంది.

అందులో చాలా మందికి నేర చరిత్ర కూడా ఉంది.

పైగా చంపడం అనేదే అక్కడ ప్రధాన ఉద్దేశ్యం.  చలపతి విజయవర్ధనరావుల కేసులో దోపిడీయే వారి ప్రధాన ఉద్దేశ్యం తప్ప హత్యలు చేయడం కాదు. అయితే జూబ్లీ బ్లాస్ట్ కేసులో

చనిపోయిన మీడియా క్రూలో ఏపూటకాపూట తిండి వెతుక్కునే వారున్నారనే వాస్తవం గుర్తించాలి కదా?

కోర్టు కూడా ఆ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు ఉరి లాంటి కథిన శిక్ష వేయలేదు. సాధారణ జీవిత ఖైదు మాత్రమే విధించారు. అందుకే ఎటువంటి ఇబ్బందీ లేకుండా  2012 లో విడుదల అయిపోయారు.

మహా అయితే పదేళ్ల జైలు చేసి ఉంటారు. అంతే.

అయితే చలపతి విజయవర్ధనరావులు దళితులు కాబట్టి వీరు చేసిన నేరం కోర్టుకూ పౌరసమాజానికీ పెద్దదిగానూ క్రూరమైనదిగానూ కనిపించిందా?

జూబ్లీ బ్లాస్ట్ కేసు కోర్టులకూ పౌరసమాజానికీ సహజమైన పద్దతిలో కనిపించిందా?

అనే ప్రశ్నకు మనం ఏం సమాదానం చెప్పగలం? 

హర్షద్ మెహతా నుంచీ సత్యం రామలించరాజుదాకా అనేక మంది వైట్ కాలర్ నేరగాళ్లు చేసిన ఆర్ధిక నేరాల వల్ల నష్టపోయిన అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనకి తెలియనిదిగాదు.

స్టాక్ మార్కెట్ కుంభకోణం వల్ల, చిట్ ఫండ్ కంపెనీల మూసివేత వల్ల, బ్యాంకుల మూసివేత వల్ల ఆయా సంస్ధల్లో తమ సంపాదన మదుపు పెట్టి ఆ కంపెనీలు బోర్డు తిప్పేయడం వల్ల ఒక్కసారి అగమ్యగోచరమై దిక్కుతోచని స్థితిలో గుండెలు ఆగిపోయి ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారి గురించి మనం ఇంతే సీరియస్ గా పట్టించుకున్నామా?

అనేక మంది బలవన్మరణాలకు పాల్పడి తమ వారికి అనాధలుగా వదిలేసిన సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ మౌనంగా ఉండిపోయి నేరస్తులను వదిలేసిన అనేక సందర్భాలు మనకళ్ల ఎదుటే ఉంటాయి.

వాటిని పట్టించుకోని మనం చలపతి విజయవర్ధనరావుల విడుదల అంశం మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం అంతమంది మరణానికి కారణమైన వీరిని వదిలిపెట్టమని అడగడం సబబా బేసబబా అని ధర్మ మీమాంసకు గురవతాం.

కారణం వారు దళితులు అవడం వల్లేనా?

జూబ్లీ బ్లాస్ట్ కేసులో ముద్దాయిలు పదేళ్లకే విడుదల కావడానికి కారణం ఏమిటి? చలపతి విజయవర్ధనరావుల విడుదల మూడున్నర దశాబ్దాలుగా నిలిచిపోవడానికి కారణం ఏమిటి … రెండు కేసుల్లోనూ జీవిత ఖైదే కదా అనుభవిస్తోంది … అనుభవించింది కూడానూ అనే అనుమానం రావచ్చు.

లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పింది కనుక …

జీవిత ఖైదీలకు విడుదలకు ఉన్న ఏకైక అవకాశం ప్రభుత్వాలు దయతో ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే జీవోలే.

ఆ జీవోల్లో ఉండే మార్గదర్శకాలకు అనువైన వ్యక్తులు జీవితఖైదీలుగా ఉంటే వారు విడుదల అవుతారు. మార్గదర్శకాల ప్రకారం విడుదలకు అనర్హులు అనిపించిన వారు ఆగిపోతారు.

ఇలా జీవిత ఖైదీల విడుదలకు ఈ మధ్య మన ప్రభత్వాలు జారీ చేస్తున్న జీవోల్లో ఉంటూ వస్తున్న ఓ నిబంధన వీరి విడుదలకు అడ్డుపడుతోంది.

ఈ నిబంధన జూబ్లీ బ్లాస్ట్ వాళ్లకు ఇబ్బంది కలిగించలేదు. పైగా జీవిత ఖైదు ఏ సంవత్సరంలో అయితే ఖాయం అయ్యిందో ఆ సంవత్సరం విడుదలైన జీవోల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే … జీవిత ఖైదీలను విడుదల చేయాలి అని కూడా ఓ కోర్టు జడ్జిమెంటు చెప్పింది.

దాని ప్రకారం చూస్తే చలపతి విజయవర్ధనరావుల జీవితఖైదు ఖరారైన సంవత్సరం విడుదలైన జీవితఖైదీల విడుదల జీవోలో ఉన్న మార్గదర్శకాల్లో ఈ నిబంధన లేదు.

అయినా కోర్టులు ప్రభుత్వాలూ వీరి విడుదలను పట్టించుకోవు.

ఎందుకో అర్ధం కాదు..

చలపతి విజయవర్ధనరావులు దళితులు కాబట్టే ఇలా విడుదలలేక జైళ్ల్లో మగ్గిపోతున్నారు తప్ప అగ్రకులాలకు చెందిన వారైతే ఎప్పుడో బయటకు వచ్చేసి ఉండేవారు అని అనుకోడానికి ఆస్కారం ఉంది కదా… దానినే మనం ప్రశ్నించాల్సి ఉంది.

అలాగే … నేరంలో నేరస్తులు చూపించిన క్రూరత్వం వల్ల కూడా ఒక్కోసారి జీవోల్లో విడుదల ఆగిపోవచ్చు.

అయితే ఇక్కడ గమనించాలసిన విషయం ఏమంటే …  చనిపోయిన వ్యక్తుల సంఖ్యను బట్టి ఓ నేరంలో క్రూరత్వాన్ని జడ్జ్ చేయడం కుదరదు. చంపిన విధానాన్ని బట్టి క్రూరత్వాన్ని దృవీకరించడం జరుగుతుంది.

నిజానికి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో చలపతి , విజయవర్ధనరావులకు చంపాలనే ఇంటెన్షనే లేదు. కానీ జూబ్లీ బ్లాస్ట్ కేసులో నేరస్తులకు చంపడమే ఇంటెన్షన్.

జూబ్లీ బ్లాస్ట్ కేసులో ముద్దాయిలు అగ్రకులాలకు చెందినవారు మాత్రమే కాక నాటి ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం వల్ల వారి విడుదల పెద్ద ఇబ్బంది కాలేదు.

కోర్టులు కూడా వారికి భారీ శిక్షలు వేయకుండా కొంత కన్సిడరేషన్ ఇచ్చాయి అనే మాట అనడానికి ఆస్కారం ఉంది కదా…

ఈ వాదన అంతా పక్కన పెట్టేసి చూసినా చలపతి విజయవర్ధనరావులను ఇంకా జైల్లో మగ్గబెట్టడం ఖచ్చితంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలకు కూడని పనే.

మరణ శిక్ష నుంచీ జీవితఖైదుకు మారిన వారు విడుదలకు అనర్హులు అని జీవోల్లో ఉంటూ వచ్చిన ఓ మార్గదర్శకం అడ్డు పడి వారి విడుదల ప్రతిసారీ ఆగిపోతూ వస్తోంది.

ఈ మార్గదర్శకం ఒకప్పుడు లేదు. ఈ మధ్య వస్తున్న జీవోల్లో ఉంటూ వస్తోంది. ఇది తొలగిస్తే వారి విడుదల సులభతరమౌతుంది.

ఇప్పటికే వీరి విడుదల కోసం కోర్టులో కేసు నడుస్తోంది. పదేళ్లుగా నడస్తున్న ఆ కేసులో కూడా ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు. మానవీయ కోణంలో కోర్టులు స్పందించి వీరి విడుదలకు ఎందుకు సహకరించడం లేదో అర్ధం కాదు.

ఇద్దరు కిందికులాల కుర్రాళ్లు గత్యంతరం లేని పరిస్తితుల్లో హత్య చేయడం లక్ష్యంగాకాక కేవలం దోపిడీ కోసం చేసిన నేరంలో ప్రమాదవశాత్తూ లేక అనుభవ రాహిత్యంవల్ల బస్సు దగ్ధం జరిగిన సందర్భంలో ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి పౌరసమాజం న్యాయస్థానాలు అనేది ప్రశ్న.

ప్రగతి శీల శక్తులు ఆలోచనా పరులు అనుకుంటున్న వారు కూడా ఎందుకు వీరి విడుదల అనగానే సంశయిస్తున్నారో అర్ధం కాదు. ఆ రోజున ఉరి రద్దు ఉద్యమం లో పాల్గొన్న వారు కూడా ఇలాంటి ఆలోచనల్లోనే ఉన్నారా?  అనే అనుమానం వస్తుంది.

ఉరి రద్దు చేయాలన్నప్పుడు వారిని జైల్లో మగ్గబెట్టాదమనే ఆలోచన ఉందా? అనే ప్రశ్న వారు ఇంకా జైల్లో ఉన్నారని తెల్సి ఇంకా ఉండడం ఏమిటని ఆలోచిస్తున్న కింది కులాల యువకుల్లో కలగడం నేను ప్రత్యక్షంగా చూశాను.

ఉరి రద్దు ఉద్యమం ఏ మానవీయ కోణాన్నైతే ఎలుగెత్తి చాటిందో అదే ఇప్పుడూ మన్ని నడిపించాలి. ఉరి రద్దు అయి జీవిత శిక్షగా మారిన తర్వాత ఈ ముప్పై ఏళ్ల కాలంలో మూడు నుంచీ ఐదు పర్యాయాలు వారు విడుదలకు నోచుకోలేకపోయారు.

అంటే ఐదు సార్లు వారిని శిక్షించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒక నేరానికి ఇన్ని సార్లు శిక్ష వేయడం సబబా అనే ప్రజాస్వామిక కోణంలో మానవీయ కోణంలో సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం ఉద్దేశ్యం.

వారు తప్పు చేశారు. కాదనడం లేదు. తప్పు చేసినా … దళిత కులాలైతే వదిలేయాలా? లాంటి వాదన ముందుకు తెచ్చే మిత్రులకు నా విజ్ఞప్తి.

ఇప్పటికే భారతీయ జైళ్లల్లో దళితులే అత్యధికంగా ఉన్నారు. నేరం జరిగినప్పుడు అరెస్ట్ అయి జైల్లకు వెళ్లే అగ్రకులాల వారు చాలా వరకూ బెయిళ్లపై బయటకు వచ్చేసి ఏదో పద్దతిలో కేసు ట్రయల్ జరిగేప్పుడు సాక్షుల్ని మేనేజ్ చేసుకునో మరో ప్రయత్నం ద్వారానో కేసులు కొట్టించేసుకుంటున్న సందర్భాలే అధికంగా జరుగుతున్నాయి అంటే అందుకు సాక్షాలు కూడా చూపిస్తే ఏం మాట్లాడగలం… కాదని అనొచ్చు. కానీ అది కేవలం బుకాయింపుగానే మిగిలే అవకాశాలే అధికం.

Leave a Reply