సమాజం పట్ల బాధ్యత గల రచయితల్లో సమాజానికి ఏదో చేయలాని తపన పడి, సమాజం వైపు నిలబడి తమ గళాన్ని విప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సామాజిక సృహను కలిగి సాహిత్య సేవా దృక్పథంతో, సమాజం మార్పు కోసం ఎల్లప్పుడూ ముందుండే రచయితల కలం నుండి మాత్రమే భావోద్వేగమైన కథలు బయటికొస్తాయి.అలాంటి కథలే పి.శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్ళు కథలు.

 ఈ కథలు సమాజంపై ప్రభావం చూపే కథలని చెప్పొచ్చు. ఇలాంటి రచయితలు ఒక నిబద్ధత, సమాజం పట్ల కొంత బాధ్యత వుండడం వల్ల కూడా ఇటువంటి కథలను రాస్తారు. నేటి కాలంలో ప్రేమ కవితలకో, కథలకో వస్తున్నంతా ఆదరణ సమాజం కోసం, సమాజంతో నిలబడగలిగిన వారికి, సమాజం మార్పుకోసం పాటుపడే రచయితలకు లేదు. వారిని పట్టించుకొనే పాఠకులు చాలా అరుదుగా ఉన్నారు.

ప్రేమ, మెలోడి కథలకున్న ఆదరణ ప్రస్తుతం ఎక్కువే. ఇది పాఠకుల లోపం కాదు గానీ, ఇది ఒక రకంగా సమాజంపై ఆర్థిక సాహిత్య కారులు బలంగా రుద్దిన ఒక మోడ్రన్ వ్యాపార కిటుకు అని చెప్పొచ్చు. ఇలాంటి వ్యాపారాలలో చాలా సీరియస్ గా రాసే రచయితలకు అన్యాయం జరిగినట్లు అనిపిస్తుంది.

సాధారణమైన భాషతో సహజంగా ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలను కథాంశంగా ఎంచుకొని మార్జినోళ్ళు పేరుతో కథలు రావడం పాఠకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది.అసలు మార్జినోళ్ళు అన్న పదమే చాలా కొత్తగా విన్నట్టుంది కదా.అదేందో చూద్దామని మార్జినోళ్ళు పుస్తకాన్ని నా చేతిలోకి తీసుకొన్నాను.

మొదటి కథ పీటముడి దగ్గర మొదలు పెట్టి, *కదిలిపోతున్న నేల* చివరి కథ వరకు పాఠకుల్ని కదలనీయకుండా చదివింపచేశారు రచయిత శ్రీనివాస్ గౌడ్. మార్జినోళ్ళు కథలు చదువుతుంటే పాత్రలు కళ్ళముందు కదులుతున్నట్లుగా, జరిగినదాన్ని పూస గుచ్చినట్లుగా అంతా తేటతెల్లంగా రాశారు. ఇంకా చెప్పాలంటే క్రిస్టల్ క్లియర్ గా బొమ్మ కనపడేలా చేశారు. కథలోని కొన్ని పాత్రలోకి మన ఊహాలు ప్రయాణం చేస్తాయి. కథలో ఎక్కడో జరిగినవి కొన్ని మన అనుభవాలు కావొచ్చు, సంఘటనలు కావొచ్చు, గతాన్ని గుర్తుచేస్తూ కొంత ద్రిగ్భాంతికి గురిచేస్తాయి.

అవి కథలో నిజాలో తెలీదు కానీ, కథలో ప్రతి పాత్రకి జీవం పోసారు రచయిత. ఎన్నో జీవిత సంఘర్షణలను, ఎందరో జీవిత వ్యథలను , అలసిన జీవిత గాథలను, దగా పడిన అనాథల జీవితాలను రచయిత చాలా దగ్గరగా చూసినట్లు ఉన్నారు. బీదబిక్కి బతుకు జీవనాడులను పట్టుకొని చలించిపోయి ఎన్నో వ్యథలను అక్షరాలుగా మలిచి, అవి కథలుగా సమాజానికి ఈ సాహిత్య లోకానికి పరిచయం చేశారని తెలుస్తుంది. జరిగిన సంఘటనల్ని, సమాజంలో నేటికీ జరుగుతున్నవి కథా వస్తువులుగా ఎంచుకొని, వాస్తవాలను రాయడంలో రచయితకు ఎటువంటి బెరుకు లేదు. కథలో సామాన్య జీవన ఘోషను, ప్రభుత్వాల అవినీతి అధికారుల నిర్లక్ష్యాన్ని నిర్భయంగా రాసేశారు.

ఒక్కో కథ ఒక్కోకోణంలో ఉంది. కథల్లోని పాత్రలకు వారి క్షోభకు, వారి దారిద్ర్యానికి సూత్రదారులెవ్వరు ? కష్టాల కడలిలో మునిగిపోతున్న శ్రామికుల స్వేదానికి ఫలితం లేకుండా పోతున్నదానికి కారకులెవరంటూ ప్రశ్నిస్తారు. పాఠకుణ్ణి ఆలోచింప చేస్తూ దేశంలో ఈ దుర్బుద్ధి మనుషుల్లో సేవాగుణం, సమానత్వం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రచయిత.

కథలన్నీ తల్లికోడి ఒడిలోకి కోడిపిల్లలు ఒదిగినట్టు ఈ పుస్తకంలోని కథలన్నీ అలా ఒదిగిపోయాయి. ఈ మార్జినోళ్ళు కథా సంపుటిలోని కథలన్నీ లోతైన పరిశీలనలో పాఠకుడు లీనమయ్యేలా చేశారు. రచయిత కంటపడిన దేన్నైనా కథగా మార్చగల సామర్థ్యముందని అనిపిస్తాడు. కొంత కాలమయినా ఈ కథలు నిలుస్తాయని, పాఠకుల్ని వెంటాడతాయని చెప్పడంలో సందేహం లేదు.

ఎవరైనా సరే కథలు చదువుతుంటే కొద్దిసేపు ఈ లోకాన్ని మర్చిపోయి కథల కాలంలోకి వెళ్లి నిదానంగా ఆ సృహ నుంచి బయటికొస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కథలోని ఘాటైన వాక్యాల వల్ల, కథ నడిపిన విధానం వల్ల, ఇవి నిజంగా జరిగిన అనుభవాల నుంచి ఏరుకున్న కథల్లా, కథను ఏమాత్రం జంకు గొంకు లేకుండా వ్యక్తం చేసిన విధానం వల్లా కూడా ఇవి దమ్మున్న కథలు. ఒక సినిమా క్లైమాక్స్‌ని ముందే చెప్పి మిగతా కథతో సినిమాను నడిపించి ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లలో కదలకుండా కుర్చోబెట్టే డైరెక్టర్ లా రచయిత ఆగుపిస్తారు. కథలన్నీ చదివాక అది పాఠకులుగా మీక్కూడా అర్థమవుతుంది.

ఇకపోతే మొదటి పీటముడి కథలో స్త్రీ ఆంతర్యాన్ని తెలుసుకొలేని మనుషులు, స్త్రీల ఎదుగుదలను ఓర్చుకోలేని భర్తను , సొంత కూతురి ఆరోగ్యం పట్టించుకోలేని తండ్రి, మాటలురాని చిన్న పాప నర్మదకు మాటలొచ్చేలా చేయాలని తల్లి ప్రయత్నిస్తుంటే దానికి అడ్డుపడి, పల్లెలో అడ్డగాడిదలా ఉండే అవినీతి సర్పంచు ఖద్దరు చొక్కాల దోపిడీని , నరసమ్మ, లక్షమ్మక్కల ఎదురీతనీ, ఎవడొచ్చినా చూసుకుందాం అనేంత గంభీరత్వాన్ని చెప్తూ, స్త్రీలు అనుకుంటే దేన్నైనా సాధిస్తారని , వాళ్ళ ఓపికను పరీక్షిస్తే భూతాలం బద్దలై ఎన్ని పీటముడులైనా విప్పి, ఫిరంగులా పేలతాయని స్త్రీలకి ఎంతో ధైర్యాన్నిచ్చే కథగా నిలుస్తుందని చెప్పొచ్చు. రచయిత ఈ కథలో వాస్తవికతకు ఎక్కువ చోటు కల్పించాడు.

రెండవ కథ మార్జినోళ్ళు ఈ కథ విషయానికి వస్తే బ్రతుకంతా కష్టం చేసిన బ్రతకడానికి చోటు దొరక్కపోవడం, బ్రతుకుతున్న చోటుని కూడా భూభకాశురులు లాక్కోడం, అవినీతి సంపాదనకి అలవాటు పడి దానినే చాలా సులువైన మార్గంగా ఎంచుకొన్న కొందరు, పచ్చనోట్ల ప్రభుత్వ అధికారులు కూడా దీనికి చేతులు కలపడం. బ్రతుకు సంఘర్షణ కోసం ఎంతవరకైనా తెగించే తత్వం ఒక్క పల్లె మనుషుల్లో ఉందని, కష్టాన్ని నమ్ముకున్న వారి జీవితాల్లో ఐక్యతగా ఉంటే ఏదైనా సాదిస్తామనే ధీమా ప్రతి పేదోడి ఒంట్లో ఉంటుందని, వాళ్ళతో పెట్టుకుంటే ప్రభుత్వాలు, పాలకుల కుర్చీలు కూడా కదిలిపోతాయని ఖబార్దర్ అన్నట్లుగా ఈ కథ హెచ్చరిస్తుంది. చోద్యం చూస్తున్న ప్రభుత్వాన్ని అధికారులను, ఎవరెటుపోతే మనకెందుకలే అని నిర్లక్ష్యపు సమాజానికి అగ్గిపెట్టారు. ఇలా ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ వున్న నిర్వాసితులకు ఊరటగా, అన్యాయాన్ని వెనకేసుకొచ్చే వాళ్ళకి గుణపాఠంగా తగులుతుందని ఒక విప్లవ జ్వాలను రగిలించిన కథగా నిలుస్తుంది ఈ  మార్జినోళ్ళు.

ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న పోకిరీల ఆగడాలకు బలైపోతున్న అనామక ప్రేమికుల కథనే ఈ *తిరునాల* కథ. నవసమాజ నాగరికత కాస్తా అనాగరిక సమాజం వైపు అడుగులేస్తోంది. వచ్చిపడిన సాంకేతికత వల్ల అందుబాటులో వున్న బూతు వీడియోల వల్ల , ఎక్కడ చూసినా కామంతో. ఎక్కడ పడితే అక్కడ, ఎపుడూ పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్ళు వావి వరుసలంటూ మర్చిపోయి, చిన్నా పెద్దా తేడాలు, మానవ సంబంధాలను నట్టేట కలిపి శృంగార అనుభవం కోసం ఎంతకయినా తెగించే యువతరం బయల్దేరింది. నేడు ఆదిమానవుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు కామంలో మునిగిన మనుషులు. ఆడదైతే చాలు అన్నట్లు కొన్ని మృగాళ్లు వేట కుక్కల మాదిరి కాచుకొని కంటికి కనిపించిన ఎందరో స్త్రీల బ్రతుకులను కాటేస్తున్నాయి. ఆడవాళ్ళు కంటికి కనిపించిందంతా నిజమని నమ్మి వాళ్ళతో ఎక్కడెక్కడికో పోయి విగత జీవులుగా మారి దినపత్రికలలో వార్తలవుతున్నారు. అయినా సరే ఎవరిలో ఎలాంటి మార్పులేదు. అటువంటి ఒక జంటకు ఎదురైన ఒక భీభత్స సంఘటనే ఈ తిరనాళ కథ. అదే సమయంలో మరొక పాత్ర వారికి సాయం చేస్తుంది. మనిషి కొన్నిసార్లు హింసకు తలొగ్గక, కామం కుహురంలోంచి బయటపడి కాపాడే స్థాయికి రావడం, స్వచ్ఛమైన మనిషితననానికి మార్గం వేయడం అసలైన కథకుల లక్ష్యమనిపిస్తుంది.రచయిత రాసిన ఈ కథ నిత్యం ప్రస్తుత పల్లెల్లో తిరునాళలలో, జాతర్లలో, జన సంద్రం ఎక్కువుగా ఉన్న చోట జరిగే సంఘటనలకు తార్కాణం. ఈ కథ చదివినప్పుడు ఎలాంటి వారిలోనైనా కొంత మానవీయత పుడుతుంది. ఎంత హృద్యంగా రాశారో కథ. చదివిన ప్రతి ఒక్కరిలో తమ దగ్గర్లో జరిగిన ఇలాంటి ఘటనలు తమ మెదళల్లో కదిలేలా చేశారు రచయిత.

ఇలాంటి హృదయ విదారకమైన కథనే లీల కథ కూడా. అయితే ఈ కథలోని పాత్రలు పాఠకున్ని సందిగ్ధంలో పడేస్తాయి. ఆకలి తీర్చడానికి ఏవేవో ఆటుపోట్లు పడుతుంటాం. అయినా కొన్ని సార్లు సరైన జీవితం బ్రతకాలనే పోరాటంలో సామాన్య జీవితం కూడా దక్కదు కొందరికి. అలాంటి బ్రతుకు చిత్రాలకు దగ్గరగా ఉండే వర్ణానతీతమైన కథనే ఈ లీల. కడుపునింపుకోవడానికి కొందరు, కడుపాకలితో కొందరు, కొడుకు వైద్యం కోసం మరికొందరు తమను తాము మనసు చంపుకొని కొన్ని పనులు అయిష్టంగా చేస్తారు. అస్తవ్యస్తమైన జీవితాల్లో అనారోగ్యంగా పుట్టిన కొడుకుని కాపాడుకొనేందుకు తల్లి చేసిన ఓ చీకటి బ్రతుకు పోరాటమే ఈ కథ. బాలింతగా ఉంటూ కొడుకుని కాపాడడం కోసం వైద్యానికి డబ్బులు కావాల్సి వస్తే చేసేదేమీ లేక పడుపువృత్తికి పోవాల్సిన ఓ తల్లి కడుపుకోత, స్త్రీ కన్నీటి కథ.

సమాధి కథలో తన ఆశల్ని సమాధి చేసిన సమాజాన్ని ఓ ముసలి పలుకులే కథాంశ పాత్రలో, ఆవేదనగా ప్రభుత్వాన్ని, రాజకీయ అధికారుల అసమానతలను ప్రశ్నించారు. కొందరు సమాధుల్ని కూడా కబ్జా చేసిన మితి మీరినతనాన్ని ఈ సమాజం గుడ్లప్పగించి నిలబడి చూస్తోందని, ఏమి జరిగినా ఎన్ని జరిగినా ఎవరూ పట్టనట్లు ఉంటున్నారని, న్యాయానికి సమాధి కట్టారని రచయిత బాధని వెళ్ళబోస్తున్నాడు. మూడు సంవత్సరాల తరువాత తన సొంతురికి తిరిగివెళ్ళి తల్లితండ్రుల సమాధులను చూడాలనుకున్న రచయితకి, సమాధి కింద మిగిలిన ఎముకలు కూడా పెళ్ళగించి, దానిపైన ఇండ్లు వెలసిన వైనాన్ని, వాళ్ళ జీవ సమాధులు చూసి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని, తల్లి తండ్రులను తల్చుకుని ఎంతగా బాధ పడ్డారో కళ్ళకు కట్టినట్లు రాసి, పాఠకులు కూడా కన్నీటి పర్యంతమయ్యేలా చేశారు రచయిత. నిజంగా ఇదొక సజీవ సమాధుల నివసిస్తున్న కాలం అని చెప్పొచ్చు. కనీసం శ్మశానాన్ని కూడా వదిలిపెట్టడం లేదంటే ప్రభుత్వాలు రాజకీయాల కనుసైగల్లో ఎంతకీ దిగజారిపోయారో, తమ అంత్యక్రియల అవసరాలనూ గుర్తించక, జనాలు ఎంత మతి వున్నారోనని ప్రస్తుత పరిస్థితులను గురించి చెప్పిన కథ ఇది. పేదవాళ్ళకు సమాధుల్లో కూడా స్థలముండదని చెప్పిన కథ.

ఈ మార్జినోళ్ళు సంపుటిలోని కథలన్నీ (ఒకటో రెండో మినహాయిస్తే) అన్నీ అవార్డులు పొందిన కథలే. కథల్లో కంటే ఇందులో ఉన్న నిజాన్ని తెలుసుకొని సమాజంలో మెలగటాన్ని కథకులు గొప్పగా భావిస్తారని, ఎందరికో ఈ మార్జినోళ్ళు కథా సంపుటి కనువిప్పుగా నిలుస్తుందని తెలుసుకోవచ్చు. ఒక్కొకథ ఒక్కో రకంగా ఉండి, శిథిలమైతున్న జీవన వ్యవస్థలను కాపాడాలని, సృష్టిలో జరిగే అవాంఛనీయ సన్నివేశాలను తిప్పికొట్టాలని, తప్పుల తడకల లెక్కల వేసే నీతి తప్పిన అవినీతి అధికారులను అగ్నిగుండంలోకి తొసెయ్యాలని, మమకారపు అమ్మలను కాపాడాలంటూ, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలంటూ, స్త్రీ బానిసత్వాన్ని మళ్ళీ రూపుమాపాలని రచయిత శ్రీనివాస్ గౌడ్ గారు తన పదునైన వ్యాఖ్యలతో చెప్పారు.

కథల్లో స్వచ్చత, సమాజం వైపు నిలబడే వైఖరి, పాఠకుల్లో రేకెత్తించే ఆలోచనల తీరు ఇవన్నీ కథకున్ని నిలబెడతాయి. మిగిలిన అన్ని కథలూ దేవుళ్లాట, గాలికిలేచిన ఆకులు, రెటమతం మడిసి, వ్యవహారం, *నా కొడుకు లచ్చిమి*, *దిక్కుతెలీని పక్షులు*, *కదిలిపోతున్న నేల* ప్రతి కథ కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది .ఒక్కోటి ఒక్కో విలువైన కథగా పాఠకులకు అనిపిస్తుంది. కథలు చదివిన పాఠకుడు తన సమయం సద్వినియోగం అయిందని భావిస్తాడు. ఇంతమంచి కథలు అందించిన అన్వీక్షికి పబ్లికేషన్స్ వారికి, చక్కని కథలకు ప్రాణం పోసి, నిక్కచిగా నిజాలను రాసిన కథకులు శ్రీనివాస్ గౌడ్ గారికి మనం అభినందనలు చెప్పవచ్చు.

Leave a Reply